NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

రింగు వలల వివాదం..! విశాఖ తీరంలో మళ్లీ అలజడి
విశాఖ తీరంలో మళ్లీ అలజడి మొదలైంది. మత్స్యకార గ్రామాల మధ్య రింగు వలల వివాదం నివురు గప్పింది. ఎన్నికల సీజన్, సున్నితమైన వ్యవహరం కావడంతో పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. జాలరి ఎండాడ, వాస వాని పాలెంలో ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పహారా కొనసాగుతోంది. ఇక్కడ రింగువలల మత్స్యకారులు, సంప్రదాయ జాలర్ల మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. నిషేధిత రింగు వలలతో వేటకు వెళ్లడాన్ని పెద్ద జలరిపేట మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వేట విధానంలో మత్స్య సంపద వృద్ధికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, చట్టబద్ధంగా రింగు వలలకు గతంలో అనుమతులు తీసుకున్నామని.. వాటితో వేట సాగిస్తే మత్స్య సంపద దెబ్బతింటుందనే అభ్యంతరంలో నిజం లేదంటున్నారు జాలరి ఎండాడ ప్రజలు. రాజకీయంగా కూడా ప్రస్తుతం వాతావరణం వేడి ఎక్కుతోంది. ఈ నేపథ్యంలో మత్స్యకార గ్రామాల మధ్య సామరస్య వాతావరణం కోసం పోలీసులు చర్యలు ప్రారంభించారు.

ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్సీ.. ఘాటు విమర్శలు.. పోలీసులకు ఫిర్యాదు..
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, జనసేన నేత, ఎమ్మెల్సీ వంశీయాదవ్ మధ్య వ్యక్తి గత కక్షలు మరోసారి బహిర్గతం అయ్యాయి. తన రాజకీయ జీవితాన్ని ఎంపీ దెబ్బకొట్టారని భావిస్తున్న ఎమ్మెల్సీ వంశీయాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు ఎంవీవీ. ఆయన ప్రత్యర్ధిగా హ్యాట్రిక్ ఎమ్మెల్సీ వెలగపూడి రామకృష్ణబాబు బరిలోకి దిగుతున్నారు. జనసేన-టీడీపీ పొత్తుల కారణంగా ఉమ్మడి అభ్యర్ధి అయిన రామకృష్ణబాబు విజయం కోసం కలిసి పని చేస్తామని వంశీయాదవ్ ప్రకటించారు. అదే సమయంలో తనకు రాజకీయ, వ్యక్తిగత ప్రత్యర్ధిగా భావిస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు వంశీ యాదవ్. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇంటికి వచ్చి మరీ తంతానని.. ముఖ్యమంత్రి కాదు కదా దేవుడు వచ్చిన కాపాడలేడని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఎంవీవీని ఓడించడం ఖాయమని.. అది జనసేన, టీడీపీ విధానం అయితే.. తన వ్యక్తిగత అవసరమని ప్రకటించారు వంశీ. బిల్డర్ అయిన ఎంవీవీపై వ్యక్తిగత ఆరోపణల తో పాటు వ్యాపారపరమైన అభియోగాలు చేశారు ఎమ్మెల్సీ. అయితే, ఎంవీవీ, వంశీ మధ్య వివా దం కొత్తది కాకపోయినా బహిరంగంగా ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. సిట్టింగ్ ఎంపీపై ఎమ్మెల్సీ ప్రయోగించిన భాష చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఎమ్మెల్సీ వంశీ తీవ్రపదజాలంపై ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని ఎంవీపీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను అవమానించినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఎంవీవీ.

డీఎస్సీ 2024 నోటిఫికేషన్.. హైకోర్టులో అత్యవసర విచారణ
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇటీవలే డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ జారీ చేసింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది.. హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ముందు విచారణకు అనుమతి కోరారు పిటిషన్ తరపు న్యాయవాది.. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన.. 10 లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్‌సీటీఈ నిబంధనలుకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందన్నారు.. తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని ఆరోపించారు.. అయితే, ఈ పిటిషనర్ పై అత్యవసర విచారణ సోమవారం చేపడతామని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం సూచించింది.

కృష్ణపట్నం పోర్టుకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. వాస్తవాలు వివరించాలనే వచ్చా..
కృష్ణపట్నం పోర్టును సందర్శించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. కంటైనర్లతో వచ్చిన వెజల్ వివరాలను ఈ సందర్భంగా మంత్రికి వివరించిన పోర్టు అధికారులు.. ఇక, మంత్రి కాకాణి మాట్లాడుతూ.. కృష్ణపట్నం పోర్టును మూసివేస్తారని అందులో భాగంగానే కంటైనర్ మండల్ని ఎత్తు వేస్తారని టీడీపీ నేత సోమిరెడ్డి తప్పుడు ప్రచారం చేశారు అని ఫైర్‌ అయ్యారు. కరోనా వల్ల కంటైనర్ టెర్మినల్ లో కార్యకలాపాలు మందగించాయి అని వివరించిన ఆయన.. కంటైనర్ టెర్మినల్ ను మూసి వేయడం లేదని పోర్టు అధికారులు పదేపదే చెప్పినా.. టీడీపీ నేతలు పట్టించుకోలేదు.. అఖిలపక్షం పేరుతో హడావిడి చేశారు.. ఈ రోజు నాలుగు వేల కంటైనర్లతో షిప్ వచ్చిందని.. 2,800 కంటైనర్లను కృష్ణపట్నం పోర్టులో అన్ లోడ్ చేస్తున్నారని తెలిపారు. అయితే, తాను ప్రజలకు వాస్తవాలు వివరించాలనే పోర్టుకు వచ్చాను అని వివరించారు.. మరోవైపు, కోర్టులో దొంగతనానికి సంబంధించి సీబీఐ ఎదుట సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మూడుసార్లు హాజరయ్యారని తెలిపారు. ఛార్జిషీట్‌లో నా ప్రమేయం లేదని సీబీఐ తెలపడంతో ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రవర్తించాలని హితవుపలికారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

విశాఖ రాజధానే మా ఆకాంక్ష.. మళ్లీ జగన్‌ వస్తేనే అది సాధ్యం..
విశాఖ రాజధానిగా కావాలన్నదే మా ఆకాంక్ష.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్‌ వస్తేనే విశాఖను రాజధానిగా చేసుకోగలం అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రథసప్తమి రోజు అరసవల్లి వచ్చి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం మాకు అలవాటుగా పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలోనీ దుష్టచతుష్టయాన్ని ఎదుర్కొనే శక్తిని జగన్మోహన్ రెడ్డికి సూర్య భగవానుడు ప్రసాదించాలని తద్వారా ప్రజలకీ మంచి జరగాలని కోరుకున్నానని తెలిపారు. సూర్యనారాయణ స్వామి ప్రజలందరి జీవితాలలో వెలుగును తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.మరోవైపు.. నారా లోకేష్ కి అవగాహన లేదు అని ఫైర్‌ అయ్యారు అప్పలరాజు.. మా పలాస వచ్చి కోటి డబ్బే లక్షల టీచర్ పోస్టులు తామే వేశామన్నారు.. కానీ, అంతమంది విద్యార్థులే లేరు… అతని మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి అంటూ సెటైర్లు వేశారు. కుటుంబాన్ని, సచివాలయాన్ని, జిల్లాను,రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అభివృద్ధి, సంక్షేమం చేస్తున్న నాయకుడు వైఎస్‌ జగన్ అని ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ను.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ దూషించడం.. దురదృష్టకరo అన్నారు. మీకు మంచి జరిగింది అనిపిస్తే జగన్ ని గెలిపించండని ప్రజలకు కోరుతున్నాను అంటూ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు అని చెబుతున్న లోకేష్.. మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుని ఆ ప్రశ్న అడగాలి అని సూచించారు. ఇక, సీఎం జగన్‌ విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్‌ వస్తేనే విశాఖను రాజధానిగా చేసుకోగలం.. యువత అది గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.

ఎందరు అడ్డు వచ్చినా తిరుపతిని రాజధానిని చేస్తాం..!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా తిరుపతి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతామోహన్‌.. మరోసారి తిరుపతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తిరుపతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి రాజధానిపై ప్రజా ఉద్యమం ప్రారంభం అవుతోందన్నారు.. ఎందరు అడ్డు వచ్చినా తిరుపతిని రాజధానిని చేసి తీరుతామని ప్రకటించారు. ఇక, నిరుపేద వర్గాల అప్పుల మాఫీని మా మేనిఫెస్టోలో పెడతాం అన్నారు.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అప్పులను మాఫీ చేస్తాం అంటున్నారు చింతామోహన్‌.. మరోవైపు.. భారతదేశ చరిత్రలో నిన్న మరపురాని రోజుగా అభివర్ణించారు చింతామోహన్‌.. లాంగ్ లీవ్ సుప్రీం కోర్టు.. ఆ ధర్మాసనం ఇచ్చిన తీర్పు అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు.. ఎలక్టోరల్ బాండ్లపై జడ్జిమెంట్‌ గ్రేట్‌ అన్న ఆయన… తీర్పు ఇచ్చిన వారికి సెల్యూట్ చేస్తున్నాను అన్నారు.. ఇక, ప్రజల ఇబ్బందులు చంద్రబాబు, వైఎస్‌ జగన్ లకు కనపడటం లేదు అని దుయ్యబట్టారు కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ చింతామోహన్‌.

శివ బాలకృష్ణ విచారణలో కీలక విషయాలు..
ఆదాయానికి మించిన అక్రమార్జన కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ కేసులో ఆయన అనుచరులను ఏసీబీ విచారిస్తోంది. హెచ్‌ఎండీఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని, సత్యనారాయణ, భరత్‌లు శివబాలకృష్ణ బినామీలని అధికారులు ఇప్పటికే గుర్తించారు. వీరి పేరుతో చాలా భూములు, స్థలాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని విచారిస్తున్నారు. వేలానికి ముందే అధికారులు పలువురు రియల్టర్లకు సమాచారం అందించారని, పలువురు రియల్టర్లకు భూములు దక్కేలా అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు వేలంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వేలం వేసిన భూములపై ఇప్పటికే ఏసీబీ విచారణ చేపట్టింది. వేలం సమయంలో శివ బాలకృష్ణ హెచ్‌ఎండీఏలో పనిచేస్తున్నారు. భూముల వేలంతోపాటు ప్రాజెక్టుల వివరాలను రియల్టర్లకు చేరవేశారు. హెచ్‌ఎండీఏలో పలువురు అధికారుల పాత్రపై ఏసీబీ లోతుగా ఆరా తీస్తోంది. ఇదిలావుండగా శివ బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్‌కు ఏసీబీ ఇప్పటికే లేఖ రాసింది. మరోవైపు శివబాలకృష్ణకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిపై కూడా ఏసీబీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎన్నికల వేళ స్తంభించిన కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలు..
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభించాయని ఇవాళ తెలిపింది. వాటిలో యూత్‌ కాంగ్రెస్‌ ఖాతాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ‘ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించడం అని అని కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి అజయ్‌ మాకెన్‌ మండిపడ్డారు. తమ ఖాతాలను ఆదాయపన్ను శాఖ స్తంభింపజేసిందని ఆయన ఆరోపించారు. ఇక, ఈరోజు విలేకరుల సమావేశంలో మాకెన్ మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలలోని 210 కోట్ల రూపాయలను కట్టాలని ఆదాయపు పన్ను చెప్పింది. అయితే, ఎన్నికలకు కేవలం 2 వారాల ముందు ప్రతిపక్షాల బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడం.. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడం లాంటిది అని ఆయన అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఖర్చు చేయడానికి, బిల్లులు కట్టడానికి లేదా ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా నిధులు లేవని అజయ్ మాకెన్ అన్నారు.

దేశాన్ని కాంగ్రెస్ అంధకారంలోకి నెట్టింది.. మేమే బయటకు తీసుకొచ్చాం..
రాజస్థాన్‌లో రూ.17 వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెగిటివ్ ఆలోచనలతో ఉండే కాంగ్రెస్, పాజిటివ్ నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఈ కారణంగానే కరెంట్ విషయంలో కాంగ్రెస్ అపఖ్యాతి మూటగట్టుకుంది అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతల వల్ల దేశవ్యాప్తంగా చాలా చోట్ల గంటల కొద్దీ అంధకారం ఉండేది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కరెంట్ కొరత ఉంటే ఏ దేశం అభివృద్ది సాధించలేదు.. ఇక, కాంగ్రెస్ భవిష్యత్ గురించి ఊహించలేదు.. రోడ్డు మ్యాప్ గురించి ఆలోచించలేదు అని ప్రధాని తెలిపారు. కాగా, ప్రగతిశీల ఆలోచనలతో సానుకూల విధానాలు రూపొందించలేకపోవడం కాంగ్రెస్‌కు పెద్ద సమస్య అని ప్రధాని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని అంధకారం నుంచి బయటపడేశామని ఆయన పేర్కొన్నారు.

రూ.500ల తగ్గింపుతో చౌక బంగారం కొనేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్
మోడీ ప్రభుత్వం నుంచి రూ.500 తగ్గింపుతో ‘చౌక’ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు నేడే చివరి అవకాశం. సావరిన్ గోల్డ్ బాండ్ కొనుగోలుకు ఈరోజు చివరి తేదీ. ఈ బంగారం స్పెషాలిటీ ఏంటంటే.. దీనిని ఏ దొంగ కూడా దొంగిలించలేడు. ఏ నగల వ్యాపారి కూడా అందులో కోత పెట్టలేడు. మీరు ఈ బంగారంతో ఆభరణాలను తయారు చేయలేరు. ఆభరణాల తయారీకి బంగారాన్ని కొనుగోలు చేయడానికి మీరు బులియన్ మార్కెట్‌కు వెళ్లవలసి ఉంటుంది. కానీ ఈ బంగారంతో మీరు బంగారం నుండి వచ్చే రాబడిని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వ గోల్డ్ బాండ్ (SGB) విక్రయం సోమవారం నుండి అంటే నేటి వరకు ఐదు రోజుల పాటు జరుగుతోంది. మీరు గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు చివరి రోజు. RBI తన ఇష్యూ ధరను గ్రాముకు రూ.6,263గా నిర్ణయించింది. అంటే 10 గ్రాముల బంగారానికి రూ.62630 చెల్లించాల్సి ఉంటుంది. గురువారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61508 వద్ద ముగిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇది నాల్గవ సిరీస్ గోల్డ్ బాండ్‌లు.

హైదరాబాద్ మహిళా క్రికెటర్ల పట్ల అసభ్య ప్రవర్తన.. కోచ్ జై సింహాను సస్పెండ్ చేసిన హెచ్‌సీఏ!
హైదరాబాద్ మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ జై సింహాపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని హెచ్‌సీఏ ఆదేశించింది. జై సింహాను సస్పెండ్‌ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావు ఆదేశాలు జారీ చేశారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని, క్రిమినల్ కేసులు పెడతాం అని తెలిపారు. ‘గత కొంతకాలంగా మహిళా క్రికెట్ కోచ్ జై సింహాపై ఫిర్యాదులు వస్తున్నాయి. జై సింహాను సస్పెండ్ చేస్తున్నాం. మహిళలపై వేధింపులకు పాల్పడితే జీవిత కాలం నిషేధం విధిస్తాం. జై సింహాపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. హెచ్‌సీఏకు సంబంధించిన కార్యక్రమాల్లో జై సింహా పాల్గొనకూడదు. ఇలాంటి చర్యలకు పాల్పడితే లైఫ్ టైం బ్యాన్ చేస్తాం. మహిళా క్రికెటర్లకు హెచ్‌సీఏ అండగా ఉంటుంది. పూర్తి స్థాయి విచారణ జరుపుతాం’ అని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావు అన్నారు. కోచ్ జై సింహాపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు జనవరిలో లేఖ రాశారు. జై సింహాకు పలువరు అండగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. జై సింహా తాగుడుకు బానిస అయ్యాడు. తమ ముందు మద్యం తాగొద్ధని పలుమార్లు మహిళా ప్లేయర్స్ వారించినా వినలేదు. తనను ప్రశ్నిస్తే టీంలో నుండి తీసేస్తామని బెదిరింపులు గురిచేవాడు. బీసీసీఐకి కూడా మహిళా క్రికెట్ ప్లేయర్స్ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నెల రోజుల తరువాత హెచ్‌సీఏ స్పందించింది.

‘ఊరు పేరు భైరవకోన ‘ సినిమా హిట్ కొట్టినట్లేనా?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. అయితే ఈ హీరో ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయ్యింది.. తాజాగా ‘ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ సినిమా ఈరోజు విడుదలైంది.. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా ఈ మూవీని నిర్మించారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక విడుదలకు రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 14న వేసిన పెయిడ్‌ ప్రీమియర్స్‌కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ రావడంతో పాటు సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈరోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఊరి పేరు భైరవకోన’ ఎలా ఉంది? సందీప్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? అనేది ట్విట్టర్ ద్వారా నెటిజన్లు చర్చిస్తున్నారు..సూపర్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ ‘ఊరు పేరు భైరవ కోన’లో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్‌ నెమ్మదిగా సాగినప్పటికీ.. కథ ఆకట్టుకునేలా ఉంటుంది. సెకండాఫ్‌ కొంత సమయం తర్వాత ట్రాక్ నుండి బయటపడి ఊహాజనిత మోడ్‌లోకి వెళుతుంది. ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది.. మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

‘రాజధాని ఫైల్స్‌’ విడుదలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌!
‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వైసీపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. రివైజింగ్‌ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో నేటి నుంచి యధావిధిగా రాజధాని ఫైల్స్‌ షోలు కొనసాగనున్నాయి. రాజధాని ఫైల్స్‌ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు గురువారం అడ్డుకున్న విషయం తెలిసిందే. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు రాజధాని ఫైల్స్‌ సినిమా తీశారని.. సెన్సార్‌ బోర్టు జారీ చేసిన ధ్రువ పత్రాన్ని రద్దు చేయాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిబ్రవరి 13న విచారణ జరిపిన హైకోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేయాలని గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం విచారణ చేపట్టి సినిమా విడుదలకు అంగీకారం తెలిపింది. సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించిన కోర్టు.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని పేర్కొంది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను కోర్టు వాయిదా వేసింది.