NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఢిల్లీకి పురంధేశ్వరి.. ఆ తర్వాతే అభ్యర్థుల ఫైనల్..!
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన పార్టీలతో పొత్తు ఖరారు చేసుకున్న భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక పూర్తి అయినట్టు తెలుస్తుండగా.. ఆ లిస్ట్‌ను బీజేపీ అధిష్టానం ఫైనల్‌ చేయాల్సి ఉంది.. ఇప్పుడు అందుకోసమే ఢిల్లీ బాట పట్టారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.. తన పర్యటనలో బీజేపీ జాతీయ నేతలతో ఆమె సమావేశం కానున్నారు.. వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై బీజేపీ అధిష్టానంతో చర్చించనున్నారు పురంధేశ్వరి.. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనలను హైకమాండ్‌ ముందు ఉంచి.. లాభనష్టాలను బేరీజు వేసి.. అభ్యర్థులను ఫైనల్‌ చేయనున్నారు.. కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తులు ఖరారు అయిన తర్వాత.. సీట్లపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది.. ఏ పార్టీ ఎన్ని స్థానాలు, ఏఏ స్థానాలు అనేదానిపై క్లారిటీ వచ్చినా.. అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.. ఇప్పటికే టీడీపీ మెజార్టీ స్థానాలను ప్రకటించింది.. జనసేన కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఆమోదం తర్వాత.. ఒకేసారి అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. కాగా, ఏపీలో 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్న బీజేపీ.. 10 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగనున్న విషయం విదితమే.. మరోవైపు.. టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడిగా ఓ భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాయి.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభలో పాల్గొని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసిన విషయం విదితమే.

తమిళిసై రాజీనామాకు ఆమోదం.. తెలంగాణ కొత్త గవర్నర్‌ ఈయనే..
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదముద్రవేశారు.. ఇక, తెలంగాణ గవర్నర్‌ బాధ్యతలను జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ చేతిలో పెట్టారు.. అంటే, జార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ తమిళిసై రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆ బాధ్యతలను కూడా సీపీ రాధాకృష్ణన్‌కు అప్పగించారు రాష్ట్రపతి.. కాగా, లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల కాగా.. తమిళనాడు నుంచి లోక్‌సభ బరిలో దిగేందుకే తమిళిసై రాజీనామా చేశారని చెబుతున్నారు.. బీజేపీ టికెట్‌పై లోక్‌సభకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానం హామీతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.. సెప్టెంబర్ 8, 2019న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. మొదట్లో అంతా సాఫీగా సాగినా.. ఆతర్వాత బీఆర్ఎస్ సర్కార్‌ వర్సెస్‌ గవర్నర్‌గా మారింది.. చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వంపై బహిరంగంగానే తమిళిసై వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. మరోవైపు.. బీఆర్ఎస్‌ నేతలు సైతం ఆమెపై విమర్శలు గుప్పించారు.. ఆ తర్వాత రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య చాలా విషయాలు బేధాభిప్రాయాలు వచ్చి.. రచ్చగా మారాయి.. ఇక, ఆ తర్వాత బీఆర్ఎస్‌ సర్కార్‌ కూలిపోవడం… కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రేవంత్‌రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం, రాజ్‌భవన్‌ మధ్య కొంత సఖ్యత కనబడింది.. కానీ, గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు తమిళిసై.

నేను వైసీపీ కోవర్టును కాదు.. పవన్‌ నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను..!
వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.. జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే.. జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అయినందుకు వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేయడం.. ఆ తర్వాత ఆరణి శ్రీనివాసులు పవన్ సమక్షంలో జనసేనలో చేరడం.. ఇక ఆ తర్వాత ఆయనకు టికెట్‌ దక్కడం అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి.. అయితే, ప్రచారంలో స్పీడ్‌ పెంచుతున్నారు ఆరణి.. అందులో భాగంగా.. ఈ రోజు తిరుపతి ఎన్.జి.ఓ.కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ.. తిరుపతి వాసులకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.. శ్రీవారి పాదాల చెంత కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం.. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటాను అని స్పష్టం చేశారు. ఇక, నేను నాన్ లోకల్ కాదు.. లోకలే అన్నారు ఆరణి.. 2009లోనే పద్మావతిపురంలో నాకు సొంత ఇళ్లు ఉందన్న ఆయన.. తిరుపతి ప్రజలకు దగ్గరగా ఉంటూనే వచ్చాను.. కానీ, కొంతమంది నాపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కోవర్టును కాదు.. పవన్ కల్యాణ్‌ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరాను.. నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను అని స్పష్టం చేశారు. మరోవైపు ఐదేళ్ల వైసీపీ పాలన మొత్తం అవినీతిమయం.. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చారు అని ఆరోపించారు. వైసీపీ హయాంలో తిరుపతి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు చేసిన అక్రమాలు అందరికీ తెలుసన్నారు. తిరుపతి ప్రజలు ఒక్కసారి ఆలోచించండి.. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఆరణి శ్రీనివాసులు.

పిఠాపురంపై వైసీపీ స్పెషల్‌ ఫోకస్‌..! ఆ సామాజిక వర్గాలే టార్గెట్..!
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండడంతో.. ఇప్పుడు పిఠాపురంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పటికే ఎంపీ వంగా గీతను అభ్యర్థిగా ఖరారు చేసిన వైసీపీ ఇప్పుడు పిఠాపురంలో సామాజిక వర్గాలవారిగా ఎలక్షన్‌ వర్క్‌ షురూ చేసింది.. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లపై ఫోకస్ చేసింది.. పిఠాపురంలో దాదాపు 85000 బీసీ ఓట్లు ఉన్నాయి.. అందులో మత్స్యకారులు 30000, శెట్టిబలిజ 30 వేలు, పద్మశాలి ఓట్లు 20000 ఉన్నరాయి.. నియోజవర్గంలో మొత్తం 2 లక్షల 30 వేల ఓట్లు ఉంటే.. అందులో కాపులు ఓట్లు దాదాపు 95000.. ఎస్సీ ఓట్లు 30,000 ఉన్నాయి.. దీంతో.. బీసీ, ఎస్సీ ఓట్లు టార్గెట్ గా అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పవన్ కల్యాణ్‌ను ఎదుర్కోవడానికి ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు. అంటే.. ఆ రెండు సామాజిక వర్గాలలో మెజార్టీ ఓట్లు తమ వైపు ఉంటే గెలుపు ఈజీ అవుతుందని అంచనా వేస్తోంది వైసీపీ.. కాపులు ఓట్లలో తమ ఓటు బ్యాంకు ఎలాగో ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.. నిన్న ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి దాడిశెట్టి రాజా.. గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది అధికార పార్టీ.. చేనేత మగ్గం పనులు చేసే పద్మశాలిలు తమ ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధి చేకూరిందని వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు.. చేనేత సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు చెక్ పెట్టే విధంగా అడుగులు ముందుకు వేస్తోంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.

సిద్ధమైన టీడీపీ ఎంపీల జాబితా..! ఈ రోజే విడుదలకు ఛాన్స్..
ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో.. అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి.. అధికార వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ముందు వరుసలో ఉండగా.. పొత్తుల వల్ల టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థుల ఎంపిక కాస్త ఆలస్యం అయ్యింది.. అయితే, పొత్తులు తేలిపోవడంతో.. మెజార్టీ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది.. ఇవాళ టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలకు ఛాన్స్ ఉంది అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.. 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది టీడీపీ. ఇవాళ సాయంత్రానికల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉండగా.. బీజేపీ ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ రానుండడంతో తమ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలకు సిద్దమవుతుంది టీడీపీ. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ మొత్తం 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయనుంది.. ఇప్పటికే రెండు విడతల్లో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో 14 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది.. ఎంపీ అభ్యర్థుల స్థానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తుది కసరత్తు చేస్తు్నారు.. మొత్తంగా 17 స్థానాల్లో పోటీ చేయనుండగా.. ఇప్పటికే పది స్థానాలకు పైగా క్లారిటీకి వచ్చారట సైకిల్ పార్టీ చీఫ్‌.. మిగిలిన స్థానాలపై కసరత్తు కొనసాగుతోంది.. టీడీపీ క్లారిటీ వచ్చిన ఎంపీ స్థానాలు.. అభ్యర్థుల పేర్లు ఇవి ఫైనల్‌ అయినట్టుగా తెలుస్తోంది.
* శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
* విశాఖ – భరత్
* అమలాపురం – గంటి హరీష్
* విజయవాడ – కేశినేని చిన్ని
* గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
* నరసరావు పేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
* ఒంగోలు – మాగుంట రాఘవ రెడ్డి
* నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
* నంద్యాల – బైరెడ్డి శబరి
* చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్

లైసెన్స్ గన్‌తో నెమళ్ల వేట.. పోలీసుల అదుపులో డీఎస్పీ తండ్రి..!
జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం దోమలకుంట శివారులో జాతీయ పక్షి నెమలి వేటాడిన ఘటన కలకలం రేపింది. ములుగు డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న తండ్రిని పెగడపల్లి పోలీసుల అదుపులో తీసుకున్నారు. పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామశివారులో గన్ తో డీఎస్పీ తండ్ర సత్యనారాయణ వేటకి వెళ్ళినట్లు గుర్తించారు. దీంతో గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అయితే.. పోలీసుల తనికీల్లో నెమలి కళేబరం, వేటకి వాడిన తుపాకీ పట్టుబడ్డాయి. దీంతో సత్యనారాయణను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మన దేశంలో నెమలి, జింక వంటి వన్యప్రాణులను వేటాడటం నిషేధం. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా 2017లో మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జింకల వేట కేసులో సత్యనారాయణకు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ముగియడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మార్చి 25లోగా లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం తుపాకులను వెనక్కి తీసుకోవచ్చని చెబుతున్నారు. తుపాకులు డిపాజిట్ చేయని వారిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తండ్రికి లైసెన్స్ గన్ ఇచ్చిన వేటకు పంపిన ములుగు డీఎస్పీ పై కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైసెన్స్ గన్ ను కుటుంబ సభ్యులకు ఎలా ఇస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి దీనిపై ములుగు డీఎస్పీ ఏం సమాధానం చెబుతారన్నది ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

భార్గవి హత్యకేసులో ట్విస్ట్.. తల్లి కాదు ప్రియుడే..!
ఇబ్రహీంపట్నం లోని దండుమైలారం డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి భార్గవి అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. పరువు హత్యా, లేక ప్రియుడు చంపాడా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగతుంది. భార్గవి సోదరుడు చరణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే భార్గవిని తన తల్లి చంపినట్లు చరణ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. అయితే.. భార్గవి సోదరులు, ప్రియుడు శశిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. కాగా.. ఇప్పుడు భార్గవి హత్యకేసులో తల్లికాదు ప్రియుడు శశినే చంపాడని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్గవి తండ్రి ఐలయ్య మాట్లాడుతూ.. కన్నతల్లి ఎక్కడనైనా కూతుర్ని చంపుకుంటుందా? అని ప్రశ్నించాడు. నిన్న మధ్యాహ్నం నా భార్య ఇంటికి వచ్చే సరికి శశి ఇంట్లో ఉన్నాడని తెలిపాడు. నా భార్యను చూసి పారిపోయాడని వెల్లడించాడు. నా కూతురు భార్గవిని శశి చంపి పారిపోయాడనేది అనుమానం ఉందని, అయితే నా కూతురును చూసి షాక్ తో నా భార్య మాట్లాడలేని పరిస్థితికి వచ్చిందని వాపోయాడు. భార్గవిని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకున్నామని తెలిపారు. భార్గవి మాత్రం శశిని పెళ్ళి చేసుకుంట నని చెప్పిందని తండ్రి తెలిపాడు. నిన్న మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో శశి వచ్చాడని, కొద్దిసేపటికే నా భార్య ఇంటికి వచ్చిందన్నారు. శశిని చూసిన కోపంతో భార్గవి వున్న గదికి వెళ్లింది. అయితే అప్పటికే భార్గవి చనిపోయిందని అది చూసిన తన భార్య షాక్ లో మాట్లాడలేని పరిస్థితిలో ఉందని భర్త తెలిపాడు. అది చూసిన తన కొడుకు చరణ్ తన కన్నతల్లే హత్య చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడని వాపోయాడు. తన భార్య కూతురిని హత్య చేయలేని క్లారిటీ చేశారు. మరి దీనిపై కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు ప్రియుడు శశి, సోదరుడు చరణ్ ను విచారిస్తున్నారు.

మరోసారి ఆ చెత్త రికార్డును దక్కించుకున్న ఢిల్లీ నగరం..!
మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరం మరోసారి చెత్త రికార్డును దక్కించుకుంది. అత్యంత కాలుష్య రాజధానిలలో ఒకటిగా మరోసారి లిస్ట్ లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిలలో మరోసారి ఢిల్లీ పేరు నమోదైంది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ సంస్థ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు, దేశ రాజధానుల జాబితాను తాజాగా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారంగా చూస్తే మనదేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా వరుసగా నాల్గవసారి ఎంపికైంది. ముఖ్యంగా ఢిల్లీలోని గాలి నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉన్న రాజధాని అని చెప్పుకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ 2018 నుంచి వరుసగా నాలుగోసారి ఈ ర్యాంక్‌ ను సాధించింది. అదే విధంగా మరోవైపు బీహార్‌ రాష్ట్రములోని ‘బెగుసరాయ్’ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఎంపికైంది. కాలుష్య దేశాలు, నగరాల జాబితా ప్రకారం సగటు వార్షిక PM 2.5 గాఢతతో క్యూబిక్ మీటరుకు 54.4 మైక్రోగ్రాములుగా పేర్కొనగా అందులో.. 2023లో మూడో స్తానం దక్కించుకుంది. ఈ లిస్ట్ లో మొదటి రెండు స్థానాల్లో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ లు ఉన్నాయి.

విమానంలో ప్రయాణికుడి ఆత్మహత్యాయత్నం.. ఫ్లైట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!
తైవాన్‌కు చెందిన ‘ఇవా ఎయిర్‌లైన్స్‌’ ఫ్లైట్‌లో ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన గత శుక్రవారం (మార్చి 15) జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికుడి వివరాలు, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఇవా ఎయిర్‌లైన్స్‌ వెల్లడించలేదు. ఇవా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీఆర్‌ 67 ఫ్లైట్‌ మార్చి 15న బ్యాంకాక్‌ నుంచి లండన్‌ బయల్దేరింది. విమానంలోని ఓ ప్రయాణికుడు వాష్‌రూమ్‌లోకి వెళ్లి.. ఎంతసేపటికీ బయటకు రాలేదు. ఇది గమనించిన విమాన సిబ్బంది.. వాష్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా అతడు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడు. సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం లండన్‌ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించి.. హిత్రూ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.

మ్యాచ్‌ మధ్యలో ఆ పని చేసిన పాకిస్తాన్ క్రికెట‌ర్.. వీడియో వైరల్‌!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎసీఎల్‌) 2024 ఫైనల్‌లో ముల్తాన్ సుల్తాన్‌పై విజయం సాధించిన ఇస్లామాబాద్‌ యునైటడ్‌ టైటిల్ సాదించింది. ఇస్లామాబాద్‌ విజయంలో ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీం కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో తన కోటా 4 ఓవర్లలో 23 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌లో కీలకమైన 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇమాద్‌ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను అతడికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. పీఎసీఎల్‌ 2024 ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసి అందరిని అకట్టుకున్న ఇమాద్‌.. ఓ పాడు పని చేసి విమర్శల పాలయ్యాడు. పీఎసీఎల్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్ జరుగుతుండగా ఇమాద్‌ వసీం డ్రెసింగ్‌ రూంలో సిగరెట్ తాగాడు. ఇస్లామాబాద్‌ యునైటడ్‌ డ్రెసింగ్‌ రూంలో ఎంచక్కా సిగరెట్ అంటించుకుని, దాన్ని తాగుతూ ఎంజాయ్ చేశాడు. ఈ తతంగాన్ని కెమెరామెన్ బంధించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురుపిస్తునారు. ‘మ్యాచ్ జరుగుతుండగా ఇదేం పాడు పని’, ‘ఇమాద్‌ వసీంపై కఠిన చర్యలు తీసుకోవాలి’, ‘పీఎసీఎల్‌ అంటే.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ కాదు పాకిస్తాన్‌ స్మోకింగ్‌ లీగ్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

హీరో సిద్ధార్థ్ ట్వీట్ పై నెటిజన్ల ఆగ్రహం..!
‘ఈసాల కప్ నమదే’ అంటూ ఆర్సీబీ టీం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కంటున్న కల ఎట్టకేలకు 2024 లో సాకారమైంది. ఆదివారం మార్చి 17 రాత్రి మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ మహిళలు కప్ ఎత్తుకోగానే బెంగళూరు వీధుల్లో సంబరాలు మిన్నంటాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ స్మృతి మందన్నా టీమ్ కు విషెస్ వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే నటుడు హీరో సిద్ధార్థ్ కూడా ఓ ట్వీట్ చేశారు. అయితే అతను ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశాడో కానీ.. అది కాస్తా సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ఈ ట్వీట్ సంబంధించి నెటిజన్లు సిద్ధూను తప్పుపడుతున్నారు. బెంగళూరు నగర వీధుల్లో ‘ఆర్సిబి’ జట్టు విజయాన్ని సంబరాలు చేసుకుంటున్న పురుషుల వీడియోను సిద్ధార్థ్ షేర్ చేస్తూ.. ‘ఒక టోర్నమెంట్‌ లో మహిళల జట్టు ట్రోఫీని గెలుచుకుంది. కానీ రోడ్డుపై సంబరాలు చేసుకునేందుకు ఒక్క మహిళ కూడా లేదంటూ పోస్ట్ చేసాడు. ఇది భారతదేశ పితృస్వామ్య వ్యవస్థకు ఇది సరైన ఉదాహరణని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

ఆర్ఆర్ఆర్ మూవీ రాజమౌళి ఒరిజినల్ వెర్షన్ కాదా.. అన్ని మార్పులు చేసారా..?
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీని ఎంతగానో మెచ్చుకున్నారు..కాగా ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ నెల (మార్చి) 24కు రెండు సంవత్సరాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకు వచ్చిన చిత్రమిది.భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులకు, సినీ ప్రముఖులకు ‘ఆర్ఆర్ఆర్’ ఎంతగానో నచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకీ సంబంధించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు తెలియజేసారు.ప్రేక్షకులంతా చూసిన ‘ఆర్ఆర్ఆర్’ వేరు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఒరిజినల్ వెర్షన్ వేరు. సినిమా అంతా పూర్తి అయ్యాక మరీ శాడ్ ఫిలింలా ఉందని ఫీలై, యంగ్ టైగర్ ఎన్టీఆర్,ఆయనకు జోడీగా నటించిన ఫారిన్ యాక్ట్రెస్ ఒలీవియా మోరిస్ క్యారెక్టర్లలో మార్పులు చేశారట.’ఆర్ఆర్ఆర్’ ఒరిజినల్ వెర్షన్ లేదా డిలీట్ చేసిన సీన్స్ లో జెన్నీ అలియాస్ జెన్నీఫర్ (ఒలీవియా) క్యారెక్టర్ మరణిస్తుందని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి  జపాన్ లో ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షోకి అటెండ్ అయ్యారు. షో అనంతరం ప్రేక్షకులతో ముచ్చటిస్తూ… ”మేం తొలుత జెన్నీ తన అంకుల్ గదిలోకి వెళ్లి వాళ్ల ప్లాన్స్ తెలుసుకునే సన్నివేశాలు రాశాం. అయితే, క్లైమాక్స్ దగ్గర పడుతుండటంతో అవన్నీ అవసరం లేదని ఫీల్ అయ్యాం. డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదనుకున్నాం. భీంను కలిసిన జెన్నీ, మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె బూట్లకు మట్టి ఉండటంతో ఏదో చేసిందని ఆంటీకి అనుమానం వస్తుంది. అలాగే, జైలు నుంచి రామ్ ను భీం తప్పించి… బ్రిటిషర్ల మీద ఎటాక్ చేసినప్పుడు జెన్నీకి అంకుల్ గన్ గురి పెడతారు. వాళ్ళను లొంగిపోమని చెబుతాడు.లొంగిపోవడానికి ముందు షూట్ చేయడంతో జెన్నీ మరణిస్తుంది. ఒరిజినల్ వెర్షన్ లో జెన్నీ చచ్చిపోతుంది. నేను అంత సాడ్ ఫిల్మ్ తీయాలని అనుకోలేదు” అని రాజమౌళి చెప్పారు.’ఆర్ఆర్ఆర్’ ఒరిజినల్ వెర్షన్ లో జెన్నీఫర్ క్యారెక్టర్ మార్చడంతో ఎన్టీఆర్ క్యారెక్టర్ సన్నివేశాలు కూడా మారాయట. ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ అయితే ఎలా ఉండేదో అని అభిమానులు చర్చించుకుంటున్నారు.