*ముఖ్యమంత్రి పదవికి నితీష్‌కుమార్ రాజీనామా.. నెక్ట్స్ ఏంటంటే..!
బీహార్ రాజకీయ సంక్షోభం చివరంఖానికి చేరుకుంది. అంతా ఊహించినట్టుగానే మహాకూటమికి నితీష్‌కుమార్ గుడ్‌బై చెప్పేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి నితీష్ రాజీనామా లేఖను సమర్పించారు. అంతకముందు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజీనామాకు గల కారణాలను ఎమ్మెల్యేలకు నితీష్ తెలియజేశారు. నితీష్‌కుమార్ మాట్లాడుతూ..”గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించాను.. సీఎం పదవికి రాజీనామా చేశాను.. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తాం.. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవు.. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చా.. ఇండియా కూటమి బలహీనపడింది.” అని నితీష్ అన్నారు. గత మూడు, నాలుగు రోజులుగా బీహార్ ప్రభుత్వంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం వచ్చిదంటూ వార్తలు షికార్లు చేశాయి. కానీ నితీష్‌కుమార్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి పొలిటికల్ సస్పెన్స్‌కు తెరలేపుతూ మహాకూటమి నుంచి నితీష్ బయటకు వచ్చేశారు. మరోసారి బీజేపీతో కలిసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. పట్నాలో ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఏం చూసిస్తే అలా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే జేపీ నడ్డాతో సహా పలువురు బీజేపీ ముఖ్యనేతలు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3 గంటలకు బీహార్‌కు చేరుకోనున్నారు. అనంతరం నితీష్‌కుమార్‌తో సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో ఏడోసారి ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నితీష్‌తో బీజేపీకి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. కనీస మెజార్టీకి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ప్రస్తుతం ఆర్జేడీకి 79, బీజేపీకి 78కి, జేడీయూకి 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16, హెచ్‌ఏఎం(ఎస్)కు నలుగురు, ఎంఐఎంకు ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్షాలు ఆర్జేడీతో కలిసే ఉన్నాయి. ఈ మూడు పార్టీల బలం 114 మంది ఉన్నారు. మెజార్టీకి మరో 8 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. జేడీయూ-బీజేపీకి మాత్రమే 123 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే బలం ఉంది.
*ఇక రాజకీయాలకు దూరం.. ఎంపీ గల్లా జయదేవ్ సంచలన నిర్ణయం
తన రాజకీయ విరామంపై ఎంపీ గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చారు. గుంటూరులో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సభ నిర్వహించారు ఎంపీ గల్లా జయదేవ్. తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఎంపీగా రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చివరి మూడు సంవత్సరాలుగా తాను క్షేత్ర స్థాయిలో అందుబాటులో లేనని.. కానీ పార్లమెంట్‌లో గుంటూరు ప్రజలకు ఏం చేయాలో అవి చేస్తూనే ఉన్నానని ఆయన అన్నారు. తాత రాజగోపాల్ నాయుడు వారసత్వంగా ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో కొన్ని వ్యవస్థలు ఫుల్ టైం, కొన్ని వ్యవస్థలు పార్ట్ టైం పని చేస్తాయన్నారు. పార్లమెంట్‌లో కేవలం 24 శాతమే పూర్తి స్థాయిలో పని చేసే పార్లమెంట్ సభ్యులు ఉన్నారని.. మిగిలిన వారు ఏదో ఒక రంగంలో కొనసాగుతూ రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. బిజినెస్‌మెన్‌గా తనకు ఉన్న నాలెడ్జ్ ప్రజల కోసం ఉపయోగించాలని అనుకున్నానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజకీయాల్లోకి వచ్చానన్న గల్లా.. రాజకీయ ప్రస్థానం ప్రారంభించడానికి చంద్రబాబును నాయకుడిగా ఎంచుకున్నానన్నారు. తన ప్రస్థానం గుంటూరు నుంచి ప్రారంభించానని.. తన కుటుంబానికి గుంటూరుకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. రాజకీయాలు చేసినంత కాలం గ్రూపు వివాదాలకు దూరంగా ఉన్నానని.. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఇచ్చానని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. పదేళ్ల నుండి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నామని.. కానీ ప్రయోజనం లేదన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి అవడానికి తన వంతు కృషి చేశానన్నారు. మన తోటి రాష్ట్రాల రాజధానులు సమాన దూరం ఉండేలా విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేశామన్నారు. తాను 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చారు. ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ” క్షేత్ర స్థాయిలో పూర్తి గా అందుబాటులో ఉండటం లేదు. నేను వ్యాపార వేత్తగా రాజకీయ నాయకుడిగా ఉండి ఖాళీగా కూర్చో లేను. పోరాటం చేయకుండా నేను ఉండలేను. కానీ నా వ్యాపారాలు దాని మీద ఆధారపడ్డ వాళ్ళని కూడా నేను చూసుకోవాలి. నా కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. అందుకే రాజకీయ విరామం తీసుకుంటున్నాను. అమరావతి ఉద్యమంలో నన్ను కొట్టినా, నా వ్యాపారాలు దెబ్బ తీయాలని చూసినా నేను భయపడలేదు. ప్రజల కోసం పోరాటం చేశాను. ఒక వ్యాపారం చేయాలంటే డెబ్బైకి పైగా అనుమతులు కావాలి. ఆ శాఖలు అన్ని అవన్నీ ప్రభుత్వాల దగ్గర ఉన్న ఆయుధాలు అని నా అభిప్రాయం. వ్యాపారుల మీద ప్రభుత్వాలు కక్ష కట్ట కూడదు. 24 శాతం మంది వ్యాపారులు రాజకీయ వేత్తలుగా ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యాపారులపై కక్ష గడితే ఎలా. దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. రాజకీయాలు మా తాతల కాలం నుండి ఇలాగే ఉన్నాయి. అలాంటి రాజకీయాలు మారాలని కోరుకుంటున్నా.” అని ఎంపీ జయదేవ్ అన్నారు.
*తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న చలి.. ఐఎండీ వెల్లడి
ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు అల్పపీడన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రేపు తెలంగాణ రాష్ట్రం, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 20 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కి.మీ వేగంతో ఆగ్నేయ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20.2 డిగ్రీలు. గాలి తేమ 84 శాతంగా నమోదైంది. ఇక.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పై చలి పంజా విసురుతుంది. సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడ్డాయి. కొమురం భీం జిల్లాలోని సిర్పూర్ యూ లో 8.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదిలాబాద్ జిల్లాలోని అర్లీటీలో 8.9కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నిర్మల్ జిల్లాలోని పెంబి లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా నిల్వాయిలో 11.4 ఉష్ణోగ్రతలు నమోదైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో జోన్‌లో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు కురుస్తుందని చెబుతున్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రలోనూ పొడి వాతావరణం ఉంటుంది. రాయలసీమలో కూడా పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
*సార్ మీకు సలామ్.. మాటకోసం సొంతింటినే కూల్చేసిన బీజేపీ ఎమ్మెల్యే
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కామారెడ్డి పట్టణంలో రోడ్డు వెడల్పు చేసేందుకు సొంత ఇంటిని కూల్చివేసుకున్నారు. మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో శనివారం ఉదయం ఇంటిని కూల్చివేశారు. అయితే ఇప్పుడు నగరవాసుల దృష్టి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీపై పడింది. ఈ రోడ్డుపైనే ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇల్లు ఉంది. దీనిపై షబ్బీర్ అలీ ఎలా స్పందిస్తారోనని కామారెడ్డి పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న సొంత ఇంటిని కూల్చివేసి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట నిలబెట్టుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఇళ్లు కూల్చివేసేందుకు రోడ్డు పక్కన ఉన్న ఇళ్ల యజమానులు సహకరించాలని కోరారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు 80 అడుగుల రోడ్డు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం 30 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయిలు, షెడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల తొలగింపు తన ఇంటి నుంచే ప్రారంభించాలని, దారిలో ఉన్న తన ఇంటిని కూల్చివేసి అధికారులకు అప్పగించారు. శనివారం ఉదయం ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జేసీబీతో దగ్గరుండి ఇంటిని కూల్చివేశారు. పంచముఖి హనుమాన్ దేవాలయం కూడా ఇదే దారిలో ఉన్నందున ఆలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. వారం రోజుల్లోగా రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్లను స్వచ్ఛందంగా తొలగించి అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అదనంగా మరో 24 అడుగుల రోడ్డును నెల రోజుల్లోగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేసిన పనికి సార్ మీకు సలామ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
*మూడురోజులే గడువు.. పెండింగ్ చలాన్లు కట్టని వారు కట్టేయండి బాబు..
పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ గడువును తెలంగాణ పోలీసులు ఇప్పటికే పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు ఆఫర్ గతేడాది డిసెంబర్ 27 నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఇంకా చాలా చలాన్లు చెల్లించాల్సి ఉండడంతో డిస్కౌంట్ ఆఫర్ ను జనవరి 31 వరకు పొడిగించారు.అయితే.. మరో నాలుగు రోజుల్లో ఈ గడువు ముగియనుండడంతో.. వాహనదారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఈ డిస్కౌంట్ ఆఫర్ గడువు పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని పోలీసులు స్పష్టం చేశారు. జనవరి 31 వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని.. ఆ తర్వాత పూర్తి చెల్లింపులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చలాన్లు పెండింగ్‌లో ఉన్నవారు వెంటనే చెల్లించి డిస్కౌంట్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక.. పెండింగ్ లో ఉన్న చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు 1,52,47,864 మంది చలాన్లు చెల్లించారు. అయితే ఇది మొత్తం 42.38 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాగా, ఇప్పటివరకు చెల్లించిన చలాన్ల ద్వారా రూ.135 కోట్ల ఆదాయం సమకూరినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో 34 కోట్లు, సైబరాబాద్‌లో 25 కోట్లు, రాచకొండలో 16 కోట్లు కాగా.. అయితే వాహనదారుల నుంచి పెండింగ్‌లో ఉన్న చలాన్లను వసూలు చేసేందుకు పోలీసులు ఈ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించారు. గతంలో ప్రకటించినప్పుడు.. వాహనదారుల స్పందన చూసి.. ఈసారి మళ్లీ అదే అవకాశం కల్పించారు పోలీసులు. ఇందుకోసం.. గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. డిసెంబర్ 25 వరకు పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను 15 రోజుల ముందుగానే రాయితీ ద్వారా చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అయితే.. సింబాలిక్ కారణాలు, ఇతరత్రా కారణాల వల్ల.. చాలా వరకు చలాన్లు వసూలు కాలేదు. దీంతో ఈ ఆఫర్ గడువును జనవరి 31 వరకు పొడిగించారు.అయితే చాలా చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో మళ్లీ పెంచే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీసులు వీటిపై క్లారిటీ ఇచ్చారు. ఇక.. డిస్కౌంట్ ఆఫర్ గడువును పొడిగించే అవకాశం లేదని.. జనవరి 31 చివరి తేదీ.. అని చెప్పారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించని వారు చెల్లించాలని సూచించారు.
*సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమిదేనా?
దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన తర్వాత బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అనంతరం రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో బీజేపీ నేతలతో నితీష్‌కుమార్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడం.. వారితో కలిసి నవ్వులు చిందించడంతో అప్పుడే సంకీర్ణ ప్రభుత్వానికి బీటలు వారుతున్నాయని సంకేతాలు వెళ్లాయి. అనుకున్నట్టుగానే మహాకూటమి నుంచి నితీశ్ బయటకు వచ్చేశారు. వారం రోజులుగా కొనసాగుతున్న పొలిటికల్ డ్రామాకు ఆదివారంతో తెరపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో బీజేపీతో జేడీయూ జతకలిసింది. నితీష్‌కుమార్ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం బీజేపీ నుంచి నితీష్ బయటకు వచ్చేసి ఆర్జేడీతో జతకట్టారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్), సీపీఐ, సీపీఐ(ఎం), హెచ్‌ఏఎం అనే ఏడు పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. అప్పుడు కూడా నితీష్‌కుమారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కి డిప్యూటీ సీఎంతో పాటు పలువురికి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ మొదట నుంచీ ఆర్జేడీతో సరైన సఖ్యత లేదు. ప్రభుత్వంలో ఆర్జేడీ మితిమీరిన జోక్యం ఎక్కువ కావడంతో నితీష్ విసిగిపోయినట్లుగా తెలుస్తోంది. నితీష్‌ను సంప్రదించకుండానే తేజస్వీ యాదవ్ పలు నిర్ణయాలు తీసేసుకోవడం నితీష్‌కు ఏ మాత్రం నచ్చలేదని సమాచారం. ఈ పరిణామాలతో ఆయన మహాకూటమి నుంచి బయటకే వచ్చేందుకు సమయం కోసం ఎదురుచూసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇండియా కూటమి ఏర్పడడానికి నితీష్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయా రాజకీయ పార్టీలను సమన్వయం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. కానీ అనంతరం జరిగిన పరిణామాలు ఆయనకు రుచించినట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇండియా కూటమి అధ్యక్షుడిగా నితీష్‌ను కాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ఎంచుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోయారని సమాచారం. పైగా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్.. నితీష్‌ను కాకుండా ఖర్గేకు మద్దతు తెల్పడంతో అప్పట్నుంచీ ఆయన మనస్తాపం చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమిలో తనకు ప్రాధాన్యత లేనప్పుడు.. అందులో ఉండడం ఉపయోగలేదనే నితీష్ బయటకు వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సోనియాగాంధీ, మల్లిఖార్జన ఖర్గే పలుమార్లు ఫోన్ చేసినా నితీష్ కనీసం స్పందించలేదంటే పరిస్థితులు ఎంతవరకు వెళ్లాయో చెప్పకనే చెప్పొచ్చని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. తాజాగా జేడీయూ కూడా నిష్క్రమించింది. మరీ ఇండియా కూటమి పరిస్థితి భవిష్యత్‌లో ఎలా ఉంటుందో వేచి చూడాలి.
*ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్.. 10 లక్షల మందికి ఉద్యోగాలు
ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉపాధి కల్పించే పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఈసారి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టదు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా సామాన్య ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను ప్రభుత్వం ప్రారంభించవచ్చు. ఉపాధి విషయానికి వస్తే ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వావలంబన భారత ఉపాధి పథకంపై ఆధారపడి ఉంటుంది. స్వావలంబన భారత ఉపాధి పథకాన్ని ప్రోత్సహించడానికి, లాక్డౌన్ సమయంలో ఉద్యోగాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, ఉద్యోగులకు EPFO (ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ద్వారా 24శాతం జీతం సబ్సిడీ అందించబడుతుంది. రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం. ఈ పథకం కోసం ప్రభుత్వం దాదాపు రూ.6000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. దీని కింద ఇప్పటివరకు 5 లక్షలకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఈ కంపెనీల ద్వారా ఉద్యోగులకు దాదాపు 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్ తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు ఈ పథకం ప్రయత్నిస్తోంది. సహజంగానే, స్వావలంబన భారతదేశం ప్రచారంతో పాటు, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
*రాముడి ప్రాణప్రతిష్ట కోట్లాది మందిని కట్టిపడేసింది.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ఈ ఏడాది తొలిసారిగా దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం మనమందరం 75వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఈ ఏడాది మన రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. దాంతో పాటు సుప్రీంకోర్టు ఏర్పడి 75ఏళ్లు అయింది. 2024 మొదటి మన్ కీ బాత్ కార్యక్రమంలో.. రామ మందిరంలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. ‘అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం కోట్లాది మంది దేశ ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చింది. అందరి భావాలు ఒక్కటే, అందరి భక్తి ఒక్కటే, అందరి మాటల్లో రాముడు… దేశంలోని ఎందరో రామభజనలు పాడి శ్రీరాముని పాదాల చెంత అర్పించారు. జనవరి 22 సాయంత్రం దేశం మొత్తం రామజ్యోతి వెలిగించి దీపావళిని జరుపుకుంది. ఈసారి జనవరి 26న జరిగిన కవాతు చాలా అద్భుతంగా సాగింది. అయితే పరేడ్‌లో మహిళా శక్తిని చూడడమే ఎక్కువగా చర్చనీయాంశమైందని ప్రధాని మోడీ అన్నారు. సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఢిల్లీ పోలీసుల మహిళా కంటెంజెంట్లు విధి మార్గంలో కవాతు ప్రారంభించినప్పుడు, ప్రతి ఒక్కరూ గర్వంతో నిండిపోయారు. ఈసారి 13 మంది మహిళా అథ్లెట్లకు అర్జున అవార్డు లభించింది. ఈ మహిళా అథ్లెట్లు ఎన్నో పెద్ద టోర్నమెంట్లలో పాల్గొని భారతదేశ పతాకాన్ని ఎగురవేశారు. దేశంలోని మహిళలు ప్రతి రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం, దేశం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో అట్టడుగు వర్గాలతో మమేకమై సమాజంలో పెద్ద మార్పులు తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తులకు పద్మ గౌరవాలు ఇస్తున్నారు. ఈ వ్యక్తులు మీడియాకు దూరంగా సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నారు. పద్మ అవార్డు ప్రకటించిన తర్వాత ఇలాంటి వారిపై సర్వత్రా చర్చ జరగడం సంతోషకరమని మోడీ అన్నారు. ప్రధాని మాట్లాడుతూ, ‘ఈసారి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హేమ్‌చంద్ మాంఝీ కూడా పద్మ అవార్డును అందుకున్నారు. వైద్యరాజ్ హేమ్‌చంద్ మాంఝీ కూడా ఆయుష్ సిస్టం ఆఫ్ మెడిసిన్ సహాయంతో ప్రజలకు చికిత్స చేస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో 5 దశాబ్దాలకు పైగా పేద రోగులకు సేవలందిస్తున్నారు. కాగా, శ్రీమతి యానుంగ్ అరుణాచల్ ప్రదేశ్ నివాసి, మూలికా ఔషధ నిపుణురాలు. ఆది గిరిజనుల సంప్రదాయ వైద్య విధానాన్ని పునరుద్ధరించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఈ కృషికి గానూ ఈసారి ఆయనకు పద్మ అవార్డు కూడా లభించింది.
*రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే!
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 102.1 ఓవర్లలో 420 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్ ఒలీ పోప్ త్రుటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 196 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రివర్స్ స్వీప్ ఆడి.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. టీమిండియా 231 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్ 246, భారత్ 436కి ఆలౌటైన సంగతి తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోర్ 148తో క్రీజులోకి వచ్చిన ఒలీ పోప్ నాలుగో రోజూ జోరు కనబరిచాడు. ఆట ఆరంభంలోనే రివర్స్ స్వీప్ షాట్లతో అలరించాడు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్కోర్ 400 దాటించాడు. టామ్ హార్ట్‌లీ (34)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులు జోడించి.. ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 200 దాటించాడు. అయితే హార్ట్‌లీను ఆర్ అశ్విన్ బౌల్డ్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మార్క్ వుడ్‌ను జడేజా ఔట్ చేశాడు. ఆపై పోప్ డబుల్ సెంచరీ కలను బుమ్రా చిదిమేశాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు, అశ్విన్ మూడు, జడేజా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (70) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. జడేజా (87), రాహుల్ (86), జైస్వాల్ (80) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ 4 వికెట్స్ పడగొట్టాడు. లంచ్ బ్రేక్ అనంతరం భారత్ లక్ష్య దేదనకు దిగుతుంది.
