*సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ డిమాండ్ చేసింది. పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ టీడీపీ సభ్యుల ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. విజిల్స్ ఊదుతూ సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పైకి పేపర్లు చించి విసిరేశారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ఒకరోజు పాటు… దీంతో టీడీపీ సభ్యులను సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులందరినీ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సభ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
*డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక భేటీ
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ విద్యా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీలోని బొత్స సత్యనారాయణ ఛాంబర్‌లో కీలక సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. 6,100 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకటన, విధివిధానాల ఖరారుపై చర్చ కొనసాగుతోంది. టీచర్ పోస్టుల సంఖ్యను పెంచాలని డీఎస్సీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనపై కూడా చర్చిస్తున్నారు. జనవరి 31న సీఎం జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ల విడుదలపై చర్చించారు.. 6100 టీచర్ పోస్టుల భర్తీకి ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ ృ జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.
*చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై పేర్ని నాని ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. జగన్ జనంలోకి వెళుతుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని ఆయన అన్నారు. 2014లో ఉమ్మడి పోటీగా ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళతారని ఆయన ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయలేదని మోడీ కూడా చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఒక్క సీటు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబును సీఎం చేయటం కోసమే పాకులాడతాడని ఆయన అన్నారు. 2014లో జగన్‌కు ఇప్పటికి చాలా తేడా ఉందని.. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అర్జునుడు అయితే ద్రౌపదిని కాపాడాలి అంటారని.. అర్జునుడికి, ద్రౌపదికి మధ్య సంబంధం ఏంటో వీళ్ళకు తెలియదని ఆయన విమర్శించారు. చిరంజీవి జనరంజక నటుడు అని.. చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పాత్ర పోషించారని పేర్ని నాని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేయమని పవన్ కళ్యాణ్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించ లేదా అంటూ ప్రశ్నించారు. రాంచరణ్ మాకు, బాబాయికి సంబంధం లేదని ఓ వేదిక పై మాట్లాడిన విషయం మర్చిపోయారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. మానవ సంబంధాల గురించి పవన్ కళ్యాణ్ చెప్పటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. షర్మిల అన్నతో విబేధించి అన్న శత్రువులతో చేతులు కలిపారని.. మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసిందని విమర్శించినా అదే కాంగ్రెస్ జెండా మోస్తున్నారన్నారు. తల్లిని తిట్టిన పార్టీకి పల్లకి మోస్తున్నాడు పవన్ కళ్యాణ్.. కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్‌ది అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. తన పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాడని మండిపడ్డారు. 2004 నుంచి జగన్ గురించి మొత్తం తెలుసు అంటున్నాడు బాలశౌరి.. ఇంత చెడ్డ వాడని తెలిస్తే ఎందుకు వైసీపీలోకి వచ్చావ్ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. 2004లో తెనాలికి వెళ్ళింది ఎవరని ప్రశ్నలు గుప్పించారు. 2009లో నర్సరావుపేటకు పారిపోయింది ఎవరని.. 2019లో మచిలీపట్నంకు వెళ్లింది ఎవరు అని ప్రశ్నించారు. ఢిల్లీలో రాత్రి పది దాటిన తర్వాత ఎంత జుగుప్సాకరంగా కేవీపీ దగ్గర మాట్లాడావో తెలియదు అనుకుంటున్నావా అంటూ ఆయన చెప్పారు. పేర్ని నాని సర్వర్ ఉద్యోగం చేస్తున్నాడు అని చంద్రబాబు అంటున్నాడని ఆయన వెల్లడించారు. కార్యకర్తలకు భోజనం పెడితే అంత చులకనగా కనిపిస్తున్నామా అంటూ చంద్రబాబును ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు. సర్వర్లు మనుషులు కాదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వమని పేర్ని నాని విమర్శించారు.
*బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి ఎంపీ వెంకటేష్ నేత..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్‌లో చేరారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ కాంగ్రెస్ లో చేరారు. ఇటీవల ఎంపీ వెంకటేష్ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వెంకటేష్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేశ్.. కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మంచిర్యాల, చెన్నూర్,బెల్లంపల్లి బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో వెంకటేష్ నేత కనిపించలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయిన నేత.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద పల్లి స్థానానికి పోటీ చేసి ఎంపిగా వెంకటేశ్ నేత గెలిచిన విషయం తెలిసిందే. అయితే నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. మరోవైపు మహబూబ్ నగర్ లోని బీఆర్ఎస్ కు షాక్ తగలనుంచి కాంగ్రెస్ లోకి పారిశ్రామిక వేత్త మన్నే జీవన్ రెడ్డి చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో ఖర్గే సమక్షంలో జీవన్ రెడ్డి చేరనున్నట్లు టాక్.. ఆయనతో పాటు ఆయన బాబాయి ఎంపి శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడుతారనే ప్రచారం జరుగుతుంది.
*నేడు కాజీపేట నుంచి అయోధ్యకు రైలు.. సాయంత్రం 6.20 గంటలకు..
అయోధ్య బలరాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం ఇవాళ కాజీపేట నుంచి ఆస్తా ప్రత్యేక రైలును ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు కాజీపేట నుండి సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరుతుంది. గత నెల 30న బయలుదేరాల్సిన ఆస్తా ప్రత్యేక రైలు సాంకేతిక కారణాలతో రద్దయింది. మళ్లీ ఈ రైలు పాత ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకారమే నడుస్తుందని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాజీపేట నుండి రైలు నెం. 07223 జనవరి 30, ఫిబ్రవరి 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో మొత్తం 15 ట్రిప్పులు నడుస్తుంది. అయోధ్య నుండి కాజీపేట వరకు నడుస్తుంది. ఫిబ్రవరి 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2 తేదీల్లో భక్తులకు అందుబాటులో ఉంటుంది. కాజీపేటలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరిన రైలు మరుసటి రోజు రాత్రి 9.35 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.20 గంటలకు అయోధ్యలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.02 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. ఈ రైలు పెద్దపల్లి మీదుగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్‌పూర్, జుజర్‌పూర్, ఇటార్సీ, భూపాల్, బీనా, విరంగన, ఝాన్సీ, ఒరై, ఖాన్‌పూర్, అయోధ్య స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 20 స్లీపర్ కోచ్‌లు, 2 జనరల్ బోగీలు ఉన్నాయి. అయోధ్య బలరాముడి దర్శనం కోసం భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ‘ఆస్తా’ సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన విసయం తెలిసిందే. ఈ ప్రత్యేక రైలును బీజేపీ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలులో రామ్‌లల్లా దర్శనం కోసం 1,346 మంది అయోధ్యకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంగణం అంతా రామ నామస్మరణతో మారుమోగింది. ఈ ప్రత్యేక రైలు అయోధ్యను సందర్శించిన తర్వాత 9వ తేదీన తిరిగి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 07221 సికింద్రాబాద్ నుండి అయోధ్యకు ఫిబ్రవరి 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. అదే నంబర్‌తో అయోధ్య నుండి ఫిబ్రవరి 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, మార్చి 1, 3. సికింద్రాబాద్‌లో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. ఇది అయోధ్య నుండి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది కూడా కాజీపేట నుండి బయలుదేరి ఆస్తా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు ఆగిన అన్ని స్టేషన్లలో ఆగుతుంది. వరంగల్ , సికింద్రాబాద్ లలోని సామాన్య ప్రజల కోసం ఆస్తా అయోధ్య ప్రత్యేక రైలు అందుబాటులోకి రావడం ప్రజలకు మంచి సౌలభ్యం అని చెప్పవచ్చు.
*లోక్ సభలో ప్రధాని మోడీ స్పీచ్ పై కాంగ్రెస్ ఆగ్రహం..
దేశ తొలి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రధాని మోడీ అభద్రతా భావంతో బాధపడుతున్నారని పేర్కొనింది.. అందుకే నెహ్రూపై రాజకీయంగా కాకుండా వ్యక్తిగతమైన ఆరోపణలు గుప్పిస్తూ.. దుర్మార్గంగా మాట్లాడుతున్నారని హస్తం పార్టీ నేతలు మండిపడతున్నారు. నెహ్రూ గురించి బీజేపీ సీనియర్ నేతలు వాజ్‌పేయీ, అద్వాణి కూడా ఇంత దారుణంగా మాట్లాడలేదు.. కానీ ప్రధాని మోడీ లోక్ సభలో దిగజారి మాట్లాడటం ద్వారా ఉన్నతమైన పదవికి ఉన్న వ్యాల్యూను పొగొట్టుకుంటున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ఇక, నిన్న (సోమవారం) లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధానులు జవాహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే, ఇవాళ రాజ్యసభలో కూడా ప్రధాని మోడీ అలాగే మాట్లాడనున్నారని జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగాలోమానియా, నెహ్రూ ఫోబియా అనే విషపూరిత మిశ్రమం దేశంలో ప్రజాస్వామ్య హత్యకు దారి తీస్తోంది అని ఆయన అన్నారు. అందుకే దేశ యువత లోక్‌సభలో ప్రధాని మోడీకి ఇదే చివరి ప్రసంగం అని అనుకుంటున్నట్లు జైరాం రమేశ్ చెప్పారు. పదేళ్ల పాటు అన్యాయమైన పరిపాలనకు త్వరలో ముగిసిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
*వామ్మో.. ఏకంగా 32 వేల మంది టెకీలు తొలగింపు..
2024వ సంవత్సరంలో కూడా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు భారీగానే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఏకంగా 32,000 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు లేఆఫ్స్. ఫ్లై (Layoffs.fyi) డేటాలో వెల్లడించింది. తాజాగా స్నాప్ ఇన్ (Snap Inc) కంపెనీ 10 శాతం మంది ఉద్యోగులను (540) తొలగించినట్లు ప్రకటించింది. దీంతో పాటు ఓక్టా ఇన్(Okta Inc ) సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఈ నెల ప్రారంభంలోనే.. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బందిలో ఏకంగా 7 శాతం మంది ఉద్యోగులను (400 ) విధుల నుంచి తొలిగిస్తున్నట్ల ప్రకటించింది. అయితే, అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా లాంటి దిగ్గజ కంపెనీలు సైతం ఈ ఏడాది ప్రారంభం నుంచి సిబ్బందిని తొలగిస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఏఐ వంటి టెక్నాలజీలను ఉపయోగించుకోవడం వల్లే ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం అని స్పష్టమవుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) వినియోగిస్తుండటం వల్ల.. ఇందులో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానే చాలా కంపెనీలు సుముఖత చూపుతున్నాయి. దీని వల్ల కొత్త నియామకాల సంఖ్య తగ్గడమే కాకుండా.. ఉన్న ఉద్యోగులను కూడా టెక్ పరిశ్రమలు ఇంటికి పంపిస్తున్నాయి. ఇక, వరుస లేఆఫ్స్ తో టెక్కిలు భయందోళనలో గురి అవుతున్నారు. ఏఐ టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన లేదా ప్రస్తుతం వినియోగంలో ఉన్న టెక్నాలజీలో నైపుణ్యాని కలిగి ఉన్న ఉద్యోగులకు అధిక డిమాండ్ ఉంది. ఈ కారణంగానే గత డిసెంబర్ నుంచి జనవరి వరకు పలు కంపెనీలు కొత్త టెక్నాలజీపై నైపుణ్యం కలిగి ఉన్న 2000 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. దీంతో ఏఐ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సంఖ్య 17, 479కి చేరినట్లు సమాచారం.
*బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్..
బ్రిటన్ రాజు ఛార్లెస్-3 అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఛార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్ తాజాగా ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ క్రమంలోనే ఛార్లెస్-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. అయితే, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా ఈ వ్యాధి బయటపడిందన్నారు. అది ఏ రకమైన క్యాన్సరనేది ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు.. కాగా, క్యాన్సర్‌కు చికిత్స పూర్తి చేసుకుని త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని బకింహం హాం ప్యాలెస్ పేర్కొనింది. మరోవైపు.. వీలైనంత త్వరగా ఛార్లెస్-3 పూర్తి విధుల్లోకి రావాలనుకుంటున్నారని చికిత్స టైంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని ప్యాలెస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించబోతున్నారని పేర్కొన్నారు. 2022 సెప్టెంబరులో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2, 96 ఏళ్ల వయసులో మరణించడం వల్ల ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా నియమకం అయ్యారు. అయితే, ఛార్లెస్-3 క్యాన్సర్ బారిన పడడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. మీరు త్వరగా కోలుకుని.. సంపూర్ణ ఆరోగ్యంతో మీరు తిరిగి వస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని ట్విట్టర్ (ఎక్స్ ) తెలిపారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటు బ్రిటన్ మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్, సర్ టోనీ బ్లెయిర్ కూడా ఎక్స్ వేదికగా రాజు చార్లెస్ -3 త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
*నేడే చివరి మూడు టెస్ట్‌లకు భారత జట్టు ప్రకటన.. అందరి కళ్లు విరాట్ కోహ్లీ ఎంట్రీపైనే!
ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం (ఫిబ్రవరి 6) ప్రకటించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం మధ్యాహ్నం ముంబైలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించనున్నారు. అయితే అందరి కళ్లు మాత్రం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీపైనే ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా విరాట్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మూడో టెస్టుకు దాదాపు 10 రోజుల సమయం ఉండడంతో.. కోహ్లీ జట్టు ఎంపికకు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రసవ సమయంలో ఆమె పక్కన ఉండాలని నిర్ణయించుకున్న కోహ్లీ.. బీసీసీఐ అనుమతితో తొలి రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. అయితే రెండోసారి తండ్రవుతున్నాననే విషయాన్ని విరాట్ అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. చివరి మూడు టెస్ట్‌లకు ప్రస్తుత జట్టు దాదాపుగా కొనసాగనుంది. అయితే రెండు టెస్ట్‌ల్లో విఫలమైన శ్రేయాస్ అయ్యర్‌పై వేటు వేసి.. సర్ఫరాజ్ ఖాన్‌ను కొనసాగించవచ్చు. విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తే మాత్రం రజత్ పటీదార్‌కు ఉద్వాసన తప్పదు. మూడో టెస్టుకు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్‌లోడ్ కారణంగా రాజ్‌కోట్ టెస్టుకు అతడిని పక్కన పెట్టాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గాయాల బారిన పడిన లోకేష్ రాహుల్, రవీంద్ర జడేజాలు మూడో టెస్ట్ ఆడే అవకాశాలు ఉన్నాయి.