300 రకాలు వంటకాలు.. అనకాపల్లిలో అల్లుడికి సంక్రాంతి ఆతిథ్యం
ఆ గోదావరి వాళ్ల ప్రేమలే వేరప్ప.. మర్యాద చేయడంలో వారికి వారే సాటి అని చెబుతుంటారు. ఎవరింటికైనా వారి ఇంటికి వెళ్తే బొజ్జ నిండిపోయేలా భోజనాలు కొసరికొసరి వడ్డిస్తారు.. అదే.. అల్లుడి ఇంటికొస్తే.. ఆయన కొత్తు అల్లుడైతే.. ఆయన పండగకే ఇంటికొస్తే.. పిండి వంటలు, స్వీట్లు, మాంసాహార వంటకాలు ఇలా రకరకాలుగా ప్రత్యక్షమవుతాయి. ఇప్పటి వరకు 50 రకాల వంటకాలు, 100 రకాల వంటకాలు, 150 రకాలు, 250 వంటకాలు ఇలా ఎన్నో చూశాం.. కానీ, సంక్రాంతి అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదావరి జిల్లాలు స్పెషల్ అనుకుంటే అంతకంటే సూపర్ అంటున్నారు అనకాపల్లికి చెందిన అత్తమామలు. కొత్త అల్లుడికి పొట్టపగిలిపోయేలా విందు భోజనం ఏర్పాటు చేసి ఔరా..! అనిపించారు. 50 వెరైటీలే ఎక్కువను కుంటే ఏకంగా 300 రకాలు వంటకాలతో అల్లుడికి సంక్రాంతి ఆతిథ్యం ఇచ్చారు అనకాపల్లికి చెందిన దంపతులు.. అనకాపల్లికి చెందిన బియ్యం వ్యాపారి తన కుమార్తె రిషితకు విశాఖపట్నం చెందిన దేవేంద్రనాథ్ కి ఇచ్చి వివాహం చేశారు.. ఇక, వారి పెళ్లి జరిగిన తర్వాత మొదటి సంక్రాంతి పండగకు అత్తారింటికి వచ్చాడు అల్లుడు.. అతడికి గుర్తుండిపోయేలా.. అంతా అదిరిపోయేలా ప్రేమచూపిస్తూ ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా 300 రకాలకు పైగా పిండివంటలు, స్వీట్స్, ఐస్ క్రీమ్.. ఇలా 300 రకాలు అంటే ఎన్ని వెరైటీలు ఉంటాయే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. అలా రకరకాల వంటలతో దగ్గరుండి తినిపించి అల్లుడికి మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. మొత్తంగా ఇప్పుడు అనకాపల్లి అల్లుడికి 300 రకాల వంటకాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.
పండుగ పూట విషాదం.. సోదరికి కొత్త బట్టలు తీసుకెళ్తూ రోడ్డుప్రమాదంలో సోదరుడు మృతి
పండుగ పూట జరిగిన ఓ ప్రమాదం.. కుటుంబంతో పాటు ఊరిలో విషాదాన్ని నింపింది.. సంక్రాంతి పండుగ సందర్భంగా సోదరికి వస్త్రాలు బహుమతిగా అందించేందుకు వెళ్తూ మార్గమధ్యం యర్నగూడెం హైవే వద్ద డివైడర్ ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు.. పండుగ పూట కన్న కొడుకును కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.. ఆనందంగా పండుగ జరుపుకోవాల్సిన సమయంలో.. చేతికి అందివచ్చిన కొడుకును కోల్పోయి.. గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఇక, ఆ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన విష్ణు 20 ఇటీవలే బీటెక్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన తోబుట్టువు వద్దకు కోరుకొండ నుండి నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం వెళ్లేందుకు బైక్‌పై బయల్దేరాడు.. అయితే, యర్నగూడెం జాతీయరహదారిపై ప్రమాదం జరిగింది.. ఫ్లై ఓవర్ వద్ద మార్జిన్ ను ఢీకొని తలకు తీవ్రగాయాలయ్యాయి.. పండుగ సందర్భంగా తన సోదరికోసం విష్ణు తీసుకెళ్తున్న చీర, బట్టల సంచి రక్తపు మడుగులో తడిసిపోయింది.. సోదరికోసం ఆనందంగా బట్టలు తీసుకెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.. ఆ పరిస్థితులు హృదయాన్ని కలచివేస్తున్నాయి.. అయితే, తీవ్ర గాయాలపాలైన విష్ణుకు చికిత్సకోసం వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే విష్ణు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలోలో రికార్డు అయ్యాయి..
ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్ల వల.. స్పందించారంటే అంతే..!
సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.. తమకు అందివచ్చిన ఏ అవకాశాన్నా కూడా వదలకుండా..? ఎక్కడి నుంచి అంటే ప్రజలు తొందరగా స్పందిస్తూ.. వారిని బుట్టలో ఎలా వేసేకొవచ్చో.. తెలుసుకుని మరి.. వారి ప్లాన్ అమలు చేస్తున్నారు.. అందినకాడికి దండుకుంటున్నారు.. విశాఖపట్నంలో వెలుగు చూసిన ఓ తాజా సైబర్ మోసం విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం విదితమే కాగా.. ఆ సంక్షేమ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.. ఢిల్లీ కేంద్రంగా లబ్ధిదారులకు వల విసురుతుంది కేటుగాళ్ల ముఠా.. ఏపీలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న అమ్మ ఒడి, చేయూత, జగన్నన విద్యదీవెన, వైఎస్సార్ కాపు నేస్తం, వాహన మిత్ర లాంటి పథకాలు వస్తున్నాయా? అంటూ ఫోన్‌లో పలకరిస్తారు మోసగాళ్లు.. లేదు తమకు ఈ పథకం డబ్బులు అందలేదని చెబితే.. వాళ్లకు పట్టు దొరికినట్టే.. ఎందుకంటే.. ఏదైనా పథకం రాక పోతే వెంటనే డబ్బులు ఖాతాలో వేస్తామంటూ నమ్మబలుకుతారు.. మీరు లబ్ధిదారులే అంటూ ట్రాప్‌లోకి దింపుతారు.. ఇదో లింక్.. ఆ లింక్ క్లిక్ చేయండి.. మీ వివరాలు నమోదు చేయండి.. వెంటనే ఆ పథకానికి సంబంధించిన నగదు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది అంటూ ముగ్గులోకి దింపుతారు.. ఇక, ఇదంతా నిమజే అని నమ్మి మోసగాళ్లు పంపిన లింక్‌ను క్లిక్ చేస్తే.. డబ్బులు వచ్చేది వట్టిమాటే.. కానీ, ఖాతా ఖాళీ కావడం ఖాయం అన్నమాట.. విశాఖలో ఓ బాధితుడు దగ్గర అమ్మ ఒడి పేరుతో లక్ష రూపాయలు కాజేశారు కేటుగాళ్లు.. లక్ష రూపాయలు పోగొట్టుకున్న బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ వ్యవహారం వెలుగు చూసింది.. ప్రభుత్వ పథకాల పేరుతో ఫోన్ కాల్స్ వస్తే నమ్మొద్దు అని సూచిస్తున్నారు విశాఖపట్నం సిటీ పోలీసులు.
నందిగామలో తీవ్ర ఉద్రిక్తత..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య చోటు చేసుకున్న ఓ ఘటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను అడ్డుకున్నారు పోలీసులు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దుబాయ్ కరిముల్లా పై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు ఆరోపిస్తున్నారు ఆమె.. గత రెండు రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే సౌమ్యపై కామెడీ మీమ్స్ సభలో వేయడంపై సౌమ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.. దుబాయ్ కరిముల్లా పై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సౌమ్య.. అయితే, కేసు నమోదు చేయకుండా పోలీసులు మూడు రోజులుగా తాత్సారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సౌమ్య.. టీడీపీ నేతలతో కలిసి కరిముల్లా ఇంటికి బయల్దేరారు.. దీంతో, వైసీపీ నేత ఇంటికి బయలు దేరిన మాజీ ఎమ్మెల్యే సౌమ్యను, టీడీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. ఇక, పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే సౌమ్య, ఆచంట సునీత, టీడీపీ శ్రేణులు. దీంతో.. నందిగామ పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలకు పోలీసులు సర్దిచెప్పే సమయంలో.. మాటా మాటా పెరిగి.. టీడీపీ శ్రేణుల, పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది..
SBI-CSR నిధులతో సంక్రాంతి వేడుకలు.. సీపీఎంపై జీవీఎల్ కౌంటర్ ఎటాక్
మహాసంక్రాంతి వేడుకల విరాళాలపై రాజకీయ విమర్శలకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. SBI-CSR నుంచి 65 లక్షల రూపాయలు తీసుకోవడంపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విదితమే కాగా.. సీపీఎం నేతలపై మండిపడ్డారు జీవీఎల్.. కనుమరుగైన వామపక్ష పార్టీలవి చౌకబారు విమర్శలు.. సాంస్కృతిని మరిచి పోయిన కమ్యూనిస్టులు.. చైనా వేడుకలు ఇక్కడ నిర్వహించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే నైజం వామపక్షాలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలు కొనసాగించాలని పార్టీలకు అతీతంగా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాం.. ఇవాళ జరగనున్న మహాసంక్రాంతి ముగింపు వేడుకల్లో 10 మందికి పైగా ఎంపీలు పాల్గొంటున్నారని తెలిపారు. ఛాలెంజ్ చేస్తున్నా ఈ సంక్రాంతి వేడుకల్లో ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించగలరా..? అంటూ సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
సీఎం జగన్‌కు అంబేద్కర్‌పై ఉన్న అభిమానంతో విగ్రహ నిర్మాణం.. 19న ప్రారంభోత్సవం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై ఉన్న అభిమానంతోనే అంబేద్కర్ అతిపెద్ద విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారని తెలిపారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.. విజయవాలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధం అవుతోన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నేతలతో కలిసి పరిశీలించారు.. 19వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న స్మృతివనంలో ఏర్పాట్లను పరిశీలించి.. కొన్ని సూచనల చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజ్యాంగ కర్తగా బీఆర్ అంబేద్కర్ సామాజిక అభివృద్ధికి తగినట్టుగా రాజ్యాంగం రూపొందించారు.. సీఎం వైఎస్ జగన్‌కు అంబేద్కర్ పై ఉన్న అభిమానంతో విగ్రహ నిర్మాణం చేశారని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా సీఎం జగన్.. నవరత్నాలు రూపొందించారని పేర్కొన్నారు. చరిత్రలో ఈ మహాశిల్పం నిలిచిపోతుందన్నారు. లక్షా ఇరవై వేల మందితో కార్యక్రమంలో జరుగుతుంది.. సాయంత్రం డ్రోన్ షో నిర్వహిస్తాం అన్నారు. దార్శనికుడి కార్యక్రమానికి అందరూ తరలిరావాలి.. ఆహ్వానం అవసరమా..? అని ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి.
ఆ ప్రాజెక్టు కు జైపాల్ రెడ్డి పేరు పెడతాం..? రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్న కోమటిరెడ్డి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో దివంగత జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రావడంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలను నెక్లెస్ రోడ్డులోని ప్రశోధి స్థల్‌లో అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి తెలంగాణను నిర్మిస్తారని అన్నారు. జైపాల్ రెడ్డి పేరుతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. జైపాల్ రెడ్డి కృషి ఫలితంగానే హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చిందని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సోనియాను ఒప్పించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారన్నారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని ఏపీ నేతలు ప్రచారం చేసినా అది జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు నిలిచిపోయేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెడతామన్నారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జైపాల్‌రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నేటి రాజకీయ నేతలు జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి గొప్ప నాయకుడిగా ఎదిగారని జూపల్లి అన్నారు. పార్లమెంటులో జైపాల్ రెడ్డి ప్రసంగం చేస్తే ఊరుకునేదని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి పార్లమెంటులో ప్రసంగించే సమయంలో విమర్శలకు పోకుండా సమస్యలపై మాట్లాడేవారన్నారు. పాలకుర్తి ఎత్తిపోతల పథకానికి ఎంతో కృషి చేశారన్నారు.
ఆ పరిశ్రమకు కాంగ్రెస్ అండగా నిలవాలి.. కేటీఆర్ విజ్ఞప్తి..
సిరిసిల్ల గార్మెంట్ పరిశ్రమ సంక్షోభంపై వచ్చిన వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కొన్ని పేపర్ కటింగ్స్ పోస్ట్ చేస్తూ.. పదేళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నాయకులు ఎదగడమే కాకుండా తమ కార్యకలాపాలను కూడా విస్తరించుకున్నారని గుర్తు చేశారు. పదేళ్లలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. పవర్‌లూమ్ వస్త్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పలు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సహకరిస్తే తమిళనాడులోని తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలమని సిరిసిల్ల నేతన్న అన్నారు. చేనేత రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు.
శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
మధురలోని షాహీ ఈద్గా మసీదు సర్వేపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అడ్వకేట్ కమీషనర్ సర్వేకు ఆదేశించిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ ఈద్గా మసీదు మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలం పక్కనే ఉంది. ఇది ధ్వంసమైన శ్రీకృష్ణ జన్మస్థలమైన పురాతన ఆలయంపై నిర్మించబడిందని పేర్కొన్నారు. ఈ కారణంగా.. హిందూ పక్షం ఒక దరఖాస్తును దాఖలు చేసింది.. మసీదును సర్వే చేయాలని డిమాండ్ చేసింది. కాశీలోని జ్ఞాన్‌వాపి మసీదుపై ఇటీవల ఒక సర్వే నిర్వహించబడింది.. దాని నివేదిక కూడా రాబోయే కొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వు హిందూ పక్షానికి ఎదురు దెబ్బగా పరిగణిస్తోంది.
పంజాబ్ సీఎంను చంపేస్తామంటూ ఖలిస్తానీ ఉగ్రవాది హెచ్చరిక
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ గురుపత్వంత్ సింగ్ పన్నూ భగవంత్ మాన్‌ను చంపేస్తానని హెచ్చరించాడు. జనవరి 26న ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ తెలిపాడు. సీఎంతో పాటు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్‌కు కూడా ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. ఇక, ఖలిస్తానీలు, గ్యాంగ్‌స్టర్లపై నిరంతర చర్యలు తీసుకోవడం వల్ల పన్ను ఇతర గ్యాంగ్‌స్టర్లు అలాగే, ఖలిస్తానీ మద్దతుదారులు భయాందోళనలకు గురయ్యారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు బెదిరింపులు రావడమే ఇందుకు ఉదాహరణ.. గ్యాంగ్‌స్టర్‌లతో పాటు ఖలిస్తానీ ఉగ్రవాదులపై పంజాబ్ పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించారు. గత కొంతకాలంగా వీరిపై పోలీసులు కఠినమై చర్యలు తీసుకుంటున్నారు. ఇక, జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రభుత్వాన్ని బెదిరించిన వారం తర్వాత ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు.
మాకు యుద్ధం చేసే ఉద్దేశం లేదు.. కానీ, దక్షిణ కొరియాతో ఏకీకరణ సాధ్యం కాదు..
దక్షిణ కొరియాతో సయోధ్య మరియు పునరేకీకరణను ప్రోత్సహించే అనేక ప్రభుత్వ సంస్థలను ఉత్తర కొరియా కూల్చివేసింది. తమ దేశం యుద్ధాన్ని తప్పించుకోకూడదని కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా పార్లమెంట్ అయిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ కొరియాతో ఇకపై ఏకీకరణ సాధ్యం కాదని అన్నారు. దక్షిణ కొరియాను ప్రత్యేక ‘శత్రువు దేశం’గా మార్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని పిలుపునిచ్చారు. అయితే, సౌత్- నార్త్ కొరియా దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు శాంతియుత పునరేకీకరణ కమిటీ, నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ బ్యూరోతో పాటు ఇంటర్నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషన్ అనే మూడు సంస్థలు మూసివేయబడతాయని సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో కిమ్ ప్రకటన విడుదల చేశాడు. ప్యోంగ్యాంగ్ ఇటీవల నిర్వహించిన క్షిపణి పరీక్షల పరంపర తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.
‘డియర్ ఉమ’ సినిమాతో మరో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ
ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం… అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం… దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా మల్టీ టాలెంటెడ్‌గా సుమయ రెడ్డి అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం రాబోతోంది. ఇందులో సుమయ రెడ్డి, దియ మూవి ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా వ్వవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కూడా నిర్మించారు. టీజర్ రిలీజ్ చేసిన తరువాత సినిమా స్థాయి ఏంటో అందరికీ తెలుస్తుందని మేకర్లు చెబుతున్నారు. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు త్వరలోనే థియేటర్లోకి రానుందని దర్శక నిర్మాతలు తెలిపారు. రాజ్ తోట కెమెరామెన్‌గా, రధన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ వంటి వారు నటించారు.
మెగాస్టార్ పాటకి చిందేసిన కలెక్టర్…
మెగాస్టార్ చిరంజీవి డాన్స్ కి ఉండే క్రేజే వేరు. ఆయన స్టైల్ అండ్ గ్రేస్ అన్ మ్యాచబుల్ అసలు. అందుకే చిరు డాన్స్ చేస్తుంటే అభిమానులు మెస్మరైజ్ అయ్యి చూస్తుంటారు. ఆయన పాటకి డాన్స్ వేయాలనుకుంటారు, ఆయనలా డాన్స్ స్టెప్పులు వేస్తారు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ శివశంకర్ స్టేజ్ పైన మెగాస్టార్ పాటకి సూపర్ స్టెప్పులేశాడు. వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘వేర్ ఈజ్ ది పార్టీ బాసు, వీర్ ఈజ్ ది పార్టీ’ సాంగ్ కి శివశంకర్ డాన్స్ వేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోని ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు. గతేడాది ఇదే సంక్రాంతి సీజన్ కి రిలీజైన వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. వింటేజ్ చిరుని చూపిస్తూ దర్శకుడు బాబీ మెగా ఫ్యాన్స్ కి మాస్ పూనకాలు తెప్పించాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరు ఎన్నేళ్లు అయినా తన యాక్టింగ్ లో, డాన్స్ లో గ్రేస్ తగ్గదు అని మరోసారి నిరూపించాడు. ఇదిలా ఉంటే చిరు ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి రోజున టైటిల్ అనౌన్స్మెంట్ జరిగిన ఈ మూవీని బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ జానర్ లో విశ్వంభర తెరకెక్కుతోంది. మ్యూజికల్ లెజెండ్, ఆస్కార్ విన్నర్ కీరవాణి విశ్వంభర సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరు ఫాంటసీ జానర్ లో చేస్తున్న సినిమా ఇదే. పాన్ ఇండియా రిలీజ్ ని టార్గెట్ చేస్తున్న ఈ మూవీపై సాలిడ్ బజ్ ఉంది.
రాకింగ్ స్టార్ తో సందడి చేయనున్న థ్రిల్లింగ్ స్టార్…
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈటీవీ విన్ కోసం స్పెషల్ సెలబ్రిటీ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఉస్తాద్… ర్యాంప్ ఆడిద్దాం అంటూ రానా, సిద్ధూ జొన్నలగడ్డ, నాని, విశ్వక్ సేన్, తేజ సజ్జ లాంటి హీరోలతో ఇప్పటికే సందడి చేసిన మంచు మనోజ్ తన హోస్టింగ్ స్కిల్స్ తో షోలో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. మంచు మనోజ్ లో ఉండే ఈజ్ ని ఉస్తాద్ షో ప్రేక్షకులని మళ్లీ పరిచయం చేసింది. లేటెస్ట్ గా ఉస్తాద్ షోకి థ్రిల్లింగ్ స్టార్ అడివి శేష్ కూడా గెస్ట్ గా వచ్చేసాడు. జనవరి 18న ప్రీమియర్ కానున్న ఈ ఎపిసోడ్ లో శేష్ అండ్ మంచు మనోజ్ చేయబోయే సందడి ఎలా ఉంటుందో చూడాలని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. హీరోల డై హార్డ్ ఫ్యాన్స్ తో సాగే ఈ గేమ్ షోలో అడివి శేష్ డై హార్డ్ ఫ్యాన్ గా ఎవరు ఎంట్రీ ఇస్తారు అనేది చూడాలి. మేజర్ రిపోర్టింగ్ అంటూ ఈటీవీ విన్ నుంచి శేష్-మనోజ్ ఎపిసోడ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది, ప్రోమో త్వరలో బయటకి రానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి 2 చేస్తున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మంచు మనోజ్ కూడా హీరోగా రీఎంట్రీ ఇచ్చే ప్లాన్స్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు అనౌన్స్ చేసాడు కానీ ఆ ప్రాజెక్ట్స్ విషయంలో అప్డేట్స్ లేవు. మరేదైనా ప్రాజెక్ట్ తో అతి త్వరలో మంచు మనోజ్ సోలో హీరోగా సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని మంచు అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ వెయిటింగ్ కి రాకింగ్ స్టార్ ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తాడనేది చూడాలి.