అమ్మపై అధికారులకు బాలిక ఫిర్యాదు.. చదువంటే ప్రాణం మరి..!
సమాజంలో అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు.. కొందరు చదుకొంటే.. కొందరు చదువుకునేందుకు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి.. ఇక, చదువుకుంటే ఏమి వస్తుంది.. కూలి ఏస్తే కొన్ని డబ్బులైనా వస్తాయంటూ.. పిల్లలను తమ వెంట పనికితీసుకెళ్లే తల్లిదండ్రులు కూడా ఉన్నారు.. మరికొందరు తాము పడిన కష్టం పిల్లలు పడకూడదంటూ.. అప్పులు చేయి అయినా.. పిల్లలను చదివించుకునేవారు ఉన్నారు.. అయితే, కర్నూలు జిల్లాలో తన తల్లిపై అధికారులకు ఫిర్యాదు చేసింది ఓ బాలిక.. ఈ ఏడాది టెన్త్ పాసైన నిర్మలమ్మ అనే బాలిక.. టెన్త్‌లో ఏకంగా 534 మార్కులు సాధించింది.. తనకు పై చదువులు చదవాలనే కోరిక ఉన్నా.. ఆమెను చదివించలేని పరిస్థితి ఆ కుటుంబానిది.. ఆ బాలిక ఎన్నిసార్లు తన తల్లికి మొరపెట్టుకున్నా.. తన కల తీరాలా కనిపించలేదు ఆ బాలికకు.. దీంతో.. అధికారులకు ఫిర్యాదు చేసింది.. ఆదోని మండలం పెద్దహరివానంలో తాజాగా అధికారిక కార్యక్రమానికి వచ్చారు తహశీల్ధారు, ఎంపీడీవో, ఎస్‌ఐ.. అయితే, తన తల్లిపై వారికి ఫిర్యాదు చేసింది నిర్మలమ్మ.. టెన్త్ లో తనకు 534 మార్కులు వచ్చాయని.. పై చదువులు చదుకోవాలని ఉంది.. కానీ, మా అమ్మ నన్ను చదివించడంలేదు.. ఎలాగైనా నా తల్లిని ఒప్పించండి అంటూ అధికారులను వేడుకుంది.. అయితే, పేదరికంతో ఉన్న ఆ తల్లి.. తన వెంట కూతురిని కూలికి తీసుకెళ్తోంది.. ఇద్దరం పనిచేస్తేనే.. నాలుగువేళ్లు నోట్లోకి వెళ్తాయనేది ఆ తల్లి ఆవేదన.. కానీ, చదువుపై ఉన్న ప్రేమతో.. తనను కనిపించిన తల్లిపైనే అధికారులకు ఫిర్యాదు చేసింది నిర్మలమ్మ.. దీంతో, ఆ తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అధికారులు.. ప్రభుత్వ పథకాల ద్వారా నిర్మలమ్మను చదివించే బాధ్యత తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. మరి నిర్మలమ్మ కష్టాలు తీరి.. మళ్లీ బ్యాగ్ భుజానికి వేస్తుందో..? ఉన్నత చదువులు చదువుతుందేమో చూడాలి..
విశాఖలో కలకలం.. రియల్టర్ ఫ్యామిలీ కిడ్నాప్
విశాఖపట్నంలో మరోసారి కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. మరో రియల్టర్ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. రియల్టర్ శ్రీనివాస్, అతని భార్యలో లక్ష్మిని కిడ్నాప్ చేశారు దుండగులు.. విశాఖలో 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది.. అయితే, శ్రీ చరణ్ రియల్టర్ సంస్థపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఏడుగురు దుండగులు వచ్చి.. శ్రీనివాస్, లక్ష్మి దంపతులను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.. శ్రీనివాస్ దంపతులు.. కొద్ది రోజుల క్రితమే విజయవాడ నుంచి విశాఖకు మకాం మార్చారు.. కొద్ది రోజులుగా వ్యాపారం చేసుకుంటున్నారు.. ఉన్నట్టుండి దంపతులు కనిపించడకుండా పోవడం కలకలం రేపుతోంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, ఈ మధ్యే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌తో పాటు ఆడిటర్, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) కిడ్నాప్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం విదితమే.. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి . నిందితులు వారి నుంచి రూ.1.75 కోట్ల నగదు వసూలు చేశారని తెలిపారు. వారి నుంచి రూ.86.5 లక్షలు రికవరీ చేశామని పేర్కొన్నారు.. ఇక, ఆ తర్వాత రాజకీయాలు విశాఖలో చేస్తాను.. కానీ, వ్యాపారం మాత్రం హైదరాబాద్‌లో చేస్తానంటూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించిన విషయం విదితమే. కాగా, 2021 జూన్ లో విజయవాడ లో శ్రీనివాస్‌ని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు పటమట పోలీసులు.. 3 కోట్ల రూపాయలు కాజేసినట్టుగా తెలుస్తుండగా.. అందులో 60 లక్షల రూపాయల తమకు ఇవ్వాలంటూ శ్రీనివాస్ దంపతులను కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కేసు ఛేదించారు పోలీసులు.
సంచలనంగా మారిన మాజీ ఎంపీ ట్వీట్.. టి.బీజేపీ ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం..!
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గత కొన్ని రోజులుగా ఏదో జరిగిపోతుంది అనే ప్రచారం సాగుతూ వస్తుంది.. దానికి అనుగుణంగా.. రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు అంటీముట్టనట్టు ఉండడం.. రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లడం.. బీజేపీ పెద్దలను కలవడం.. ఆ తర్వాత వారు మాట్లాడిన తీరు చూస్తే.. అదంతా నిజమే అనిపించేలా పరిస్థితులు ఉన్నాయి.. అయితే, తాజాగా, మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి సోష్‌ల మీడియా వేదిక చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది.. నిజంగా తెలంగాణ బీజేపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అనేలా చేసింది.. ఇక, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ఆ వివాదాస్పద ట్వీట్ విషయానికి వెళ్తే.. గేదెను ట్రాలీ ఎక్కిస్తున్న ఓ వీడియోను షేర్ చేశారు.. గేదెను ట్రాలీకి కట్టి.. దానిని వెనకనుంచి తన్నగానే వెంటనీ ట్రాలీలోకి ఎక్కేసింది.. ఇక, ఇలాంటి ట్రీట్‌మెంట్ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అవసరం అంటూ ఆయన కామెంట్ రాసుకొచ్చారు.. అంతేకాదు.. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్, తెలంగాణ బీజేపీని ట్యాగ్ చేసి ఆ ట్వీట్ చేశారు.. మొత్తంగా ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తన అసంతృప్తిని జితేందర్‌రెడ్డి ఇలా బయటపెట్టారనే చర్చ సాగుతోంది.. కాగా, రాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న కొందరు నేతలు గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్నారని.. మరికొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. బీజేపీ అగ్రనాయకత్వం.. తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని మార్చేందుకు కసరత్తు కూడా చేస్తుందనే చర్చ కూడా నడుస్తోంది.. ఈ సమయంలో.. జితేందర్‌రెడ్డి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. అయితే, కొద్ది సేపటి క్రితం మరో ట్వీట్ చేశారు జింతేదర్ రడ్డి.. “కేసీఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే… బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార.. బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి” అంటూ ఘాటుగా రాసుకొచ్చారు.
సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ.. ఆ స్టిక్కర్ ఏంటి..?
ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఇదే సమయంలో.. వరుసగా లేఖలు రాస్తూ వస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. తాజాగా.. సీఎం జగన్‌కు మరోలేఖ రాశారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. కేంద్ర నిధులపై జగన్ సర్కార్ స్టిక్కర్లేంటంటూ లేఖలో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ ఏంటి? అంటూ నిలదీశారు సోము వీర్రాజు.. ఏపీలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం తప్పు అని హితవుపలికారు.. ఈ తరహా ప్రచారాన్ని తక్షణం ఉప సంహరించుకోవాలని సూచించారు.. ఇక, కేంద్ర ప్రభుత్వంమే ఉచిత బియ్యం ఇస్తున్నట్లుగా ఇంటింటికి ఇస్తున్న రేషన్ బియ్యం వాహనాలపై ప్రత్యేక బోర్డులను ప్రదర్శించాలని సీఎం వైఎస్ జగన్‌కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు సోము వీర్రాజు.. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని కేంద్ర పథకాల విషయంలో మార్గదర్శకాలు అమలు చేయాలని కోరారు. కాగా, కేంద్రం నిధుల విషయంలో బీజేపీ నేతలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు ఆదినుంచి కొనసాగుతూనే ఉన్నాయి.. కేంద్రం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడుకుంటూ.. కనీసం కేంద్రం పేరు ప్రస్తావించకుండా.. తామే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ నేతలు మండిపడుతోన్న విషయం విదితమే.
ఎఫ్‌బీలో లవ్.. పెళ్లి పేరుతో రూ.12 లక్షలు నొక్కేశాడు..!
సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై గట్టిగానే ఉంది.. ఎల్లలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా స్నేహితులను పరిచయం చేస్తుంది.. అందేకాదు.. సోషల్ మీడియా వేదికగా మోసాలు కూడా పెద్ద సంఖ్యలు జరుగుతున్నాయి.. కొందరు మౌనంగా ఉండిపోతే.. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సోషల్ మీడియా వేదికగా జరిగిన మోసాలు వెలుగు చూస్తున్నాయి.. తాజాగా, గుంటూరులో మరో ఫేస్ బుక్ మోసం బయటపడింది.. ప్రేమ -పెళ్లి పేరుతో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశారు గుంటూరుకు చెందిన గురు ప్రసాద్ అనే వ్యక్తి.. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో వీరి పరిచయం మొదలైంది.. తాను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నానంటూ సదరు యువతితో మాటలు కలిపాడు గురుప్రసాద్.. అలా వారి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది.. కంత్రీ మైండ్‌తో ఉన్న గురుప్రసాద్.. తన ప్లాన్ ప్రకారం.. పెళ్లి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.. త్వరలోనే పెళ్లి చేసుకుందామని నమ్మించాడు.. యువతి కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండడంతో.. సాఫ్ట్‌వేర్ డెవలపర్ అయితే.. బాగానే ఉంటుందని నమ్మింది.. ఇక, ఆ యువతి నుంచి దాదాపు రూ.12 లక్షల వరకు తీసుకున్నారు.. ఆ తర్వాత మొఖం చాటేశాడు.. తాను మోసపోయినట్టు గుర్తించిన యువతి.. ఈ ఘటనపై అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గురు ప్రసాద్ కు ఇప్పటికే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుండగా.. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలుగా గెలిచి.. కాంట్రాక్టుల కోసం పార్టీ మారారు..
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేరుకుంది. రహదారిపై పాదయాత్రగా వెళ్తున్న భట్టికి.. కొలిమి వద్ద ఇనుప పని చేసుకుంటున్న బాలాజీ వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తాము మహారాష్ట్ర నుంచి ఇక్కడకు పనిచేసుకునేందుకు వచ్చామని.. పెరిగిన ధరల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కొలిమిలే వేసే బొగ్గు ధర కూడా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. ధరలు తగ్గించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంతో ధరలను స్థిరీకరణ చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. కూసుమంచి కార్నర్ మీటింగ్ లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాలేరు నుంచి స్థానిక ఎమ్మెల్యేను కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే… కాంట్రాక్ట్ ల కోసం ప్రజలను మోసం చెసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినారు అని ఆయన మండిపడ్డారు. పార్టీ మారి ప్రజలను, ఓటు హక్కును మోసం చేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మోకరిల్లుతారని పాలేరు నియోజకవర్గ ప్రజలు ఊహించలేదు అని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు సమయానుకూలంగా బుద్ది చెప్తారని ఆయన అన్నారు.
కోడలిని తుపాకీతో కాల్చి చంపిన అత్త
సహజంగా ఇంట్లో ఉండే అత్త, కోడళ్లు గొడవ పడుతుంటారు. వారి గొడవకు కారణాలు పెద్దగా ఉండకపోవచ్చు. అత్త, కోడళ్ల మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే ఈ గొడవలు కాస్త ఎక్కువగా ఉంటే రెండు కుటుంబాల పెద్దలు కూర్చుని మాట్లాడుకొని సమస్యలు లేకుండా చూసుకుంటారు. లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరు సర్ధుకుపోతారు. కానీ ఇక్కడ ఇంటి పనులు సరిగా చేయడం లేదని.. ఇంటిని సరిగా పట్టించుకోవడం లేదని కోడలిని తుపాకీతో కాల్చి చంపిందో అత్త, కోడలిని కాల్చిన తరువాత ఆ తుపాకి దొరకకుండా డ్రైనేజ్‌లో పడేసింది అత్త. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. ఇంటి పనుల పట్ల నిర్లక్ష్యం వహించిందనే కోపంతో కోడలిని అత్త తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉందని కోమల్‌పై ఆమె అత్త తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండేంది. పలుమార్లు హెచ్చరించి సహనం కోల్పోయిన అత్త బుధవారం కోడలు కోమల్ ఇంట్లో నిద్రిస్తుండగా తుపాకీతో ఆమె తలపై కాల్చింది. దీంతో కోమల్ నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లింది. కాల్పులు జరిగిన సమయంలో అత్త కోడలు తప్ప ఇంట్లో ఎవరూ లేరు. హత్య అనంతరం పోలీసులకు దొరకకుండా ఉండడానికి తుపాకీని డ్రైనేజీలో పడేసింది అత్త. దొంగలు ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నించారని, అడ్డుకోబోయిన కోమల్‌ను కాల్చి చంపారని నమ్మించే ప్రయత్నం చేసింది. సాక్ష్యంగా చూపెట్టడం కోసం ఇంటిని చిందరవందర చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
బక్రీద్ పండుగ.. బిలియనీర్లకు 45 వేల కోట్ల బహుమతి ఇచ్చిన షేర్ మార్కెట్
స్టాక్ మార్కెట్ ఒకరోజు ముందే బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంది. బుధవారం స్టాక్ మార్కెట్ ఈద్ కానుకగా పెట్టుబడిదారులకు సుమారు రూ.1.70 లక్షల కోట్ల బహుమతిని అందించింది. దేశంలోని కోటీశ్వరులు దీని ప్రయోజనాన్ని పొందారు. ఈ కోటీశ్వరుల వాటాలో 45 వేల కోట్ల రూపాయలు వచ్చి చేరింది. నిజానికి స్టాక్ మార్కెట్ బూమ్ కారణంగా భారతీయ బిలియనీర్ల సంపద గణనీయంగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం దేశంలోని 17 మంది బిలియనీర్ల సంపద రూ.45 వేల కోట్లు పెరిగింది. గౌతమ్ అదానీ సంపద గరిష్టంగా పెరిగింది. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద దాదాపు 27 వేల కోట్ల రూపాయలు పెరిగింది. ఈద్ సందర్భంగా భారతీయ బిలియనీర్ల సంపదలో ఎంత పెరుగుదల కనిపించిందో తెలుసుకుందాం..
అది క్యాబా సూపర్ మార్కెటా ? వైఫై నుండి షూ పాలిష్ వరకు అన్ని సౌకర్యాలు.!
మంచి క్యాబ్ డ్రైవర్ దొరికితే ప్రయాణం హాయిగా సాగిపోతుంది. అయితే డ్రైవర్లు సమయానికి రావడం లేదని, కారు ఏసీ ఆన్ చేయడం లేదని, అదనంగా డబ్బులు అడుగుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. బహుశా ఇది మీకు కూడా జరిగి ఉండవచ్చు. అయితే ఓ క్యాబ్ డ్రైవర్ మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైనాడు. అవును, అబ్దుల్ ఖాదిర్ ఢిల్లీలో క్యాబ్‌లు నడుపుతాడు. అతని కారులో మీకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి. అవును, ఈ క్యాబ్‌లలో WiFi, వార్తాపత్రికలు, ఆహారం,పానీయాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోటోను జూన్ 26న శ్యామ్ లాల్ యాదవ్ (@RTIExpress) ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ రోజు నేను ఉబర్‌ని ఉపయోగిస్తున్నాను అని రాశాడు. నేను ఒక అద్భుతమైన డ్రైవర్‌ను కలిశాను. అతని పేరు అబ్దుల్ ఖాదిర్. అతడికి 26 ఏళ్లు. గత ఏడేళ్లలో ఆయన ఒక్క ట్రిప్పును కూడా రద్దు చేసుకోలేదు. అతని కారులో చాలా ఉన్నాయి. అవును, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి నుండి రైడర్‌లకు అవసరమైన అనేకం ఉన్నాయి. వీటి కోసం అబ్దుల్ ఎటువంటి అదనపు ఛార్జీని వసూలు చేయడు. అవును, క్యాబ్‌లో నిరుపేద పిల్లలకు విరాళం పెట్టె కూడా ఉంది. ఈ ట్వీట్‌కి 48 వేలకు పైగా వ్యూస్.. దాదాపు వెయ్యి లైక్‌లు వచ్చాయి. అలాగే వినియోగదారులు క్యాబ్ డ్రైవర్‌ను అభినందిస్తున్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని యువకుడిని కాల్చి చంపిన పోలీసులు
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు యువకుడిని పోలీసులు కాల్చిచంపారు. ఆ తర్వాత పోలీసుల చర్యపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయంలో తమను తాము సమర్థించుకునేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ వారి వాదనలు ప్రజానీకం పట్టించుకోకుండా నిరసనకు దిగింది.ఈ సమయంలో హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. భారీగా ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం ప్రారంభించింది. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన యువకుడి పేరు నహెల్ ఎం. వాహనం నడిపిన కొద్దిసేపటికే ఆ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. పోలీసులు అతి సమీపం నుంచి కాల్చిచంపారని చెబుతున్నారు. తాజా హింసాకాండను అదుపులోకి తెచ్చామని పారిస్ పోలీసులు తెలిపారు. టీనేజీ యువకుడి మృతి తర్వాత రెండో రోజు కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. టౌలౌస్‌లో నిరసనకారులు పలు ఆస్తులకు నిప్పు పెట్టారు. దానిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బందిపై రాళ్లు విసిరారు. ఫ్రాన్స్‌లోని ఉత్తర నగరం లిల్లేలో కూడా నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం హత్యకు గురైన యువకుడికి నివాళులు అర్పించేందుకు పశ్చిమ నగరమైన రెన్నెస్‌లో సుమారు 300 మంది ప్రజలు గుమిగూడారు. వీరిలో చాలా మంది కాల్పులు కూడా ప్రారంభించారు. అయితే పోలీసులు వారిని చెదరగొట్టారు.
ఐఫోన్ 14కి పోటీగా.. శాంసంగ్ నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్!
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ ‘శాంసంగ్’కు భారతదేశంలో మంచి మార్కెట్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమయింది. శాంసంగ్ ఎస్23 సిరీస్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడింది. అప్పటినుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE) గురించి చర్చ జరుగుతోంది. ఈ ఫోన్ కోసం కంపెనీ పని చేస్తోందని ప్రచారం జరుగుతోంది. మరికొద్ది నెలల్లోనే ఎస్23 ఎఫ్ఈను పరిచయం చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. టిప్‌స్టర్ ఆన్‌లీక్స్ ప్రకారం.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, ఫ్లిప్ 5 మోడల్స్ తర్వాత శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ మార్కెట్లోకి వస్తుందని సమాచారం. ఎస్23కి బడ్జెట్ ఫ్రెండ్లీ వర్షెన్‌గా ఈ ఫోన్ ఉండనుంది. అయితే హార్డ్‌వేర్‌లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో టాప్ సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ 68 రేటెడ్ ప్రొటెక్షన్, కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటాయని అంచనా. ఈ ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లే మరియు వెనుక మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ రెండు వేర్వేరు వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది.ఇది స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ఎస్ఓసీతో రావచ్చు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4కి కూడా ఇది శక్తినిస్తుంది. రెండవ వేరియంట్‌లో ఎస్23 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీని కలిగి ఉంటుంది. స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో మీరు 6GB లేదా 8GB RAM మరియు 128GB లేదా 256GB స్టోరేజ్ ఎంపికలను కలిగి ఉండే అవకాశం ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇందులో ఉండొచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈలో 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 25W ఛార్జింగ్ మద్దతుగా 4500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో లభించొచ్చు. ఎస్23 ఎఫ్ఈ ధర రూ. 50,000లుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ జూలై చివరి నాటికి లాంచ్ చేయబడవచ్చు. గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ లాంచ్ డేట్, ధరలపై రానున్న రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
