NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సీఎం జగన్‌కు ఇంటెలిజెన్స్ సమాచారం..! ఏమైనా జరగొచ్చు..!
ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల పొత్తులపై చర్చ సాగుతోంది. కుదిరిన పొత్తులపై క్లారిటీ లేకపోగా.. కొత్త పొత్తులపై సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడడం.. కొత్త చర్చకు దారి తీసింది.. అసలు సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్దేశం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలతో పొత్తుల విషయం ఇంకా అస్పష్టంగానే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. పొత్తుల విషయం ఇంకా ఉందంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. రాబోయే రోజుల్లో కుట్రలు జరుగుతాయి.. కుతంత్రాలు జరుగుతాయి.. కుటుంబాలను చీలుస్తారు. పొత్తులు పెట్టుకుంటారు.. అబద్ధాలు చెబుతారు. మోసాలు చేస్తారు అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కొత్త చర్చ సాగుతోంది.. అయితే, ఏపీలో ఇప్పటికే వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందనేది స్పష్టమైంది.. మరోవైపు.. బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనే విషయం తెలియకపోయినా.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. అంతేకాదు ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు.. వైఎస్‌ షర్మిల.. కాంగ్రెస్‌ పార్టీలో చేరనుండడంతోనే సీఎం వైఎస్‌ జగన్‌ ఆ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో షర్మిల చేరితే.. ఆ పార్టీ మరింత బలపడుతోంది.. ఈ సమయంలో.. సీఎం జగన్‌ ప్రకటించిన ఆ కొత్త పొత్తు ఏంటి? అనే చర్చ సాగుతోంది.. కాంగ్రెస్‌ రాష్ట్రవ్యాప్తంగా పోటీచేస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. ప్రతిపక్ష కూటమికి ఎదురుదెబ్బ తగులుతుందని.. అది అధికార పార్టీకి కలిసివచ్చే అవకాశం కూడా ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, తాను ఎన్డీఏ భాగస్వామిని అని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకుంటున్నారు.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరినా.. బీజేపీ వ్యవహారం తేలాల్సి ఉంది.. ఈ సమయంలో.. చంద్రబాబు.. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తారా? సీఎం వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం అదేనా? అనేది ప్రాధాన్యత సంతరించుకుంది.
Live : సీఎం జగన్ కు ఇంటెలిజెన్స్ సమాచారం.! ముందు ముందు ఏమైనా జరగొచ్చు..! | Ntv

ఏపీలో ఎన్నికల పొత్తులు.. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్‌ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. పొత్తులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు కీలక సమావేశం జరగనుంది.. ముందుగా ఈ సమావేశానికి బీజేపీ నేత తరుణ్‌ చుగ్‌ హాజరుకావాల్సి ఉండగా.. వేరే కార్యక్రమాలు ఉండడంతో ఏపీ పర్యటనను తరుణ్ చుగ్ రద్దు చేస్తున్నారు.. అయితే, జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ నేతృత్వంలో ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీ సాగనుంది.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌.. పొత్తులపై ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తైంది.. ఏపీ ముఖ్య నేతలమంతా పొత్తులపై మా అభిప్రాయాలు అధిష్టానానికి చెప్పేశాం అన్నారు. ఇక, పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో పొత్తులపై చెప్పేదేం ఉండదు అన్నారు ఎంపీ సీఎం రమేష్‌.. పార్టీలో కొంత మంది నేతలు పొత్తులపై అనవసరంగా కామెంట్లు చేస్తున్నారన్న ఆయన.. పొత్తులపై మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా కొందరు నేతలు వినడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక, ఇవాళ్టి సమావేశాలో పొత్తులపై మాట్లాడే నేతలను కట్టడి చేయాలని కోరతాం అన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది బీజేపీ కూటమితో కూడిన ప్రభుత్వమే అని ప్రకటించారు. కానీ, ఆ కూటమిలో ఎవరెవరు ఉండాలో జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌. కాగా, ఇవాళ్టి సమావేశాలకు ముఖ్యనేతలను మాత్రమే ఏపీ బీజేపీ ఆహ్వానించిన విషయం విదితమే..

వైసీపీలోనే చావో, రేవో.. సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీలోనే..!
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే చావో.. రేవో.. సీటు ఇచ్చినా.. ఇవ్వకపోయినా వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు హిందూపురం లోక్‌సభ ఎంపీ గోరంట్ల మాధవ్‌.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పార్టీ కన్నతల్లి లాంటిది.. పార్టీ నిర్ణయాన్ని శిరసావహించటం బాధ్యతగా భావిస్తున్నాను అన్నారు. నేను పార్టీ పెద్దలు ఎవరిపై ఒత్తిడి చేయలేదేని స్పష్టం చేశారు. తాడేపల్లిలో పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశాను.. నేను, సజ్జల రామకృష్ణారెడ్డితో కోట్లాడినట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని కొట్టిపారేశారు. ఇక, తొందరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కల్పిస్తాం అని పెద్దలు చెప్పారని తెలిపారు. అనేక కారణాలతో పార్టీలో మార్పులు చేశారు.. ఇక్కడ తప్పించినా పార్టీ సరైన గౌరవం ఇస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వైసీపీలోనే చావో, రేవో.. పార్టీ మారే ప్రసక్తే లేదు.. సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటాను అని ప్రకటించారు ఎంపీ గోరంట్ల మాధవ్‌.

మా నాన్న వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తున్నా.. సంతోషంగా ఉంది
మా నాన్న వైఎస్సార్‌ అడుగుజాడల్లోనే నా ప్రయణం.. ఆయన అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నాను అన్నారు వైఎస్‌ షర్మిల.. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేరారు షర్మిల.. ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు ఖర్గే, రాహుల్‌, ఏపీసీసీ చీఫ్ గుడుగు రుద్రరాజు.. ఇక, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ)ని విలీనం చేశాం అన్నారు. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. వైఎస్సార్‌ జీవితమంతా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేశారు.. నేను మా నాన్న వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తున్నాను అన్నారు. ఇక, దేశంలో అతిపెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్సే అన్నారు వైఎస్‌ షర్మిల.. మణిపూర్‌లో 2వేల చర్చిలను ధ్వంసం చేసిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు.. దీని ప్రధాన కారణం దేశంలో కాంగ్రెస్‌ పార్టీ లాంటి సెక్యూలర్‌ పార్టీ అధికారంలో లేకపోవడమే అన్నారు.. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్న షర్మిల.. కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా.. తన శక్తి మేరకు పనిచేస్తానన్నారు.. మరోవైపు.. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలన్నది మా నాన్న వైఎస్సార్‌ కల.. అది సాకారం చేసేందుకు తనవంతు కృషి ఉంటుందన్నారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చింది. జోడో యాత్ర ప్రజలతోపాటు తనలో కూడా విశ్వాసాన్ని నింపిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.. ఇక, తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఎన్నికల్లో పోటీ చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు వైఎస్‌ షర్మిల.

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల.. హాట్‌ కామెంట్లు చేసిన మంత్రి పెద్దిరెడ్డి
వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన వైఎస్‌ షర్మిల.. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సహా పలువకు కాంగ్రెస్‌ దిగ్గజాల సమక్షంలో.. కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు.. అంతేకాదు.. ఏపీలో ఆమెకు కాంగ్రెస్‌ పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందనే చర్చ సాగుతోంది. అయితే, ఈ పరిణామాలపై హాట్‌ కామెంట్లు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అన్నారు. ఇక, రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం.. సీఎం వైఎస్ జగన్ మా నాయకుడు ఆయన కోసం మేం ఎప్పటికీ పని చేస్తూనే ఉంటాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇలా ఎన్ని పార్టీలు వచ్చినా మేం, మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెంటే నడుస్తాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. రాష్ట్ర ప్రజలందరూ సీఎం వైఎస్ జగన్ ను గెలిపించాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా.. మా పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ప్రత్యర్థిగా చూస్తాం అన్నారు. మరోవైపు, జెడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని మేం ఎమ్మెల్యేగా గెలిపించాం.. ఇలాంటివి మాట్లాడే ముందు ఆలోచన చేయాలన్నారు. ఎవరో రెచ్చగొడితే అలా మాట్లాడటం సబబు కాదు అని.. ఇప్పటికైనా అయన పునరాలోచలో చేయాలని కోరుకుంటున్న.. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. గతంలో మా నాయకుడు వైఎస్‌ జగన్ పై అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైలుపాలు చేశారని మండిపడ్డారు. అందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.. మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అని కామెంట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

కేసీఆర్ ను పరామర్శించిన జగన్.. లంచ్ తరువాత లోటస్ ఫాండ్ కు..
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ ఇవాళ కలిసారు. ఇటీవల తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్‌ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని కేసీఆర్ నివాసంలో గులాబీ బాస్ ను పరామర్శించిన జగన్.. కేసీఆర్ తో కలిసి భోజనం చేసిన అనంతరం లోటస్ పాండ్ లోని ఆయన నివాసానికి వెళ్లనున్నారు. కాగా.. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్, లోటస్ పాండ్ లో నివాసానికి వెళ్లనున్నారు. కాగా.. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. జగన్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలికారు. కేటీఆర్ స్వయంగా జగన్ ను తీసుకుని లోపలికి వెళ్లారు. అయితే కేసీఆర్ ను జగన్ మర్యాదపూర్వకంగా కలిశారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరి వీరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయో తెలియాల్సి ఉంది. డిసెంబర్ 8న ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూమ్‌లో జారిపడి కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. కేసీఆర్ కుటుంబీకులు వెంటనే ఆయనను యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు పరీక్షించి తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. అనంతరం యశోద వైద్యుల ఆధ్వర్యంలో కేసీఆర్‌కు ఎముకల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన కేసీఆర్ డిసెంబర్ 15న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నందినగర్‌లోని పాత ఇంటికి వెళ్లారు. కేసీఆర్ ఇంట్లో కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్ తో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

బీజేపీ నన్ను అరెస్ట్ చేయాలనుకుంటోంది.. లిక్కర్ స్కామ్‌పై కేజ్రీవాల్ సంచలనం..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈ రోజు ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తుందనే ఊహాగానాల నడుమ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం ఏంటంటే.. అవినీతే జరగలేదని, బీజేపీ తనను అరెస్ట్ చేయాలని అనుకుంటోందని ఆయన అన్నారు. నా పెద్ద ఆస్తి నిజాయితీ అని, వారు దానిని దెబ్బతీయాలనుకుంటున్నారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. తనకు పంపిన ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. బీజేపీ లక్ష్యం తనను అరెస్ట్ చేయించడమే కాదని, తనను లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవడమే అని చెప్పారు. దర్యాప్తును సాకుగా చెప్పి తనను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారంటూ మండిపడ్డారు. రెండేళ్లుగా బీజేపీ కేంద్ర సంస్థల్ని ఉపయోగించి పలువురిని అరెస్ట్ చేసిందని, ఈ స్కామ్‌లో ఒక్క రూపాయి కూడా పట్టుబడలేదని, స్కామ్ జరిగితే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందని, గాలిలో మాయమైందా..? అంటూ ప్రశ్నించారు. నిజం ఏంటంటే అసలు స్కామే జరగలేదని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో గుండాయిజం పెరిగిందని, ఎవరినైనా అరెస్ట్ చేసి లోపలేస్తోందని ఆరోపించారు. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమని, దీనిపై ఈడీకి లేఖ రాస్తూ ఎలా చట్టవిరుద్ధమో వివరించాలని, వారి నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదని ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల ముందే తనకు ఎందుకు సమన్లు పంపారని ప్రశ్నించారు. 8 నెలల క్రితం సీబీఐ పిలిచినప్పుడు వెళ్లానని, అయితే ఇప్పుడే తనను ఎందుకు విచారణ పేరుతో పిలుస్తున్నారంటూ ప్రశ్నించారు.

భారత్‌లో 4000కి పైగా యాక్టివ్ కేసులు.. ఇద్దరు మృతి..
దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల క్రితం కేవలం పదుల్లో ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 760 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది. గడిచిన 24 గంటల్లో కేరళ, కర్ణాటకలో ఒక్కొక్కరి చొప్పున ఇద్దరు మరణించారు. డిసెంబర్ 5 వరకు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య కేవలం డబుల్ డిజిట్స్‌కే పరిమితమై ఉండేది, అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, చలి వాతావరణం కారణంగా దేశంలో కోవిడ్ కేసులు పెరిగాయి. దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 కోట్ల మందికి కోవిడ్-19 సోకింది. వీరిలో 5.3 లక్షల మందికి పైగా మరణాలు సంభవించాయి. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. రికవరీ రేటు దేశంలో 98.81 శాతం ఉందని, ఇప్పటి వరకు దేశంలో 220.67 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు కేంద్రం తెలిపింది.

ఖలిస్తానీ పన్నూ కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు..
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలపై నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఇప్పటికే అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా చెక్ అధికారులను కోరుతుంది, దీనిపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఇదిలా ఉంటే నిఖిల్ గుప్తా నిర్భందంపై కేంద్రం కలుగజేసుకోవాలని కోరుతూ, ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ని అత్యున్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. ఇది సున్నితమైన విషయమని దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని సుప్రీం తెలిపింది. తాము అంతర్జాతీయ చట్టాల్లో జోక్యం చేసుకోలేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక విదేశీ కోర్టు అధికార పరిధిని గౌరవించాలని కోర్టు తెలిపింది.

అమెరికాలో కరోనా విజృంభణ.. నాలుగు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ
అమెరికాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. యూఎస్ అంతటా డిసెంబర్ 17-23 వరకు కోవిడ్ కారణంగా 29 వేల మంది రోగులు ఆసుపత్రిలో చేరారు. ఈ సమయంలో 14 వేల 700 మంది రోగులు జ్వరం కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అమెరికాలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కొన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ తో పాటు మసాచుసెట్స్‌లోని ఆసుపత్రులలో రోగులు మాస్క ధరించడం తప్పనిసరి చేసింది. ఇక, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డేటా ప్రకారం.. అమెరికాలో కరోనా కారణంగా 11 లక్షల మంది రోగులు మరణించారు. చికాగోలోని రష్ యూనివర్శిటీ మెడికల్ సిస్టమ్ కూడా ఆసుపత్రి క్యాంపస్‌లో రోగులతో పాటు ఆరోగ్య కార్యకర్తలు మాస్కులు తప్పనిసరి చేసింది. గత వారం న్యూయార్క్ నగరం నగరంలోని 11 ప్రభుత్వ ఆసుపత్రులకు మాస్క్‌లు ధరించాలని చెప్పింది.. లాస్ ఏంజిల్స్, మసాచుసెట్స్‌లోని కొన్ని ఆసుపత్రులలో ఇలాంటి చర్యలు గత వారం నుంచి కొనసాగుతున్నాయి.

ఫేర్‌వెల్‌ టెస్టులో లైఫ్‌ వచ్చినా.. నిరాశపర్చిన డేవిడ్ వార్నర్‌!
ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచే వార్నర్‌కు చివరిది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో వార్నర్‌ సెంచరీ చేసి.. ఆటకు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్‌ భాయ్‌ 34 పరుగులు మాత్రమే చేశాడు. ఫేర్‌వెల్‌ టెస్టులో లైఫ్‌ వచ్చినా.. దేవ్ భాయ్ దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో రెండో రోజు ఓవర్‌ నైట్‌ స్కోరు 6-0తో ఆసీస్‌ బ్యాటింగ్‌కు దిగింది. అమీర్ జమాల్‌ వేసిన 14వ ఓవర్లో తొలి బంతి డేవిడ్ వార్నర్‌ బ్యాట్‌ను తాకుతూ స్లిప్స్‌ దిశగా దూసుకెళ్లింది. ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న అయూబ్‌ సునాయాస క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దాంతో వార్నర్‌కు లైఫ్‌ దొరికింది. అయితే వార్నర్‌ దానిని సద్వినియోగించుకోలేకపోయాడు. వార్నర్‌ను పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ అఘా సల్మాన్‌ ఔట్‌ చేశాడు. 25వ ఓవర్లో వార్నర్‌ స్లిప్స్‌లో బాబర్‌ ఆజమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో వార్నర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 68 బంతులు ఆడిన దేవ్ భాయ్ నాలుగు బౌండరీల సాయంతో 34 పరుగులు చేశాడు.

72 సెకండ్స్ వీడియోతో వస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ దేవర సినిమా చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ ఇప్పుడు దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పోస్టర్స్ తో నందమూరి అభిమానుల్లో జోష్ పెంచిన దేవర నుంచి గ్లిమ్ప్స్ బయటకి రాబోతుంది. వరల్డ్ ఆఫ్ దేవరని ఎస్టాబ్లిష్ చేసేలా దేవర గ్లిమ్ప్స్ ఉండబోతుందని సమాచారం. జనవరి 8న గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తున్నామని ఇప్పటికే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేయడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాని కబ్జా చేసారు. 24 గంటల్లో దేవర గ్లిమ్ప్స్ కి 1.5 మిలియన్ లైక్స్ ఇచ్చి లైక్స్ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయాలనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్లాన్. ఇదే జరిగితే దేవర సినిమాపై హైప్ అమాంతం పెరిగిపోవడం గ్యారెంటీ. పాన్ ఇండియా ప్రమోషన్స్ కి సాలిడ్ స్టార్ ఇవ్వాలి అంటే దేవర నుంచి వస్తున్న గ్లిమ్ప్స్ అదిరిపోవాలి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు దేవర గ్లిమ్ప్స్ ని కొరటాల శివ 72 సెకండ్ల నిడివితో కట్ చేసాడని సమాచారం. ఈ 72 సెకండ్ల గ్లిమ్ప్స్ దేవర బాక్సాఫీస్ ఫేట్ ని ఆల్మోస్ట్ డిసైడ్ చేయబోతుంది. గ్రాఫిక్స్ తేడా కొడితే ఆదిపురుష్ సినిమాకి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారో అందరికీ తెలుసు. దేవర సినిమా ఎక్కువ శాతం గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ లోనే చేసారు కాబట్టి ప్రతి ఒక్కరి ద్రుష్టి విజువల్ ఎఫెక్ట్స్ పైన పడుతుంది. సో సీజీ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా దేవర గ్లిమ్ప్స్ లో అన్నీ బాగున్నాయి అనిపించిన తర్వాతే రిలీజ్ చేయడం మంచిది.

ఆయన సరదా సరదాకే హీరోలని యాంగ్రీ యంగ్ మెన్స్ లా చూపిస్తాడు… ఇక పోలీస్ అంటున్నాడు చూసుకోండి మల్ల
సందీప్ రెడ్డి వంగ… ది మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ ఇన్ ప్రెజెంట్ జనరేషన్. చెప్పాలి అనుకున్న కథని కన్విక్షన్ తో చెప్పడంతో సందీప్ రెడ్డి వంగ స్టైల్. క్రిటిక్స్ ఏం అనుకుంటారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అనే ఆలోచన లేకుండా నేనో కథ చెప్పాలి అనుకుంటున్నా దాన్ని 100% ఎఫర్ట్ పెట్టి చెప్తాను అనే స్టైల్ లో సినిమాలు చేస్తుంటాడు సందీప్ రెడ్డి వంగ. ఈయన సినిమాల్లో హీరోలు మామూలుగానే కాస్త హైపర్ గా ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ, అనిమల్ సినిమాలో రణబీర్ కపూర్ లు రెగ్యులర్ హీరోల్లా ఉండరు. కాస్త ఓవర్ ది బోర్డ్ అగ్రెసివ్ గా ఉంటారు. మాటల దగ్గర నుంచి యాక్షన్స్ వరకూ ప్రతి ఎలిమెంట్ ని సందీప్ స్పెషల్ గా డిజైన్ చేస్తాడు అందుకే ఆయన సినిమాల్లో హీరోలు కొత్తగా కనపడుతూ ఉంటారు. ఆల్ఫా మేల్స్ లా హీరోలని చూపించే సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. స్పిరిట్… ప్రభాస్ ని పోలీస్ గా చూపిస్తాను అంటూ సందీప్ హైప్ పెంచుతున్న మూవీ. అఫీషియల్ అనౌన్స్మెంట్ తప్ప పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోని ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథతో స్పిరిట్ సినిమా తెరకెక్కనుందని చెప్తూ సందీప్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ మాములు హీరోలని గ్యాంగ్ స్టర్ లా చూపిస్తూ ఉంటాడు, ఇక ప్రభాస్ ని పోలీస్ అంటున్నాడు… ఇంకే రేంజులో చూపిస్తాడో ఊహించుకోండి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ మాటల్లో నిజముంది ఎందుకంటే సందీప్ డిజైన్ చేసే క్యారెక్టర్స్ మామూలుగానే టిపికల్ గా ఉంటాయి ఇందులో ప్రభాస్ ని ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి సందీప్ స్పిరిట్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అనేది చూడాలి.