నేటి నుంచి ప్రజాపాలన మొదలైంది.. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తా..
గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. కానీ ఈ సారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని.. ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతంపైగా విజయం దేశ చరిత్రలో ఎవరికి రాలేదన్నారు. వెంకటేశ్వర స్వామి ముందు సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు. కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 2003లో క్లైమోర్ మైన్స్ పేలుడు సమయంలో వెంకటేశ్వర స్వామి తనను రక్షించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే స్వామివారు తనకు ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించడమే తన ధ్యేయమన్నారు. ఏపని పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో అది పేదవారికి అందేలా చేయడం అంతే ముఖ్యమన్నారు. ఇవన్నీ ప్రభుత్వం వల్లనే సాధ్యం అవుతుందన్నారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. పేదిరకం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తానని చంద్రబాబు అన్నారు. నేటి నుంచి ప్రజాపాలన మొదలైందని, తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్‌వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలబెడతాననని హామీ ఇచ్చారు. నేరాలు చేసి తప్పించుకోవాలంటే కుదరదని.. కొందరు దాడులు చేసి మళ్లీ మా మీద ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదన్నారు. మంచివారిని కాపాడుకోవాలి, చెడ్డవారిని శిక్షించాలన్నారు. తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని.. పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదన్నారు. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి అన్నదానం పథకానికి విరాళం ఇస్తున్నామని.. వేంకటేశ్వర స్వామి నిద్రలేచిన వెంటనే ప్రార్థనా చేస్తానని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రోజు కోరుకుంటానన్నారు. పరిపాలనా అంటే సెక్రటేరియట్ నుంచి ప్రజల మధ్య నుండి పరిపాలనా సాగేలా చూశానన్నారు. వేంకటేశ్వర స్వామిని ఒక్కటే కోరికను కోరానని.. దేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శమని చెప్పిన చంద్రబాబు.. ఆ కుటుంబ వ్యవస్థ కలకాలం ఉండాలని కోరుకున్నానన్నారు. ప్రపంచం వ్యాప్తంగా వేంకటేశ్వర ఆలయాలను నిర్మాణం చేపట్టాలని, చేపట్టే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. సంపదను సృష్టించడంతో పాటు పేదవారికి అందేలా చూస్తామన్నారు. మా కుటుంబానికి తాను ఏమీ ఇవ్వాల్సిన పనిలేదని.. వారికి కాస్త సమయం కేటాయిస్తే చాలంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకా పోలీసులు పరదాలు కట్టే సంస్కృతి మానడం లేదని.. ఇక నుంచి ఆ పద్ధతి మారుస్తామన్నారు. నేను అందరినీ వాడిని, ఐదుకోట్లమంది ప్రజాప్రతినిధినని చంద్రబాబు అన్నారు. పోలవరం, అమరావతిలను నాశనం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని నిర్మించి ప్రజలకు అందజేస్తామన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ.. పలు అంశాలపై దిశానిర్దేశం
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే త్వరలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరిగింది. త్వరలోనే జరిగే శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పలు అంశాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. పార్టీలో జోష్ నింపేందుకు జగన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత మూడు నాలుగు రోజులుగా వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు, కీలక నేతలతో ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. 40 శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారని మర్చిపోవద్దన్నారు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయన్నారు. ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరగాలన్నారు. మనకు కష్టాలు కొత్త కాదని.. ప్రలోభాలకు లొంగకుండా ప్రజల తరఫున పోరాడదామన్నారు. నాలుగైదు కేసులు పెట్టినంత మాత్రం భయపడవద్దని సూచించారు. మళ్ళీ వైసీపీ ఉవ్వెత్తున ఎగసి పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. శిశుపాలుని మాదిరిగా చంద్ర బాబు తప్పులు లెక్క పెట్టాలన్నారు. ఇప్పటికే ప్రజలకు అందాల్సిన స్కీమ్స్ డబ్బులు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం టీడీపీ , జనసేన, బీజేపీ హనీమూన్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. మరి కొంత సమయం కూటమికి ఇద్దామని.. ఆ తర్వాత ప్రజల తరపున పోరాటాలు చేద్దామని జగన్ వైసీపీ ఎమ్మెల్సీలకు సూచించారు. అసెంబ్లీలో వైసీపీ నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందని.. కాబట్టి శాసన మండలిలో గట్టిగా పోరాటం చేద్దామని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు కేబినెట్‌లో శాఖల కేటాయింపు?.. పవన్‌కు కీలక శాఖలు !
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు. పవన్ కల్యాణ్‌ను ఉపముఖ్యమంత్రిని చేయడంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్టు తెలిసింది. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేశ్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు తెలిసింది. పవన్ కోరిక మేరకు గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించారని తెలుస్తోంది. లోకేశ్‌కు కూడా కీలక శాఖను కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాఖల కేటాయింపుపై ఇవాళ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి జనసేనకు ఏయే శాఖలు లభిస్తాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు జనసేనకు పరిశ్రమలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్యుత్ వంటి కీలక శాఖలను కట్టబెడతారని ప్రచారం కూడా జరుగుతోంది. ఆర్థికం, రెవెన్యూ వంటి అంశాలను పయ్యావుల, ఆనం వంటి వారికి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫరూక్‌కు మైనార్టీ శాఖ, గుమ్మడి సంధ్యారాణికి గిరిజన సంక్షేమం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తయ్యాక శాఖల కేటాయింపుపై జీవోలను విడుదల చేయనున్నారు. ఇవాళ సాయంత్రానికి శాఖల కేటాయింపుపై జీవోలు జారీ చేసే అవకాశం ఉంది.
నా భార్య అలిగి వెళ్లిపోయింది.. కరెంట్ స్తంభం ఎక్కిన భర్త
కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ మాత్రమే కాదు సహనంలో సీతగా కూడా భార్యకు చాలా మంచి స్థానం ఉంది. అటువంటి భార్య..భర్తల వైవాహిక జీవితంలో అన్నీ అడ్డంకులే. ఎవరు ఏమనుకున్నా అలగడం, లేక ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా చంపేయడం ఇటువంటివి మనం రోజూ చూస్తున్నాము. భార్య భర్తల జీవితాల్లో సర్దకు పోవాలి అనే మాట కరువైంది. సర్దుకుని సంసారం చేసేందుకు ఇద్దరి మనోభావాలు అడ్డుగా వస్తున్నాయి. నువ్వెంత అంటే నేనింతే అనే మాటలు, మాటల తూటాల్లా సంసారంలో పేలుతున్నాయి. ఒకొరినొకరు అర్థం చేసుకునే రోజులు పోయి. చీటికి మాటికి అలగడం, మాట్లాడుకోకుండా జీవితాలను చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునే రోజులు పోయి అక్రమ సంబంధాలు, కేసులు, ఆత్మహత్యలు, దాడులు చేసుకునే రోజులు వస్తున్నాయి. అంతేకాదు భర్త తిట్టిన కొట్టిన భార్య సర్దుకుని సంసారం చేస్తే అది ఎనలేని వీడని బంధం అవుతుంది. ఇది నేరమే అయినా సంసారం సాఫీగా జరగాలంటే ప్రేమతో కొట్టిన, తిట్టినా అదే అలుసుగా తీసుకుని భర్త పై భార్య, భార్యపై భర్త అలగడం, గొడవ పడటం ఇప్పుడు ఫ్యాషన్ గా మారుతుంది. అయితే ఓ మహిళ భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లింది. దీంతో కోపంతో భర్త విద్యుత్ స్తంబం ఎక్కిన ఘటన సైదాబాద్ సింగరేణి కాలనీలో చోటుచేసుకుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు, తన భార్యతో నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజులు అన్యోన్యంగా సాగిన వీరిజీవితంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. మద్యానికి బానిసైన మోహన్, తన భార్యతో రోజూ గొడవ పడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య.. భర్త మోహన్ పై ఆగ్రహం వ్యక్తం చేసేది. దీంతో భర్త మోహన్ కు భార్యకు చిన్నపాటు గొడవైంది. మోహన్ మద్యానికి బానిసై రోజూ ఇంటికి తాగిరావడంతో విసుగు చెందిన భార్య అలిగి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మద్యం మత్తులో వున్న మోహన్ బాబు.. స్థానిక కాలనీలోని శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం చేశాడు. మోహన్ బాబు స్తంభం మీదే కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేశాడు. దీంతో స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులకు మద్యం బాబు గంటన్నర పాటు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దించారు. ఇతడు రెండేళ్లలో ఐదుసార్లు ఇలా విద్యుత్ స్తంభం ఎక్కుతాడని, భార్య తిట్టినా, కోపం వచ్చినా ఇలాంటి పనులే చేస్తాడని స్థానికులు పోలీసులకు తెలిపాడు.
ప్రియురాలిపై మోజు.. 22నెల చిన్నారిని నేలకేసి కొట్టిన ప్రియుడు
అక్రమ సంబంధానికి 22 నెలల పసికందు అడ్డుగా ఉందని నేలకేసి కొట్టి చంపాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం గ్రామంలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాఠాపూర్ గ్రామానికి చెందిన మౌత్క విజయ, సైల్ దంపతుల కుమార్తె రమ్య అలియాస్ నవ్యశ్రీకి అదే మండలం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె అరుణ్యకు 4 సంవత్సరాలు, రెండవ కుమార్తె మహాన్వికి 22 నెలలు. నవ్యశ్రీ అత్తగారు గ్రామానికి చెందిన బుల్లింక అరవింద్ రెడ్డితో ఏడు నెలల క్రితం అక్రమ సంబంధం పెట్టుకుంది. అరవింద్ రెడ్డి 20 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి వచ్చి నవ్యశ్రీతో పాటు తన ఇద్దరు పిల్లలను చూసుకుంటానని చెప్పి గది అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 11వ తేదీ మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో 22 నెలల పాప నిద్రిస్తుండగా, నవ్యశ్రీ తన పెద్ద కూతురు అరుణ్యను తీసుకుని కిరాణా దుకాణానికి వెళ్లింది. ఈ సమయంలో ఇంటికి వచ్చిన అరవింద్ రెడ్డి నిద్రిస్తున్న మహాన్విపై దారుణంగా దాడి చేసి కొట్టి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. నవ్య శ్రీ ఇంటికి తిరిగి వచ్చేసరికి, మహాన్వి తప్పిపోయింది. నవ్య శ్రీ షాక్ లో ఉండిపోయింది. నాగమణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై వెంకట్ రెడ్డి కేసు నమోదు చేసి రూరల్ సీఐ సురేందర్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో మహాన్వి నుదిటిపై గాయమైంది. రెండు భుజాలకు చెంపలు, చేతులు, అరికాళ్లు, పిరుదులపై విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా బలమైన గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో అరవింద్ బాలికను హత్య చేసి పారిపోయాడని తేలడంతో పోలీసులు అరవింద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు అరవింద్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నవశ్రీతో అరవింద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, దీంతో అరవింద్ 22 నెలల మహాన్విపై కోపగించాడని విచారణలో తేలింది. దీంతో అక్రమ సంబంధాన్ని అడ్డుకోవాలనే కారణంతోనే మహాన్విని అరవింత్ విచక్షణారహితంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
నీట్ కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ..
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీంతో కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కాగా, గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది నీట్-యూజీ 2024 అభ్యర్థుల స్కోర్ కార్డులను క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అలాగే, ఇప్పటికే నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కమిటీ కూడా వేసినట్లు మోడీ సర్కార్ చెప్పుకొచ్చింది. 1560 మంది అభ్యర్థుల ర్యాంకులపై అనుమానాలు ఉన్నాయి.. కాగా, అభ్యర్థుల ర్యాంకులను నిలిపివేశామని ఎన్టీఏ కోర్టుకు తెలిపింది. విద్యార్థులకు తిరిగి పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నామన్న ఎన్టీఏ పేర్కొనింది. దీంతో గ్రేస్ మార్కులు ఇవ్వడంపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కువైట్ లో అగ్నిప్రమాదం.. వారికి మోడీ సర్కార్ రూ. 2 లక్షల సాయం
కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షల సాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధి నుంచి అందజేస్తారు. కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఈ దురదృష్టకర సంఘటనపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. ఇక, కువైట్ లోని భారతీయులకు అన్ని విధాలా సహాయాన్ని అందించాలని ప్రధాని మోడీ ఆదేశించారు. సహాయ చర్యలను పర్యవేక్షించడంతో పాటు మృతదేహాలను త్వరగా భారత్ కు తిరిగి తీసుకురావడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రిని వెంటనే కువైట్‌కు వెళ్లాల్సిందిగా చెప్పారు. కాగా, దక్షిణ కువైట్‌లోని విదేశీ కార్మికులు నివసిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 50 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 42 మంది భారతీయులే ఉన్నారు. ఈ ప్రమాదం రాత్రి నిద్రపోతున్న సమయంలో పొగలు వ్యాపించడంతో ఊపిరాడక చాలా మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ భవనంలో ఒకే కంపెనీకి చెందిన 195 మంది కార్మికులు నివసిస్తున్నట్లు సమాచారం. అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 50కి చేరుకుందని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో నివేదించింది. ఇక, మృతుల్లో 11 మంది కేరళకు చెందిన వారని, మిగిలిన వారు తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తుంది.
డ్రగ్స్ కేసులో హేమకు బెయిల్
బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగుళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో తాజాగా హేమకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల దగ్గర సాక్షాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న ఆధారాలను సిసిబి న్యాయవాది కోర్టుకు అందించారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఇక తాను డ్రగ్స్ తీసుకోలేదని ముందు నుంచి హేమ చెబుతూ వచ్చారు. అయితే తాను బెంగళూరులో ఉన్నా సరే హైదరాబాదులో ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయంలోనే బెంగళూరు పోలీసులు సైతం సీరియస్ అయ్యారు.