NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

రామోజీరావు మృతిపట్ల సంతాపం తెలిపిన నరేంద్ర మోడీ
ఈనాడు గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు రావు కన్నుమూతపై సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్న ఆయన.. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని గుర్తుచేశారు.. పత్రికారంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు.. పత్రిక, సినీ, వ్యాపార రంగాలపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.. రామోజీ రావు మరణించడం చాలా బాధాకరం. అతను భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. అతని గొప్ప రచనలు జర్నలిజం మరియు చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయి. ఆయన ప్రయత్నాల ద్వారా, అతను మీడియా మరియు వినోద ప్రపంచంలో ఆవిష్కరణ మరియు శ్రేష్ఠత కోసం కొత్త ప్రమాణాలను నెలకొల్పాడని ప్రశంసించారు. ఇక, రామోజీ రావు.. భారతదేశ అభివృద్ధి పట్ల చాలా మక్కువ చూపేవారు అని తెలిపారు నరేంద్ర మోడీ… నేను ఆయనతో సంభాషించడానికి మరియు అతని జ్ఞానం నుండి ప్రయోజనం పొందేందుకు అనేక అవకాశాలు పొందడం నా అదృష్టంగా పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు అసంఖ్యాక అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను.. ఓం శాంతి… అంటూ ట్వీట్‌ చేశారు నరేంద్ర మోడీ.

రామోజీరావు కన్నుమూత.. సంతాపం ప్రకటించిన వైఎస్‌ జగన్‌, పలువురు ప్రముఖులు
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్‌ రామోజీరావు కన్నుమూశారు.. ఈ రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రామోజీరావు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రామోజీరావు మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్న ఆయన.. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని పేర్కొన్నారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌.. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు అచ్చెన్నాయుడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయంకృషితో కష్టపడి అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రిక స్థాపించి తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది పలికారు. ఈనాడు మీడియా సంస్థ ద్వారా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యం చేశారు. ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువగా సమాచార హక్కు చట్టం, సుజలాం, సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరూవాడా చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగుజాతికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల మా ప్రగాఢ సంతాపం అంటూ ప్రకటించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. తెలుగు పత్రికారంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రామోజీరావు.. ఆసియాలోనే అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీ నిర్మించిన ఘనత ఆయనదే.. రామోజీరావు ఎంచుకున్న ప్రతి రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచారు.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాం అన్నారు రామకృష్ణ.. మరోవైపు మీడియా దిగ్గజం రామోజీరావు గారి అస్తమయం చాలా బాధాకరం అన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి.. సామాన్యుడి గొంతుకను ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి రామోజీరావు.. అనేక కళలను గుర్తించి, వెలికితీసి వారిని ప్రోత్సహించిన రామోజీరావు మరణ వార్త హృదయాన్ని ద్రవింపజేసింది అన్నారు స్వరూపానందేంద్ర సరస్వతీ.

రామోజీరావు స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు..
మీడియా దిగ్గజం, ప్రముఖ వ్యాపార్తవేత్త రామోజీరావు కన్నుమూశారు.. ఆయన మరణం అందరినీ కదిలిస్తోంది.. ఇక, రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామర్రులోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. రామోజీ రావు మరణ వార్త విని శోకసముద్రంలో మునిగిపోయారు గ్రామస్తులు. ఈ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు రామోజీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు… జోహార్ రామోజీరావు అంటూ గ్రామ సెంటర్లో నినాదాలు చేశారు గ్రామస్తులు. పెదపారుపూడిని దత్తత తీసుకొని.. 20 కోట్లకు పైగా సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారు రామోజీరావు. విద్యార్థి దశ నుండే రామోజీరావుకు కష్టపడి తత్వం ఉండేది అని ఆయన బాల్యమిత్రుడు పాలడుగు చంద్రశేఖర రావు గుర్తుచేసుకున్నారు.. దేశంలోనే గొప్ప స్థాయికి చేరుకున్నా.. పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా సేవలు చేశారని కొనియాడారు చంద్రశేఖర్‌రావు. ఇక, గత ప్రభుత్వం సహకరించకపోయిన.. దత్తత గ్రామమైన పెదపారుపూడి కోసం రామోజీరావు ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకున్నారు సర్పంచ్ చప్పిడి సమీరా… ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పెదపారుపూడిని మోడల్ గ్రామంగా రామోజీరావు అభివృద్ధి చేశారని రామోజీ ఫౌండేషన్ సభ్యులు అంటున్నారు.. గ్రామంలో స్మశానాల దగ్గర నుండి… ప్రభుత్వ పాఠశాలల వరకు గ్రామంలో ఎన్నో నిర్మాణాలు చేశారని కొనియాడారు.. రామోజీరావు చివరి దశలో మాజీ సీఎం వైఎస్‌ జగన్.. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఎంతో వేధించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారో.. మేం ఏం తప్పులు చేసామో తెలియటం లేదు..
అభివృద్ధి చేసినా ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలో పొందలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్‌.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలకు మంచి చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనను ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారో అర్థం కావట్లేదు.. ఏం తప్పులు చేసామో తెలియటం లేదన్నారు. రెల్లి పేటలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వైయస్సార్ వెనుకే జనం ఉంటారు.. అక్కడ కూడా ఎలా తక్కువ వచ్చింది అర్థం కావటం లేదు అన్నారు. రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను.. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను.. ఎంతోమంది నాయకులు ఎంపీలు, మేయర్లు అయ్యారు రాజమండ్రిలో ఈ తరహా డెవలప్మెంట్ ఎప్పుడు జరగలేదన్నారు భరత్. ఇక, రాజమండ్రిలో మోరంపూడి శిలాపలకాన్ని టీడీపీ నేతలు కూల్చేసినా ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడటం దారుణం అన్నారు భరత్.. శిలాపలకం కూల్చేసి క్రమశిక్షణకు మారుపేరని చెప్పటం ఎంతవరకు కరెక్ట్..? అని ప్రశ్నించారు. అమరావతి రైతులు నిజమైన రైతులు కాదు.. రైతుల రూపంలో ఉన్న టీడీపీ మూకలు రాజమండ్రిలో మాపై దాడి చేశారు.. దానిని మాత్రమే ప్రతిఘటించామని గుర్తుచేసుకున్నారు. అమరావతిలో కూల్చేసిన ప్రజావేదిక ఎన్జీటీ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఉందన్న ఆయన.. ఉండ్రాజవరం, జొన్నాడ, కైకలూరు, తేతలి నాలుగు ఫ్లై ఓవర్లు మంజూరు చేసిన జీవో కాపీలు కూడా చూపించాం.. నాలుగు ఫ్లైఓవర్లకు సంబంధించి 345 కోట్ల రూపాయలు 2020లోనే మంజూరు చేశారు.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలపై చాలా బాధ్యత ఉంది అన్నారు. తమకు ఇంకా మంచి చేస్తారని ప్రజలు భావించి వారికి విజయాన్ని కట్టబెట్టారు.. ఇచ్చిన హామీలు ఎంతమేర నిలబెట్టుకుంటారో చూద్దాం అన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్.

వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోండి.. అధికారులకు సీఎస్‌ ఆదేశం
భారీ వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్, వరద నీటి నిల్వ వంటి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఆమె సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీజీపీ రవిగుప్తా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, వాటర్‌ బోర్డు ఎండీ సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ సీపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.

ఈడీ చర్య తప్పు.. రూ.180 కోట్ల ప్రఫుల్ పటేల్ ఇంటిని తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు
ప్రఫుల్ పటేల్‌కు పెద్ద ఊరటనిస్తూ రూ. 180 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉత్తర్వులను ముంబై కోర్టు రద్దు చేసింది. స్మగ్లర్లు, విదేశీ మారక ద్రవ్య మానిప్యులేషన్ చట్టం కింద ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రఫుల్ పటేల్ రాజ్యసభ ఎంపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు. అంతకుముందు.. ప్రఫుల్ పటేల్, అతని కుటుంబానికి చెందిన దక్షిణ ముంబైలోని ఉన్నత స్థాయి వర్లీలోని సీజే హౌస్‌లోని 12వ, 15వ అంతస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. దాదాపు రూ.180 కోట్ల విలువైన ఈ అపార్ట్‌మెంట్లు ప్రఫుల్ పటేల్ భార్య వర్ష, ఆమె కంపెనీ మిలీనియం డెవలపర్ పేరిట ఉన్నాయి. ఇక్బాల్ మీనన్ మొదటి భార్య అయిన హజ్రా మెమన్ నుంచి ఈ ఆస్తులను అక్రమంగా సంపాదించారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

మోడీ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు..
కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకూ ఎలాంటి అనుమానం లేదు.. కానీ ఆ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ఎన్నాళ్లు నడుపుతారు అనేది మాత్రం ఊహించలేమని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రిగా మోడీ ఎన్నాళ్లు ఉంటారో కూడా తెలియదన్నారు. ఆయన ఎక్కువ కాలం ప్రధానిగా ఉండక పోవచ్చు, ఐదేళ్లూ ఈ ప్రభుత్వం నిలబడదని తెలిపారు. అయితే, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి విశాల హృదయం, ఓపెన్ మైండ్, అందరినీ కలుపుకొని పోయే లక్షణాలు ఉండాలి.. అలాంటి లక్షణాలు మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌పేయికి ఉన్నాయి.. కానీ, నరేంద్ర మోడీకి లేవని గౌరవ్ గొగొయ్ విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన ప్రధానమంత్రిగా ఐదేండ్ల కాలం పాటు పని చేయడం ప్రశ్నార్థకమేనని వెల్లడించారు. రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు గొగొయ్ కృతజ్ఞతలు చెప్పారు.

స్టాక్ మార్కెట్ క్వీన్ గా నారా భువనేశ్వరి.. ఈ షేర్ తో 5 రోజుల్లో రూ.584 కోట్లు
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పిచ్‌లో చాలా ఎత్తుపల్లాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు కొత్త ప్రభుత్వానికి ‘కింగ్ మేకర్’ అయ్యారు. కానీ అతని భార్య నారా భువనేశ్వరి గత ఐదు రోజులుగా స్టాక్ మార్కెట్‌లో ‘క్వీన్’గా అవతరించింది. కేవలం ఒక్క షేర్‌తో ఐదు రోజుల్లో రూ.584 కోట్లు రాబట్టింది. నారా భువనేశ్వరి 5 రోజుల్లో 584 కోట్ల రూపాయలను సంపాదించిన కంపెనీ ‘హెరిటేజ్ ఫుడ్స్’. ఈ కంపెనీ ప్రధానంగా పాల ఉత్పత్తులను డీల్ చేస్తుంది. గత ఐదు రోజులుగా ఈ కంపెనీ షేర్ నిరంతరం పెరుగుతోంది. హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరికి 24.37 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ ప్రమోటర్లలో ఆయన కుమారుడు నారా లోకేష్ ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అఖండ విజయం, కేంద్ర ప్రభుత్వంలో వారి నిర్ణయాత్మక పాత్ర హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్‌ను విపరీతంగా పెంచింది. గత 5 రోజుల్లో నారా భువనేశ్వరి షేర్ల వాల్యుయేషన్ 584 కోట్ల రూపాయలు పెరగడానికి కారణం ఇదే.

భారత్- పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్.. ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..?
టీ20 ప్రపంచకప్ 2024లో హై వోల్టేజ్ క్రికెట్ స‌మ‌రానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా రేపు (జూన్ 9) న్యూయ‌ర్క్ వేదిక‌గా టీమిండియా- పాకిస్తాన్ జ‌ట్లు మధ్య కీలక పోరు జరగబోతుంది. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ను వీక్షించేందుకు రెండు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఫ్యాన్స్ కు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది అని పేర్కొనింది. ఆదివారం నాడు మ్యాచ్ జరిగే టైంలో న్యూయర్క్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని ‘అక్యూ వెదర్’ రిపోర్ట్ వెల్లడించింది. కాగా, అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10. 30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. టాస్ వేసే సమయంలో 40 శాతం నుంచి 50 శాతం వరకు వర్షం పడే ఛాన్స్ ఉందని అక్యూ వెదర్ తమ రిపోర్ట్‌లో ప్రకటించింది. ఇక, వర్ష సూచన మధ్యాహ్నం 1 గంట సమయానికి 10 శాతానికి తగ్గిపోయి.. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ 40 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ అయితే, ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తోంది. ఈ మ్యాచ్ సమయంలో వాన పడితే ఎంతో కాలంగా వేచి ఉన్న క్రికెట్ అభిమానుల ఆశ మాత్రం అడియాశలు అయినట్లే అని క్రిడా పండితులు అంటున్నారు.

రామోజీరావు మృతి.. టాలీవుడ్ కీలక నిర్ణయం
అనారోగ్య కారణాలతో కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి రామోజీరావు నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. అదే విధంగా రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేసి తెలుగు సినిమాలకు మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని సినిమాల షూటింగ్స్ కి హైదరాబాద్ ను కేంద్ర బిందువు అయ్యేలా చేశారు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ సైతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి అంటే అది కేవలం రామోజీరావు వల్లే అని తెలుగు సినీ ప్రేమికుల గంటా పథంగా చెబుతున్నారు. ఇక రామోజీరావు మృతి నేపథ్యంలో ఆయనకు సంతాపంగా రేపు తెలుగు సినీ పరిశ్రమంలో తెలుగు సినిమాలకు సంబంధించిన అన్ని షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక రామోజీరావు మృతి నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు హీరోలు దర్శక నిర్మాతలు తమ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే రామోజీ ఫిలిం సిటీలో చివరి చూపు కోసం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున వెళుతున్నారు.