ఎన్నికలపై ఫోకస్ పెట్టిన జగన్..
అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే ‘సిద్ధం’ సభలతో ప్రచారంలో దూకుడు పెంచిన జగన్.. ఇప్పుడు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు రెడీ అవుతున్నారు.. అందులో భాగంగా రేపు వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్ నిర్వహించనున్నారు.. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.. వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో.. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లకు.. పార్టీ పటిష్టతకు గ్రౌండ్ లెవల్‌లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనున్నారు. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేధాలను పరిష్కరించుకుని.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా మార్గనిర్దేశనం చేయనున్నారు సీఎం జగన్.. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే.. తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన మంచిని వివరిస్తూనే.. ప్రతిపక్షాలు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేలా నేతలకు సీఎం వైఎస్ జగన్ సూచనలు చేస్తారని తెలుస్తోంది. కాగా, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. ఇప్పటికే ‘సిద్ధం’ పేరుతో సభలు నిర్వహిస్తూ వస్తోంది వైసీపీ.. భారీ స్థాయిలో జనసమీకరణతో ఔరా! అనిపించేలా ఈ సభలు నిర్వహిస్తోన్న విషయం విదితమే.
పవన్‌కి ఇదే నా ఓపెన్ ఆఫర్.. ఎంత డబ్బు కావాలి..? మా పార్టీలో చేరితే సీఎంని చేస్తా..!
మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. పవన్.. ప్రజాశాంతి పార్టీలో చేరితే సీఎంని చేస్తానని ప్రకటించిన ఆయన.. పవన్ కి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా.. ఎంత డబ్బు కావాలి..? అని ప్రశ్నించారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన పాల్.. పవన్ కల్యాణ్, చంద్రబాబు పొత్తుతో ఒకే వేదిక మీద ఉన్న అతనిలో బాధ కనపడిందన్నారు.. కాపులు జనసేన, టీడీపి పొత్తుని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ.. తిరుపతి సాక్షిగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తాం అన్నారు. కానీ, ఆ మాట మర్చిపోయారని మండిపడ్డారు. దేశంలో మతతత్వం పెంచుతున్నారు.. జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తాం అంటున్నారు. మోడీ పాలనలో ఇతర మతాల ప్రజలకి భద్రత లేదని ఆరోపించారు. ఇక, పాస్టర్లకి తాను రైఫిల్ కొనిస్తాను.. ఆత్మ రక్షణ కోసం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పాల్.. మరోవైపు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకస్మికంగా చనిపోతాడు అని చెప్పను.. అదే జరిగింది.. తెలంగాణలో కేసీఆర్ చిత్తుగా ఓడిపోతారు అని చెప్పను.. అది కూడా జరిగిందన్నారు. ఇప్పుడు దేశంలో రూపాయి విలువ పడిపోయింది.. మోడీ ప్రభుత్వం వచ్చాక అప్పు.. నెలకి లక్షా పదివేల కోట్లుకి చేరిందన్నారు. మోడీ తోత్తులు అయిన టీడీపీ, జనసేన పార్టీలని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. వైసీపీ సిద్ధం అంటుంది.. టీడీపీ – జనసేన దోచుకోవడానికి సంసిద్ధం అంటుంది.. కానీ, ప్రజల రక్షణ కోసం ప్రజాశాంతి పార్టీ, కేఏ పాల్ ఆత్మీయ యుద్ధం అంటున్నారు.. ఇక ప్రజలు తేల్చుకోవాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.
రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరుతా.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
ఎన్నికల తరుణంలో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమా భేటీ అయ్యారు.. అయితే, ఈ రోజు మైలవరం టీడీపీ నేతలను కలుస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. అంతేకాదు.. దేవినేని ఉమాతో కలిసి పనిచేయడానికి సిద్ధం అంటున్నారు.. నందిగామ మండలం ఐతవరం గ్రామంలో మైలవరం నాయకులతో సమావేశం అయిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరుతానని ప్రకటించారు.. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రం లాగా ఇక్కడ నాయకులు వంగి దండాలు, పాదాభివందనాలు, బూతులు మాట్లాడితే చెల్లదు అని హెచ్చరించారు వసంత కృష్ణ ప్రసాద్.. అమరావతి రాజధాని అని చెప్పి… మాట మార్చడం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికే చెల్లిందని దుయ్యబట్టారు.. తాను ఎమ్మెల్యేగా మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను.. నా నియోజకవర్గం అభివృద్ధిపై ఎంపీ కేశినేని నాని చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. కాగా, మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన విషయం విదితమే.. అయితే, మంత్రి జోగి రమేష్‌తో ఆయనకు ఆది నుంచి పొసగలేదు.. కొన్నిసార్లు వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకుని సర్దిచెప్పినా.. అప్పటి వరకు సమస్యలు పరిష్కారం అయినట్టే కనిపించినా.. ఆ తర్వాత యథాస్థితి కొనసాగుతూ వచ్చింది.. మరోవైపు.. ఓ దిశలో ఆయన అలగడం.. టీడీపీతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం కూడా సాగింది.. అయితే ఉన్నట్టుండి మళ్లీ వైసీపీ వైపునే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మైలవరం ఇంఛార్జ్‌గా మరో వ్యక్తిని వైసీపీ రంగంలోకి దించడంతో.. తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు.
టికెట్ల టెన్షన్‌లో టీడీపీ సీనియర్లు.. ఐవీఆర్ సర్వేలతో ఆందోళన..!
ఎన్నికల వేళ.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను ఐవీఆర్ సర్వే టెన్షన్ పెడుతోంది.. పెనమలూరులో దేవినేని ఉమామహేశ్వరరావు, నరసరావుపేటలో యరపతినేని పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తోంది టీడీపీ అధిష్టానం.. ఇక, గురజాలలో జంగా కృష్ణమూర్తి పేరుతో.. సర్వేపల్లి నుంచి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరుతో తాజాగా ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయట.. రకరకాల పేర్లు తెరపైకి వస్తుండడంతో టెన్షన్‌లో పడిపోయారట మాజీ మంత్రి, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. మరోవైపు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేరుతో గతంలోనే మూడు చోట్ల ఐవీఆర్ఎస్ సర్వేలు చేసింది టీడీపీ అధిష్టానం.. ఆనం పేరుతో వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు సెగ్మెంట్లల్లో సర్వేలు చేసింది.. ఇక, ఫస్ట్ లిస్ట్‌లో తన పేరు ప్రకటించకపోవడంపై ఆందోళనలో కళా వెంకట్రావు ఉన్నారు.. ఎచ్చెర్ల నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారాయన.. ఇక, దెందులూరు నుంచి చింతమనేనికి కూడా క్లారిటీ రాలేదు.. చింతమనేని కుమార్తె పేరుతో దెందులూరులో ఐవీఆర్ఎస్ సర్వే నడిచింది.. అనకాపల్లి టిక్కెట్ ఆశించిన పీలా గోవింద్ డైలామలో ఉన్నారు..మరోవైపు.. బండారు సత్యనారాయణ మూర్తి సీటుపై కూడా క్లారిటీ రాలేదు.. పెందుర్తి టిక్కెట్ ఆశిస్తోన్నారు బండారు. ఇక, చీపురుపల్లి వెళ్లమని గంటా శ్రీనివాసరావుకు టీడీపీ అధిష్టానం సూచించిందట.. అయితే, భీమిలే కావాలంటూ గంటా పట్టు పడుతున్నారని సమాచారం.. ఉంగుటూరు టిక్కెట్ ఆశిస్తోన్న గన్ని వీరాంజనేయులుకూ క్లారిటీ రాలేదు.. చంద్రబాబు నివాసానికి వచ్చిన గన్ని.. ఆ విషయంపై మాట్లాడి వెళ్లారు.. కోవ్వూరు టిక్కెట్ కోసం తంటాలు పడుతున్నారు మాజీ మంత్రి జవహర్.. ఇలా టీడీపీ సీనియర్లలో టికెట్ల వ్యవహారం టెన్షన్ పెడుతోంది.
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్
టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది.. టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో పాలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. ఇక, టీటీడీలో వివిధ దశల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పారు.. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కరుణాకర్‌రెడ్డి.. గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇకపై నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద వున్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం చేయనున్నారు. రూ.4కోట్లతో 4,5,10 గ్రాముల తాళి బోట్టులు తయ్యారి.. నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయింపు.. ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది.. ఇదే సమయంలో అటవీ కార్మికుల జీతాల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు రూ.8.16 కోట్లు చెల్లించాలనే నిర్ణయానికి వచ్చారు. రూ.3.89 కోట్లతో తిరుచానూరులో లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అలిపిరిలో వున్న గోశాల వద్ద రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం చేసేందుకు నిర్ణయం తీసుకోగా.. విరాళంగా రూ.1.8 కోట్లు ఇచ్చేందుకు సముఖుత వ్యక్తం చేశారు శేఖర్ రెడ్డి.. ఇక, 15 పోటు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. రూ.3.19 కోట్లతో సప్తగిరి అతిధిగృహం ఆధునీకరణ.. రూ.3.15 కోట్లతో తిరుమలలోని జలాశయాల్లో ఉన్న మోటార్ పంపులు మార్పు.. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి ఉత్సవవరులుకు నూతన బంగారు కవచాలు.. 15 లక్షలతో వాహన తండ్లకు బంగారు తాపడం.. అలిపిరి నడకమార్గంలోని ముగ్గుబావిని తాగునీటి అవసరాల కోసం ఆధునీకీకరణకు ఆమోదం తెలిపారు.
రైతు బంధు, భీమా పక్కదారి నిజమేనా..! క్లారిటీ ఇచ్చిన సైబరాబాద్ సీపీ..
రైతుబంధు, రైతు బీమా పథకం డబ్బులు పక్కదారి పడుతున్నట్లు వస్తున్న వార్తలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు నిఘా పెట్టారు. నకిలీ పత్రాలతో రైతుబంధు రైతుబంధు బీమా పథకాలను కాజేస్తున్నారనే రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. రైతుబంధు, రైతు బీమా పథకం డబ్బులు కొట్టేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని ఏళ్ల నుంచి రైతుబంధు బీమా డబ్బులను డ్రా చేసిన తమ సొంతపనులకు వాడుకుంటున్నట్లు వెలుగులోకి రావడంతో అధికారులు షాక్ తిన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి నకిలీ వ్యక్తుల పేర్లతో డబ్బులు తీసుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. భూములు లేకపోయినా ఉన్నట్లుగా సృష్టించి రైతుబంధు బీమా పథకాలు డబ్బులను ముఠా తీసుకుంటున్నట్లు తెలిపారు. వీరిని చాక చక్యంగా పట్టుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే దీనిపై సైబరాబాద్ సీపి అవినాష్ మహంతి మాట్లాడుతూ.. క్లారిటీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ ఫిర్యాదుతో రైతుబంధు, రైతు బీమా పథకం డబ్బులు కొట్టేసినట్లు వెలుగులోకి వచ్చిందని అన్నారు. రంగారెడ్డి జిల్లా కుందుర్గ్ మండలంలో 20 రైతు భీమా క్లైయిమ్స్ జరిగాయని తెలిపారు. ఈ 20 క్లైయిమ్స్ అనుమామానాస్పదంగా ఉన్నట్లు ఏఓ గుర్తించడం జరిగిందని అన్నారు. ఈ 20 క్లైయిమ్స్ ద్వారా సుమారు కోటి రూపాయల ఎల్ఐసి అమౌంటు రైతు బీమా కింద డైవర్ట్ చేశారని తెలిపారు. సుమారు 130 నకిలీ పట్టేదారులను క్రియేట్ చేసి రైతు బందు స్కీంలో క్లెయిమ్ చేశారని అన్నారు. ఇందులో కొంత మంది అప్పటికే చనిపోయి ఉన్నారని సంచలన విషయాలు బయటపెట్టారు సీపీ. కొన్ని రోజుల తరువాత చనిపోయారని చెప్పి నగదు డైవర్ట్ చేశారని అన్నారు. కుందర్గ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని అన్నారు. ఆ తరువాత సైబరాబాద్ ఎకానమిక్స్ వింగ్ దర్యాప్తు చేసిందన్నారు. ఏఈఓ గోరెటి శ్రీశైలంతో పాటు వీరస్వామి ఇద్దరిని అరెస్టు చేశామని అన్నారు.
కళ్లుండి చూడలేని కబోదులు మీరు.. మల్లురవి ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఫైర్ అయ్యారు.. నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అవాకులు, చెవాకులు మాట్లాడారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని ఆయన మాట్లాడ్డం కల్లుండి చూడలేని కబోదిలా.. చెవులుండి వినలేని చెవిటివాడిలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండోరోజే ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేసి మరో రెండు రేపు చేవెళ్లలో అమలు చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోట్లాది మంది మహిళలు బస్ లల్లో ఉచిత ప్రయాణాలు చేస్తూ వారి అవసరాలు చేస్కోవడంతోపాటు డబ్బులు పొదుపు చేసుకుంటున్నారని అన్నారు. 5 లక్షల ఆరోగ్య శ్రీ భీమా 10 లక్షల రూపాయలకు పెంచాము. రోగులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యం బాగు చేసుకుంటున్నారని తెలిపారు. రేపు 500 రూపాయలకు గ్యాస్ సిలెండర్స్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయబోతున్నామన్నారు. రేవంత్ రెడ్డిని ముందుగా సీఎంగా ప్రకటిస్తే 30 సీట్లు రాకపోయేవని కేటీఆర్ అనడం ఆయన దూరంహకారానికి పరాకాష్ట అన్నారు. ముందుగానే రేవంత్ రెడ్డి సీఎం అని కాంగ్రెస్ ప్రకటిస్తే బీఆర్ఎస్ కు 3 సీట్లు కూడా రాకపోయేవని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య యుతంగా పని చేస్తుంది. ఎన్నికల తర్వాత గెలిచిన వారితో సీఎల్పీ నేతను ఎన్నుకుంటారని అన్నారు. మాది కుటుంబ పార్టీ కాదు ప్రజాస్వామ్య విలువలు నిండుగా ఉన్న పార్టీ అన్నారు. కేటీఆర్ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు.
భారత్ లో తగ్గిన పేదరికం.. నీతి అయోగ్ సర్వేలో కీలక విషయాలు..!
భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పలు కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయని నీతి అయోగ్ తెలిపింది. అది జరిపిన తాజా సర్వేలో భారత్‌లో దాదాపు 5 శాతం మేర పేదరికం తగ్గిందని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఆయన దీన్ని తాజ గృహ వినియోగ డేటా సర్వేను కీలకంగా చేసుకుని దీన్ని అంచనా వేసినట్లు చెప్పుకొచ్చారు. తాము ఆగస్టు 2022 నుంచి జులై 2023ల మధ్య జరిపిన గృహ వినియోగ సర్వే ఆధారంగా దీన్ని వెల్లడించినట్లు చెప్పారు. ఆయా సంవత్సరాల మధ్య జరిగిన గృహ వినియోగ సర్వేల ఆధారంగా.. గ్రామీణ , పట్టణ ప్రాంతాల మధ్య 2.5 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. పట్టణ గృహాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2011-12 నుంచి 3.5 శాతం మేర పెరిగి రూ. 3,510కి చేరుకుందన్నారు. అయితే, గ్రామీణ భారతదేశం గణనీయంగా 40.42 శాతం పెరుగుదలలో రూ. 2,008కి చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ డేటా ఆధరాంగా దేశంలో పేదరికం 5 శాతం లేదా అంతకంటే తగ్గే ఛాన్స్ ఉందని నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ఈ సర్వే ఆహారంపై పెడుతున్న ఖర్చు విధానాల్లో మార్పులను కూడా గుర్తించింది అని వెల్లడించారు. గ్రామీణ కుటుంబాలు మొత్తం వ్యయంలో 50 శాతం శాతం కంటే తక్కువ ఆహారం కోసం కేటాయించినట్లు సర్వేలో తేలింది. అలాగే, పట్టణ- గ్రామీణ వినియోగ విభజన 2004-05లో 91 శాతం నుంచి 2022-23 నాటికి 71 శాతం తగ్గిందని నీతి అయోగ్ పేర్కొనింది.
ఎలక్టోరల్ బాండ్ల రద్దుపై అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు..
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఇవాళ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పథకాన్ని ఒక కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. అమెరికాలోని మసాచుసెట్స్ నుంచి పీటీఐతో మాట్లాడిన సేన్.. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో మరింత పారదర్శకతను తీసుకురానున్నట్టు చెప్పారు. కాగా, ఎలక్టోరల్ బాండ్లు ఒక కుంభకోణం.. దానిని రద్దు చేసినందుకు నేను సంతోషిస్తున్నాను అని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంలో ప్రజలు ఒకరికొకరు ఇచ్చే మద్దతులో మరింత పారదర్శకత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.. రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయం చేయడానికి ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.. కొందరు రహస్యంగా ఈ బాండ్లు ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురైతాయని పేర్కొన్నారు. భారతదేశంలోని ఎన్నికల వ్యవస్థ పార్టీ రాజకీయాల స్వభావంతో లోతుగా ప్రభావితమైంది అని ఆర్థికవేత్త అమర్త్యసేన్ తెలిపారు. ఇది ఎన్నికలలో పాల్గొనాలని సాధారణ ప్రజలు వినడానికి చాలా కష్టతరం చేస్తుంది.. దీని వల్ల దేశ ఎన్నికల వ్యవస్థ ప్రభావితమవుతుందని ఆయన చెప్పారు. ప్రత్యర్థి పార్టీల పట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఈ సమస్య ప్రభావం చూపుతుంది. పౌరుల భావవ్యక్తీకరణ, స్వేచ్ఛతో పాటు వీలైనంత స్వతంత్ర ఎన్నికల వ్యవస్థను మేము కోరుకుంటున్నాము అని ఆయన తెలిపారు.
జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నేటి ఉదయం సంచలన తీర్పు వెల్లడించింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని వ్యాస్ కా తేకానాలో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది. కాగా, వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ(ఏఐఎంసీ) పిటిషన్‌ను జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం కొట్టివేసింది. నాలుగు రోజుల పాటు పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 15న రిజర్వ్ చేసింది. అయితే, మసీదు సెల్లార్‌లో హిందువులు పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్ విచారించేందుకు నిరాకరించడంతో హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. ఇక, ఈ తీర్పుపై అడ్వకేట్ ప్రభాస్ పాండే మాట్లాడుతూ.. తీర్పు ప్రకారం తేఖానా రిసీవర్‌గా వారణాసి జిల్లా కలెక్టర్ కొనసాగుతారని వెల్లడించారు.
లండన్ కు మకాం మార్చిన ప్రభాస్.. అద్దె ఇల్లు రూ. 60 లక్షలు.. ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. సలార్ హిట్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుటుంది. ఈ మధ్యనే ప్రభాస్ పై ఒక కీలక షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. ఇక ఈ షెడ్యూల్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రభాస్.. లండన్ లో కాలికి సర్జరీ చికిత్స తీసుకుంటున్న విషయం తెల్సిందే. షూటింగ్ లో చిన్న గ్యాప్ వచ్చినా కూడా డార్లింగ్ లండన్ వెళ్ళిపోతున్నాడు. ఇక అక్కడ ప్రతిసారి హోటల్స్ లో ఉండలేక.. ప్రభాస్ లండన్ లోనే ఒక అద్దె ఇల్లు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని సౌకర్యాలతో ఒక విలాసవంతమైన ఇల్లును డార్లింగ్ అద్దెకు తీసుకున్నాడట. చికిత్స అయ్యేవరకు .. ఆ ఇంట్లోనే ఉండనున్నట్లు సమాచారం. ఇక ఆ ఇంటి అద్దె సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ కు అంత ఎమౌంట్ లెక్క కాకపోయినా.. ఆ రేట్ చూసిన అభిమానులకు మాత్రం దిమ్మతిరిగిపోతుంది. దీంతో ఒక చిన్నపాటి ఇల్లే తీసుకోవచ్చు.. అద్దె అంత ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ లండన్ లోనే కొన్నిరోజులు ఉండనున్నాడు. ఇండియా తిరిగి వచ్చాకా కల్కి షూటింగ్ లో తిరిగి పాల్గొంటాడని తెలుస్తోంది. ఇక ఇది కాకుండా రాజాసాబ్ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడట డార్లింగ్. మరి ఈ సినిమాలతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
యానిమల్ సక్సెస్ ను ఎంజాయ్ చేయాలేకపోవడానికి కారణం అదే.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ ఎంత భారీ విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ సినిమాని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి ఎన్ని ప్రశంసలు దక్కాయో, అంతే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.అయితే, యానిమల్ మూవీ సక్సెస్ పై రష్మిక మందన ఎక్కడా కూడా స్పందించలేదు. ఎక్కడా ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, ఫంక్షన్స్ లో కనిపించడం కానీ జరగలేదు. దీంతో బీ టౌన్లో అలాగే ఆమె అభిమానుల్లో ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది.. అయితే, ఎట్టకేలకు ఆ విషయంపై రష్మిక స్పందించారు. ఇన్ స్టా పోస్ట్ ద్వారా ఆమె సమాధానం చెప్పారు. ‘‘ఎస్.. ఇప్పుడు మాట్లాడాల్సిన టాపిక్.. నేను ఎందుకు ‘యానిమల్’ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేయడం లేదు అని. నాకు తెలుసు ఇవి ప్రేమ, అభిమానం వల్లే వస్తున్నాయి. యానిమల్ టీమ్ అందించిన భారీ చిత్రాన్ని ప్రజలు ఆనందించారు, ఆదరించారు, ప్రశంసలు కురిపించారు. ఆ విజయాన్ని నేను ఆస్వాదించాలని అనుకున్నాను. టైం కేటాయించాలి అనుకున్నాను. కానీ, ఆ సినిమా విడులైన మరుసటి రోజు నుంచే నేను వేరే సినిమా షూట్ కి వెళ్లాల్సి వచ్చింది. అది నా కెరీర్ లోనే చాలా ముఖ్యమైన, పెద్ద ప్రాజెక్ట్. ఇంటర్వ్యూలలో,సక్సెస్ పార్టీల్లో కూడా నేను పాల్గొనలేకపోయా. ప్రతిష్ఠాత్మక చిత్రాల షూటింగ్స్ కోసం రాత్రిళ్లు కూడా నేను ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. మీరు నన్ను మిస్ అవుతున్నారని నాకు తెలుసు. ఆ లోటును నేను నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల ద్వారా భర్తీ చేస్తానని భావిస్తున్నా. అవి మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తాయి. మీరు వాటిని చూస్తూ ఎంజాయ్ చేసే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అన్నింటికీ మించి మీ ప్రేమే నాకు సంతోషాన్ని ఇస్తుంది’’ అని ఇన్ స్టాలో రష్మిక పోస్ట్ పెట్టారు.
హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఐశ్వర్య రాయ్!
సారా అర్జున్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విక్రమ్ ‘నాన్న’ సినిమాలో బాలనటిగా నటించి మెప్పించింది. అనంతరం ‘సైవం’ చిత్రంలో నటించిన సారా.. ఇటీవల మణిరత్నం హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో మెరిసింది. ఈ సినిమాలో యుక్త వయసులో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌గా నటించి మెప్పించింది. యువత హృదయాలను కొల్లగొడుతోన్న యంగ్ బ్యూటీ.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. 12 బీ, ఉన్నాలే ఉన్నాలే, ధామ్ ధూమ్ వంటి విజయవంతమైన చిత్రాలను డైరెక్ట్ చేసిన దివంగత దర్శకుడు జీవా వారసురాలు సనా మరియం త్వరలో మెగాఫోన్ పట్టబోతున్నారు. సనా దర్శకత్వం వహించనున్న సినిమాలో సారా అర్జున్ కథానాయికగా పరిచయం కానుంది. పొన్నియిన్ సెల్వన్‌లో విక్రమ్ చిన్ననాటి పాత్రను పోషించిన సంతోష్.. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారని తెలుస్తోంది. అవ్నీ పిక్చర్స్ పతాకంపై సుందర్ సి, కుష్బూ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
బీటెక్ లోనే ప్రేమ.. అతడు నా కళ్ళముందే చనిపోయాడు
నటి దివి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్నా కానీ, అమ్మడికి సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ కు ఫ్రెండ్ గా, హీరోకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన దివి బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తరువాతనే దివి గురించి అందరికి తెల్సింది. ఇక బిగ్ బాస్ తరువాత దివి.. అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న దివి.. మొట్ట మొదటిసారి తన బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. ” నేను బీటెక్ లో ఉన్నప్పుడే అతనిని కలిశాను. ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఎంటెక్ వరకు రిలేషన్ లో ఉన్నాం. ఇరు కుటుంబాల పెద్దలను కూడా ఒప్పించాం. త్వరలో పెళ్లి ఉండబోతుంది అనుకొనేలోపు అతని తమ్ముడు అనారోగ్యం కారణంగా చనిపోయాడు. తమ్ముడు అంటే అతనికి చాలా ఇష్టం. నేను కూడా అతని తమ్ముడుతో ఎక్కువగా ఎటాచ్ మెంట్ పెట్టుకున్నాను. అతనితో పాటు అతని తమ్ముడు బాగోగులు అన్ని కలిసి చూసుకున్నాం. తమ్ముడు నా కళ్ల ముందే చనిపోయాడు. ఇక తమ్ముడి మరణం నుంచి నా ప్రియుడు, వారి కుటుంబం కోలుకోలేకపోయింది. కుటుంబంతో సహా.. వారు సొంత ఊరికి వెళ్ళిపోయాడు. నేను నా కెరీర్ ను వదిలేసుకొని వస్తానేమో అని అతను నాకు ఆ విషయాన్నీ చెప్పలేదు. అలా మేము విడిపోవాల్సివచ్చింది. ఒకవేళ అదే కారణం కనుక అప్పుడు చెప్పి ఉంటే.. నేను కూడా వారితోనే ఊరికి వెళ్ళిపోయి ఉండేదాన్ని” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దివి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.