NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

వైసీపీ నాల్గో జాబితా.. ఉమ్మడి తూర్పు గోదావరిలో రెండు చోట్ల అభ్యర్థుల మార్పు
నాలుగో జాబితాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు, గోపాలపురం అభ్యర్థులను మార్చింది వైసీపీ అధిష్టానం .. కొవ్వూరు మంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వనితను గోపాలపురానికి, గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న తలారి వెంకట్రావు కొవ్వూరుకు మార్చింది. 2009లో టీడీపీ నుంచి గోపాలపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాత కాలంలో వైసీపీలో చేరి కొవ్వూరు నుంచి పోటీ చేశారు. 2014లో కొవ్వూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన తానేటి వనిత.. 2019 ఎన్నికల్లో  విజయం సాధించారు. అప్పటి నుంచి మంత్రిగా ఉన్న ఆమె మరోసారి పోటీకి సిద్ధమవుతున్నా అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు కనిపించలేదు. వర్గ పోరు కామన్ గా ఉండే నియోజకవర్గం కావడంతో ప్రతి చిన్న విషయం అక్కడ చిలికిచిలికి గాలివానగా మారుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి వనితను కొవ్వూరు నుంచి గోపాలపురానికి మార్చారు. గతంలో గోపాలపురం నియోజకవర్గంలో పనిచేసిన అనుభవం ఉండడంతో ఈసారి ఎన్నికల్లో వనితకు గోపాలపురం నుంచి పోటీ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని టార్గెట్ తో వైసీపీ కనిపిస్తుంది.

యార్లగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు.. జూ.ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు.. సీఎం జగన్ ఒక హీరో..!
రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. ఓ వైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తుతూ.. ఫ్లెక్సీ వివాదంపై ఘాటుగా స్పందించిన ఆయన.. మరోవైపు.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ప్రశంసల వర్షం కురిపించారు.. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు.. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుందన్నారు యార్లగడ్డ.. తారక్ ప్లెక్సీలు తొలగిస్తే తారక్‌కి వచ్చిన నష్టం ఏమీలేదన్న ఆయన.. తారక్ పై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టం అని హెచ్చరించారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్‌ను అతడి తల్లి జిజియా బాయిలా పెంచారంటూ ప్రశంసలు కురిపించారు. విజయవాడలో ఈ రోజు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవంపై స్పందించిన యార్లగడ్డ.. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ మంచి నిర్ణయం అన్నారు. అంబేడ్కర్ దేశానికి ఒక ఐకాన్ అని గుర్తు చేశారు. మరోవైపు, సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రశంసలు కురిపించారు.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం అని వెల్లడించారు. జగన్ పై పిచ్చి కేసులు పెట్టారు.. లక్ష కోట్లు అవినీతిని అని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్ ఒక హీరో.. నేను మంచి చేస్తేనే ఓటు వేయండని అని ధైర్యంగా చెప్పిన నేత.. అలాంటి నేత దేశంలో మరొకరు లేరని స్పష్టం చేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌.

మా అన్నకు సీటు ఇవ్వొద్దు..! సీఎం జగన్‌కు ఎమ్మెల్యే నల్లపరెడ్డి సోదరుడి ఫిర్యాదు.. ఆడియో వైరల్‌..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేల సీట్ల మార్పు వ్యవహారం ఆసక్తికరంగా సాగుతోన్న సమయంలో.. సోషల్‌ మీడియాలో హల్‌ చల్ చేస్తోన్న ఓ ఆడియో ఇప్పుడు చర్చగా మారింది.. నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డిపై ఆయన సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో నా సోదరుడు ప్రసన్నకుమార్ రెడ్డికి సీటు ఇవ్వొద్దు అంటూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి రాజేంద్రకుమార్‌ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో కోవూరులో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. వైరల్‌గా మారిన ఆ ఆడియోలో తన సోదరుడు, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ధ్వజమెత్తారు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడిని మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని మండలాలను.. నాయకులకు పంచి పెట్టారు.. అక్కడ అంతా ఆ నాయకులదే హవా.. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్.. ప్రజలకు మధ్య అడ్డుగోడలా వీరు నిలిచారని ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వెంకటరమంయ్య అనే వ్యక్తి సర్వం తానై వ్యవహరిస్తున్నారు.. నాతో పాటు, మా కుటుంబ సభ్యులను కూడా దూరం పెట్టారని విమర్శించారు. మాకంటే వెంకట రమణయ్యకే ప్రాధాన్యం ఇస్తున్నారు.. ప్రసన్న అన్న చేసిన తప్పిదాల వల్లే 2004.. 2014 ఎన్నికల్లో ఓడిపోయారని తెలిపారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినా వారిని పట్టించుకోవడంలేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని విషయాలు గమనించాలి.. నా సోదరుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మరోసారి సీటు ఇవ్వద్దని ఆ ఆడియోలో విజ్ఞప్తి చేశారు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి.

ముద్రగడను అక్కడి నుంచి బరిలోకి దింపాలి..! జనసేనకు టీడీపీ ప్రతిపాదనలు..!
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.. ఇదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చేశారు. అయతే, ఎన్నికల పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ-జనసేన.. సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి.. రెండు పార్టీల అధినేతలు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ముద్రగడ పద్మనాభం ఇంకా జనసేనలో చేరకముందే.. ఆయనను ఏ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఇరు పార్టీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. కాకినాడ సిటీ నుంచి ముద్రగడను పోటీ చేయించాలని జనసేనకి సూచించాలని కాకినాడ జిల్లా టీడీపీ నేతలు ఆలోచనలో ఉన్నారట. కాకినాడ నుంచి వైసీపీ నుంచి బరిలోకి దిగే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిని ఓడించాలంటే ముద్రగడ పద్మనాభమే సరైన ప్రత్యర్థి అని జిల్లా టీడీపీ నేతల అభిప్రాయంగా ఉందని తెలుస్తోంది. నియోజకవర్గంలో కాపు, ఫిషర్మెన్ ఓట్లు అధికంగా ఉన్నరాయి.. ప్రస్తుతం మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వనమాడి కొండబాబు టీడీపీ కో-ఆర్డినేటర్‌గా ఉన్నారు. మరోవైపు.. ముద్రగడ, ద్వారంపూడి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి.. ఈ ప్రతిపాదను ముద్రగడ ముందు పెడితే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు.. త్వరలోనే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెళ్లలనున్నారు.. ముద్రగడను జనసేన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అయితే, పవన్ కల్యాణ్‌ వచ్చినప్పుడే.. టీడీపీ-జనసేన కూటమి తరుపున కాకినాడ సిటీ నుంచి ముద్రగడ పోటీ చేసే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

అయోధ్య రాములోరికి హైదరాబాద్ నుంచి ముత్యాల హారం..
అయోధ్యలో ఈ నెల22న రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అద్భుతమైన తరుణం రానే వచ్చింది. ప్రాణప్రిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు. ప్రజలంతా ఇప్పటికే రామ నామంలో మునిగి తేలుతున్నారు. రామమందిర ప్రారంభోత్సవంలో దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దమైంది. అయితే.. దేశవ్యాప్తంగా స్వామివారికి పెద్ద ఎత్తున కానుకలు వస్తున్నాయి. ఇక అయోధ్య రాముడికి ప్రవళ జువెలర్స్ అండ్ జేమ్స్ వారు హైదరాబాద్ నుంచి మూడు కిలోల 600 గ్రాముల ముత్యాలు హారం వెల్లనుంది. తొమ్మిది మంది కళాకారులతో తొమ్మిది రోజుల్లో తయారు చేశారు. ముంబై నుంచి తెప్పించిన ముత్యాలతో తయారీ చేశారు. మూడు కిలోల 600 గ్రాముల ముత్యాలు, అరకిలో పచ్చల మణులతో హారం ప్రవళ జువెలర్స్ అండ్ జేమ్స్ తయారు చేశారు. ఈముత్యాల హారం ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే.. ఏపీలోని తిరుపతి నుంచి లక్ష లడ్డూలు పంపిస్తుండగా, తెలంగాణకు చెందిన అయోధ్య రాములోరికి బంగారు చీరను కానుకగా పంపుతున్నారు. ఎన్నో అద్భుత కళాఖండాలను తన చేతుల మీదుగా ఆవిష్కరించిన సిరిసిల్ల నేత వెల్ది హరిప్రసాద్ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను రాముడికి కానుకగా పంపుతున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయనున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నేతన్న హరిప్రసాద్ నివాసానికి వెళ్లి బంగారు చీరను పరిశీలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిరిసిల్లలో అద్భుతమైన చేనేత కళాకారులు ఉన్నారని.. అగ్గిపెట్టెల్లో పట్టుచీరలు తయారు చేసిన చరిత్ర సిరిసిల్ల జిల్లాకు ఉందని గుర్తు చేశారు. ఇంత గొప్ప నైపుణ్యం ఉన్న చేనేత పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ చీర 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేయబడింది. చేనేత కళాకారుడు హరిప్రసాద్ ఈ చీరను రామాయణ ఇతివృత్తాన్ని వర్ణించే చిత్రాలతో తయారు చేశారు.

రెండు రోజుల్లో టీడీపీలో చేరడంపై క్లారిటీ..! వైసీపీ ఎమ్మెల్యే ప్రకటన
అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు.. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నాల్గో జాబితాలో తిరువూరు ఇంఛార్జిగా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసును నియమించారు.. మీకు సీటు రాదంటూ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రక్షణ నిధికి ముందే సమాచారం ఉండగా.. దాంతో.. ఆయన టీడీపీతో టచ్‌లోకి వెళ్లారనే చర్చ సాగుతూ వచ్చింది.. దానికి అనుగుణంగా ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రక్షణ నిధి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. 6 నెలలుగా నాకు సీటు రాకుండా కుట్రలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎంపీ కేశినేని నాని.. వైసీపీలోకి వచ్చే ముందే తిరువూరు సీటు కండీషన్‌ పెట్టారని.. అందుకే నన్ను తప్పించడానికి రకరకాల సర్వేలు చేయించి చివరికి సీటు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు మంత్రి పదవి ఇస్తామని రాత్రి 12 గంటలకు చెప్పి.. పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు రక్షణ నిధి.. మంత్రి పదవి ఇవ్వక పోయినా.. పార్టీకి నిబద్ధతతో పని చేశాను అన్నారు. అయినా.. తనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందన్నారు. ఇక, పార్టీకి రాజీనామా చేసే అంశంపై క్యాడర్‌తో మాట్లాడి ప్రకటిస్తానని అన్నారు. మరోవైపు.. రెండు రోజుల్లో టీడీపీలో చేరే విషయంపై క్లారిటీ ఇస్తాను అని వెల్లడించారు తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి. కాగా, తిరువూరు నుంచి రెండు సార్లు విజయం సాధించినా.. తనకు టికెట్‌ నిరాకరించడంపై ఎమ్మెల్యే రక్షణ నిధి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. పార్టీలోనే ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి.. సీనియర్‌ నేతలను రక్షణనిధి వద్దకు పంపి.. బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించలేదు.. దీంతో, చివరకు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు.

భారత్‌ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు..
కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేసింది. అయితే, పోలీసులు భారత్‌ జోడో న్యాయ్ యాత్ర రూట్ మ్యాప్ పై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ నుంచి రాహుల్‌ నేతృత్వంలో స్టార్ట్ చేసిన ఈ యాత్ర నిన్న అస్సాంకు చేరుకుంది. ఇక, న్యాయయాత్ర జోర్హాట్‌ పట్టణం చేరుకుంది. ఆ సమయంలో పోలీసులు చూపించిన మార్గంలో కాకుండా నిర్వాహకులు మరోవైపు వెళ్లారని తెలిపారు. ఈ మార్పు పట్టణంలో తీవ్ర అంతరాయాలకు దారి తీసిందని పోలీసులు చెప్పారు. ట్రాఫిక్‌ బారికేడ్లను తొలగించేలా, పోలీసులపై దాడి చేసేలా ప్రజలను నేతలు రెచ్చగొట్టారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దీంతో యాత్ర నిర్వాహకులపై ఈ కేసు నమోదు చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను తప్పబట్టింది. ఇదంతా న్యాయ్ యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాకు ఇరుకైన మార్గం కేటాయించి.. అలాగే, ఆ రూట్ లో రద్దీ ఎక్కువగా ఉండటంతో.. కొద్ది దూరం పక్క మార్గంలో ప్రయాణించామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

రాముడి విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేసిన దిగ్విజయ్ సింగ్
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు మరోసారి రాములోరి విగ్రహంపై కూడా ప్రశ్నలు సంధించారు. గర్భగుడిలో ఏర్పాటు చేసిన విగ్రహానికి సంబంధించి.. అది పాత విగ్రహమని మరోసారి ప్రశ్నించారు. తన అభిప్రాయాన్ని బలపరచడానికి.. అతను జోషిమఠ్‌లోని శంకరాచార్య స్వామి స్వరూపానంద్ జీ మహారాజ్ సహాయం కూడా తీసుకున్నాడు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా.. రెండవ విగ్రహం అవసరం ఏమిటి? ద్వారకా, జోషిమఠానికి చెందిన మా గురువు దివంగత శంకరాచార్య స్వామి స్వరూపానంద్ జీ మహారాజ్ కూడా రామజన్మభూమి ఆలయంలో రాముడి విగ్రహం బాల రాముడి రూపంలో ఉండాలని.. తల్లి కౌసల్య ఒడిలో ఉండాలని సూచించారు. కానీ ప్రతిష్ఠాపన చేస్తున్న విగ్రహం మాత్రం చిన్నపిల్లాడిలా కనిపించడం లేదన్నారు. కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై నిర్వాణి అఖారాకు చెందిన మహంత్ ధర్మదాస్ అభ్యంతరం వ్యక్తం చేసిన పోస్ట్‌తో పాటు దిగ్విజయ్ ఒక వార్తా వీడియోను కూడా పంచుకున్నారు. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చిందో వారిని మాత్రమే గర్భగుడిలో ప్రతిష్ఠించాలని ధర్మదాస్ అన్నారు. అయోధ్య వివాదంలో పక్షపాతిగా ఉన్న ధర్మదాస్ పాత విగ్రహానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. పాత విగ్రహం స్థానంలో మరో విగ్రహాన్ని ఎవరూ ఏర్పాటు చేయకూడాదని అన్నారు. రామనగరి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉన్న గ్రాండ్‌ రామ్‌ టెంపుల్‌ గర్భగుడిలో గురువారం రామలాలా విగ్రహాన్ని దాని పీఠంపై ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ గర్భగుడిలో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల విగ్రహం నలుపు రంగులో ఉండి రెండు టన్నుల బరువు ఉంటుంది. ప్రస్తుతం విగ్రహాన్ని పసుపు గుడ్డతో కప్పి ఉంచారు.

వడ్డీ రేట్లు తగ్గవు.. సామాన్యులకు ఝలక్ ఇచ్చిన ఆర్‌బీఐ గవర్నర్‌
సామాన్యులకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. EMIలు చౌకగా లభిస్తాయని ఆశించే వారి ఆశలను రిజర్వ్ బ్యాంక్ అడియాశలు చేసింది. ప్రస్తుతం ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం లేదు. ప్రస్తుత సంవత్సరంలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఊహాగానాల మధ్య, బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ప్రస్తుతం వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనలో ఆర్బీఐ లేదని చెప్పారు. ద్రవ్యోల్బణం రేటును 4 శాతానికి చేర్చడమే ఆర్‌బిఐ పెద్ద దృష్టి అని ఆయన అన్నారు. శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ‘వడ్డీ రేట్లను తగ్గించడం ప్రస్తుతానికి మా ఎజెండాలో చేర్చబడలేదు. ఇప్పట్లో దీనిపై చర్చ లేదన్నారు. ద్రవ్యోల్బణం రేటును 4 శాతం స్థాయికి తీసుకురావడమే మా అతిపెద్ద లక్ష్యమని చెప్పారు. నాలుగు శాతం ద్రవ్యోల్బణం దిశగా పయనిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. మనం ద్రవ్యోల్బణం రేటు 4 శాతానికి చేర్చుకోకుండా.. వడ్డీ రేట్లను తగ్గించడం గురించి మాట్లాడటం అర్థరహితం.’ అన్నారు.

డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా.. భారత్‌కు ఇంగ్లండ్ సిరీస్‌ కీలకం!
టెస్టు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఇటీవల పాకిస్థాన్‌పై మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఆసీస్.. తాజాగా అడిలైడ్‌ వేదికగా ముగిసిన మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 పట్టికలో ఆసీస్‌ అగ్రస్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ ఎడిషన్‌ 2023-25లో ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. 6 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రాతో చేసుకుంది. మొత్తం 61.11 శాతం విజయాలతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా వరుస విజయాల కారణంగా భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఈ డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రాతో 54.16 శాతంను భారత్ నమోదు చేసింది. దక్షిణాఫ్రికా (50 శాతం), న్యూజిలాండ్‌ (50 శాతం), బంగ్లాదేశ్‌ (50 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే సీజన్‌ పూర్తయ్యే నాటికి తొలి రెండు స్థానాల్లో నిలవాలి. త్వరలో భారత్‌కు అత్యంత కఠిన సవాల్ ఎదురుకానుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన ఆడనుంది. ఈ సిరీస్‌ను గెలిస్తేనే మళ్లీ అగ్రస్థానానికి చేరుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం పట్టికలో ఇంగ్లీష్ జట్టు 15 శాతంతో ఏడో స్థానంలో ఉంది.

డార్లింగ్ బిజీగా ఉన్నాడు… అనిమల్ పార్క్ తో బ్లాస్ట్ చేస్తా
సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఏ సెంటర్ బీ సెంటర్ అనే తేడా లేదు… నార్త్ సౌత్ అనే బేధం లేదు… ఆల్ సెంటర్స్ లో అనిమల్ మూవీ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టి ఓవరాల్ గా థియేటర్స్ లో 900 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఒక ఏ రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా, ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం ఇదే మొదటిసారి. అనిమల్ సినిమా హిట్ అవుతుంది అని అందరూ నమ్మారు కానీ మరీ ఈ స్థాయి హిట్ అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చిన అనిమల్ సినిమాకి సీక్వెల్ గా “అనిమల్ పార్క్” అనౌన్స్ అయ్యింది. ప్రభాస్ తో స్పిరిట్, అల్లు అర్జున్ తో మూవీ చేసిన తర్వాత అనిమల్ పార్క్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ ఊహించని దాని కన్నా ముందే అనిమల్ పార్క్ సెట్స్ పైకితీసుకోని వెళ్లేలా సందీప్ ప్లాన్ చేస్తున్నాడట. అయాన్ ముఖర్జీ వార్ 2 తెరకెక్కించే పనిలో ఉన్నాడు కాబట్టి రణబీర్ తో బ్రహ్మాస్త్ర 2కి టైమ్ పడుతుంది. ప్రభాస్ కల్కి, ది రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ నుంచి ప్రభాస్ ఫ్రీ అవ్వడానికి టైమ్ పడుతుంది. ఈ గ్యాప్ లో సలార్ 2 కూడా త్వరగానే స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి సలార్ 2 స్టార్ట్ అయితే స్పిరిట్ మరింత డిలే అవ్వడం గ్యారెంటీ. సో ఈ గ్యాప్ ని వాడుకుంటూ అనిమల్ పార్క్ సినిమాని కంప్లీట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ రెడీ అవుతున్నాడు. అనిమల్ పార్క్ సినిమాతో ఐ విల్ హ్యావ్ ఏ బ్లాస్ట్ అంటూ సందీప్ రెడ్డి వంగ ఇటీవలే ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వింటే అణిమపి పార్క్ ఎంత వైల్డ్ గా ఉండబోతుందో ఊహించొచ్చు. అనిమల్ పార్క్ ఎప్పుడు కంప్లీట్ అయ్యి రిలీజైనా కూడా ఇండియన్ బాక్సాఫీస్ ఇప్పటివరకూ చూడనంత మోస్ట్ ఎరప్షన్ ని చూడబోతుంది. “ఇస్తాంబుల్ లో ఉండే అనిమల్ కి, ఢిల్లీ రన్ విజయ్ సింగ్ కి మధ్య వార్” వయొలెన్స్ అనే పదానికే కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.

గురూజీకి ఈ హీరో కలిస్తే ఇంపాక్ట్ మాములుగా ఉండదు…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని ఫేస్ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత గురూజీపైన విమర్శలు రావడం ఇదే మొదటిసారి. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో త్రివిక్రమ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసాడు కానీ ఈసారి మాత్రం మహేష్ ఒక్కడే గుంటూరు కారం సినిమా వెయిట్ ని మోయాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇప్పటికే అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసాడు త్రివిక్రమ్. ఇప్పటికే మూడు సినిమాలు చేసి హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ నాలుగోసారి ఎలాంటి సినిమాతో వస్తారో అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపు త్రివిక్రమ్ ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ అల్లు అర్జున్ సినిమా కన్నా ముందు త్రివిక్రమ్ మాస్ మహారాజ రవితేజతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన తెరకెక్కనున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఫైనల్ అయ్యిందని సమాచారం. త్రివిక్రమ్ డైలాగ్స్ కి రవితేజ డైలాగ్ డెలివరీ తోడైతే స్క్రీన్ పైన మ్యాజిక్ చూడడం గ్యారెంటీ. సినిమాలో డైలాగ్స్ పర్ఫెక్ట్ గా పేలుతాయి కాబట్టి రవితేజ-త్రివిక్రమ్ కాంబినేషన్ చూడడానికి బాగుంటుంది. రవితేజ త్వరగా సినిమాలు చేసేస్తాడు కాబట్టి ఈ మూవీ కూడా స్టార్ట్ చేస్తే ఫాస్ట్ గానే కంప్లీట్ అవ్వడం గ్యారెంటీ. అయితే ఈ కలయిక అసలు నిజమా? ఒకవేళ నిజమైతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ అవుతుంది అనేది చూడాలి.