NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

కరెంటు చార్జీల పెంపు..? క్లారిటీ ఇచ్చిన ఏపీఈఆర్సీ
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ చార్జీలు పెరగనున్నాయా? గత ఏడాది చార్జీలు పెంచకపోవడంతో.. ఈ సారి పెంచే అవకాశం ఉందా? అనే చర్చ సాగుతూ వచ్చింది.. అయితే, ఈ ఏడాది కూడా విద్యుత్‌ వినియోగదారులకు ఊరట కలిగించే న్యూస్‌ చెప్పింది ఏపీఈఆర్సీ.. రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులకు వరుసగా రెండో ఏడాదీ శుభవార్త వినిపించింది.. 2024–25లో వినియోగదారులపై ఎలాంటి విద్యుత్తు భారం పడకుండా డిస్కమ్‌­లు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి.. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున.. సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం పడకుండా పాత టారిఫ్‌లనే కొనసా­గిస్తున్నట్లు మూడు డిస్కమ్‌లు స్పష్టం చేశాయి.. వైజాగ్‌లోని ఏపీ ఈపీడీసీ­ఎల్‌ కార్యాలయంలో ఏపీఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్‌ రామ్‌­సింగ్, పీవీఆర్‌ రెడ్డి నేతృత్వంలో వర్చువల్‌ విచారణ జరిగింది.. ప్రజాభి­ప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధనశాఖ, ట్రాన్స్‌కో, జెన్‌కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. మొత్తంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని.. అందువల్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదని స్పష్టం చేశారు. “ప్రజా విచారణలో విద్యుత్ సంస్థలు ఏపీ డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కోలు చేసిన ప్రతిపాదనలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71 మంది కమిషన్‌లో నమోదు చేసుకున్నారు. మొదటి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 17 మంది లేవనెత్తిన సమస్యలపై చర్చలు జరిగాయి, మిగిలిన వ్యక్తులను తదుపరి రోజుల్లో కవర్ చేస్తారు. పబ్లిక్ హియరింగ్‌లో సమస్యను లేవనెత్తడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది మరియు విచారణలో చర్చించాల్సిన సరైన అంశాలతో రావాలని నేను వ్యక్తిగతంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. APEPDCL వెబ్‌సైట్ apeasternpower.comలో అందుబాటులో ఉన్న పబ్లిక్ హియరింగ్ లింక్ ద్వారా ప్రజలు పాల్గొనడానికి మరియు వారి అభిప్రాయాలను తెలియజేయడానికి వారి పేర్లను వీక్షించవచ్చు మరియు నమోదు చేసుకోవచ్చు అన్నారు.

మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో సాకారం చేశాం..
మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో సాకారం చేశాం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. “సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.” అంటూ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ట్వీట్‌ చేశారు. ఇక, అంతకుముందు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించి.. జాతిపితగా నిలిచిన మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగాజరుపుకుంటారు.. 1948 జనవరి 30వ తేదీన నాథూరామ్ గాడ్సే అందరూ చూస్తుండగా మహాత్ముడిపై కాల్పులు జరపడం.. హే రామ్ అంటూ ఆ మహనీయుడు ప్రాణాలు విడిచిన విషయం విదితమే.. ఇవాళ ఆ మహాత్ముడి 76వ వర్ధంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.. గుజరాత్ రాష్ట్రంలోని కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2వ తేదీన కరంచంద్ గాంధీ, పుత్లీ బాయి దంపతులకు మహాత్మా గాంధీ జన్మించారు.

నేను కమీషన్లు తీసుకున్నట్టు నిరూపిస్తే.. రాజకీయాలకు గుడ్‌బై..!
ఆవ భూముల్లో 150 కోట్లు దోచేశానని, అభివృద్ధి పనుల్లో 15 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుండి వైదొలగుతాను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్‌ విసిరారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌.. రీల్ ఎంపీ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. పార్లమెంట్‌లో ఈ విషయాలు మాట్లాడటం లేదని చంద్రబాబు చేసిన ఆరోపణలపై సవాల్‌ చేస్తున్నా.. పార్లమెంట్‌లో నేను లేవనెత్తిన ఎక్కువ అంశాలు ఎవరు ప్రస్తావించలేదన్నారు. ఆవ భూముల్లో 150 కోట్లు దోచేశానని, అభివృద్ధి పనుల్లో పదిహేను శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుండి వైదొలగుతానని ప్రకటించారు. విమర్శలు చేసే ముందు చంద్రబాబు ఆలోచన చేయాలని సూచించారు. రాజమండ్రిలో టంగుటూరి ప్రకాశం పంతులు పార్క్‌ను ఎన్టీఆర్ పార్క్ గా మార్చేశారు.. ఇంత దుర్మార్గం మరొకటి లేదని దుయ్యబట్టారు ఎంపీ భరత్‌ రామ్‌.. ఈ పార్క్‌కు తిరిగి ప్రకాశం పంతులు పార్క్‌గా మార్పు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను కోరతాం అన్నారు. ఇక, విభజించిన రాష్ట్రానికి అన్యాయం చేసింది చంద్రబాబు అని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టింది చంద్రబాబేన్న ఆయన.. పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతలు ఎవరితోనైనా చర్చకు సిద్ధం అన్నారు. మీరా నామీద విమర్శలు చేసేది అంటూ విరుచుకుపడ్డారు. సెంట్రల్ జైల్లో ఉండగా చంద్రబాబు కిటికీలోనుంచి రాజమండ్రి అభివృద్ధిని చూసి ఉంటారన్నారు. పుష్కరాల్లో రెండు వేల కోట్లు తినేసింది చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, బెజవాడలో సీఎం వైఎస్‌ జగన్ ‘సిద్ధం’ ప్లెక్సీకి పోటీగా పవన్ కల్యాణ్‌ మేం కూడా సిద్ధం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని హేళన చేశారు.. పవన్ సిద్ధమవుతుంది నాలుగో పెళ్లికా అంటూ ఎద్దేవా చేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌.

వైసీపీ ఐదో జాబితాపై కసరత్తు.. సీఎంవోలో కీలక నేతలు.. సిట్టింగ్‌ల్లో టెన్షన్‌..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గానే సాగుతోంది.. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు ఐదో జాబితాపై ఫోక్‌ పెట్టింది.. ఐదవ జాబితాపై వైసీపీలో కసరత్తు కొనసాగుతోంది.. ఇవాళ, రేపటిలోగా ఐదవ జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు నేతలు క్యూ కట్టారు.. అంతే కాదు.. సీఎంవోలనే విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటి కీలక నేతలు తిష్టవేశారు.. సీఎంవోకు మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్, పొన్నాడ సతీష్, ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత బాబు తదితర నేతలు చేరుకున్నారు. సోమవారం రోజు సీఎం క్యాంప్ కార్యాలయానికి దాదాపు 20 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు.. ఇవాళ సీఎంవోకు మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్, పొన్నాడ సతీష్, ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత బాబు తదితర నేతలు చర్చలు జరుపుతున్నారు.. ఇదే సమయంలో వైసీపీలో కీలకంగా ఉన్న సజ్జల, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి కూడా అక్కడే ఉండే కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. 68 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో మార్పులు చేశారు. ఐదో జాబితాలో 15 నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.. అందులో భాగంగానే మార్పులు చేర్పులు జరిగే స్థానాలకు సంబంధించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు.. ఆ స్థానంలో ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుంది అనే విషయాలపై కూడా ఫోకస్‌ పెట్టింది వైసీపీ అధిష్టానం.

అఖిల ప్రియకు వ్యతిరేకంగా రంగంలోకి భూమా కుటుంబం.. మా మద్దతు కిషోర్‌రెడ్డికే..!
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు వ్యతిరేకంగా సమీప భూమా కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు.. నంద్యాలలో ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. భూమా కుటుంబంతో అఖిల ప్రియకు సంబంధం లేదంటున్నారు భూమా నాగిరెడ్డి సోదరి శ్రీదేవి.. మా భూమా కుటుంబం అంత భమా కిషోర్‌ రెడ్డికే మద్దతు ఇస్తుందన్నారు. అఖిల ప్రియకు మద్దతు ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు. అఖిల ప్రియ.. భూమా కుటుంబానికి చెందినామే కాదు, తన భర్త మద్దూర్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు భూమా నాగిరెడ్డి సోదరి శ్రీదేవి.. భూమా కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉండేది నేనే.. ఫిబ్రవరి 7 లేదా 9వ తేదీల నుండి ప్రజల్లోకి ప్రచారానికి సిద్ధం అవుతున్నట్టు ప్రకటించారు ఆళ్లగడ్డ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇంఛార్జ్‌ భూమా కిషోర్ రెడ్డి.. అంతేకానీ, మద్దూరు అఖిల ప్రియ, భార్గవ్ రామ్ నాయుడుతో సంబంధం లేదన్నారు. భూమా కుటుంబం అంటే మేమే, మద్దూరు అఖిల ప్రియ కాదు అన్నారు. మద్దూరు అఖిల ప్రియ చేసిన ఘోరాలు అందరికీ తెలుసు.. అందుకే ఆమెను మా ఫ్యామిలీ పక్కన పెట్టిందన్నారు. పొత్తులో భాగంగా బీజేపీ అధిష్ఠానం నాకు సీటు ఇవ్వకపోతే.. ఇండిపెండెడ్ గా అయినా పోటీ చేస్తాను.. కానీ, అఖిల ప్రియకు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు భూమా కిషోర్ రెడ్డి.

కేరళ కోర్టు సంచలన తీర్పు.. బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి ఉరిశిక్ష!
కేరళ సెషన్స్‌ కోర్టు మంగళవారం (జనవరి 30) సంచలన తీర్పు ఇచ్చింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో మావెలిక్కర అదనపు సెషన్స్ కోర్టు 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధించింది. నిందితులు అందరూ ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన వారు కావడం గమనార్హం. కేరళలో రెండేళ్ల క్రితం బీజేపీ నేత రంజిత్ హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2021 డిసెంబరు 19న అలప్పుళలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ను హత్య చేశారు. పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తలు రంజిత్ ఇంట్లోకి చొరబడి.. కుటుంబసభ్యుల ముందే దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఈ దాడిలో మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి కొందర్ని అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు.. 2024 జనవరి 20న 15 మందిని దోషులుగా నిర్ధారించింది. నేడు తుది తీర్పు వెలువరించింది. నైసామ్, అజ్మల్, అనూప్, మహ్మద్ అస్లాం, అబ్దుల్ కలాం (అలియాస్ సలాం), అబ్దుల్ కలాం, సఫరుద్దీన్, మన్షాద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, నజీర్, జాకీర్ హుస్సేన్, షాజీ పూవతుంగల్ మరియు షెర్నాస్ అష్రఫ్ లు బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్‌ను దారుణంగా హత్య చేసిన దోషులు. వీరందరికి నేడు కేరళ సెషన్స్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది.

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ సతీమణి?
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ అందుబాటులో లేకపోవడంతో.. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేలంతా రాంచీకి చేరుకోవడంతో త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ ఎమ్మెల్యేలు అందరూ లగేజీలతో సోమవారం రాంచీ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు రాంచీ రావాలని సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆదేశించారట. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం సీఎం నివాసంలో అందరూ సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలు అందరూ రాంచీలోనే ఉండాలని హైకమాండ్‌ ఆదేశించినట్లు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే సోషల్ మీడియాలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం హేమంత్‌ సోరెన్‌ తన ఎమ్మెల్యేలను బ్యాగులతో రాంచీకి పిలిచారు. సమాచారం ప్రకారం.. సీఎం హేమంత్‌ తన సతీమణి కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదన ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణతో సీఎం భయపడుతున్నారు. తాను రోడ్డు మార్గంలో ఢిల్లీ నుంచి రాంచీకి వస్తానని పార్టీ నేతలకు సోరెన్‌ చెప్పినట్లు తెలిసింది’ అని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈడీ అధికారులు సోమవారం సోరెన్ ఇంటికి వెళ్లి 13 గంటలకు పైగా మనీలాండరింగ్ కేసు విచారణ చేశారు. ఆ వెంటనే బీజేపీ ఎంపీ ప్రకటన వచ్చింది.

మాల్దీవులు టూరిజం ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి భారత్
భారత్- మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్యపరమైన వివాదం కారణంగా మాల్దీవులు టూరిజం ర్యాంకింగ్స్‌లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఐదో స్థానానికి పడిపోయింది. మాల్దీవులు పర్యాటక శాఖ విడుదల చేసిన తాజా డేటా వివరాల ప్రకారం.. డిసెంబర్ 2023లో అగ్రస్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం ఐదో స్థానానికి దిగజారిపోయింది. 2024 జనవరి 28 నాటికి మాల్దీవులు టూరిజంతో భారత్ వాటా కేవలం 8 శాతం ఉండగా చైనా 9.5శాతం, యూకే 8.1శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం 13 వేల 989 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. ఈ ఏడాది జనవరి మాసంలో అత్యధిక మంది పర్యాటకులను మాల్దీవులకు పంపిన దేశాల్లో రష్యా (18,561), ఇటలీ (18,111), చైనా (16,529) , యూకే (14,588) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కేవలం ఒక నెలలోనే మాల్దీవుల టూరిజం మార్కెట్‌లో భారత్ యొక్క స్థానం గణనీయంగా పడిపోడం గమనార్హం. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇక, బీచ్‌లు, లగ్జరీ టూరిజానికి ప్రసిద్ధి చెందిన మాల్దీవులకు 2023లో అతి పెద్ద టూరిజం మార్కెట్‌గా భారతదేశం ఉండేది. 2020కి ముందు చైనా ఫస్ట్ స్థానంలో ఉండేది. కానీ, 2020 తర్వాత భారత్ నుంచి మాల్దీవులు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన పరిణామాల వల్ల మళ్లీ భారత్ ఐడో స్థానానికి పడిపోయింది. ఇటీవల మాల్దీవులు అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జు చైనా అనుకూల నేతగా పరిగణించసడటంతో చైనీయులు మాల్దీవులు పర్యటనకు అత్యధికంగా వెళ్తున్నారు. తాజాగా ముయిజ్జూపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ రెడీ అయింది.

ఎంఎస్ ధోనీ ఇంకా 2-3 ఐపీఎల్‌ సీజన్‌లు ఆడగలడు!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మోకాలి గాయం నుంచి కోలుకున్నాడని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో 2-3 సీజన్‌లు ఆడగలడని చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చహర్ చెప్పాడు. ధోనీ లేకుండా చెన్నై జట్టును ఊహించడం కష్టమే అని, సీఎస్‌కే అంటేనే మహీ భాయ్‌ అని పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఇద్దరం కలిసి పబ్‌జీ ఆడేవాళ్లమని టీమిండియా పేసర్ దీపక్ చహర్ తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ సిరీస్‌లకు చహర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ఐపీఎల్ 2024 ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ‘ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉంది. మరో 2-3 ఐపీఎల్‌ సీజన్‌లు ఆడగలిగే సత్తా మహీలో ఉంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. చివరి నిర్ణయం మాత్రం ధోనీదే. గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయడం నేను చూశాను. బాగా ఆడుతున్నాడు. తన చివరి మ్యాచ్‌ చెన్నైలోనే అని ధోనీ అందరికీ చెప్పాడు. ధోనీ లేకుండా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును ఊహించడం చాలా కష్టమే. సీఎస్‌కే అంటేనే మహీ భాయ్‌’ అని దీపక్ చహర్ పేర్కొన్నాడు.

గుంటూరు కారం ఓటీటీ వెర్షన్ లో ఆ సీన్స్ యాడ్ చేయనున్న మేకర్స్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన గుంటూరు కారం  మూవీ థియేటర్లలో భారీగా వసూళ్లను రాబట్టింది. మహేష్‌బాబు కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.ఈ మూవీ 18 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 240 కోట్ల వరకు గ్రాస్‌ను 122 కోట్లకుపైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఏపీ మరియు తెలంగాణలోని చాలా చోట్ల గుంటూరు కారం మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. నైజాం ఏరియాలో దాదాపు నలభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు 34 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు 135 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మరో పన్నెండు కోట్లకుపైగా వసూళ్లను సాధించాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.అయితే గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఓటీటీ వెర్షన్‌లో కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేయబోతున్నట్లు సమాచారం. థియేటర్లలో నిడివి ఎక్కువ కావడంతో అమ్మ సాంగ్‌తో పాటు కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా మేకర్స్ కట్ చేసారు.. దీనితో ఈ అమ్మ సాంగ్‌, కబడ్డీ యాక్షన్ సీన్‌ను ఓటీటీలో యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది. కబడ్డీ యాక్షన్ ఎపిసోడ్ ఫైట్ ఓటీటీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుందని సమాచారం..గుంటూరు కారం మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. మహేష్‌బాబుకు తెలుగులో ఉన్న క్రేజ్ కారణంగా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నలభై కోట్లకు నెట్‌ఫ్లిక్స్ గుంటూరు కారం డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు చసమాచారం.ఈ మాస్ అండ్ యాక్షన్ మూవీ ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు తెలుస్తుంది.

పదిహేను రోజులిస్తే చాలు పాన్ ఇండియా షేక్ అయ్యే సినిమా రెడీ
పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌తో చివరగా అనౌన్స్మెంట్ అయి జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకున్న సినిమా ఏదైనా ఉందా? అంటే, అది ఓజి అనే చెప్పాలి. సాహో తర్వాత సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఓజి పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా ఫస్ట్ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. అయితే సుజీత్ ఉన్న స్పీడ్‌కి ఈపాటికే ఓజి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని థియేటర్లోకి రావాల్సింది కానీ పవన్ పాలిటిక్స్ కారణంగా ప్రస్తుతం బ్రేక్‌లో ఉంది. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనేది సస్పెన్స్‌గా మారింది. కానీ ఓజి ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఎందుకంటే పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. ఇప్పటికే పవన్ లేని సీన్స్ కంప్లీట్ చేశాడట సుజీత్. దీంతో జస్ట్ పవన్ 17 నుంచి 18 రోజులు డేట్స్ ఇస్తే చాలు… షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట. ప్రజెంట్ పవన్ ఎన్నికల హడావిడిలో ఉన్నారు కాబట్టి… ఆ తర్వాత డేట్స్ ఇస్తే వెంటనే ఓజిని పూర్తి చేసి ఆగస్ట్ వరకు రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తోందట. ఆగస్టు టార్గెట్ ని అచీవ్ చేస్తే చాలు సుజిత్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయగలడు. ఇప్పటివరకు రీజనల్ సినిమాల కలెక్షన్స్ దగ్గర మాత్రమే కొత్త రికార్డులు క్రియేట్ చేసే పవన్ కళ్యాణ్… OG సినిమాతో మొదటిసారి రీజనల్ బౌండరీలు దాటి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు. OG హిట్ అయితే సినిమా అభిమానులు మొదటిసారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సంభవం చూస్తారు. మరి ఈ ఆగస్టు టార్గెట్ ని సుజిత్ అచీవ్ చేస్తాడా? పవన్ కళ్యాణ్ బాలన్స్ డేట్స్ ని త్వరగా ఇస్తాడా లేదా అనేది చూడాలి.

‘ధనుష్’ షూటింగ్‌ కోసం ట్రాఫిక్ మళ్లింపు.. తిరుమలకు వెళ్లే భక్తులకు కష్టాలు
మంచి స్పాట్‌లో లేదా పుణ్యక్షేత్రాల్లో సినిమా షూటింగ్‌లు, వెబ్‌ సిరీస్‌లు షూటింగ్‌లు నిర్వహించే సాదారణ విషయమే.. కానీ, అవి భక్తులకు ఇబ్బంది కలిగించేలా ఉంటేనే.. ఎవరైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పుడు తమిళనటుడు ధనుష్ నటిస్తోన్న.. వెబ్ సిరీస్ షూటింగ్‌కు అనుమతించిన అధికారులు.. ట్రాఫిక్‌ మళ్లించారు.. దీంతో.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అలిపిరి వద్ద తిరుమల వెళ్లే భక్తులకు కష్టాలు తప్పడం లేదు.. కపిల్ తీర్థం ద్వారా తిరుమలకు వెళ్లాల్సిన అన్ని వాహనాలను దారి మళ్లించారు అధికారులు.. ట్రాఫిక్‌ మళ్లింపు కోసం పోలీసులతోపాటు భారీగా బౌన్సర్ల మొహరించారు.. ఇరుకైన హరే రామ హరే కృష్ణ రోడ్ లో ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.. అయితే, తిరుమల శ్రీ వెంకన్న దేవుడి వద్దకు వెళ్లే వారిని ఆపి షూటింగ్ కు అనుమతించడం ఏంటి..? వీరికి మరెక్కడా చోటు దొరకలేదా అంటూ మండిపడుతున్నారు భక్తులు.

మృణాల్ మత్తులో సోషల్ మీడియా!
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా మృణాల్ ఠాకూర్ మత్తులో పడిపోయింది. అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. సీతారామం సినిమాలో సీతగా కట్టిపడేసిన మృణాల్… ఆ తర్వాత నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమాతో మరోసారి మాయ చేసింది. త్వరలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సీతారామంతో హిట్ వచ్చిందని తొందరపడకుండా చాలా కూల్‌గా మంచి కథలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది మృణాల్. అయితే సినిమాల్లో అచ్చ తెలుగమ్మాయిలా ట్రెడిషనల్‌గా కనిపించే మృణాల్… అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మంట పుట్టిస్తు ఉంటుంది. తన అందంతో కుర్రాళ్ళకు కిర్రెక్కిస్తుంది. లేటెస్ట్‌గా మృణాల్ గ్లామర్ షోకు సోషల్ మీడియాకే చెమటలు పడుతున్నట్టుగా ఉంది. ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకలో మృణాల్‌ను చూస్తే వావ్ అనాల్సిందే. ఈ వేడుకకు ఆలియా భట్, జాన్వీ కపూర్‌తో పాటు చాలామంది స్టార్ హీరోయిన్లు హాజరయ్యారు కానీ అందరికంటే మిన్నగా తన భారీ అందంతో మృణాల్ అందరినీ అట్రాక్ట్ చేసింది. అసలు ఈమె మా సీతనేనా? అనేలా హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. మృణాల్ స్మైల్‌కు, ఆ టెంప్టింగ్ లుక్‌కు తెగ అట్రాక్ట్ అయిపోయారు కుర్రాళ్లు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అది ఇది అని కాకుండా… సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నింటిలోను అమ్మడి ఫోటోలే కనిపిస్తున్నాయి. దీంతో మృణాల్ ట్యాగ్, మృణాల్ ఫోటోలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.