NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

కులం పేరుతో దూషిస్తూ మహిళలపై గ్రామ వాలంటీర్‌ దాడి
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటి దగ్గరకే పాలన అందించాలన్న ఉద్దేశంతో గ్రామ/వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు.. అయితే, కొన్ని సందర్భాల్లో వాంటీచర్లు చేసే పొరపాట్లు.. ఆ వ్యవస్థపై ఆరోపణలు, విమర్శలకు దారి తీశాయి.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సహా విపక్షాలు తీవ్రస్థాయిలో వాలంటీర్‌ వ్యవస్థపై ధ్వజమెత్తారు. తాజాగా న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా మరోసారి ఓ వాలంటీర్‌ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది.. కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలో నూతన సంవత్సర వేడుకల్లో ఓ వాలంటీర్ దాష్టీకం ప్రదర్శించాడు. మండలంలోని పెదప్రోలు గ్రామస్తులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా.. అక్కడ వాలంటీర్ సుధాకర్ రెచ్చిపోయాడు. డీజే వివాదంలో గ్రామస్తులపై దాడికి పాల్పడ్డాడు.. మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసినట్టు మండిపడుతున్నారు స్థానికులు.. పెదప్రోలు గ్రామంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వారిపై కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు గ్రామ వాలంటీర్ సుధాకర్.. ఇక, వాలంటీర్‌కు తోడుగా వచ్చిన మరో నలుగురు యువకులు కూడా రెచ్చిపోయారు.. మహిళలను కర్రలతో కొడుతూ, పొత్తి కడుపులో పిడిగుద్దులు గుద్దారు.. అయితే, తమపై జరిగిన దాడిని, వాలంటీర్‌ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు పట్టించుకోలేదని.. ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.. మరోవైపు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలతో పాటు.. గ్రామంలో బాధితులను తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.

ఏపీ చివరి అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు.. ఎప్పుడంటే..?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చివరి అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు సాగుతున్నాయి.. ఈ టెన్యూర్ లో చివరి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌ సిద్ధం అవుతోంది.. అనుకున్నది అనుకున్నట్టుగా సాగితే.. ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. చివరి టెన్యూర్‌లో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ సమావేశాల్లో 4 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. ఎన్నికల ఏడాది కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఓట్ ఆన్ అకౌంట్ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం.

బాలికపై సామూహిక అత్యాచారం.. 13 మందిపై కేసు, 11 మంది అరెస్ట్‌
విశాఖపట్నంలో కలకలం సృష్టించిన మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో 13 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో 11 మందిని ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.. ఇక, అరెస్ట్ అయిన 11 మంది నిందితులు ఫొటోగ్రాఫర్లే.. అరెస్ట్‌ తర్వాత వారిని కోర్టుముందు హాజరుపర్చగా.. 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది కోర్టు.. ఈ కేసులో మరో ఇద్దరు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. కీలక నిందితుడిగా ఉన్న బాలిక ప్రియుడు ఇమ్రాన్‌తో పాటు అతని స్నేహితుడు షోయాబ్‌ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా, విశాఖలో 17 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం తీవ్ర కలకలం సృష్టించింది.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి నరకం చూపించారు కామాంధులు.. నగరంలోని పలు లాడ్జిలకు తిప్పుతూ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఒడిశా నుంచి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికను ప్రేమపేరుతో వంచించి ప్రియుడు తొలుత కామవాంఛ తీర్చుకున్నాడు. తర్వాత మరో తొమ్మిది మంది బాలికను రెండు రోజుల పాటు లాడ్జిలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ సంఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. అయితే, ఈ ఘటనలో 13 మందిని కేసు నమోదు చేశారు పోలీసులు..

మున్సిపల్ కార్మికుల సమ్మె.. చర్చలు సఫలం అయ్యేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతోనూ ఉంది.. తమ డిమాండ్ల సాధన కోసం మొండుపట్టుపట్టారు కార్మికులు.. వారికి అండగా నిలిచాయి కార్మిక సంఘాలు.. అయితే, నేడు మరోసారి మున్సిపల్ కార్మిక సంఘాలను చర్చలకు పిలిచింది ప్రభుత్వం.. సచివాలయంలోని సెకెండ్ బ్లాక్ లో జీవీఎంతో సమావేశం కానున్నారు కార్మిక సంఘాల నేతలు.. సమాన పనికి సమాన వేతనం పై పట్టుబడుడుతోంది సీఐటీయూ.. మున్సిపల్ వర్కర్స్ పలు డిమాండ్ల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పట్టికీ.. అన్ని డిమాండ్‌పై చర్చలు కొనసాగుతున్నాయి.. కార్మిక సంఘాల డిమాండ్ మేరకు మరికొన్ని క్యాటగిరీలకు కూడా ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్స్, శానిటేషన్ వెహికల్ డ్రైవర్స్, మలేరియా వర్కర్స్ కు నెలకు 6 వేల రూపాయల ఓహెచ్ అలవెన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది.. అయితే, సమ్మెలో ఉన్న సీఐటీయూ, సమ్మె నోటీసిచ్చిన వివిధ మున్సిపల్ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో చర్చలు సాగనున్నాయి.. మున్సిపాల్టీల్లో పని చేసే వివిధ వర్గాలకు రూ. 6 వేల మేర హెల్త్ అలవెన్స్ మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు.. కానీ, ప్రభుత్వం జారీ చేసిన జీవోపై కార్మిక సంఘాల అసంతృప్తితో ఉన్నాయి.. కొన్ని వర్గాలకు మాత్రమే అలవెన్స్ ఇచ్చి. మరికొన్ని వర్గాలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తున్నాయి కార్మిక సంఘాలు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి తీరాల్సిందేనని పట్టు పడుతోన్న కార్మిక సంఘాలు. వేతనాన్నైనా పెంచాలి.. లేదా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రైగులరైజ్ చేయాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.. మరోవైపు.. సమ్మె విరమింప చేయాలని ప్రయత్నిస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఇప్పటికే హెల్త్ అలవెన్స్ పెంచుతూ జీవో జారీ చేశామని గుర్తు చేస్తోంది.. సమ్మె విరమించి విధుల్లో చేరాలని కార్మిక సంఘాలను కోరుతున్నారు మంత్రులు.

కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ షర్మిల చేరిక..! ఇల్లు అలకగానే పండుగ కాదు..
వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.. ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న ఆమె.. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తారట.. అదే రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది.. ఆమెతో పాటు సుమారు 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీ కాంగ్రెస్‌ పార్టీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది.. అయితే, వైఎస్‌ షర్మిల.. కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. షర్మిల రాకతో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమికి కూడా ప్రయోజనమేనన్న ఆయన.. వైసీపీ నుంచి బయటకు రావాలనుకునే వారికి షర్మిల ద్వారా అవకాశం దొరికినట్టే అన్నారు.. అయితే, ఇల్లు అలకగానే పండుగ కాదు.. షర్మిల రాకతోనే వెంటనే అన్నీ జరగబోవు అని వ్యాఖ్యానించారు. ఇక, ఫిబ్రవరి నెలాఖరులో మా ఎత్తులు, పొత్తులు తేలుతాయన్నారు రామకృష్ణ.. బీజేపీ వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలు అని స్పష్టం చేశారు. ప్రధాని మోడీవి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అని మండిపడ్డారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలే లిక్కర్ స్కాం ఏపీలో జరుగుతోందని లెటర్ ఇచ్చినా ప్రొసీడ్ కాలేదు అని ఆరోపించారు. రాష్ట్రంలో కిందిస్ధాయి ఉద్యోగులు జీతాల కోసం రోడ్లెక్కే పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1.06 లక్షల అంగన్వాడీ వర్కర్ల నిరసన ధర్నాను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. అయితే, రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే అంగన్వాడీల కలెక్టరేట్ల దిగ్బంధన కార్యక్రమానికి సీపీఐ మద్దతిచ్చి పాల్గొంటుందని ప్రకటించారు. మరోవైపు.. 11 లక్షల కోట్ల అప్పులు చేశారు.. మరో 2 వేల కోట్ల అప్పు చేస్తే ఏమైనా పోతుందా? అని ప్రశ్నించారు రామకృష్ణ.. బైజూస్ కంపెనీ రూ.9200 కోట్ల మనీలాండరింగ్ లో ఉన్న కంపెనీ.. బజాజ్ ఫైనాన్స్ తో టైఅప్ చేసుకుని బైజూస్ విద్యార్ధులను దోచుకుంటోందని ఆరోపించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.

చూసుకుని కట్టండి బ్రో.. ట్రాఫిక్‌ ఈ చలాన్‌ పేమెంట్స్‌ ఫేక్‌ వెబ్సైట్‌..!
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఆఫర్లలో పోలీసులు మీ సేవా కేంద్రాలతోపాటు https://echallan.tspolice.gov.in/publicview వెబ్‌సైట్ ద్వారా చలాన్లు వసూలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే.. ఈ ఆఫర్‌కు భారీ రెస్పాన్స్ వస్తుండటంతో.. పోలీసుల వెబ్‌సైట్లు ఎప్పటికప్పుడు హ్యాంగ్ అవుతున్నాయి. దీనికి తోడు సైబర్ క్రైమ్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించారు. https://echallantspolice.in/ పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించబడింది. దీంతో చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్లను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్‌సైట్లలో చలాన్‌లు చెల్లించవద్దు. పోలీసులు సూచించిన అధికారిక వెబ్‌సైట్‌లో చెల్లించాలని సూచించారు. నకిలీ వెబ్‌సైట్లు సృష్టించిన వారిని గుర్తించేందుకు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

స్కూళ్లలో ఫేస్ రికగ్నిషన్ హాజరు.. విద్యాశాఖ కీలక నిర్ణయం
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించారు. ఈ హాజరు విధానం ద్వారా విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పాఠశాల దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించాలనేది విద్యాశాఖ ఆలోచనగా తెలుస్తోంది. దాదాపు ఏడాది క్రితమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినా కనీసం 40 శాతం పాఠశాలల్లో అమలు కావడం లేదు. ఎన్నికల విధులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతో విద్యాశాఖ ఈ అంశంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కాగా, ఈ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు విధానం ఉండేది. ప్రతి నెలాఖరులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా హాజరును రాష్ట్ర కార్యాలయానికి పంపుతారు. అయితే వారు పంపిన వివరాలు విద్యార్థులకు అందజేస్తున్న ఆహారం, దుస్తులు, పుస్తకాలకు సరిపోవడం లేదని అధికారులు ఆరోపించారు. పాఠశాల నిర్వహణ నిధులు కూడా పక్కాగా లెక్కించలేని పరిస్థితి నెలకొంది.

రికార్డు.. న్యూ ఇయర్‎ సందర్భంగా 24లక్షల సీసాలు పీల్చేశారు
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 31 రాత్రి 24 లక్షలకు పైగా మద్యం బాటిళ్ల వినియోగం నమోదైంది. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం అర్థరాత్రి వరకు మొత్తం 24 లక్షల 724 బాటిళ్లు అమ్ముడుపోయాయి. గతేడాది కంటే ఈ సంఖ్య 4 లక్షలు ఎక్కువ. 2023 సంవత్సరంలో డిసెంబర్‌లో అత్యధిక మద్యం అమ్మకాలు జరిగాయి. 31వ తేదీతో కలిపి డిసెంబర్‌లో ఢిల్లీలో 5 కోట్లకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోయాయి. డిసెంబర్ 2022తో పోలిస్తే ఈసారి డిసెంబర్‌లో 98 లక్షలకు పైగా మద్యం బాటిళ్లను వినియోగించారు. డేటా ప్రకారం, 2023లో కూడా నెలవారీ వృద్ధి 14 శాతం నమోదైంది. డిసెంబరు 30న 17 లక్షల 79 వేల 379 మద్యం బాటిళ్లను విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీలోని 520 షాపుల నుంచి దాదాపు 4 కోట్ల బాటిళ్లు అమ్ముడయ్యాయి. ఈసారి 635 షాపుల నుంచి 4 కోట్ల 97 లక్షల మద్యం బాటిళ్లు అమ్ముడుపోయాయి. నూతన సంవత్సర వేడుకల్లో ఈసారి అమ్మకాలు భారీగా పెరిగాయి. షాపులు పెరగడం కూడా రాజధానిలో మద్యం అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 2022లో 520 దుకాణాలతో పోలిస్తే ఈసారి 635 షాపుల్లో మద్యం విక్రయాలు జరిగాయి. మరిన్ని బ్రాండ్‌ల కారణంగా విక్రయాలలో పెరుగుదల నమోదు చేయబడింది. 2023 సంవత్సరంలో ప్రతి నెలా 14 శాతం పెరుగుదల నమోదైంది.

మేడ్ ఇన్ చైనా డ్రోన్లతో సరిహద్దులో పాకిస్థాన్ డర్టీ గేమ్
పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్లు భారత్‌కు పెను ముప్పుగా మారుతున్నాయి. 2023లో భారత భూభాగంలోకి ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థానీ డ్రోన్లను బీఎస్ఎఫ్ అధికారులు కూల్చివేసినట్లు ప్రకటించింది. ఈ డ్రోన్లు పూర్తిగా మేడిన్ చైనా పేరుతో తయారు చేయడినవిగా గుర్తించారు. డ్రాగన్ కంట్రీలో తయారైన వీడిని వినియోగించి భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు పాకిస్థానీయులు ప్రయత్నం చేస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళాలు తెలిపాయి. అయితే, పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో 107 డ్రోన్‌లను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చి వేశారని బీఎస్ఎఫ్ చెప్పుకొచ్చింది. అయితే, జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ తో పాటు గుజరాత్ సరిహద్దులతో భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో 2,289 కిలో మీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. పంజాబ్ ప్రాంతం పాకిస్థాన్‌తో 553 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. కాగా, ఈ సమయంలో రాజస్థాన్ సరిహద్దు నుంచి సుమారు 10 డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. ఈ డ్రోన్‌ల ద్వారా మొత్తం 442.39 కిలోల హెరాయిన్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. బీఎస్ఎఫ్ సైనికులు ముగ్గురు పాకిస్థానీ చొరబాటుదారులను హతమార్చాడంతో పాటు ఇద్దరు స్మగ్లర్లతో సహా 23 మంది పాకిస్తానీ పౌరులను అరెస్టు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, 35 మంది స్మగ్లర్లు సహా 14 మంది బంగ్లాదేశ్ జాతీయులతో పాటు 95 మంది భారతీయ అనుమానితులను కూడా అరెస్టు చేశారు. తెలియకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటిన దాదాపు 12 మంది పాకిస్థాన్ పౌరులను కూడా తమ దేశానికి తిరిగి పంపిచినట్లు బీఎస్ఎఫ్ పేర్కొనింది. పాకిస్తాన్‌తో సరిహద్దు భద్రతను సంరక్షించేందుకు బీఎస్ఎఫ్ పటిష్ట చర్యలు తీసుకుంటుంది.

వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. కళ్ళకు ఎఫెక్ట్ పడకుండా..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఈ ఫీచర్ వల్ల కళ్ళకు ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది.. ప్రస్తుతం వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో ఫీచర్‌ను టెస్టింగ్‌ దశలో ఉన్నది. కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండడానికి ఇప్పటికే వాట్సాప్‌లో డార్క్‌ మోడ్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిని కొత్తగా అప్‌డేట్ చేయాలని వాట్సాప్‌ ప్లాన్‌ చేస్తోంది.. ఈ ఫీచర్ గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.. యూజర్ల కంటిపై ఒత్తిడి పడకుండా ఉండేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. వాట్సాప్ వెబ్‌లో కొత్త కలర్స్, టాప్ బార్, బ్యాక్‌గ్రౌండ్, మెసేజ్ బబుల్స్‌లో కలర్ స్కీమ్, సైడ్‌బార్‌ను మరింత ఆధునికంగా రీడిజైన్ చేసి, తక్కువ కాంతిని ఇచ్చే విధంగా అప్డేట్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ ఫీచర్ అందరికీ బాగుంటుందని చెబుతున్నారు.. ఇదిలా ఉంటే వాట్సాప్‌ ఇది వరకే 2020లో వెబ్‌ వెర్షన్‌ కోసం డార్క్‌ మోడ్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను అప్‌డేట్ చేస్తూ మరింత తక్కువ లైట్‌తో పనిచేసేలా చేయనున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేష్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇదేందయ్యా ఇది.. ఒడ్కా తో కూడా వంటలు చేస్తున్నారే.. ఏం ఐడియా రా బాబు..
సోషల్ మీడియాలో రకరకాల వంటల వీడియోలు దర్శనమిస్తుంటాయి.. అందులో కొన్ని కాంబినేషన్స్ తల నొప్పి తెప్పిస్తే.. మరికొన్ని వీడియో జనాలకు భయాన్ని కలిగిస్తున్నాయి.. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో పరోటాలను తయారు చేసిన తీరు జనాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేద్దాం పదండీ.. ఈ ఏడాదిలోనూ ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ తాజాగా వోడ్కా ఆలూ పరాఠా హాట్ టాపిక్ గా మారింది. అయితే తాము ఇష్టంగా తినే ఆలూ పరాఠాని వోడ్కాతో తయారు చేయడం ఏంటని చాలా మంది తిట్టిపోస్తున్నారు. వోడ్కా కలిపితే పరాఠా టేస్ట్ ఎంత దారుణంగా మారుతుందో ఊహించడానికే కష్టంగా ఉందని మరికొందరు మండి పడుతున్నారు.. ఈ పరోటాను ఓ ఇంస్టాగ్రామ్ యూజర్ తయారు చేసింది.. ఆ వీడియోనే ఇది.. ఆమె నూనెకు బదులుగా వోడ్కాని ఎలా వాడుతుందో మనం చూడవచ్చు. ఆమె పిండిని మెత్తగా చేయడానికి, మసాలా బంగాళాదుంపను స్టఫ్ గా వాడింది. తడి చేయడానికి, పాన్ మీద పరాఠాను వేయించడానికి వోడ్కాను ఉపయోగించింది.. ఆ తర్వాత ఆమె పరాఠాను కొద్దిగా తిని దాని టేస్ట్ ఎలా ఉందో వివరించింది. ఆమె మాట్లాడుతూ ఆ పరాఠా స్పైసీగా, హాట్ గా ఉందని, తల తిరుగుతుందని చెప్పింది.. కొత్తగా, మత్తుగా ఉందని పేర్కొంది.. ఆహారం, పానీయాలు రెండింటినీ ఆస్వాదించడానికి ఇది మంచి మార్గం అని కూడా ఆమె పేర్కొంది.. ఆ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది క్షణాలకే వ్యూస్ అధికంగా వచ్చాయి.. అంతే విధంగా కామెంట్స్ కూడా అందుకుంది.. ఏంటో ఈ ఖర్మ ఒక లుక్ వేసుకోండి మరి..

రెండు సినిమాలు అనౌన్స్ చేసావ్ బ్రో? ఏది ముందు స్టార్ట్?
హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసారతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన కళ్యాణ్… లేటెస్ట్ గా డెవిల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అభిషేక్ నామా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా సో సో రిజల్ట్ నే సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్‌గా అదరగొట్టాడు కళ్యాణ్ రామ్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌తో దుమ్ములేపాడని అంటున్నారు. దీంతో.. బింబిసార తర్వాత కళ్యాణ్‌ రామ్, సంయుక్త మీనన్‌ కలిసి మరో మంచి సినిమా చేసారు. రిలీజ్ రోజున చేసిన సెలబ్రేషన్స్‌లో భాగంగా.. డెవిల్ 2 కూడా ఉంటుందని అనౌన్స్ చేశాడు కళ్యాణ్ రామ్. ‘డెవిల్ 2 ఉంటుంది. నా టీమ్ మెంబర్స్‌తోనే ఉంటుంది. 2024లో డెవిల్ 2 మొదలుపెట్టి 2025లో రిలీజ్ చేస్తాం. డెవిల్2 లో 1940 ఎరా.. 2000 ఎరా కూడా కనిపిస్తుంది. ఈ రెండు కాలాలు కలిపి చూడబోతున్నారు…’ అని చెప్పుకొచ్చాడు. డెవిల్ రిలీజ్ రోజునే సీక్వెల్ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్ ఇప్పటికే బింబిసార 2 కూడా అనౌన్స్ చేశాడు. వశిష్ట కాకుండా ఇంకో దర్శకుడితో బింబిసారా 2 స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే బింబిసారా 2 అనౌన్స్ చేసిన తర్వాత కూడా కళ్యాణ్ రామ్ నుంచి రెండు సినిమాలొచ్చాయి. అమిగోస్ ఫ్లాప్ అవగా… డెవిల్ ఓకె అనిపించుకుంది. ఇక ఇప్పుడు డెవిల్ 2 అనౌన్స్ చేశాడు కానీ డెవిల్ ట్రైలర్ లాంచ్‌లో… వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో బింబిసార 2 షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో… ఈ రెండు సీక్వెల్స్‌లలో ఏది ఫస్ట్ సెట్స్ పైకి వెళ్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే NKR21 వర్కింగ్ టైటిల్‌తో మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. మరి ఆ తర్వాత బింబిసార 2 చేస్తాడా? డెవిల్ 2 తీస్తాడా? అనేది చూడాలి.

ఇండియన్ 2 మూవీ షూటింగ్ పూర్తి..సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న మేకర్స్..?
విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. డైరెక్టర్ శంకర్‌ 2015 లో ఇండియన్ 2 మూవీని అనౌన్స్‌చేశాడు. 2018లో షూటింగ్ మొదలైంది. షూటింగ్‌లో క్రేన్ ప్రమాదం జరగడం అలాగే నిర్మాణ సంస్థ లైకాతో శంకర్‌కు విభేదాలు ఏర్పడటంతో 2020లో ఇండియన్ 2 ఆగిపోయింది. కమల్ హాసన్ చొరవ తీసుకోని ఈ వివాదాల్ని పరిష్కరించారు. దాంతో 2022 మేలో ఇండియన్ 2 షూటింగ్‌ ను శంకర్ తిరిగి మొదలుపెట్టాడు. శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తూనే ఇండియన్ 2 సినిమా ను కూడా డైరెక్ట్ చేశాడు . దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్‌ను జరుపుకున్న ఈ మూవీకి 2024 కొత్త ఏడాది తొలిరోజున మోక్షం కలిగింది. ఎట్టకేలకు దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ను పూర్తిచేశాడు. చెన్నైలో జరిగిన తాజా షెడ్యూల్‌ తో ఇండియన్ 2 షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది.ఇండియన్ 2 షూటింగ్ పూర్తయిన సందర్భంగా సినిమా యూనిట్‌తో కమల్‌హాసన్ ఓ ఫొటోను దిగారు . కమల్‌హాసన్‌తో పాటు శంకర్ కెరీర్‌లో ఎక్కువ కాలం షూటింగ్‌ ను జరుపుకున్న మూవీగా ఇండియన్ 2 నిలిచింది.ఇండియన్ -2లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా సిద్ధార్థ్‌ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్‌ మరియు ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ఇండియన్ 2 మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.. ఇండియన్ 2 సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన కమ్ బ్యాక్ ఇండియన్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇండియన్ 2 సినిమా ను దర్శకుడు శంకర్ ఎంతో రిచ్ గా తెరకెక్కిస్తున్నారు. అదిరిపోయే విజువల్స్ తో ఈ మూవీ ఎంతో గ్రాండ్ గా ఉండనున్నట్లు సమాచారం.

రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్న మేకింగ్ మాస్టర్ అండ్ లోకనాయకుడు
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప సినిమాల్లో ఒకటిగా, ఆల్ టైమ్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది నాయకుడు సినిమా. లోకనాయకుడు కమల్ హాసన్, మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి చేసిన ఈ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాయకుడు కథా కథనాలు ఎన్నో కమర్షియల్ సినిమాలకి ఒక దిక్సూచిగా నిలిచాయి. కమల్ హాసన్ అండ్ మణిరత్నంలకి ఇళయరాజా మ్యూజిక్, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ  కూడా తోడవ్వడంతో నాయకుడు మరింత గొప్ప మూవీ అయ్యింది. 1987లో రిలీజ్ అయిన ఈ మూవీ తర్వాత ఇద్దరు లెజెండ్స్ కమల్-మణిరత్నంలు కలిసి వర్క్ చేస్తే చూడాలని మూవీ లవర్స్ అంతా వెయిట్ చేసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తే కమల్ హాసన్-మణిరత్నంలు చేస్తున్న సినిమా థగ్ లైఫ్. కమల్ హాసన్ బర్త్ డే రోజున అనౌన్స్మెంట్ వీడియోతో సెన్సేషన్ క్రియేట్ చేసింది థగ్ లైఫ్ సినిమా. జపనీస్ స్టైల్ లో డిఫరెంట్ మేకింగ్ తో కమల్-మణిరత్నంలు తమ మ్యాజిక్ ని చూపించారు. ఇన్నేళ్ల తర్వాత కలిస్తే ఈ రేంజులోనే ఉండాలి అని నిరూపించేలా థగ్ లైఫ్ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేసారు. ఇన్ని రోజులు కాస్త సైలెంట్ గా ఉన్న కమల్-మణిరత్నం… ప్రీప్రొడక్షన్ వర్క్స్ ని కంప్లీట్ చేసుకోని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు కలిసి జనవరి మూడో వారం నుంచి థగ్ లైఫ్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈలోపు కమల్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తాడా లేక మధ్యలో బ్రేక్ తీసుకోని థగ్ లైఫ్ షూటింగ్ స్టార్ట్ చేస్తాడా అనేది చూడాలి. ఇప్పటికైతే ఇండియన్ 2 కంప్లీట్ అవ్వకముందే కమల్ థగ్ లైఫ్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు అనే మాట కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.