నగరి నుంచే పోటీ.. హ్యాట్రిక్ కొడతా..!
వచ్చే ఎన్నికల్లోనూ తాను నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్టు సంకేతాలు ఇచ్చారు నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా.. తిరుమలలో ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. నగరి నుంచి బరిలో ఉంటాననే సంకేతాలను పంపించారు.. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుడూ.. నగరి నుంచి పోటీ చేస్తా.. హ్యాట్రిక్ కోడతానన్నారు రోజా.. కాగా, ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి రోజాను బరిలోకి దింపేందుకు వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుందనే ప్రచారం సాగింది.. ఆ తర్వాత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.. దాదాపు ఆయన పేరు ఖరారు చేసినట్టు.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే తాను నగరి నుంచే మరోసారి పోటీ చేస్తానని మంత్రి రోజా స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
నేను పార్టీ మారడం లేదు.. జీవితాంతం జగన్‌తోనే..!
కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. నేను పార్టీ మారుతున్నాను అని నా పై దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా నన్ను ఎమ్మెల్యేను చేశారు.. నేను జీవితాంతం వైఎస్ జగన్ తోనే ఉంటాను అని స్పష్టం చేశారు. ఇక, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నా ఆరాధ్య దైవం, వైఎస్ జగన్ నా రాజకీయ దైవం అని వెల్లడించారు బుర్రా మధుసూధన్ యాదవ్.. పదేళ్లుగా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో నాకు అనుబంధం ఉంది.. అందుకే నాకు టికెట్ రాకపోవడంతో కొంత బాధ పడ్డారని తెలిపారు.. ఇక, పార్టీ అధిష్టానం నియమించిన కొత్త ఇంఛార్జ్ నారాయణ యాదవ్ కు పూర్తి సహకారం అందిస్తాను అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లోనూ కనిగిరి కోటపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్.
రాజకీయాన్ని ప్రజా సేవగా మార్చాలి.. అందుకే ప్రజల నుంచి విరాళాల సేకరణ..
రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ప్రజలకు, ఓటర్లకు డబ్బులు ఎర వేసి ఓట్లు లాక్కోవాలి… గుంజుకోవాలని చూస్తున్నాయి.. కానీ, సీపీఎం మాత్రం ప్రజల నుంచే విరాళాలు సేకరిస్తోంది.. ఇది ప్రజల పార్టీ అన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయనగరం జిల్లా కేంద్రంలో ఇంటింటి నిధి వసూలు కార్యక్రమం చేపట్టింది సీపీఎం.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేటర్ల దగ్గర మేం నిధులు తీసుకోలేదు.. ఎన్నికల్లో డబ్బులు పంచే పార్టీలు మావి కావు.. ప్రజల్లో నుంచి, ప్రజల కోసం పని చేస్తాం.. కాబట్టి ప్రజలు నుంచి నిధులు సేకరిస్తున్నాం అన్నారు. ఈ రోజు రాజకీయంలో అవినీతి విచ్చల విడిగా సాగుతుంది.. కానీ, రాజకీయాన్ని ప్రజా సేవగా మార్చాలి అని పిలుపునిచ్చారు.
గన్నవరం ఎమ్మెల్యే వంశీపై నాలుగు అరెస్ట్ వారెంట్లు జారీ..
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌పై నాలుగు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు.. వంశీపై నాలుగు కేసుల్లో విచారణ చేస్తున్న ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది న్యాయస్థానం.. అయితే, వివిధ సందర్భాల్లో ధర్నాలు, ఆందోళనల సందర్భంగా వల్లభనేని వంశీపై కేసులు నమోదు అయ్యాయి.. అందులో నాలుగు కేసులు ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి.. కానీ, ఆయన వరుసగా కోర్టుకు హాజరుకాకపోవడంతో.. అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది న్యాయస్థానం.. అరెస్ట్ వారెంట్లపై వల్లభనేని వంశీ కౌంటర్‌కు దాఖలు చేసే అవకాశం ఉంది. అరెస్ట్ వారెంట్లు మాత్రమే కాబట్టి.. అసలు వల్లభనేని వంశీ మోహన్.. కోర్టు విచారణకు ఎందుకు హాజరుకాలేకపోయారు అనే విషయాలను వివరిస్తూ.. అఫిడవిట్ రూపంలో కౌంటర్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. కాగా, వివిధ సమస్యలపై ఆందోళనలు నిర్వహించే సమయంలో.. ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఆ కేసులతో పాటు.. ప్రజా ప్రతినిధులపై ఇతర సందర్భాల్లోనూ నమోదైన కేసులను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోన్న విషయం విదితమే.
బాలినేని మా నాయకుడు.. ఎలాంటి తారతమ్యం ఉండదు..
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. అయితే, బాలినేని మా నాయకుడు.. అందులో ఎటువంటి తారతమ్యం ఉండదు అని స్పష్టం చేశారు మంత్రి మేరుగు నాగార్జున.. ఆయన ఆధ్వర్యంలో మేమంతా పని చేస్తాం అని ప్రకటించారు.. ఇక, తన క్యాంపు కార్యాలయం దగ్గర బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫ్లెక్సీలను చించారటూ వస్తున్న వార్తలపై స్పందించిన నాగార్జున.. ప్లెక్సీలు నా క్యాంపు కార్యాలయంలో చినగలేదు.. అవి బయట చినిగాయని క్లారిటీ ఇచ్చారు. ఆ విషయాన్ని అంతటితో వదిలేయాలన్నారు మంత్రి నాగార్జున.. మరోవైపు.. వైఎస్ షర్మిలకు ఇంతకాలం గుర్తురాని ప్రత్యేక హోదా.. ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు మేరుగు.. ఆమె ఎవరికోసం దీక్షకు దిగిందో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు పంపిస్తే.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిందని దుయ్యబట్టారు.. చంద్రబాబు డ్రామాల్లో ఇదొక నాటకం మాత్రమేనని విమర్శలు గుప్పించారు.
డిమాండ్ అలా ఉంది మరి..! తాపీ మేస్త్రీయా మజాకా..! నెలజీతం రూ.4.47 లక్షలు
తాపీ మేస్త్రీకి నెలవారీ ఆదాయం ఎంత ఉంటుంది? రోజుకు రూ. 1000 నుంచి 1500 లెక్క వేసుకున్నా నెలకు రూ.30-40 వేలు మధ్య ఉంటుంది. కుటుంబం కోసం ఒక్కరోజు కూడా మిస్ కాకుండా పనికి వెళ్లాల్సిన పరిస్థితులు వుంటాయి. కానీ అమెరికా కాన్సులేట్‌లో మేస్త్రీ ఉద్యోగానికి లక్షల్లో వేతనం ఇస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సైతం.. జీవితమే తాపీ మేస్త్రీ అనుకునేలా లక్షల్లో జీతంతో ఉద్యోగ ప్రకటన ఇచ్చారు. హైదరాబాద్‌లోని యూఎస్ ఎంబసీ మేసన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తాపీ మేస్త్రీ ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తే.. అందులో పేర్కొన్న జీతం అందర్నీ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ కాన్సుల్ జనరల్ కార్యాలయంలో మేస్త్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం కూడా ఉంది. వార్షిక వేతనం రూ.4,47,348. నెలవారీ జీతం లెక్కన చూస్తే మేస్త్రీ జీతం రూ.37,279గా నిర్ణయించారు. జీతంతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. ఈ ఉద్యోగాన్ని ఫుల్ టైమ్ జాబ్ గా తెలిపారు. ఈ ఉద్యోగానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని యుఎస్ కాన్సుల్ వర్గాలు ప్రకటించాయి. ఇది అమెరికన్ కాన్సుల్‌లో శాశ్వత ఉద్యోగంగా పేర్కొనబడింది. ప్రొబేషనరీ పీరియడ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థి వారానికి 40 గంటలు పని చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత కనీసం 4 నుండి 8 వారాలు.
పేపర్ లీకేజీపై కేంద్రం కొత్త చట్టం.. ఫిబ్రవరి 5 పార్లమెంట్ ముందుకు బిల్లు
పేపర్ లీకేజీల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం (ఫిబ్రవరి 5వ తేదీ) నాడు లోక్‌సభలో జాతీయ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లును ప్రవేశ పెట్టబోతుంది. ఈ ప్రతిపాదిత చట్టం.. సెంట్రల్ ఏజెన్సీ పోటీ పరీక్షలు, విశ్వవిద్యాలయ పరీక్షలతో సహా వివిధ పరీక్షల సమయంలో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. దోషులుగా తేలిన వారికి రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో కూడిన జరిమానాలు అన్ని బిల్లులో ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదిత చట్టంలోని నిబంధనల ప్రకారం ఉన్నత స్థాయి జాతీయ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని మోడీ సర్కార్ యోచిస్తోంది. అయితే, రాజస్థాన్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష, హర్యానాలో గ్రూప్-డీ పోస్టులకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ), గుజరాత్‌లో జూనియర్ క్లర్క్‌ల రిక్రూట్‌మెంట్ పరీక్ష, బీహార్‌లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష, తెలగాణలో గ్రూప్- 1 పరీక్ష (టీఎస్పీఎస్సీ) గత ఏడాది ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో పరీక్షలను రద్దు చేశారు. ఇక, బడ్జెట్ సమావేశాలలోనే పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు చట్టాన్ని రూపొందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం పార్లమెంట్ లో ప్రస్తావించారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ నిరసన
లోక్‌సభ ఎన్నికలు దగ్గర వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాజకీయం తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పటికే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ కాగా, బీహార్‌లో మహాకూటమి ప్రభుత్వం పోయి ఇప్పుడు అక్కడ ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది. ఇక, ఢిల్లీలోనూ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఈడీ మధ్య వార్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. అలాగే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు కోల్‌కతాలో నిరసన చేస్తారు. రాష్ట్ర బకాయిలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినందుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన చేపట్టనున్నారు. ముఖ్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) కింద కేంద్రం బకాయిలను నిలుపుదల చేసింది. దీంతో కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా ఇవాళ మమతా బెనర్జీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ.. రెడ్ రోడ్ ప్రాంతంలోని మైదానంలో మధ్యాహ్నం 1 గంటలకు నిరసన ప్రారంభమవుతుంది అని చెప్పుకొచ్చారు. మా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఈ నిరసనకు నాయకత్వం వహిస్తారు.. అలాగే, ఇతర పార్టీ సీనియర్ నేతలు కూడా హాజరుకానున్నారు అని వెల్లడించారు.
ముయిజ్జూపై అవిశ్వాస తీర్మానం.. భారత్ రియాక్షన్ ఇదే..?
భారత్‌తో సంబంధాలు క్షీణించిన తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురైతుంది. మహ్మద్ ముయిజుపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు మాల్దీవుల ప్రధాన ప్రతిపక్ష పార్టీ సిద్ధమైంది. దీనిపై భారత్ కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. వీక్లీ మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇది మాల్దీవుల అంతర్గత విషయం.. దీనిపై వ్యాఖ్యానించడానికి భారతదేశం ఇష్టపడదని తెలిపారు. అయితే, గత వారం మాల్దీవుల పార్లమెంట్‌లో ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఒక ఎంపీ మాట్లాడుతూ.. ముయిజ్జూపై అభిశంసన తీర్మానాన్ని దాఖలు చేయడానికి తమ పార్టీతో పాటు ఇతర ఎంపీల దగ్గర నుంచి సంతకాలను సేకరించామన్నారు. అయితే, ప్రతిపక్షాలు ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని ఆయన అన్నారు. మాల్దీవుల పార్లమెంట్‌లో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత ప్రభుత్వ అనుకూల పార్టీలైన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC), ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (PPM) ఎంపీలు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించి స్పీకర్‌తో గొడవకు దిగారు. అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ క్యాబినెట్‌లోని మంత్రుల కోసం పార్లమెంటరీ ఆమోదం కోసం పిలిచిన ప్రత్యేక సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది.
ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం పని చేస్తుంది..
గత కొద్దీ రోజులుగా పేటీఎం షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో దాని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. తమ కంపెనీ ఇతర బ్యాంకులతో మాత్రమే పని చేస్తున్నందున పేమెంట్స్ బ్యాంక్ కాదన్నారు. దేశంలోని పెద్ద బ్యాంకుల నుంచి తమకు సపోర్టు ఉందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు కంపెనీ మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ అంశాల కారణంగా సేవల వల్ల వ్యాపారం ప్రభావితం కాదని విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. ఈ చర్యపై ఆర్బీఐ తమకు ఎలాంటి వివరాలను ఇవ్వలేదన్నారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షల వల్ల పేటీఎం షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. ఒక్కో షేరు ధర 20 శాతం వరకు క్షీణించి ఎన్‌ఎస్‌ఈలో ఆరు వారాల కనిష్టానికి పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ 1.2 బిలియన్ డాలర్ల మేర నష్టపోయింది. 2021 నుంచి కంపెనీ ఫార్మ్ లోకి వచ్చిన తర్వాత అత్యంత చెత్త ట్రేడింగ్ ను నిన్న (గురువారం) నమోదు అయ్యాయి.
షాకింగ్.. అనారోగ్యంతో బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి!
బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే (32) మృతి చెందారు. సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్‌తో గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో పూనమ్ మరణించారు. ఈ విషయాన్ని పూనమ్ పీఆర్ టీమ్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. గురువారం రాత్రి పూనమ్ మరణించారని ఆమె సన్నిహితులు కూడా మీడియాకు వెల్లడించారు. పూనమ్ మరణ వార్త తెలిసిన ఫాన్స్ షాక్‌కు గురవుతున్నారు. ఆమె మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘ఈ ఉదయం మాకెంతో కఠినమైనది. మా ప్రియమైన పూనమ్ పాండేను మేం కోల్పోయాం. గర్భాశయ క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ మరణించారు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిపట్ల ఆమె స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలను పంచారు. ఈ దుఃఖ సమయంలో పూనమ్ మరణవార్తను షేర్ చేసేందుకు ఎంతో బాధపడుతున్నాం. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాం’ అని పూనమ్ పాండే పీఆర్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది.
ఇట్స్ అఫీషియల్.. చిరంజీవి ‘విశ్వంభర’ వచ్చేది ఎప్పుడంటే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. ఈ చిత్రంను యూవీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విశ్వంభర సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విశ్వంభర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘అతీత శక్తుల పోరాటం నుంచి లెజెండ్స్ అవతరిస్తారు’ అని పవర్‌ఫుల్ పోస్టర్‌ను యూవీ క్రియేషన్స్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే విశ్వంభర చిత్రీకరణ ప్రారంభమైంది. అయితే చిరంజీవి ఇంకా సెట్స్‌లోకి అడుగు పెట్టలేదు. విశ్వంభర సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను తాజాగా షేర్ చేశారు. అందులో రెడీ ఫర్ విశ్వంభర అంటూ ఫుల్ జోష్‌లో చిరు చెప్పారు. దీంతో మెగాస్టార్ విశ్వంభర సెట్స్‌లోకి త్వరలోనే అడుగు పెట్టనున్నారని తెలిసింది. ఈ వారంలో మొదలయ్యే కొత్త షెడ్యూల్‌లో చిరు పాల్గొననున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను మేకర్స్ ఏర్పాటు చేశారు.
