NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను’.. నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం-ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జీతన్ రామ్ మాంఝీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖా మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర రోడ్ల రవాణా-ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ.రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేష్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలెప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖా మంత్రి అనుప్రియా పటేల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయశాఖా మంత్రి రామ్ దాస్ అథవాలే,రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం.. దద్దరిల్లిన వేదిక
మెగా అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా కంటున్న కల నిజమైంది. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. 2014వ సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ అప్పుడు తెలుగుదేశం బీజేపీ కూటమికి కేవలం మద్దతు తెలిపి పోటీకి దూరంగా ఉన్నారు. అయితే 2019వ సంవత్సరంలో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, తెలుగుదేశం రెండిటికి దూరమై ఒంటరిగా పోటీ చేసి 175 స్థానాలలో కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల నుంచి కూడా ఘోర పరాజయం పాలయ్యాడు. అయితే 2019 ఎన్నికల తర్వాత మరోసారి బిజెపితో పొత్తు లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు ముందు నాటకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమి ఏర్పడడానికి కారణమయ్యారు. ఇక ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి సుమారు 70,000 మెజారిటీ తెచ్చుకుని అక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద గెలుపొందారు. ఇక ఈరోజు ఏపీ తదుపరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోపక్క హోమ్ మినిస్టర్ పదవి కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పటివరకు అటు జనసేన నుంచి కానీ ఇటు తెలుగుదేశం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం మొదలు పెట్టిన వెంటనే వేదిక సహా అక్కడి పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహిని నుంచి ఆయనకు విశేష స్పందన లభించడం గమనార్హం.

 

ప్రమాణ స్వీకారం.. చిరు కాళ్లపై పడి, చంద్రబాబుని హత్తుకున్న పవన్
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో యువరాజ్యం బాధ్యతలు తీసుకుని మొట్టమొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం మూతపడడంతో ఇక రాజకీయాల వైపు చూడరేమో అనుకున్నారు. అయితే 2014వ సంవత్సరంలో జనసేన అనే పార్టీని స్థాపించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బిజెపి తెలుగుదేశం కూటమికి బయట నుంచి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో స్వయంగా పోటీ చేసి ఒక సీటుకే పరిమితమైన ఏపీ రాజకీయాల్లో మాత్రం ఆయన ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉంటూ హాట్ టాపిక్ అవుతూ వచ్చారు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్టుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చ నివ్వను అంటూ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పాటు ఎందుకు పవన్ ముఖ్య కారణమయ్యారు. ఎట్టకేలకు పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రమాణస్వీకారం అనంతరం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ తన అన్న చిరంజీవి కాళ్ళ మీద పడి మరోసారి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాదు దగ్గరలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అనే నేను, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ టాగ్స్ కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ట్రెండ్ అవుతున్నాయి.

 

తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్‌.. చార్జీలు పెంచిన ఆర్టీసీ..
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు మరోసారి పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌గేట్ల వద్ద ఈ ఫీజులు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ టికెట్ చార్జీలు టోల్ గేట్ చార్జీలు పెరిగాయి. టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 పెంచారు. టోల్ గేట్లతో రోడ్లపై తిరిగే ఆర్టీసీ బస్సులు కూడా టోల్ రుసుము చెల్లించాలి. కేంద్రం నిర్ణయంతో టోల్ గేట్ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ ప్రయాణికులపై భారం మోపింది. టికెట్ చార్జీల్లో చేర్చిన టోల్ ఫీజును రూ.3 పెంచింది. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.10 నుంచి రూ.13, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో రూ.13 నుంచి రూ.16, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17. నాన్-ఎసి స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ బస్సులలో 15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.20 నుంచి రూ.23కి.పెరిగిన చార్జీలు ఇటీవల అమల్లోకి వచ్చాయి. ఒక్కో టోల్ గేట్‌కు రూ. 3 పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిత్యం 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని.. ఇందులో నగరంలో 12 లక్షల మంది, పల్లె వెలుగు బస్సుల్లో 12 లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఛార్జీల పెంపు భారం తమకు వర్తించదని, మిగిలిన 6 లక్షల మందికి మాత్రమే అదనపు భారం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. చార్జీలు పెంచినా టోల్ గేట్ల వద్ద టోల్ చెల్లించడంతో ఆర్టీసీకి అదనపు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. టోల్ చార్జీల పెంపు నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ అధికారులు కూడా బస్సు చార్జీలను పెంచడంతో పాటు వేళల్లో మార్పులు చేశారు. అయితే చార్జీల పెంపుపై ఆర్టీసీ ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. ఛార్జీల పెంపుపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. వారిపై ఎలాంటి భారం పడే అవకాశం లేదు. ఇప్పుడు ఆ భారాన్ని పురుషులు మాత్రమే భరించాల్సి ఉంటుంది.

ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో సీనియర్ హిజ్బుల్లా కమాండర్ హతం
గాజాలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుండి, లెబనాన్ సరిహద్దు నుండి ఇజ్రాయెల్.. సైన్యంపై రాకెట్లతో నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఫ్రంట్ ప్రారంభించింది. హిజ్బుల్లా టార్గెట్ లపై దాడుల ద్వారా ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం గొప్ప విజయాన్ని సాధించింది. ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం రాత్రి, ఇజ్రాయెల్ వైమానిక దళం యుద్ధ విమానాలు హిజ్బుల్లా సైనిక స్థావరంపై దాడి చేశాయి. ఈ ప్రదేశం నుండి లెబనాన్‌కు ఆయుధాలు సరఫరా అవుతాయి. ఈ సైనిక స్థావరం దక్షిణ లెబనాన్‌ కు చాలా దూరంలో ఉంది. ఇప్పటివరకు దక్షిణ లెబనాన్ యుద్ధానికి కేంద్రంగా ఉంది. ఇజ్రాయెల్ దాడిలో గొప్ప విజయాన్ని సాధించింది. సీనియర్ హిజ్బుల్లా కమాండర్ తో సహా కనీసం ఇద్దరు యోధులను హతమార్చింది. “దక్షిణ లెబనీస్ పట్టణం అదాచిత్‌కు చెందిన తలేబ్ అబ్దుల్లా ‘అల్ అక్సాకు వెళ్లే మార్గంలో’ వీరమరణం పొందాడు” అని ఇరాన్-మద్దతుగల బృందం ఒక ప్రకటనలో తెలిపింది. జౌయా నగరంలో జరిగిన దాడిలో అబ్దుల్లా మరణించాడు. ఈ నగరం ఇజ్రాయెల్ సరిహద్దుకు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దాడిలో కనీసం నలుగురు మరణించారని హిజ్బుల్లాకు అనుబంధంగా ఉన్న అల్-అక్బర్ నివేదించింది. రాయిటర్స్ ముగ్గురు వ్యక్తుల మరణాన్ని ధృవీకరించింది.

 

పసికూనపై పంజా విసిరిన ఆస్ట్రేలియా.. 5.4 ఓవర్లలోనే విజయం!
టీ20 ప్రపంచకప్‌ 2024లో పసికూన నమీబియాపై ఆస్ట్రేలియా పంజా విసిరింది. ముందుగా బౌలింగ్, ఆపై బ్యాటింగ్‌లో చెలరేగి సంచలన విజయం నమోదుచేసింది. ఆంటిగ్వా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నమీబియా నిర్ధేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఒక వికెట్ కోల్పోయి 5.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ విజయంలో ఆడమ్ జంపా (4/12), ట్రావిస్ హెడ్ (34) కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా గ్రూప్-బీలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి నమీబియా ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. హాజిల్‌వుడ్, కమిన్స్, జాంపా దాటికి 43 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్స్ పడుతున్నా.. గెర్హార్డ్ ఎరాస్మస్ (36; 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరి పోరాటం చేశారు. గెర్హార్డ్ పోరాటంతోనే నమీబియా ఆ పరుగులైనా చేయగలిగింది. మైఖేల్ వాన్ లింగేన్ (10) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. జంపా నాలుగు.. హేజిల్‌వుడ్, స్టొయినిస్ చెరో రెండు వికెట్స్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (34 నాటౌట్; 17 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (20; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగారు. వార్నర్ అవుట్ అనంతరం వచ్చిన మిచెల్ మార్ష్ (18 నాటౌట్, 9 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ధాటిగానే ఆడాడు. నమీబియా బౌలర్ డేవిడ్ వైసీ ఒక వికెట్ తీశాడు.

 

టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా!
టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన రెండో జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్-బీలో భాగంగా ఆంటిగ్వా వేదికగా బుధవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో ఆసీస్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. నమీబియా నిర్ధేశించిన 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 5.4 ఓవర్లలోనే ఛేదించింది. 86 బంతులు మిగిలుండగానే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని సాధించిన జట్టుగా శ్రీలంక ఉంది. టీ20 ప్రపంచకప్‌ 2014లో నెదర్లాండ్స్‌‌పై లంక 90 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. 2021 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 82 బంతులు ఉండగానే గెలిచింది. భారత్ (81 బంతులు, స్కాట్లాండ్‌పై-2021), శ్రీలంక (77 బంతులు, నెదర్లాండ్స్‌‌పై 2021) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌట్ అయింది. గెర్హార్డ్ ఎరాస్మస్ (36; 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరి పోరాటం చేశాడు. మైఖేల్ వాన్ లింగేన్ (10) తప్ప మిగతా నమీబియా బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా నాలుగు వికెట్స్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే ఛేదించింది. ట్రావిస్ హెడ్ (34 నాటౌట్; 17 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (20; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు.

మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?
మొన్నటివరకు రూ.2 వేలకు వరకు తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ షాకిస్తున్నాయి. రెండు రోజులుగా పసిడి ధరలు భారీ పెరిగాయి. నిన్న తులం బంగారంపై రూ.150 పెరగ్గా.. నేడు రూ.300 పెరిగింది. బుధవారం (జూన్ 12) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160గా ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. నేడు హైదరాబాద్​లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,160గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.66,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,310గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160గా ఉంది. నేడు వెండి ధరలు కూడా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.800 పెరిగి.. రూ.91,300గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,300 ఉండగా.. ముంబైలో సైతం రూ.91,300గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.95,800లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.90,150గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.95,800లుగా ఉంది.