NTV Telugu Site icon

Top Headlines@1PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్ కోసమే..
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సుయాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు అని తెలిపారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం.. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారు.. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3 కోట్ల మందికి పైగా లబ్ది పొందారు అని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ చూడని విధంగా రైత భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుకు 13, 500 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నాం.. ప్రతి మహిళ ముఖంలోనూ ఆత్మ విశ్వాసం కనిపిస్తుంది.. ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికే వచ్చి వైద్యం అందిస్తున్నాం అని సీఎం జగన్ వెల్లడించారు. ఇక, నా కంటే ముందు చాలా మంది సీఎంలు పని చేశారు.. నా కంటే ముందు ఓ 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారు అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నేను వయస్సులో చాలా చిన్నోడిని.. ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశాడా అని ప్రశ్నించారు.

విధ్వంసకర పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలి..
పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలి అని పేర్కొన్నారు. విధ్వంసకర పాలన నుండి ప్రజలను విముక్తి చేయాలి.. ఎన్నికల సమయంలో పని చేసే విషయాలపై క్షేత్ర స్థాయిలో వివరించడంతో పాటు కార్యకర్తలతో కలిసి దిశా నిర్దేశం చేయాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం అయింది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల ఆలోచనలు తీసుకుంటాం అని ఆమె తెలిపారు. పొత్తులో మూడు పార్టీలు ఉన్నా ఎజెండా ఒక్కటే.. అప్పుల ఊబిలోకి నెట్టేసి నా వైసీపీ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారు అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో సుపరిపాలన అందిస్తున్నారు అని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. దేశంలో అవినీతి రహిత పాలన ఇస్తున్నారు.. నరేంద్ర మోడీ పాలనలో 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య బాలరాముడు విగ్రహం ప్రాణ ప్రతిష్టతో పాటు పేదవాడి జీవితానికి భరోసా నరేంద్ర మోడీ కల్పించారు.. అలాగే, దేశంలో పేదరికం తగ్గుతుంది అని చెప్పుకొచ్చారు.

రామవరంలో హై టెన్షన్..సైకిల్ని మంటలో విసిరేసిన నల్లమిల్లి అనుచరులు
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టిక్కెట్టు పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి జాబితాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టిక్కెట్ కేటాయించిన చంద్రబాబు.. ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు బీజేపీకి టికెట్ మార్పు చేయటంపై అనపర్తి టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అనపర్తి మండలం రామవరంలోని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జెండాలు, కరపత్రాలు, ఎన్నికల సామాగ్రిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. అధిష్టానం నిర్ణయం వచ్చే వరకు శాంతియుతంగా ఉండాలని రామకృష్ణారెడ్డి కార్యకర్తలను సముద్రయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేస్తున్నారు. కోపంతో టీడీపీకి చెందిన జెండాలు, కరపత్రాలు, సైకిల్ ను మంటలో వేసి దగ్ధం చేశారు. ఇక, అనుచరులతో తన నివాసంలో నల్లమిల్లి సమావేశం అయ్యారు. అనపర్తి నియోజకవర్గం నుంచి రెబల్ గా పోటీ చేసే అవకాశం ఉంది.

కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.. కేటీఆర్ ఆగ్రహం
ఇది కాలం తెచ్చిన కరువు కాదు ,కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటలకు తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద పంట నష్టాన్ని ఎమ్మేల్యే కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఏడువేల కోట్లు రైతు బంధు కోసం పెట్టిపోతే అన్నారు. అవి కూడా రైతులకి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్ లకి ఆడబ్బు ఇస్తోందన్నారు. రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ మండిపడ్డారు. గతేడాది ఇదే సమయానికి నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కాళేశ్వరం, కేసీఆర్ పై కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడన్నారు. ఢిల్లీకి ,హైదరాబాద్ కి తిరగడం తప్ప రైతులను పరామర్శించే సమయం రేవంత్ కి లేదన్నారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 200 మంది రైతులు చనిపోయారన్నారు. ఎండిపోయి పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. ఎకరానికి పదివేల, 25 వేల ఎంత ఇస్తారో.. పరిహారం ఇవ్వండి అని తెలిపారు. రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధు ఇవ్వాలని కోరారు. రైతులకు అండగా మేమున్నాం.. కేసీఆర్ ఉన్నారన్నారు. దయచేసి ఆత్మహత్య లాంటి చర్యలకు రైతులు పాల్పడవద్దంటూ కేటీఆర్ అన్నారు.

అవినీతి పరులను జైల్లో వేస్తామన్నారు.. సీఎం మాటలకే పరిమితమా..?
రేవంత్ రెడ్డి అవినీతి పరులను జైల్లో వేస్తామని మాటలకే పరిమితం అయ్యాడు తప్ప చర్యలు లేవని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లీక్ వీరుడు కాదు.. గ్రీక్ వీరుడు అని నిరూపించుకోవాలని అనుకుంటే ఫోన్ టాపింగ్ వ్యవహారం నీ సీబీఐ విచారణ జరపాలన్నారు. పాత్ర దారులతో పాటు సూత్ర దారులను కూడా బయట పెట్టాలన్నారు. కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. పోన్ టాపింగ్ లో ఆ కుటుంబం పాత్ర ఉందన్నారు. కాళేశ్వరంలో కూడా ఆ కుటుంబం పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి… వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి అవినీతి పరులను జైల్లో వేస్తామని మాటలకే పరిమితం అయ్యాడు తప్ప చర్యలు లేవన్నారు. ధరణి పై చర్యలు లేవు.. ఒక్క దరఖాస్తును కూడా పరిస్కరించలేదన్నారు. మియాపూర్ భూములు, డ్రగ్స్ కేసులు పత్తా లేవన్నారు. తాజాగా పోన్ టాపింగ్ వ్యవహారం ..ప్రముఖుల పోన్ టాపింగ్ జరిగాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

టికెట్ రాలేదని ఆత్మహత్య చేసుకున్న ఎంపీ..!
కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈరోడ్ ఎంపీ, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) సీనియర్ కార్యకర్త 77 ఏళ్ల ఎ. గణేశమూర్తి, మార్చి 28, 2024 గురువారం నేటి ఉదయం 5.05 గంటలకు గుండెపోటుతో మరణించారు. మార్చి 24న విషం తాగి ఈరోడ్‌ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండగా.. ఆయన తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. గణేశమూర్తి మొత్తంగా మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన మృతదేహాన్ని ఈరోడ్‌ లోని పెరియార్ నగర్‌ లోని ఆయన నివాసానికి తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ ఆత్మహత్య గల కారణం ఆయనకు పార్టీ నుండి మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వకవపోవడమే కారణమని తెలుస్తోంది.

కరెన్సీ నోట్లపై నిద్రిస్తున్న నేత..!
అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయవేత్త తన మంచంపై 500 రూపాయల నోట్లు వేసి వాటిపై పడుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అస్సాం రాష్ట్రంలోని ఉదయ్ గిరి జిల్లాలోని భైరగురి లో బెంజమిన్ బసుమతరీ బహుమతిని ఆ గ్రామ విలేజ్ కౌన్సిలర్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఆయన 500 నోట్లను మంచంపై పరుచుకొని నిద్రిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. అంతేకాదు ఆయనపై మరికొన్ని నోట్లో కట్టులను కూడా వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. దీంతో సదరు పార్టీ అతను సస్పెండ్ చేసింది. తాను ఉన్న పార్టీ నుంచి అతనిపై క్రమశిక్షణ తీసుకుంటున్నట్లు ఓ లేక అందినట్లు బోరో తెలిపారు. ఇకపోతే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫోటో ఆయన స్నేహితులు ఐదేళ్ల క్రితం వారింట్లో ఒక పార్టీ జరిగిన సమయంలో తీసినట్లు ఆయన స్పష్టం చేశారు. కాకపోతే ప్రస్తుతం ఎలక్షన్ నేపథ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘ఫ్యామిలీ స్టార్ ‘ ట్రైలర్ వచ్చేసింది.. అది మాత్రం హైలెట్ బాసూ..
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్ ‘. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు.. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5 పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజీర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి..రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్నిపెంచేసిన మేకర్స్.. వరుస లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ హైప్ ను క్రియేట్ చేశాయి.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఫ్యామిలీ విలువలను పెంచేలా అద్భుతంగా ఉంది ట్రైలర్.మిడిల్ క్లాస్ వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి.. ఫ్యామిలి ఎమోషన్స్, విజయ్ దేవరకొండ డైలాగులు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.. ప్రతి సీన్ లో విజయ్ డైలాగులు బాగా ఆకట్టుకుంటున్నాయి.. విజయ్ దేవరకొండ లుక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని ట్రైలర్ ను చూస్తుంటే తెలుస్తుంది.

విజయంతో ఊపుమీద ఉన్న రాయల్స్ కు ఢిల్లీ బ్రేకులు వేసేనా..?!
ఇవాళ జైపూర్‌ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఐపీఎల్ 2024 తొమ్మిదో మ్యాచ్ లో భాగంగా సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) రిషబ్ పంత్‌ తో ఇద్దరు వికెట్ కీపర్ల సమరం జరగబోతుంది. ఇక, లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో రాయల్స్ ఈ గేమ్‌ లోకి అడుగుపెట్టనుంది. కెప్టెన్ శాంసన్ అజేయ అర్ధ సెంచరీతో వారి బ్యాటింగ్ తో ఫామ్ లోకి రాగా.. రియాన్ పరాగ్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. 194 పరుగులను డిఫెండింగ్ చేస్తూ, అవేష్ ఖాన్ మినహా రాజస్థాన్ రాయల్స్ ఉపయోగించిన బౌలర్లందరూ కనీసం ఒక వికెట్ తీశారు. అయితే, ఇక కొత్త బంతితో ట్రెంట్ బౌల్ట్ ఎలాగో మంచి శుభారంభాన్ని అందిస్తాడు. ఇక మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ (PBKS) చేతిలో ఓడిపోవడంతో వారి ఈ ఐపీఎల్ సీజన్‌ గొప్పగా ప్రారంభం కాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బాటింగ్ కి వచ్చిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ యూనిట్ పరిమితం చేయలేకపోయింది, దింతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గేమ్‌ ను గెలుచుకుంది.

Show comments