Site icon NTV Telugu

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

చంద్రబాబు, పవన్‌ పొర్లు దండాలు పెట్టినా ప్రజలు జగన్ పక్షమే..!

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. మరోవైపు పొత్తులపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సెటైర్లు వేస్తోంది.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఢిల్లీలోనే కాదు గల్లీల్లో పొర్లు దందాలు పెట్టినా ప్రజలు వైఎస్‌ జగన్‌ పక్షమే అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. స్వప్రయోజనాల కోసం పార్టీలు పెట్టుకున్నారే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయి? అన్న పవన్‌ కల్యాణ్‌ ఆ మాటలు మర్చిపోయారని దుయ్యబట్టారు.. టీడీపీతో పొత్తు అంటే ఢిల్లీ పెద్దలు దారుణంగా తిట్టారని పవన్ కల్యాణ్‌.. ఇదే విషయం టీడీపీకి స్వయంగా చెప్పారు.. కానీ, పెట్టిన పార్టీని స్వప్రయోజనం కోసం లాక్కున్నవాడు చంద్రబాబు.. ఆయన నుంచి ఎంతో కొంత సొమ్ము లాక్కోవడం కోసమే పవన్ పార్టీ పెట్టారంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక, స్వప్రయోజనాల కోసం కాకపోతే ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేవారు వేణేగోపాలకృష్ణ.. ఢిల్లీ వీధిలో ఆంధ్రా ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ పెద్దలు దెబ్బతీస్తున్నారని ఎన్టీఆర్ పార్టీ పెడితే.. మూడు రోజులుగా చంద్రబాబు ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ పొత్తు కోసం పాకులాడుతున్నాడు.. ఈ పరిణామాలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమేనని గతంలో చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు పొత్తు ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేవారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు తపన ఫైర్‌ అయ్యారు. అయితే, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఢిల్లీలోనే కాదు.. రాష్ట్రంలోని గల్లీల్లో పొర్లు దండాలు పెట్టినా ప్రజలు.. సీఎం వైఎస్‌ జగన్ పక్షమే.. ప్రజలు వైసీపీకి పట్టంకట్టం ఖాయం అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

ఏపీ అభ్యర్థుల ఎంపికలో బీజీపీ ట్విస్ట్‌..! వారికి మొండి చేయి..
ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు పొత్తులపై సమాలోచనలో చేస్తూనే.. మరో వైపు అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానం.. తమకు ఏ సీట్లు కావాలి అనేదానిపై ఇప్పటికే టీడీపీ-జనసేన ముందు ప్రతిపాదనలు పెట్టింది బీజేపీ అధిష్టానం.. ఈ రోజు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు, సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండగా.. మరోవైపు.. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ హైకమాండ్‌ ట్విస్ట్‌ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థుల ఖరారులో తన సొంత ముద్ర ఉండేలా బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందట.. దీంతో, తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారికి టిక్కెట్ల కేటాయింపులో సందిగ్ధత నెలకొందని తెలుస్తోంది.. బీజేపీ కోసం పని చేసిన వారికి.. టీడీపీ ముద్ర లేని వారికి ప్రయార్టీ ఇచ్చే దిశగా బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.. తప్పదనుకుంటేనే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే, ఈ పరిణామాలతో టిక్కెట్లు ఆశిస్తున్న ప్రముఖులకు సైతం మొండి చేయి చూపే ఛాన్స్ ఉందంటున్నారు.. సామాజిక సమీకరణాలు.. గెలుపు ప్రతిపాదికనే టిక్కెట్ల కేటాయించాలని బీజేపీ అధిష్టానం ప్లాన్‌ చేస్తోంది.. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆశీస్సులున్నవారికి టిక్కెట్లు దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. కాగా, రాష్ట్రంలో కనీసం 8 లోక్‌సభ స్థానాల్లోనైనా పోటీ చేసే విధంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే, సీట్ల సంఖ్య, ఏఏ స్థానాలు అనేదానిపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఓనమాలు మాత్రమే నేర్చుకొంటే.. తెలుగు ఆనవాళ్లు ఉండవు
ఓనమాలు మాత్రమే నేర్చుకొంటే.. తెలుగు ఆనవాళ్లు ఉండవు అని హెచ్చరించారు భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. కాకినాడలో అఖిల భారత తెలుగు సాహితీ సదస్సును ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొందరు భాష చాలా ఎబ్బెట్టుగా, వెటకారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వాలు దురదృవశాత్తు సాహిత్యాన్ని ప్రోత్సహించడం లేదన్నారు.. ఓనమాలు మాత్రమే నేర్చుకొంటే.. తెలుగు భాష ఆనవాళ్లు కూడా ఉండవన్నారు. ఉప రాష్ట్రపతి అయిన తర్వాత రెస్ట్ తీసుకునే అవకాశం వచ్చిందన్నారు. ఇక, 45 ఏళ్లు విరామం లేకుండా రాజకీయాలు చేశాను అని గుర్తుచేసుకున్నారు.. మాతృ భాష తల్లి లాంటిది.. తెలుగు శతకాలు అలవాటు చేస్తే పిల్లలు బాగుపడతారు అని సూచించారు భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు..

అమిత్‌షాతో ముగిసిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీ.. పొత్తు ఖరారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.. గత కొంత కాలంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సస్పెన్స్‌ కొనసాగు వస్తుండగా.. ఈ రోజు ఉత్కంఠకు తెరపడింది.. పొత్తులపై తేల్చుకోవడానికి ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో ఈ రోజు జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చారు.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య అవగాహన కుదిరింది. అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య అవగాహన కుదిరింది. అయితే, పొత్తులపై, సీట్ల సర్దుబాటుపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని నేతలు చెబుతున్నమాట.. ఈ రోజు జరిగిన సమావేశంలో ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.. అంతేకాకుండా.. త్వరలో జరగబోయే ఎన్డీఏ సమావేశానికి కూడా టీడీపీ నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కూడా మూడు పార్టీల మధ్య అవగాహన కుదరగా.. మీడియా ద్వారా.. లేదా సోషల్ మీడియా వేదికగా ఎన్నికల పొత్తులపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక, జనసేన, బీజేపీకి కలిసి 8 ఎంపీ సీట్లు ఇస్తారని ప్రచారం సాగుతోంది.. బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇస్తే.. మిగతా రెండు ఎంపీ స్థానాల్లో జనసేన.. లేదా బీజేపీకి ఐదు సీట్లు ఇస్తే.. జనసేకు మూడు ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. అరకు, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురంలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఎవరితోనూ పొత్తు లేదని తేల్చిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవచ్చని ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి వార్తలను పుకార్లే అని ఆమె వ్యాఖ్యానించారు. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆమె ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదట. గత లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో మాయావతి పార్టీ పొత్తు పెట్టుకుంది. మాయావతి ట్వీట్ చేస్తూ, ‘బీఎస్పీ పూర్తి సన్నద్ధతతో తన సొంత బలంతో దేశంలో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో పోరాడుతోంది. ఎన్నికల కూటమి లేదా మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి వచ్చిన వార్తలన్నీ పుకార్లే. ఇలాంటి దుర్మార్గపు వార్తలు ఇచ్చి మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. యూపీలో బీఎస్పీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాలు అశాంతికి లోనవుతున్నాయి. అందుకే రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే బహుజన సమాజ్, బీఎస్పీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ఖాయమన్నారు. మాయావతి కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశం ఉందని, యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూటమి భాగస్వాముల కోసం ఆమె పార్టీ వెతుకుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో మాయావతి ఒంటరిగా ఎన్నికల రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచారు. తన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి కొన్ని వారాల క్రితం మీడియా సమావేశంలో ప్రకటించారు. బీఎస్పీ, కాంగ్రెస్‌ల పొత్తు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రెండు పార్టీలకు మేలు చేస్తుందని చెబుతున్నారు. ఒకవేళ పొత్తు ఉంటే దళిత-ముస్లిం కూటమి ప్రయోజనాలు సాధించి ఉండేవారు. లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.

లాలూ యాదవ్‌ సన్నిహితుడికి చెందిన ప్రాంగణాలపై ఈడీ దాడులు
బీహార్ రాజధాని పాట్నాలోని లాలూయాదవ్ సన్నిహితుడు సుభాష్ యాదవ్ అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది. పాట్నా, దానాపూర్‌ నుంచి బిహ్తా వరకు ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. సుభాష్ యాదవ్ కూడా రాష్ట్రీయ జనతాదళ్ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో లాలూ యాదవ్‌కు సన్నిహితుడైన కౌన్సిలర్ వినోద్ జైస్వాల్‌పై కూడా ఆదాయపు పన్ను శాఖ ఉక్కుపాదం మోపింది. ఆర్జేడీ నేత, లాలూ యాదవ్‌కు సన్నిహితుడు సుభాష్ యాదవ్‌పై ఈడీ చర్యలు తీసుకుంది. బీహార్‌లో సుభాష్‌ యాదవ్‌ అక్రమ ఇసుక తవ్వకాల వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో సుభాష్ యాదవ్ జార్ఖండ్‌లోని చత్రా నుండి RJD అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, ఎన్నికలలో అతను ఓడిపోయాడు. సుభాష్ యాదవ్ స్వస్థలం పాట్నాలోని షాపూర్ జిల్లా హెతాన్‌పూర్ గ్రామం. అతను బ్రాడ్‌సన్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి యజమాని. శుక్రవారం ఇసుకకు సంబంధించి నాయకుడి ప్రాంగణాన్ని ఈడీ విచారించింది. బీహార్ పోలీసులు గతంలో నమోదు చేసిన కొన్ని ఎఫ్‌ఐఆర్‌ల నుండి మనీలాండరింగ్ కేసు కూడా తలెత్తింది. ఇంతకు ముందు కూడా సుభాష్ యాదవ్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. 2018లో పాట్నా, ఢిల్లీ, ధన్‌బాద్‌లలో చర్యలు తీసుకున్నారు.

అశ్విన్ మాయాజాలం.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్స్ కోల్పోయిన ఇంగ్లండ్!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెచ్చిపోయాడు. తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఇప్పటికే యాష్ నాలుగు వికెట్స్ పడగొట్టి ఇంగ్లీష్ నడ్డి విడిచాడు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ తీయడంతో మూడో రోజు భోజన విరామం సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్స్ కోల్పోయి 103 రన్స్ చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 156 పరుగులు వెనకపడి ఉంది. భరత్ స్పిన్నర్ల జోరు చూస్తే మ్యాచ్ ఈ రోజే ముగిసేలా కనబడుతోంది. మూడో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోర్ 473/8తో మొదటి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్ 477 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్‌ వికెట్‌ కోల్పోయింది. జేమ్స్ అండర్సన్‌ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌ (30) ఔటయ్యాడు. కాసేపటికే జస్ప్రీత్ బుమ్రా (20)ను షోయబ్ బషీర్‌ పెవిలియన్ చేర్చాడు. భారత బ్యాటర్లలో గిల్‌ (110), రోహిత్‌ (103)లు సెంచరీలు చేయగా.. పడిక్క్‌ (65), జైస్వాల్‌ (57), సర్ఫరాజ్‌ (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్‌ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 259 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లో ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (2)ను ఆర్ అశ్విన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 6వ ఓవర్లో మరో ఓపెనర్‌ జాక్ క్రాలే (0)ను యాష్ పెవిలియన్ చేర్చాడు. 11వ ఓవర్లో ఒలీ పోప్‌ (19)ను కూడా ఔట్ చేసి భారీ షాక్ ఇచ్చాడు. వికెట్స్ పడుతున్నా బెయిర్‌స్టో, రూట్‌లు దూకుడుగా ఆడారు. అయితే వీరి దూకుడుకు కుల్దీప్ యాదవ్ కళ్లెం వేశాడు. 18వ ఓవర్లో బెయిర్‌స్టో (39)ను వికెట్ల ముందు దోరకబుచ్చుకున్నాడు. 23వ ఓవర్లో బెన్‌ స్టోక్స్‌ (2)ను యాష్ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన జేమ్స్ ఆండర్సన్‌!
ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్ జేమ్స్‌ ఆండర్సన్‌ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐదవ టెస్టులో జిమ్మీ ఈ ఫీట్ సాదించాడు. ఆట మూడవ రోజు ఉదయం నాల్గవ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేసిన ఆండర్సన్‌.. 700 టెస్ట్ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా టెస్ట్ క్రికెట్‌లో 700 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా జిమ్మీ రికార్డుల్లో ఉన్నాడు. 41 ఏళ్ల వయసులో జేమ్స్ ఆండర్సన్‌ 700 వికెట్ ఘనత సాధించడం విశేషం. టెస్ట్ క్రికెట్‌లో మరే పేసర్ కూడా 700 వికెట్లు పడగొట్టలేదు. ఇంగ్లండ్‌ మాజీ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ 604 వికెట్స్ తీసి రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్‌ (800), షేన్‌ వార్న్‌ (708) స్పిన్నర్లు కావడం విశేషం. 2003లో లార్డ్స్‌లో జింబాబ్వేతో జరిగిన టెస్టుతో జిమ్మీ తన కెరీర్‌ ఆరంభించాడు. 21 సంవత్సరాల కెరీర్‌లో అతడు 187వ టెస్ట్ మ్యాచ్‌ను ఆడుతున్నాడు. ఏ బౌలర్ కూడా ఇన్ని టెస్టులు ఆడలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200) మాత్రమే జిమ్మీ కంటే ఎక్కువ టెస్టులు ఆడాడు. ధర్మశాల టెస్ట్‌కు ముందు జేమ్స్‌ ఆండర్సన్‌ 698 వికెట్స్ పడగొట్టాడు. రెండవ రోజు లంచ్ తర్వాత శుభమాన్ గిల్‌ను బౌల్డ్ చేసి 699 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. మూడోరోజు ఉదయం కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేసిన 700 టెస్ట్ వికెట్ సాధించాడు. జింబాబ్వే ఆటగాడు మార్క్ వెర్ములెన్ తొలి టెస్టు వికెట్‌గా ఉన్నాడు. జాక్వెస్ కలిస్ (100), పీటర్ సిడిల్ (200), పీటర్ ఫుల్టన్ (300), మార్టిన్ గప్టిల్ (400), క్రైగ్ బ్రాత్‌వైట్ (500), అజర్ అలీ (600) వికెట్‌గా ఉన్నారు.

మెగా మేనల్లుడు కొత్త ప్రొడక్షన్ హౌస్.. ముగ్గురు మామయ్యల ఆశీస్సులతో
మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకడు. కెరీర్ మొదట్లో కొన్ని పరాజయాలను చవిచూసినా.. తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో ఆడో పెద్ద సెన్సేషన్ సృష్టించి మరింత ఫేమస్ అయ్యాడు. చావు చివరి అంచుల వరకు వెళ్లి తిరిగివచ్చిన తేజ్.. జీవితం విలువ తెలుసుకొని.. కంగారుపడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇక గతేడాది ఆగస్టు 15 కు సత్య అనే ఫీచర్ ఫిల్మ్ ను తేజ్ రిలీజ్ చేశాడు. నరేష్ కుమారుడు, తేజ్ ఫ్రెండ్ అయిన నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ ఫీచర్ ఫిల్మ్ మంచి అవార్డులను కూడా అందుకుంది. ఇందులో తేజ్ సరసన కలర్స్ స్వాతి నటించింది. ఇక తాజాగా ఈ ఇద్దరు స్నేహితులు కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించారు. నరేష్ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన విజయ నిర్మలలోని విజయను .. తేజ్ తల్లిపేరులోని దుర్గను తీసుకొని విజయదుర్గ ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్నీ తేజ్.. అధికారికంగా అభిమానులతో పంచుకున్నాడు. తమ ప్రొడక్షన్ హౌస్ కు తన ముగ్గురు మామయ్యల ఆశీర్వాదం కూడా దక్కిందని తేజ్ తెలిపాడు. ” కొత్త ప్రారంభం.. నా తల్లికి ఆమె పేరు మీద ఒక చిన్న బహుమతిని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది, మా ప్రొడక్షన్ హౌస్ విజయదుర్గాప్రోడ్ ను మా మామయ్యలు ఆశీస్సులతో ప్రారంభించాను.నా కెరీర్‌లో మొదట్లో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు ఈ ప్రొడక్షన్ హౌస్ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్స్‌తో చేసిన “సత్య” లాంటి అమూల్యమైన అసోసియేషన్‌తో దీన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇలాంటివి ఎన్నో ముందు ముందు రానున్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

సల్మాన్ పందిలా తింటాడు.. కుక్కలా.. నటుడు సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కండల వీరుడుగా ఎంతోమంది హీరోస్ కు ఆయన ఇన్స్పిరేషన్ గా మారాడు. ఇక హీరోలు అంటే.. గ్లామర్ ను కాపాడుకోవడానికి, ఏజ్ కనిపించకుండా ఉండడానికి జిమ్ చేస్తూ ఉంటారు. ఇక దానికోసం పక్కా డైట్ ఫాలో అవుతారు. రైస్ తినరు.. ఇక బిర్యానీల సంగతి అంటే అస్సలు చెప్పనవసరం లేదు. కానీ, ఇందుకు సల్మాన్ విరుద్ధం. ఆయన ఎలా తింటాడో.. అంతకు మించి వర్క్ అవుట్ చేస్తాడట. ఈ విషయాన్నీ సల్మాన్ స్నేహితుడు, నటుడు విందు దార సింగ్‌ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “సల్మాన్, నేను చిన్నతనం నుంచి కలిసే చదువుకున్నాం. నేను బరువు పెరగడం చూసి.. సల్మాన్ జిమ్ జాయిన్ అయ్యినట్లు చెప్తాడు. ఎక్కువసేపు జిమ్ లోనే ఉంటాడు. అలా అని తినకుండా మాత్రం ఉండడు. తిండి విషయంలో అస్సలు కంట్రోల్ పెట్టుకోడు. పందిలా తింటాడు.. కుక్కలా వర్క్ అవుట్ చేస్తాడు. అదే సల్మాన్ పాలసీ. అంతా తిన్నావు.. అదంతా ఏది.. అంటే వర్క్ అవుట్ చేసి కరిగించేసాను అని చెప్తాడు. ఇక సల్మాన్ ది చాలా మంచి మనసు. అతనొక అద్భుతమైన వ్యక్తి. సాయం చేసే గుణం ఎక్కువ.. తన తండ్రి తనకు డబ్బులిస్తే.. వాటిని ఇంట్లో పనిచేసేవారికి పంచిపెట్టేవాడు. అది ఎంత అయినా సరే.. ఒక్కోసారి అవి లక్షల్లో ఉండేవి. ఇప్పటికీ సల్మాన్ అలానే ఉన్నాడు. నెలకు దాదాపు రూ.25- 30 లక్షల వరకు దానం చేస్తుంటాడు. ఎంత సంపాదించినా.. తన పాకెట్ మనీ మాత్రం తండ్రి దగ్గరే తీసుకుంటాడు. ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచుకోడు. సల్మాన్ వ్యక్తిత్వం వేరు” అంరూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version