NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

భక్తులకు షాక్‌.. చిన వెంకన్న ఆలయంలో అద్దె రూ.800 నుంచి రూ.5 వేలకు పెంపు
ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం భక్తులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది.. చిన వెంకన్న ఆలయంలో కల్యాణ మండపాల అద్దెలు భారీగా పెంచింది.. ఇప్పటి వరకు కల్యాణ మండపాల అద్దె రూ.800గా ఉండగా.. ఇప్పుడు రూ.800 నుండి రూ.5 వేల వరకు పెంచనున్నట్టు అధికారులు ప్రకటించారు.. అయితే, పెరిగిన అద్దేపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా తెలపాలని భక్తులకు సూచించింది ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయ పాలకమండలి.. కాగా, చిన వెంకన్న ఆలయంలో పెద్ద సంఖ్యలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి.. శుభముహూర్తాలు వచ్చాయంటే చాలు.. పెళ్లిళ్లు చేసుకుని జంటలు క్యూ కడుతుంటాయి. కానీ, రూ.800గా ఉన్న కల్యాణ మండపాల అద్దెను ఒకేసారి రూ.5వేలకు పెంచడంపై భక్తులల నుంచి విమర్శలు వస్తున్నాయి.

పెండింగ్‌ సీట్లపై ఏటూ తేల్చుకోలేకపోతోన్న జనసేన..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే షెడ్యూల్‌ కూడా వచ్చేసింది.. అయితే, మిత్రపక్షాలైన తెలుగుదేశంపార్టీ – జనసేన పార్టీ – భారతీయ జనతా పార్టీ.. ఇంకా కొన్ని సీట్లపై తేల్చలేకపోతున్నాయి.. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించారు.. అయితే, జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. కానీ, విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది. ఇదే సమయంలో జనసేన పోటీ చేసే బందరు పార్లమెంటు స్థానాన్ని కూడా పెండింగులో పెట్టింది. అయితే, పెండింగ్‌లో ఉన్న సీట్లల్లో అభ్యర్థుల ఖరారుపై ఇప్పటి వరకు ఏటూ తేల్చుకోలేకపోతోంది జనసేన పార్టీ.. మూడు అసెంబ్లీ, ఓ లోక్ సభ సీటుపై ఇంకా క్లారిటీకి రాలేదు.. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘ కసరత్తు చేశారు.. అయినా ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లను ఫైనల్‌ చేసినట్టుగా కనిపించడంలేదు.. మరోవైపు డైలామాలోనే బందరు పార్లమెంట్ సీటు వ్యవహారం ఉంది.. మరింత మంచి అభ్యర్థుల కోసం పవన్ కల్యాణ్‌ సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది.. అంగ బలం, అర్ధబలం ఉన్న అభ్యర్థుల కోసం జనసేనాని గాలిస్తున్నారని ప్రచారం సాగుతోంది. మరోవైపు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తొలిసారి తాను ఎన్నికల బరిలోకి దిగుతోన్న పిఠాపురంలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపటి నుంచి మూడు రోజుల పాటు జనసేనాని పిఠాపురంలో పర్యటించబోతున్నారు.. తొలి రోజు శ్రీ పురుహూతిక దేవి అమ్మవారి ఆలచాన్ని దర్శించుకోనున్నారు పవన్‌.. అక్కడే వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు..

దేవినేని ఉమాకు టీడీపీ కీలక బాధ్యతలు..
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుకు కీలక బాధ్యతలు అప్పగించింది టీడీపీ.. దేవినేని ఉమాకు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పచెప్పింది.. ఇప్పటికే ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు ఉమకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.. ఈ సారి ఎన్నికల్లో సీట్ల సద్దుబాటు కారణంగా పోటీ చేయలేకపోతున్న దేవినేని ఉమాకు మొత్తంగా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది టీడీపీ. దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.. ”తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో సేవలు అందిస్తున్న దేవినేని ఉమామహేశ్వరావుకి అదనంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమన్వయ బాధ్యతలను అప్పగించడం జరిగింది.” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మైలవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.. ఈ పరిణామాలతో తీవ్ర కసరత్తుచేసిన టీడీపీ అధినేత.. వసంత కృష్ణ ప్రసాద్‌ను మళ్లీ మైలవరం నుంచే బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చారు.. దీంతో, ఆ స్థానంపై పట్టున్న దేవినేని ఉమా.. అసంతృప్తికి లోనయ్యారు. ఇదే సమయంలో దేవినేనిని మరోస్థానం నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతూ వచ్చింది. కానీ, చివరకు పార్టీలో దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

అధికారులు తప్పకుండా ఈసీ ఆదేశాలు అమలు చేయాల్సిందే..
అధికారులు తప్పకుండా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు పాటించాలి.. తమ ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేయాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఈ రోజు ఏలూరులో పర్యటించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో ఎన్నికల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో పలు సూచనలు చేశారు.. ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తప్పకుండా ఎన్నికల సంఘం సూచనలను, ఆదేశాలు అమలు చేయాలన్నారు. ఇక, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొనకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదేనని స్పష్టం చేశారు. ఇక, తన పర్యటనలో ఏలూరులోని సీఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ గదులను కూడా పరిశీలించారు ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలు మే 13వ తేదీన నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం విదితమే.. అదే రోజు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ఏప్రిల్ 19 నుండి జూన్ 1వ వరకు జరిగే ఏడు దశల ఎన్నికల ప్రక్రియలో.. మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు.. ఇక, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

తిరుమల నడకమార్గంలో మళ్లీ కలకలం.. ఐదు సార్లు చిరుత సంచారం
తిరుపతి – తిరుమల నడకమార్గంలో మళ్లీ చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.. చిరుత ఓ బాలుడిపై దాడి చేయడం.. మరో చిన్నారి ప్రాణాలు తీసిన తర్వాత.. చిరుతలతో పాటు ఇతర అటవీ జంతువుల కదలికలను పసిగట్టేందుకు ఫారెస్ట్‌ అధికారులతో కలిసి చర్యలకు దిగిన టీటీడీ.. ప్రత్యేకంగా ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటి కదలికలను గుర్తించి బోన్‌లను ఏర్పాటు చేస్తూ.. వాటిని బందిస్తూ వచ్చింది.. అయితే, ఇప్పుడు మళ్లీ చిరుతల సంచారం మొదలైనట్టు అధికారులు చెబుతున్నారు.. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన డీఎఫ్‌వో సతీష్ రెడ్డి.. నడకదారిలో చిరుతల సంచారం కొనసాగుతుందన్నారు.. అయితే, ఫిబ్రవరి నెలలో చిరుతల కదలికలు కనిపించలేదని.. కానీ, మార్చి నెలలో ఐదు సార్లు చిరుత కనిపించినట్టు వెల్లడించారు. అధునాతనమైన ట్రాప్ కెమెరాల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు చిరుత కదలికలు గుర్తించి.. సిబ్బందిని అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. ఇక, ఏప్రిల్‌ నెలలో సెంట్రల్ వైల్డ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతాం.. వారి సూచనలతో నడకదారిలో జంతువుల సంచారానికి అనువుగా ఏర్పాట్లు చేస్తాం అని వెల్లడించారు డీఎఫ్‌వో సతీష్ రెడ్డి.

హస్తం గూటికి కడియం.. కాంగ్రెసోళ్లు జర జాగ్రత్త
కడియం శ్రీహరి పార్టీ మార్పు పై బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, పెద్ద సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. హన్మకొండ పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని హితువు పలికారు. కడియం కావ్య పెట్టిన కామెంట్ చూసి నేను ఆశ్చర్యపోయామన్నారు. 31 తారీఖున చేపట్టే కార్యక్రమాల గురించి మాట్లాడేందుకు కడియం శ్రీహరి ఇంటికి 8 గంటలకు నేను స్వయం వెళ్లాను అప్పుడు కూడా ఏలాంటి కామెంట్ చేయలేదన్నారు. కడియం శ్రీహరి అహంకారంతో ఎంతోమందిని బలి పశులను చేశారన్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను నాయకులలో అణిచివేసిన చరిత్ర కడియం శ్రీహరి అని మండిపడ్ఆరు. టీడీపీలో పని చేసిన సమయంలో చంద్రబాబును బ్లాక్ మెయిన్ చేసి పదవులు తీసుకున్న చరిత్ర కడియం శ్రీహరి ది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిస్వార్థంతో బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటే.. బీఆర్ఎస్ లో అదే విధానాలు అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయరామారావు, దొమ్మాటి సాంబయ్య, ఎంపీ దయాకర్, అరూరి రమేష్, రాజయ్యలను బయటకు వెళ్ళేలా చేశారు కడియం శ్రీహరి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై కుట్రలు చేసి పార్టీకి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి నిజాయితీపరుడు అయితే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం సీనియార్టీని గౌరవించి డిప్యూటీ సీఎం చేస్తే ఇంతటి దిగజారుడుకు పనికి చేస్తావా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పార్టీలు మాట్లాడుతున్న మోసం చేసిన కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్యాకేజీ మాట్లాడుతున్న కాంగ్రెస్ నుంచి పోటీలో నిలబడాలని కోరారు.

హరీష్ రావ్ బీజేపీలో చేరడం ఖాయం.. కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎంపీ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీజేపీలో చేరతారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్.. హరీష్.. కేటీఆర్.. మాత్రమే బీఆర్ఎస్ లో మిగిలుతారన్నారు. పార్టీ నిర్ణయమే నా నిర్ణయమన్నారు. పార్టీ ఫైనల్.. ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి పని చేస్తా అన్నారు. నల్గొండ, భువనగిరి లో భారీ మెజార్టీ తో గెలుస్తుంది కాంగ్రెస్ అని తెలిపారు. చేరికలపై గేట్లు మేమేం ఎత్తలేదు.. దూసుకుని వస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలిందన్నారు. ఆయన నేర్పిన విద్యనే కదా అన్నారు. కేసీఆర్ చేసిన పాపాల మూలంగా కరువు వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే వర్షం.. వర్షం అంటే కాంగ్రెస్ అనేట్టు ఉండేదన్నారు. రైతుల బాధ చూస్తే ఏడుపు వస్తుంది.. దీనికి కేసీఆర్ చేసిన పాపమే కారణమన్నారు. యాదాద్రి గుట్టపైనా కేసీఆర్ బొమ్మ.. కారు బొమ్మ వేసుకున్న పాపం తగిలిందన్నారు. కేసీఆర్ ట్యాపింగ్ పాపంతో చాలా మంది పోలీసు అధికారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు. సీఎంఆర్ఎఫ్ కాళేశ్వరం లో దోపిడీ జరిగిందని మండిపడ్డారు. దేవుడు పేరు తో కట్టిన ప్రాజెక్టులో అవినీతి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చిల్లర వ్యవహారం అని మండిపడ్డారు. ప్రతీది రాజకీయం చేయడమే కేసీఆర్ పని అన్నారు. కాంగ్రెస్ అంటే కరువు అని హరీష్ బుద్ది లేని మాటలు మాట్లాడుతున్నాడన్నారు. యాదగిరిగుట్ట పోతే దేవుడే కనపడకుండా చేశారు కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడిది? అని ప్రశ్నించారు.

కన్ఫూజన్‌లో దానం..! మారనున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి..
దానం వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తి నిచ్చే సాంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారన్న వార్తలతో తెరపైకి వచ్చారు. ఈనెల 14న దానం నాగేందర్‌ సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాపూర్వకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు నేతలకు దానం కలవడంతో దానం కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని తేలింది. అయితే దానం సీఎం రేవంత్‌ రెడ్డిని, పలు కాంగ్రెస్‌ నాయకులను కలిసినా ఇప్పటి వరకు తన ఎమ్మెల్యే పదివికి రాజీనామా చేయలేదు. దానం ఈనెల మార్చి 17న బీఆర్‌ఎస్‌ కు గుడ్‌ బై చెప్పి సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో దానం నాగేందర్‌ ను సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించింది. అయితే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. దానం ఇంకా కన్ఫ్యూజన్‌ లో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఏఐసీసీ ఆయనకు క్లారిటీ ఇచ్చింది. దానం ఎమ్మెల్యే పదివికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు ఏఐసీసీ చెప్పింది. రేవంత్‌ రెడ్డితో కలిసిన దానం ముందు ఓకే చెప్పిన, ఇప్పటికి వరకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడంతో అటు బీఆర్‌ఎస్‌, ఇటు కాంగ్రెస్‌ వర్గాల్లో దానం హాట్ టాపిక్‌ అయ్యారు. మొన్నటి వరకు దానం తన సొంత గూటికి వెళ్లనున్నట్లు వచ్చిన వార్తలకు దానం మరి చెక్ పెట్టీ మళ్లీ బీఆర్‌ఎస్‌ లోనే కొనసాగుతారా? అనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఏఐసీసీ . సికింద్రాబాద్ అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మళ్ళీ తెరపైకి బొంతు రామ్మోహన్ పేరు రావడం.. ఒకటి..రేండు రోజుల్లో ఏఐసీసీ క్లారిటీ ఇవ్వనున్నట్లు వార్తలు రావడంతో దానం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇటు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి వెళ్లిన దానం ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి, సికింద్రాబాద్‌ ఎంపీ బరిలో నిలుస్తారా? లేక ఆ ప్లేస్‌ లో బొంతు రామ్మోహన్‌ పోటీ చేస్తారా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

చెత్త సేకరణకు గాడిదలు.. టెండర్లు పిలిచిన మున్సిపల్ కార్పొరేషన్
దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు చెత్త వ్యాన్లను కేటాయించింది. ఈ వాహనాలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తాయి. ఆ తర్వాత ఈ వ్యర్థాలను డంపింగ్ జోన్‌లో వేస్తారు. చెత్త బండికి అతి పెద్ద గుర్తింపు అందులో వినిపించే శబ్ధాలే. చెత్త శబ్దం రాగానే ప్రజలు తమ ఇళ్ల వెలుపల చెత్తను ఉంచుతారు. కానీ జోధ్‌పూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో చెత్తను సేకరించేందుకు చెత్త బండ్లను ఉపయోగించడం లేదు. ఈ ప్రాంతాల్లో చెత్త సేకరించేందుకు కాలువ కార్పొరేషన్లు గాడిదలను ఉపయోగిస్తాయి. దీని కోసం సాధారణ టెండర్‌ను పిలిచారు. బహుశా ఇది విన్న తర్వాత నమ్మరు. కానీ ఇది నిజం. ఇక్కడి ఎమ్మెల్యే కూడా గాడిదలను పెంచేందుకు కసరత్తు ప్రారంభించారు.

భారత్లో పెరిగిపోతున్న నిరుద్యోగం.. ఐఎల్వో హెచ్చరిక
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. ఇప్పటి వరకు విద్యావంతులు, చదువుకున్న యువతతో మెరుగైన ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న భారత్.. భవిష్యత్తులో డిమాండ్‌కు తగినంత యువ కార్మిక బలగం అందుబాటులో ఉండదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ కార్మిక సమాఖ్య(ILO).. ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌’తో కలిసి ‘భారత ఉపాధి నివేదిక-2024’ను తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో విద్య లేని వారు 3.4% ఉంటే ఉన్నత విద్యావంతులైన యువకులు నిరుద్యోగులుగా ఉంటారు. గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు 29.1శాతంగా ఉంది. ఇక, భారతదేశంలో నిరుద్యోగం ప్రధానంగా యువతలో సమస్యగా మారింది. ప్రత్యేకించి సెకండరీ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ విద్యను కలిగి ఉన్న యువకులలో ఇది కాలక్రమేణా తీవ్రమైంది అని ఐఎల్వో తెలిపింది. శ్రామిక శక్తి యొక్క నైపుణ్యాలు, మార్కెట్లో సృష్టించబడుతున్న ఉద్యోగాల మధ్య చాలా అసమతుల్యతను గణాంకాలు సూచిస్తున్నాయి. భారతదేశ పేద పాఠశాల విద్య కాలక్రమేణా దాని ఆర్థిక అవకాశాలకు ఆటంకం కలిగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ లాంటి ఆర్థికవేత్తల హెచ్చరికలు చేశారు.

ఈడీకి కాదు బీజేపీకి కేజ్రీవాల్ ఫోన్ పాస్ వర్డ్ కావాలి : ఢిల్లీ మంత్రి అతిషి
ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ సమయంలో ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి మర్లెనా ఈడీ పై ప్రశ్నలు లేవనెత్తారు. ఈడీ అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ పాస్‌వర్డ్‌ను ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికల వ్యూహం తెలుసుకోవాలంటే కేజ్రీవాల్ ఫోన్ పాస్‌వర్డ్ ఈడీకి కాదు, బీజేపీకే అవసరమని అతిషి అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కొంతకాలం క్రితం వరకు ఉపయోగిస్తున్న ఫోన్ పాస్‌వర్డ్‌ను ఈడీ ఎందుకు కోరుతోంది అని అతిషి అన్నారు. నిజానికి ఈడీ కోరుకునేది బీజేపీ కాదు. ఢిల్లీ, పంజాబ్‌లోని 23 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులు ఎలా పోటీ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈడీకి ఆ పాస్‌వర్డ్ అవసరమని, తద్వారా ఆ ఫోన్ ద్వారా I.N.D.I.A ఎన్నికల సన్నాహాలు, వ్యూహాన్ని తెలుసుకోవచ్చునని అతిషి చెప్పారు. ఎన్నికల వ్యూహం, ఆమ్ ఆద్మీ పార్టీ గురించి బీజేపీకి సమాచారం అవసరమని, అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ పాస్‌వర్డ్ అడుగుతుందని అతిషి అన్నారు. నిన్న కోర్టులో జరిగిన చర్చలో బీజేపీ లక్ష్యం తెలియకుండానే అందరికీ తెలిసిపోయిందని ఈడీని ఆరోపిస్తూ అతిషి అన్నారు. కేజ్రీవాల్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌ను చెప్పనందున కేజ్రీవాల్‌ను మరికొన్ని రోజులు రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం ఉందని ఈడీ శుక్రవారం తెలిపింది.

చైనా షాక్ ఇచ్చేందుకు రెడీ అయిన పాకిస్థాన్.. భారతే అందుకు కారణమా..?
భారత్‌తో వాణిజ్యం కోసం మార్గాలను అన్వేషిస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం నాడు మరోసారి దీనిపై చర్చించింది. గత కొద్ది రోజుల క్రితం, పాకిస్తాన్ కొత్త విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ లండన్‌లో ఒక ప్రకటన చేశారు. భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణను పాకిస్థాన్ తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన చెప్పారు. ఆగస్టు 2019 నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయాయి.. వాటిని తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నామని తెలిపారు. అలాగే, ఇస్లామాబాద్‌లో భారతదేశంతో వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్‌ను ధృవీకరించారు.
ఇక, భారతదేశంతో వాణిజ్యంపై పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖతో సహా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రతిపాదనలను క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది. పాకిస్థాన్ చాలా అవసరాలకు చైనా పైనే ఆధారపడటం గమనార్హం. పాకిస్థాన్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే చైనా నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పాకిస్థాన్‌లో తమ పౌరులపై దాడులు ఆగడం లేదు. అలాగే, చైనా పౌరులు మరణించిన తర్వాత ప్రావిన్స్‌లోని స్వాబీ జిల్లాలో టార్బెలా జల విద్యుత్ విస్తరణ ప్రాజెక్టు నిర్మాణ పనులను చైనా కంపెనీ ‘పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా’ (పీసీసీసీ) ప్రారంభించిందని ప్రభుత్వ వర్గాలను తెలిపినట్లు ‘డాన్’ వార్తాపత్రిక తన వార్తలో పేర్కొంది. షాంగ్లా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో.. నిర్మాణ సంబంధిత పనులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. దీంతో 2,000 మందికి పైగా కార్మికులు ఇక్కడ పని నుంచి తొలగించబడ్డారు.

మెకానిక్ అవతారమెత్తిన మాస్ కా దాస్ ‘విశ్వ‌క్‌సేన్‌’..!
వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న విశ్వ‌క్‌సేన్‌ తాజాగా తాను నటిస్తున్న సినిమా సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈమధ్య థియేటర్లలో ‘గామి’ గా పలకరించిన విశ్వ‌క్‌సేన్‌ ప్రేక్షకుల నుండి కాస్త మిశ్రమ స్పందనలను అందుకున్నాడు. ఇక తాను నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా వచ్చే నెలలో విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇది ఇలా ఉండగా.. మరోవైపు విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ గా రెంచ్ పట్టుకొని ఊర మాస్ లుక్ లో కనపడుతున్నాడు. రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో విశ్వ‌క్‌సేన్‌ ఈ సినిమాను చేస్తున్నాడు. మెకానిక్ రాకీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మాతగా వహిస్తున్నారు. నేడు విశ్వ‌క్‌సేన్‌ పుట్టినరోజు సందర్భంగా మెకానిక్ రాకీ ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే చేతిలో రించ్ ను పట్టుకొని, నోట్లో సిగరెట్కాల్చుతూ ఉన్న ఊర మాస్ అవతారంలో దర్శనమిచ్చాడు హీరో విశ్వ‌క్‌సేన్‌.

Show comments