NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

208: టమోటా ధర నయా రికార్డు.. మదనపల్లిలో 45 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
టమోటా లేనిదే ఏ కూర వండలేం.. దాంతో కిచెన్‌కు టమోటాతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది.. కానీ, క్రమంగా కిచెన్‌లో కనిపించకుండా మాయం అవుతోంది ఆ టమోటా.. దానికి ప్రధాన కారణం.. ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోవడమే.. సామాన్యులు టమోటా వైపు చూడడమే కానీ, కొనడం ఆపేశామని చెబుతున్నారు.. ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఆగమైపోతున్నారు. ఇది ఒక ప్రాంతానికో.. ఓ రాష్ట్రానికో పరిమితం కాలేదు.. దేశం మొత్తం ఇదే పరిస్థితి. టమోటా అంటే బెంబేలెత్తిపోయేలా ధర పలుకుతోంది.. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట నాశనం కావడమే దీనికి ప్రధాన కారణం.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో టమోటాకు పెట్టినపేరైన మదనపల్లె మార్కెట్‌లో కొత్త రికార్డు సృష్టించింది టమోటా.. 45 ఏళ్ల మదనపల్లె మార్కెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు రైతులు, వ్యాపారులు.. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో ఏకంగా కిలో టమోటా ధర డబుల్‌ సెంచరీ దాటేసింది.. ఈ రోజు కిలో టమోటా ధర 208 రూపాయలుగా పలికింది.. ఇక, 25 కేజీల టమోటా బాక్స్‌ ధర 5200 రూపాయిలు పలికింది.. మరోవైపు సాధారణ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.230 నుండి రూ.250 వరకు పలుకుతోంది.. మొత్తంగా 45 ఏళ్ల మదనపల్లె మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నయా రికార్డులను సృష్టించింది టమోటా ధర. అయితే, నార్త్‌ ఇండియాతో పాటు సౌత్‌ ఇండియాలోనూ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. మరి టమోటా దిగుబడి ఎప్పుడు పెరుగుతుందో.. టమోటా ధర ఎప్పుడు కిందకు దిగివస్తుందో చూడాలి.

టీడీపీ నేతలే రాళ్ల దాడి చేశారు, అరాచకం, విధ్వంసం సృష్టించారు
వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.. టీడీపీ నాయకులే రాళ్ల దాడి చేశారని పేర్కొన్నారు.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.. మా ఫ్యాక్టరీలో చొరబడి మా సిబ్బందిని బెదిరించారు.. స్వీడన్ కంపెనీకి చెందిన లక్షల రూపాయల వస్తువులు దొంగ తనంగా తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. నేను ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తుంటే అష్ట దిగ్బంధం చేసి నాపై దాడి చేయడానికి యత్నించారని మండిపడ్డారు బ్రహ్మనాయుడు.. వినుకొండలో టిడిపి నాయకులు.. అరాచకం, విధ్వంసం సృష్టించారన్న ఆయన.. టీడీపీ నాయకులే రాళ్ల దాడి చేశారు.. నన్ను వీధి రౌడీ అని అంటున్న టీడీపీ నాయకులు ప్రభుత్వ సొమ్ము కాజేసిన గజ దొంగలు అని విరుచుకుపడ్డారు. ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు ల నుండి డబ్బులు కాజేశారని ఆరోపించారు. నేను ప్రభుత్వ భూములు కాజేసానని నిరూపించండి అంటూ సవాల్‌ చేశారు. ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి నా ఆధీనంలో ఉన్న నా ఆస్తి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేస్తానన్న ఆయన.. రాజకీయలద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కుట్రలో భాగమే వినుకొండ లో జరిగిన విధ్వంసం అన్నారు. నీ కొడుకు రాజకీయ లబ్ధి కోసం ప్రజల ప్రాణాలు ఫణంగా పెడతావా చంద్రబాబు అంటూ నిలదీశారు వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.

పులుల సంఖ్య రెట్టింపు అయ్యింది..
ఆంధ్రప్రదేశ్‌లో పులల సంఖ్య రెట్టింపు అయ్యిందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో నిర్వహించిన గ్లోబల్ టైగర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పులుల సంరక్షణ కు బీజం పడింది.. అందుకే ప్రతీ ఏడాది జులై 29న గ్లోబల్ టైగర్స్ డే జరుపుకుంటున్నాం.. మన రాష్ట్రంలో పులుల సంరక్షణలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. నల్లమల ఫారెస్ట్‌ నుండి శేషాచలం ఫారెస్ట్‌ వరకు టైగర్ రిజర్వ్ కు విస్తరించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాధనలు సిద్దం చేస్తున్నాం.. తద్వారా అటవీ సంరక్షణ సులువు అవుతుందన్నారు.. పులుల సంరక్షణకు మరింత పటిష్ట చర్యలు చేపడుతామని ప్రకటించారు.. గతంలో కేవలం పులుల కాలి ముద్రలనుబట్టి సంఖ్య లెక్కించే వాళ్ళు.. కానీ, ఇప్పుడు అధునాతనమైన సాంకేతికతతో అది మరింత సులువుగా మారిందని.. మన దగ్గర పులుల సంఖ్య రెట్టింపు అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు పులుల సంరక్షణ కు నిరంతరం కృషి చేస్తున్నారు.. వారందరినీ అభినంధిస్తున్నట్టు వెల్లడించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

బాబు, పవన్‌కు మతిభ్రమించింది.. వాళ్లు సీఎంలు అయ్యేదే లేదు..!
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి.. వాళ్ల పార్టీలు రెండూ అధికారంలోకి రావని వాళ్ల మనసులకు కూడా తెలుసన్నారు.. వాళ్లు ముఖ్యమంత్రులు అయ్యేదే లేదని వ్యాఖ్యానించారు.. ఈ నాలుగేళ్ల కాలంలో పార్టీలకు అతీతంగా 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించిన ఆయన.. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు.. అయితే, ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు తమ ఉనికిని చాటుకునేందుకు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు మతిభ్రమించింది ఏదిపడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వాళ్ల పార్టీలు రెండూ అధికారంలోకి రావని వాళ్లకే తెలుసు.. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మళ్లీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి.

మాటలు గొప్పగా ఉంటాయి.. పరిహారం మాత్రం దిక్కు లేదు..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇళ్ళందకుంట మండలాల్లో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్ట్లు పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, ఆంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగి న బాధితుల పరమార్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు నీట మునిగిన బాధితుల పట్ల ప్రభుత్వ స్పందన కరువైందన్నారు. బాధితులను ఫంక్షన్ హాల్లో పెట్టి అన్నం పెట్టారని మండిపడ్డారు. పరిహారం మాత్రం దిక్కు లేదని అన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25వేలు ఆందజేయాలని తెలిపారు. తెగిన రోడ్లు, చెరువులు, కల్వల ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. చెరువుల కింద ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయని అన్నారు. వ్యవసాయ భూములు తాటి చెట్టు అంత లోతు గొయ్యి పడ్డాయని తెలిపారు. ప్రభుత్వం మాటలు గొప్పగా ఉంటాయని, చేతల్లో మాత్రం ఏమి చెయ్యరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషాదం.. వరదల బీభత్సంతో 21 మంది మృతి.. ఏడుగురు గల్లంతు
వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతం చేశాయి. రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. చెరువులు ఏరులై పారాయి. దీంతో ఇళ్లల్లోకి నీరు చేరడమే కాకుండా.. గాలివానకు ఇళ్ల పైకప్పు ఎగిరిపోయాయి. కొందరు నీళ్లల్లో కొట్టుకు పోగా మరికొందరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్ సహాయంతో ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకుంది. వర్షం వరదలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహావిషాదం జరిగింది. ములుగు జిల్లాలో 13 మంది, హనుమకొండ జిల్లాలో ఐదుగురు, మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు, భూపాలపల్లిలో ముగ్గురు మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన గల్లంతైన వారిలో గొర్రె ఓదిరెడ్డి, వజ్రమ్మ, కోసం కోనసాగుతున్న గాలింపు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా బూరుగుపేటకు చెందిన బండ సారమ్మ, రాజమ్మ, ప్రాజెక్టు నగర్ కు చెందిన 4ఏళ్ళ బాలుడు సద్దాం అలీగా గుర్తించారు. వర్షం వరదలతో గ్రేటర్ వరంగల్ తో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాలో అఫార నష్టం వాటిల్లింది. వరంగల్ లో వరద బురదలోనే ఇంకా 40 కాలనీలు ఉన్నాయి. జంపన్నవాగు ఉదృతితో కొండాయి గ్రామం జలదిగ్బంధంలోనే ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా పశువులు మృతి చెందారు. ములుగు జిల్లాలో ఐదు చెరువులకు గండ్లు, తెగిపోయిన 52 రోడ్లు, 43 ఇల్లు పూర్తిగా కూలిపోయాయి. పసర తాడ్వాయి మద్య గుండ్లవాగు బ్రిడ్జి వద్ద అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో జాతీయ రహదారి 163ఫై రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యి కోట్ల వరకు నష్టం వాటిలినట్లు ప్రాథమిక అంచన వేశారు. వర్షం వరదలతో టిఎస్ ఎన్పీడిసిఎల్ కు ఏడుకోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇంకా పలు గ్రామాలకు పవర్ సప్లై నిలిచిపోయింది.

యూట్యూబ్ లాగే ట్విట్టర్లో లక్షలు వీలైతే కోట్లు సంపాదించొచ్చు.. కానీ ఓ షరతు
ట్విట్టర్ నేటి నుండి క్రియేటర్ల కోసం యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ ట్వీట్ ద్వారా తెలియజేసింది. క్రియేటర్‌గా సంపాదించడానికి ఇంటర్నెట్‌లో X (X.com) అత్యుత్తమ ప్రదేశంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. దీనితో పాటు నెటిజన్ల ప్రయత్నాలకు ప్రతిఫలమివ్వాలని కంపెనీ భావించింది. ఈ దిశలో ఇది తమ తొలి అడుగని పేర్కొంది. కొన్ని రోజుల క్రితమే యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ ఈ నెల ప్రారంభంలో కొంతమంది క్రియేటర్‌లకు కూడా చెల్లించింది. కానీ ఇప్పుడు దాని ప్రమాణాల పరిధిలోకి వచ్చే ఇతర వినియోగదారులు… వినియోగదారుల సెట్టింగ్‌లలోని మానిటైజేషన్ ట్యాబ్‌కు వెళ్లడం ద్వారా ఆదాయ భాగస్వామ్య ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

జూన్‌లోనే ప్రపంచకప్‌.. ఈసారి సరికొత్తగా!
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలలలో భారత గడ్డపై వన్డే ప్రపంచకప్‌ 2023 జరగనున్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముహూర్తం ఖారారు చేసినట్లు తెలుస్తోంది. 2024 జూన్‌ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్‌ జరగనున్నట్లు ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫో తమ నివేదికలో పేర్కొంది. దీనిపై ఐసీసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. టీ20 ప్రపంచకప్‌ 2024 మొత్తం 10 వేదికల్లో జరగనున్నాయని సమాచారం. ఇందులో 5 వేదికలు అమెరికాలో.. మిగతా ఐదు వేదికలు వెస్టిండీస్‌లో ఉంటాయి. అయితే అమెరికాలో 5 వేదికలను ఐసీసీ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఫ్లోరిడా, మోరిస్‌విల్లే, డల్లాస్, న్యూయార్‌ ఆ జాబితాలో ఉన్నాయి. మోరిస్‌విల్లే, డల్లాస్‌లలో ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభ ఎడిషన్‌ను నిర్వహిస్తున్నారు. మోరిస్‌విల్లే, డల్లాస్‌ సహా న్యూయార్క్ మైదానాలు ఇంకా అంతర్జాతీయ వేదిక హోదాను పొందలేదు. వేదికలపై తుది నిర్ణయం ఐసీసీ త్వరలోనే తీసుకుంటుందని సమాచారం.

శోభన ఇంట్లో చోరీ.. ఆమె చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
నమ్మిన వ్యక్తి మోసం చేస్తే ఎలా ఉంటుంది? వారిని కఠినంగా శిక్షించడమే కాదు, జీవితంలో మళ్లీ వారి ముఖం చూడకూడదన్నంత అసహ్యం వేస్తుంది. కనీసం పేరు ప్రస్తావించినా, కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ.. నటి శోభన మాత్రం అలా చేయలేదు. తన ఇంట్లో పనిమనిషి దొంగతనానికి పాల్పడినప్పటికీ.. ఆమె క్షమించింది. అంతేకాదు.. తిరిగి మళ్లీ ఆమెను పనిలోకి పెట్టుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని తేనాంపేట, శ్రీమాన్‌ శ్రీనివాస కాలనీలో నటి శోభన తన తల్లితో కలిసి ఉంటోంది. వీరిది రెండస్తుల భవనం కాగా.. పైభాగంలో వీరు నివశిస్తూ, కింది భాగంలో శోభన డాన్స్‌ స్కూల్‌ నిర్వహిస్తున్నారు. తాను డ్యాన్స్ క్లాస్‌లో బిజీగా ఉంటుంది కాబట్టి.. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి పరిచర్యల కోసం విజయ అనే మహిళని పనికి చేర్చుకున్నారు. ఏడాది కాలం నుంచి ఈమె వారి ఇంట్లో పనిమనిషిగా పని చేస్తోంది. అయితే.. కొన్ని రోజుల నుంచి తన ఇంట్లో డబ్బులు చోరీకి గురవుతున్న విషయాన్ని శోభ గుర్తించింది. దీంతో అనుమానం వచ్చి.. విజయని ప్రశ్నించింది. అందుకు ఆమె తనకేమీ తెలియదని బుకాయించింది. దీంతో.. శోభన స్థానిక తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసింది.

ఓటీటీ విడుదలకు సిద్దమైన రంగబలి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
నాగశౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘రంగబలి’. ఈ సినిమా జులై 7న థియేటర్లలో కి విడుదల అయి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది .అయితే కలెక్షన్లు కూడా ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో రాలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో సాగి సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సినిమా సీరియస్ గా మారుతుంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఈ సినిమా కు నాగశౌర్య యాక్టింగ్ అలాగే సత్య కామెడి హైలెట్ గా నిలిచాయి.. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధం అయింది.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేది ఫిక్స్ అయింది.ఈ చిత్రాన్ని ఆగస్టు 4 నుంచి ఓటీటీలో అందుబాటు లో ఉంచనున్నట్లు సమాచారం.రంగబలి సినిమా విడుదలయి కనీసం నెలరోజులు కూడా పూర్తి కాకుండా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుంది.. పవన్‌ బాసంశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమా లో నాగశౌర్య సరసన యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మలయాళ నటుడు షైమ్‌ టాన్‌ చాకో విలన్ పాత్ర పోషించాడు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పతాకం పై సుధాకర్‌ చెరుకూరి ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. నాగ శౌర్య సినిమా కెరీర్ లోనే ఛలో అద్భుత విజయం సాధించింది. కానీ నాగ శౌర్య చేసిన సినిమాలు మాత్రం ఆ రేంజ్ లో హిట్ కాలేదు. ఆ స్థాయి హిట్ కోసం నాగశౌర్య ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.రంగబలి సినిమాతో భారీ హిట్ సాధించాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడం తో ఆ తరువాత ఎలాంటి సినిమా చేయాలి అనే సంధిగ్ధం లో వున్నాడు.

లాస్ట్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చేస్తోంది…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ లోనే రిలీజ్ ఉండడంతో లియో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లియో తర్వాత విజయ్-వెంకట్ ప్రభుతో చేస్తున్నాడు. క్రియేటివ్ గా కథ చెప్పడం, కథనంలో కావాల్సినన్ని ట్విస్ట్ లు పెట్టడం వెంకట్ ప్రభు స్టైల్ అఫ్ ఫిల్మ్ మేకింగ్. రీసెంట్ గా కూడా ఆల్మోస్ట్ కెరీర్ అయిపొయింది అనుకున్న హీరో శింబుకి ‘మానాడు’ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ హిట్ ఇచ్చాడు వెంకట్ ప్రభు. ఇప్పుడు ఏకంగా విజయ్ లాంటి స్టార్ హీరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అంటే చిన్న విషయం కాదు. దళపతి 68 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ గురించి వెంకట్ ప్రభు సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ ట్వీట్ చేసాడు. తన ప్రతి సినిమాకి ఒక కొత్త టైపు కొటేషన్ పెట్టే వెంకట్ ప్రభు, విజయ్ సినిమాకి ఎలాంటి కొటేషన్ ఉంటుందో రేపు రివీల్ చేస్తున్నట్లు ట్వీట్ చేసాడు. వెంకట్ ప్రభు పాలిటిక్స్, వెంకట్ ప్రభు రీయూనియన్, వెంకట్ ప్రభు గేమ్ లాగా ఈసారి ఎలాంటి కొటేషన్ తో సినిమా చేస్తాడు అనేది చూడాలి. ఇదిలా ఉంటే ఇదే విజయ్ లాస్ట్ సినిమా అనే టాక్ వినిపిస్తోంది, వెంకట్ ప్రభు సినిమా అయిపోగానే విజయ్ పాలిటిక్స్ లో బిజీ అవ్వనున్నాడని సమాచారం. ఇందుకోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నాడట. లియో అయిపోయాకే బ్రేక్ తీసుకుందాం అనుకున్న విజయ్ ని వెంకట్ ప్రభు సినిమా కోసం ఆల్మోస్ట్ 200 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పించారట. ఒకవేళ ఇది నిజమైనా సినిమా బడ్జట్ 300 కోట్ల వరకూ ఉంటే అంత భారీ బడ్జట్ సినిమాని కూడా వెంకట్ ప్రభు హ్యాండిల్ చేయగలడా లేదా అనేది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే వెంకట్ ప్రభు భారీ బడ్జట్ సినిమాలని చెయ్యడు, కథలో ట్విస్ట్ లతో గేమ్ ప్లే చేస్తాడు. మరి ఏ విషయంలో డేర్ చేసి ఈ ప్రాజెక్ట్ ని ఆన్ చేస్తున్నారో చూడాలి.