Site icon NTV Telugu

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

డిప్యూటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు.. నాకు టికెట్‌ రాకపోతే పనిచేయను..!
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పుల వ్యవహారం కొందరు నేతలకు మింగుడుపడడం లేదు.. ఉన్నట్టుండి స్థానం మారిస్తే ఎలా? అనేవాళ్లు కొందరైతే.. తనను పక్కనబెట్టి మరో వ్యక్తికి టికెట్‌ ఇస్తే ఊరుకునేది లేదనేవాళ్లు ఇంకా కొందరు.. ఇక, ఏదేమైనా అధినేత ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామనేవాళ్లు మరికొందరు.. ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. నాకు టికెట్ రాకపోతే ఆత్మ అభిమానాన్ని చంపుకొని జ్ఞానేందర్ రెడ్డితో కలిసి పనిచేసేది లేదని తేల్చేశారు. నాకు ఏమీ ఆస్తులు, అంతస్తుల లేవు కాపాడుకోవడానికి.. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ.. మండలనేతల సమావేశంలో నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇక, నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకపోతే మాకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పని లేదంటున్నారు స్థానిక నేతలు, నారాయణస్వామి అభిమానులు.. మా నేతకు టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని మరికొందరు నేతలు అంటున్నారు.

22న సెలవు ప్రకటించాలి.. పురంధేశ్వరి డిమాండ్‌
ప్రతి ఊరిలోనూ ఇప్పుడు రాముడి ఫీవర్, ఎక్కడ చూసినా రామనామ జపమే. తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం పది రోజులుగా రామాలయాలన్నీ రామ నామంతో హోరెత్తిపోతున్నాయి.. రామ భజనలు చేయడం, భక్తులకు భోజనాలు పెట్టడం, అక్షింతలు సేకరించడం ఇలా ఊరు ఊరునా రాముడి గురించే చర్చ జరుగుతోంది. అయితే, అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట రోజు ఆంధ్రప్రదేశ్‌లో సెలవుగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు బీజేపీ నేతలు.. సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దీంతో.. రాష్ట్రంలో ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.. అయితే, ఏపీలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారు.. 22వ తేదీన దేశం మొత్తం చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు సెలవు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆ రోజు సెలవు ప్రకటించలేదని దుయ్యబట్టారు బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి..రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటమని పేర్కొన్న పురంధేశ్వరి.. ఈ నెల 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతున్నారు. 21వ తేదీ వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక దురుద్దేశం ఉందని అర్థం అవుతుందని విమర్శించారు. 22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదన్న ఆమె.. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయని గుర్తుచేశారు.

తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు అధికారంలోకి రారు.. కేశినేని ఘాటు వ్యాఖ్యలు
తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు అధికారంలోకి రారు అంటూ జోస్యం చెప్పారు విజయవాడ ఎంపీ కేశినేని నాని.. కేశినేని భవన్ లో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. దేశచరిత్రలో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని గుర్తుచేశారు. ఈ దేశంలో ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు మరెవరూ తీసుకురాలేదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎన్టీఆర్.. ఆయన తర్వాత పేదల కోసం పాటుపడిన వ్యక్తి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మాత్రమే అన్నారు. ఇక, ఎన్టీఆర్, వైఎస్సార్ బాటలో నడుస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి.. వారిద్దరికంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నారని ప్రశంసలు కురిపించారు ఎంపీ కేశినేని నాని.. మరోవైపు.. చంద్రబాబును ఎవరూ పట్టించుకోరు.. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు అధికారంలోకి రాడు అంటూ వ్యాఖ్యానించారు. 2014లో గెలిచాక చంద్రబాబు ఏవో అద్భుతాలు చేస్తాడని మేం భావించాం.. కానీ, కేవలం తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్నదే చంద్రబాబు ఆలోచనగా ఉందని దుయ్యబట్టారు.

వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు..
వెయ్యి మంది బాలయ్యలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి.. అయితే, ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది.. ఇదే నందమూరి ఫ్యామిలీలో ఉన్న వివాదాలకు ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. ఈ రోజు ఉదయమే జూనియర్‌ ఎన్టీఆర్‌ వెళ్లి ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించగా.. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు.. అయితే, అక్కడ ఎన్టీఆర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయ్‌.. ఇప్పుడే అంటూ బాలయ్య ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్న ఓ వీడియో వైరల్‌గా మారింది.. ఆ వెంటనే జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించడం చర్చగా మారింది. దీనిపై సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు కొడాల నాని.. బాలయ్య లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని వార్నింగ్‌ ఇచ్చారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన కొడాలి నాని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మానసిక వేదనతో చనిపోయారు. ఎన్టీఆర్ పనికి రాడన్న గజ దొంగ చంద్రబాబు అని.. ఆ చంద్రబాబే ఇప్పుడు ఎన్టీఆర్ బూట్లు నాకుతున్నారని దుయ్యబట్టారు. చంపిన వ్యక్తులే ఎన్టీఆర్‌ను పొగుడుతూ.. కీర్తిస్తున్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రా కదిలి రా అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతుందని సెటైర్లు వేశారు. అల్లుడి నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. గతంలో పెద్ద ఎన్టీఆర్‌ను దించిన బాలయ్య.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని ఎద్దేవా చేశారు.. అంతే కాదు.. వెయ్యి మంది బాలకృష్ణలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా.. జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయిన వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.

పనికి రాని వాళ్లనే సీఎం పక్కన పెట్టారు.. ప్రతిసారీ అదే నేతలకు టిక్కెట్లివ్వాలా..?
అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పులు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.. ఇప్పటికే మూడు లిస్ట్‌లు విడుదల కాగా.. నాలుగో లిస్ట్‌పై కసరత్తు చేస్తోంది వైసీపీ అధిష్టానం.. అయితే, ఈ సారి సీటు దక్కదు అని సమాచారం అందిన కొందరు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. అయితే, ఈ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. పనికి రాని వాళ్లనే సీఎం వైఎస్‌ జగన్ పక్కన పెట్టాడన్న ఆయన.. వైఎస్‌ జగన్ ఎవరినైతే పక్కన పెట్టారో.. వాళ్లే టీడీపీకి వెళ్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిసారీ అదే నేతలకు టిక్కెట్లివ్వాలా..? అని ఎదురుప్రశ్నించారు. పార్థసారథిని సీఎం వైఎస్‌ జగన్ పక్కన పెట్టారు.. మేమేళ్లి పార్టీలో ఉండమని కోరాం. ఇన్నాళ్లూ కలిసి పని చేశాం.. ఇప్పుడెందుకు పార్టీని వీడడమని అడిగాం అని తెలిపారు కొడాలి నాని.. ఇక, మార్పులు, చేర్పులు పార్టీ అధినేత ఇష్టమన్న ఆయన.. టీడీపీలో మాత్రం ఎంత మందిని మార్చలేదు..? అని ప్రశ్నించారు. చంద్రగిరి నుంచి కుప్పానికి చంద్రబాబు వెళ్లలేదా..? మంగళగిరిలో చిన్నప్పటి నుంచి లోకేష్ ఏమైనా గోళీలు ఆడాడా..? గుడివాడలో నా మీద ఇప్పటి వరకు నలుగురు మారారు.. దీనికేం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు. ఇక, ఈ రోజు గుడివాడలో చంద్రబాబు సభపై హాట్‌ కామెంట్లు చేశారు కొడాలి నాని.. గుడివాడలో చంద్రబాబును చూసేవాళ్లు ఎవరున్నారు..?చంద్రబాబు సభకు లక్ష మంది ఎక్కడ నుంచి వస్తారు..? 20 ఎకరాల స్థలంలో పార్కింగ్‌కు పోనూ మిగిలిన స్థలమెంత..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు చంద్రబాబు సభ కోసం 5 వేలకు మించి కుర్చీలేస్తే గుడివాడ వదిలిపోతాను అంటూ సవాల్‌ చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.

జనవరి 22న దేశంలోని అన్ని కోర్టులకు హాలిడే ?
శ్రీరాముడు అయోధ్యకు చేరుకోనుండగా… అందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చారిత్రాత్మక దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. ఇదిలావుండగా, కొత్తగా నిర్మించిన రాముడికి పట్టాభిషేకం జరిగే జనవరి 22న దేశవ్యాప్తంగా అన్ని కోర్టులకు సెలవు ప్రకటించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్‌లాలా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల సెలవులు ప్రకటించారు. పాఠశాలలు మూసివేయబడతాయి. ఆ రోజు డ్రై డేగా పాటించనున్నారు. కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మనన్ కుమార్ మిశ్రా భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. అందులో జనవరి 22వ తేదీని అన్ని కోర్టులకు సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

బెయిల్ రద్దు అయితే చంద్రబాబు జైలుకే.. చేసిన తప్పుకు మూల్యం చెల్లించక తప్పదు..!
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.. ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు.. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ పొందరు.. అయితే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు అయితే చంద్రబాబు మళ్లీ జైలుకే వెళ్తారని వ్యాఖ్యానించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పుకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కుల వ్యవస్థను రెచ్చగొట్టారు. ఏ కులం చేత ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలను అణచి వేయడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు దెబ్బతింటాయన్నారు. మేలు చేసిన నాయకుడు వెంటే వెళ్లడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం: జ్యోతిరాదిత్య సింధియా
అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్‌ క్రాఫ్ట్‌లను కొనుగోలు చేస్తోందని.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రధాని సంకల్పించారని, ఆ దిశగా సరలీకరిస్తున్నామని జ్యోతిరాదిత్య తెలిపారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శనను గురువారం ఆయన ఆరంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. ‘పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. విమాన ప్రయాణికులు క్రమంగా పెరుగుతున్నారు. దానికి తగినట్లుగా తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రపంచంలోనే ఇండియా విమాన ప్రయాణికుల పరంగా మూడో స్థానంలో ఉంది. దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి 2047లో విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాము. గత 10 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించాము. ముంబై, ఢిల్లీలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాము. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో హెలిపాడ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ఈ రోజు పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి’ అని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

రామమందిరం తపాలా స్టాంపును విడుదల చేసిన మోడీ
శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. దీనితో పాటు రాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48 పేజీల పుస్తకంలో 20 దేశాల స్టాంపులు ఉన్నాయి. ప్రధాని మోడీ మొత్తం ఆరు తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్, మా శబరి ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సందేశం కూడా ఇచ్చారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘ నమస్కార్, రామ్ రామ్… ఈరోజు రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా అభియాన్‌కు సంబంధించిన కార్యక్రమంలో నేను పాల్గొనడం విశేషం. ఈరోజు రామమందిరానికి అంకితం చేసిన 6 ప్రత్యేక స్మారక తపాలా స్టాంపులను విడుదల చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో రాముడికి సంబంధించిన పోస్టల్ స్టాంపులు విడుదలయ్యాయి. రామభక్తులందరికీ నా అభినందనలు. పోస్టల్ స్టాంపుల విధుల్లో ఒకటి వాటిని ఎన్వలప్‌లపై ఉంచడం. వాటి సాయంతో లేఖలు, సందేశాలు లేదా ముఖ్యమైన పత్రాలను పంపడం. కానీ ఈ పోస్టల్ స్టాంపులు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.

“యాంటీ బయాటిక్స్” సూచించేటప్పుడు డాక్టర్ తప్పకుండా కారణం తెలియజేయాలి.. కేంద్రం ఆదేశాలు..
యాంటీ బయాటిక్స్ అధిక వాడకాన్ని నిరోధించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. రోగులకు యాంటీ బయాటిక్స్ సూచించేటప్పుడు వైద్యులు తప్పనిసరిగా కారణాన్ని పేర్కొనాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ యాంటి బయాటిక్స్ అధికంగా వాడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దీన్ని ముందడుగుగా భావిస్తోంది. కారణంతో పాటు తప్పనిసరిగా సూచనలు తెలియజేయాలని వైద్యుల్ని కోరింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ ఒక లేఖలో ‘‘ యాంటిమైక్రోబయాల్స్ సూచించేటప్పుడు ఖచ్చితమైన సూచన/కారణం/జస్టిఫికేషన్‌ను తప్పనిసరిగా పేర్కొనవలసిందిగా’’ వైద్య కళాశాలల వైద్యులందరికీ విజ్ఞప్తి చేశారు. వైద్యులు మాత్రమే కాకుండా, ఫార్మసిస్ట్‌లకు కూడా “డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నియమాల షెడ్యూల్ H మరియు H1ని అమలు చేయాలని, చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్‌లపై మాత్రమే యాంటీబయాటిక్‌లను విక్రయించాలని సూచించినట్లు తెలుస్తోంది. వీటిని సూచించే ముందు ప్రిస్క్రిప్షన్‌లపై సూచనలను పేర్కొనాలని కోరారు.

పోటాటో చిప్స్ తెగ తింటున్నారా? ఇది మీకోసమే..
పోటాటో చిప్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో.. ఉప్పంగా, కారంగా ఉండటమే కాదు.. రుచిగా కూడా ఉండటంతో చిన్నా,పెద్దా అందరు తినడానికి ఇష్ట పడతారు.. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు పొటాటో చిప్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వారానికి ఒకసారి తింటే పర్లేదు కానీ అదే పనిగా తింటే మాత్రం హానికరం అని అంటున్నారు.అదేపనిగా నూనెలో వేగించిన స్నాక్స్‌ను తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు.. నూనెలో బాగా వేయించడం వల్ల నోటికి రుచిగా ఉంటుంది అంతే.. వీటిలో ఎటువంటి పోషకాలు ఉండవు.. నూనెలో వేగించటం వలన వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయి.అందువల్ల ఈ ఆహారాలకు బదులు సలాడ్స్ తింటే మంచిది.. శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.. హైఫ్యాట్ కెలోరీలు ఉండుట వలన అదే పనిగా తింటూ ఉంటే అధిక బరువు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది. ముఖ్యంగా బంగాళాదుంప చిప్స్ ద్వారా ఈ సమస్య అధికం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చిప్స్ లో సోడియం అధిక మొత్తంలో ఉండుట వలన రక్తపోటు పెరుగుతుంది.. ఇక రోజూ తీసుకోవడం వల్ల ఒంట్లో కొవ్వు బాగా పెరిగిపోతుందని చెబుతున్నారు.. డీప్- ఫ్రై చేయడం ద్వారా చిప్స్‌లో ట్రాన్స్‌ఫాట్ పెరుగుతుంది.ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.వేగించిన ఆహారాలలో ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయుల్ని పెంచుతాయి.. నూనెలో వేయించిన ప్రతి వంటలో, స్నాక్స్ లో కేలరీలు అధికంగానే ఉంటాయి.. వీటిని తీసుకోవడం కంటే ఫ్రెష్ కూరగాయలను తీసుకోవడం మంచిది..

భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం… ట్రైలర్ అదిరింది
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ ట్రైలర్ ని లాంచ్ చేసారు. దాదాపు రెండు నిమిషాల నిడివితో షార్ట్ అండ్ క్రిస్పీగా కట్ చేసిన ట్రైలర్ ఊరు పేరు భైరవకోన ప్రపంచాన్ని పరిచయం చేసింది. గరుడ పురాణంలోని మిస్ అయిన నాలుగు పేజీలు ఊరు పేరు భైరవకోన అనే డైలాగ్ తో విలేజ్ ని మిస్టీరియస్ గా ఎస్టాబ్లిష్ చేసాడు విఐ ఆనంద్. ట్రైలర్ కి శేఖర్ చంద్ర ఇచ్చిన మ్యూజిక్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. ఆర్ట్ వర్క్ గొప్పదనం ట్రైలర్ తోనే తెలిసిపోతుంది. విజువల్ ఎఫెక్ట్స్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, సెట్ వర్క్ కారణంగా ఊరు పేరు భైరవకోన ట్రైలర్ కొత్తగా కనిపించి అట్రాక్ట్ చేస్తోంది. ట్రైలర్ లో సందీప్ కిషన్ లుక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్, టీజర్ తో మంచి అంచనాలు సెట్ చేసిన ఊరు పేరు భైరవకోన టీమ్… ఇప్పుడు ట్రైలర్ తో మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసారు. రిలీజ్ డేట్ కి మూడు వారాల సమయం ఉంది కాబట్టి ఇకపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాబోతుంది. రిలీజ్ కి ముందు సెకండ్ ట్రైలర్ ని ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. ఈ ట్రైలర్ క్రియేట్ చేసిన బజ్ ని ఫెబ్ 9 వరకూ క్యారీ చేయగలిగితే ఊరు పేరు భైరవకోన సినిమా హిట్ పడినట్లే.

Exit mobile version