NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

కాకినాడలో పవన్ కల్యాణ్‌ రోడ్ షో.. బహిరంగ సభపై సస్పెన్స్‌..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది.. సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది.. ఇక, చివరి రోజు కాకినాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రోడ్‌షో నిర్వహించనున్నారు.. అయితే, ఆ తర్వాత పవన్‌ కల్యాణ్ బహిరంగ సభపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది.. బహిరంగ సభకు ఇంకా అనుమతులు ఇవ్వలేదు రిటర్నింగ్ ఆఫీసర్, పోలీసులు.. అయితే, ఇప్పటికే కాకినాడలో ర్యాలీకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పర్మిషన్ తీసుకుంది.. ఇదే సమయంలో జనసేన బహిరంగ సభ ఉండడంతో.. రెండు పార్టీలకి అనుమతి ఇస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని పోలీసులు చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. పర్మిషన్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పవన్ కల్యాణ్‌ సభ జరిగి తీరుతుంది అంటున్నారు జనసేన-టీడీపీ-బీజేపీ నేతలు.. కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఎక్కడ సభకు అనుమతి ఇచ్చిన ఇబ్బంది లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కూటమి నేతలు..

ఎన్నికల టైం.. క్యాష్‌ చేసుకుంటున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారానికి తెర పడనుంది. మరో రెండు రోజుల్లో అంటే మే 13న పోలింగ్‌ జరుగుతుంది. ఎన్నికల వేళ ప్రైవేట్‌ ట్రావెల్స్ రెచ్చిపోతున్నాయి. ప్రయాణికులను అడ్డంగా దోచేస్తున్నాయి. ఉద్యోగాలు, చదువుల పేరుతో ప్రజలు సొంత ఊర్లకు దూరంగా ఎక్కడెక్కడో సెటిల్‌ అయిన జనాలు.. సొంత ఊర్లకు పయనం అవుతున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు వరుసగా సెలవులు ఉండటంతో.. ఓటేయడం కోసం తమ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు ఫుల్ అయిపోయాయి. దీంతో.. ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ జనాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రధాన నగరాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ రేట్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవడం గ్యారెంటీ. మామూలు రోజుల్లో సొంత ఊర్లకు వెళ్లాలంటే.. 500నుంచి వేయి రూపాయలు అవుతుంది. కానీ.. ఇప్పుడు మాత్రం ఏకంగా మూడు, నాలుగు రెట్లు పెంచేసాయి ప్రైవేట్ ట్రావెల్స్. అంటే.. వెయ్యి రూపాయలు అయ్యే చోట ఇప్పుడు ఏకంగా 5 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓ కుటుంబం నుంచి ఇద్దరు ఊరికి వెళ్లి ఓటు వేసి రావాలంటే.. 10 నుంచి 15 వేలు ఖర్చవుతోంది.

మందుబాబుల ముందు జాగ్రత్త.. వైన్‌షాపుల ముందు క్యూ..!
ఎన్నికల ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వానికి ఫుల్ స్టాప్ పడుతుంది. మైకులు బంద్ కాబోతున్నాయి. సుధీర్ఘంగా సాగిన ప్రచారానికి తెరపడబోతోంది. పార్టీలకు మిగిలింది కొన్ని గంటలే. ఈ సమయాన్ని పక్కాగా ఉపయోగించుకుని ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. చివరిరోజు అగ్రనేతల ప్రచారాలతో హోరెత్తించనున్నాయి. సరికొత్త అస్త్రాల్ని బయటకు తీయబోతున్నాయి. క్లైమాక్స్ క్యాంపెయిన్ హీటెక్కిస్తోంది. చివరి గంటల్నే పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సాయంత్రం నుంచి రెండు రోజులపాటు మందు బంద్‌ కానుంది. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన మందుబాబులు.. వైన్ షాపుల ముందు క్యూలు కడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు మూసివేయాలని సూచించింది. మే 11న సాయంత్రం ఆరు గంటల నుంచి 13 సాయంత్రం వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ రెండు రోజులను డ్రై డేగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎప్పుడైతే ఈసీ ఆదేశాలిచ్చిందో మందుబాబులు అలర్టయ్యారు. ముందుగానే బాటిల్స్ బల్క్ బుకింగ్ చేసుకుంటున్నారు. లిక్కర్ బాటిల్స్‌ తెచ్చి పెట్టుకుంటున్నారు. దీంతో వైన్ షాపుల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇన్నిరోజులు చేసిన ప్రచారం ఒక ఎత్తు.. ఈ రెండు రోజుల ఇంకోఎత్తు. దీంతో ఆయా పార్టీల నేతలు ఓటర్లపైకి తాయిలాలు వదులుతున్నాయి. కచ్చితంగా తమకే ఓటేస్తారని భావిస్తున్న వర్గాలకు భారీగా మందు పంపిణీకి రంగం సిద్ధం చేశారు.. ముందస్తుగా భారీగా కాటన్లు తెప్పించి స్టోర్ చేశారు. ఓటర్లే కాదు.. తమ వెంటే తిరిగే కార్యకర్తలను సైతం మందులో ఓలలాడించాల్సిందే. లేదంటే వారికీ కోపం వస్తుంది. అందుకే భారీగా కాటన్లు తెప్పించి సిద్ధంగా ఉంచారు నేతలు. ఇంకేముంది తాగినోడికి తాగినంత.. తిన్నోడికి తిన్నంత అన్నట్లుగా మారనుంది పరిస్థితి.

ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం.. ఆ బిల్లుకు టీడీపీ మద్దతిచ్చింది..!
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఆ బిల్లు వచ్చినప్పుడు టీడీపీ మద్దతు ఇచ్చిందన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హయాంలో సంక్షేమం.. అభివృద్ధి కొనసాగాయి అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇక, DBT పద్ధతిలో అవినీతికి ఆస్కారం లేకుండా నగదును లబ్దిదారులకు అందేలా చూశామని వెల్లడించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశారు సీఎం వైఎస్‌ జగన్‌ అని ప్రశంసలు కురిపించారు.. గెలుపు పై పూర్తి ధీమాతో ఉన్నాం.. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తాం.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

కాణిపాకంలో చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా..? నేను నా పిల్లలతో వస్తా..
టీడీపీ అధినేత చంద్రబాబ నాయుడుకు బహిరంగ సవాల్‌ విసిరారు కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌.. కాణిపాకం వినాయకుడు గుడిలో చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా? అని ప్రశ్నించిన ఆయన.. నేను నా పిల్లలతో వచ్చి ప్రమాణం చేస్తాను.. మీరు వస్తారా? అంటూ సవాల్‌ చేవారు.. నన్ను చంద్రబాబు చిన్న సైకో అంటున్నారు.. మరి మూడు సార్లు బీ ఫారం ఇచ్చిన చంద్రబాబు బొల్లి సైకో, ముసలి సైకో అవుతాడా? అంటూ సెటైర్లు వేశారు. అనవసర, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం ఇప్పటికైనా చంద్రబాబు మానుకోవాలంటూ హితవుపలికారు.. నేను అవినీతిపరుడిని అని చంద్రబాబు అంటున్నాడు.. కాణిపాకం వినాయకుడు గుడిలో చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా అని ఓపెన్‌ ఛాలెంజ్‌ చేశారు.. ఇక, అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు అంటున్నారు.. అసలు ఆ సమయంలో నేను అసెంబ్లీలో లేను, పంజాబ్ లో ఉన్నాను అని స్పష్టం చేశారు. చంద్రబాబు గుడ్డ కాల్చి మీద వేస్తే మేం నిరూపణ చేసుకోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌.

ఆడ పిల్లలకు స్కుటీలు రాలేదు కానీ.. కాంగ్రెస్ నాయకులు లూటీ స్టార్ట్ అయింది..
ఆడ పిల్లలకు స్కుటీలు రాలేదు కానీ.. కాంగ్రెస్ లూటీ స్టార్ట్ అయిందని ఎమ్మెల్యే కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలో పోటీ ఎవరెవరి మధ్య జరుగుతుందో ఆలోచించాలన్నారు. పదేళ్ల నిజం కేసీఆర్ పాలన,పదేళ్ల విషం బీజేపీ పాలన, 150 రోజుల అబద్ధం కాంగ్రెస్ పాలన.. అన్నారు. పదేళ్ల క్రితం నేను ప్రధాని అయితే ఇంటింటికి 15 లక్షలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదన్నారు. ధరలు తగ్గిస్త అన్నాడు తగ్గియలేదని తెలిపారు. బీజేపీ అభివృద్ధి చేయలేదు కానీ రాముని గుడి కట్టిన్నం ఓటేయండి అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆధునిక గుడులు కట్టడమే కాదు అభివృద్ధి కూడా చేసిండన్నారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఐదేళ్లు ఒక్క మీటింగ్ కు హాజరు కాలేదన్నారు. మత పిచ్చి తప్పితే ఒక్క పైసకు అక్కరకు రానీ వ్యక్తి బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఎమ్మేల్యే రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ఆడ పిల్లలకు స్కుటీలు రాలేదు కానీ కాంగ్రెస్ నాయకుల లూటీ స్టార్ట్ అయిందన్నారు. ఐదేళ్లు అమిత్ షా చెప్పులు మోసుడు తప్పితే ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. దేవుళ్ళు లక్షల ఏళ్ల క్రితం పుడితే బీజేపీ పుట్టింది నలభై ఏళ్ల క్రితం అన్నారు. నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసి నిత్యావసర ధరలు పెంచిన ఘనుడు మోడీ అన్నారు. పన్నెండు పదమూడు ఎం పి లను గెలిపించండి రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రాన్ని శాసించే స్థాయికి కేసీఆర్ వస్తారన్నారు.

బీజేపీ హిందుత్వానికి.. మా హిందుత్వానికి తేడా ఇదే..!
శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. తమ హిందుత్వానికి, బీజేపీ హిందుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని పేర్కొనింది. మా హిందుత్వం ఇంట్లో పొయ్యిలు వెలిగిస్తుంటే.. కమలం పార్టీ హిందుత్వం మాత్రం ఇళ్లను తగలబెడుతోందని ఆయన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ఠాక్రే మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా పని చేస్తున్నారు.. ముస్లిం జనాభా పెరగడం ఆయన విజయమా, వైఫల్యమా అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. ముస్లింల జనాభా పెరుగుదలపై మోడీని అభినందించాలా, విమర్శించాలా అనే దానిపై అయోమయం నెలకుందని ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. అయితే, మోడీ ప్రభుత్వం శివసేన పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుని.. మా పార్టీ విల్లు, బాణం గుర్తును లాక్కుంది అని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. మా పార్టీని, చిహ్నాన్ని, మనుషులను అన్యాయంగా లాగేసుకున్నారు.. అయినప్పటికీ మాకు ఇప్పటికి బీజేపీ భయపడుతుందని ఠాక్రే అన్నారు. అలాగే, ప్రధాని మోడీ న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన విమర్శలు కురిపించారు. మోడీ డ్రామా కేవలం జూన్ 4వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటికైనా హిందువులు- ముస్లింల పేరుతో రాజకీయాలు చేయడం కాషాయ పార్టీ మానుకోవాలని సూచించారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాష సరిగ్గా లేదని.. దాని వల్ల దేశానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని శివసేన ( యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీటు పేరుతో రూ.2 కోట్లకు టోకరా
రాజధాని ఢిల్లీలో భారీ మోసం వెలుగు చూసింది. దీంతో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఇటీవల ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రాష్ట్రపతి కోటా నుంచి రాజ్యసభ సీటు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన నిందితుడు పట్టుబడ్డాడు. రాజ్యసభ సీటు పేరుతో నిందితులు రూ.2 కోట్ల మోసానికి పాల్పడుతున్నట్లు సమాచారం. నిందితులిద్దరి పేర్లు నవీన్ కుమార్ సింగ్, నానక్ దాస్ అని తెలుస్తోంది. అయితే వీరి మోసంపై చర్యలు తీసుకున్న పోలీసులు వారిద్దరినీ పట్టుకున్నారు. ఈ నిందితులు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిని రాష్ట్రపతి కోటా నుంచి ఎంపీని చేస్తానని చెప్పి రూ.2 కోట్ల మోసం చేశారు. ఈ మోసం సొమ్ముతో ఈ నిందితులు బీహార్‌లో ఆస్తులు కూడా కొనుగోలు చేశారు. అటువంటి నేరం వెలుగులోకి రావడంతో పోలీసులు ప్రస్తుతం వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితుల విచారణ కొనసాగుతోంది.

అమ్మ, మామయ్యతో కలిసి పిఠాపురానికి రామ్‌చరణ్‌
గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ పిఠాపురం వెళ్తున్నారు.. తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్‌తో కలిసి పిఠాపురం బయల్దేరారు.. ఇక, పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో తన బాబాయ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి బరిలోకి దిగిన విషయం విదితమే కాగా.. ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.. ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌ అక్కడికి వెళ్తుండడంతో ఆసక్తికరంగా మారింది.. హైదరాబాద్‌ నుంచి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్నారు రామ్‌ చరణ్.. రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో మెగా గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌కు ఘనంగా స్వాగతం పలికారు మెగా ఫ్యాన్స్‌.. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుండి అల్లు అరవింద్, తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం బయల్దేరి వెళ్లారు రామ్ చరణ్.. దారిపొడవున రామ్‌ చరణ్‌కు స్వాగతం పలుకుతున్నారు ఫ్యాన్స్‌, జనసేన శ్రేణులు.. శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం దగ్గర వేచి చూస్తున్నామంటూ ఫ్యాన్స్‌ వీడియోలు షేర్‌ చేస్తున్నారు.. దీంతో.. #RamCharan, #Pithapuram యాష్‌ ట్యాగ్స్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ట్రెండింగ్‌లోకి వచ్చాయి.. ఎయిర్‌పోర్ట్‌లో రామ్‌చరన్‌ ఎంట్రీ, దారిలో గ్లోబల్‌ స్టార్‌కు స్వాగతం పలకడం.. కుక్కుటేశ్వర స్వామి ఆలయం దగ్గర వేచి ఉండడం లాంటి వీడియోలు షేర్‌ చేస్తూ తమన అభిమాన్నా చాటుకుంటున్నారు.. అయితే, పిఠాపురం వేదికగా తమన బాబాయ్‌ పవన్‌ కల్యాణ్, మరో రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికలపై రామ్‌ చరణ్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఫ్యాన్స్‌, రాజకీయ నేతలు, కూటమి శ్రేణులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు..

నంద్యాలలో అల్లు అర్జున్ సందడి.. ఇదేం క్రేజ్‌ మామ..!
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశారు.. నంద్యాల చేరుకున్న అల్లు అర్జున్ ను చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఫ్యాన్స్‌.. ఎటు చూసినా జనమే అన్న చందంగా మారిపోయింది నంద్యాల.. ఇక, గజమాల తో పుష్పకు ఘనంగా స్వాగతం పలికారు అభిమానులు.. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్వా రవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ రెడ్డికి పూలమాలలతో స్వాగతం పలికారు శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు.. అల్లు అర్జున్‌ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో.. శిల్పా రవి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.. అసలు, ఫ్యాన్స్‌ను ఛేదించుకుంటూ.. తన మిత్రుడి ఇంట్లో అడుగు పెట్టేందుకు బన్నీ చాలా కష్టపడాల్సి వచ్చింది.. ఇక, శిల్పా రవి ఇంటి బాల్కనీ నుంచి తన ఫ్యాన్స్‌కు అభివాదం చేశారు ఐకాన్‌ స్టార్‌. కాగా, గత ఎన్నికల్లో తొలిసారి నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి బరిలోకి దిగారు.. ఆ సమయంలో కూడా బన్ని తన మిత్రుడికి మద్దతుగా నిలిచారు.. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు శిల్పా రవి.. ఎన్నికల సమయం కావడంతో.. మళ్లీ ఇప్పుడు కూడా శిల్పా రవి.. నంద్యాలలో తన భార్యతో కలిసి సందడి చేశారు.. తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని తన అభిమానులకు చూపించారు. మొత్తంగా రాజకీయాలు వేరు.. తమ స్నేహం వేరంటూ.. ప్రచారానికి తెరపడనున్న రోజు.. నంద్యాలలో సందడి చేశారు అల్లు అర్జున్‌. ఓవైపు బన్నీ ఫ్యాన్స్‌, మరోవైపు వైసీపీ శ్రేణులతో నంద్యాల కిక్కిరిసిపోయింది. మరోవైపు.. #AlluArjunAtNandyal అపూ యాష్‌ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ మారింది.. తమ అభిమాన నటుడి నంద్యాలలో అడుగుపెట్టిన వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌.

నటి కరీనా కపూర్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసు జారీ.. కారణం అదేనా..?
బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ నటి “కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్” అనే పుస్తకం రాసింది.అయితే ఈ పుస్తకం టైటిల్ లో “బైబిల్”అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోనీ కోర్టును ఆశ్రయించడంతో నటి కరీనాకు నోటీసు జారీ చేయబడింది.ఈ కేసులో జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగల్ జడ్జి బెంచ్ ఆమెకు నోటీసు జారీచేసింది. కరీనా కపూర్‌పై కేసు నమోదు చేయాలని అడ్వకేట్ క్రిస్టోఫర్ ఆంథోనీ పిటీషన్ వేశారు. పుస్తకం టైటిల్‌లో బైబిల్ అన్న పదాన్నివాడటానికి గల కారణం ఏమిటని కోర్టు ప్రశ్నలు వేసింది.ఈ పుస్తకంపై బ్యాన్ విధించాలని అడ్వకేట్ ఆంధోనీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ పుస్తక విక్రయదారులపై కూడా కేసు నమోదు చేయాలంటూ క్రిస్టోఫర్ ఆంథోనీ పిటీషన్ పై హైకోర్టు నోటీసు జారీచేసింది.పుస్తకం టైటిల్‌లో బైబిల్ అనే పదం వాడడం క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఆంథోనీ తన పిటీషన్‌లో ఆరోపించారు. క్రైస్తవులకు బైబిల్ అనేది పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్‌తో పోల్చడం సరికాదు అని ఆయన పిటీషన్‌లో పేర్కొన్నారు.