ఎన్నికల కోసమే ఉమ్మడి రాజధాని డ్రామా..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వ్యవహారం వివాదాస్పదంగా మారింది.. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో దుమారం రేగింది.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీది ఉమ్మడి రాజధాని విధానం కాదు.. వైవీ వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. అయితే, వైసీపీని టార్గెట్ చేస్తూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. ఎన్నికలు సమీపిస్తున్నందున హైదరాబాద్ రాజధాని డ్రామాకు వైసీపీ తెరలేపిందని మండిపడ్డారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని నిర్వీర్యం చేశారు.. వైసీపీ మూడు ముక్కలాటతో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా హైదరాబాద్ ఊసే ఎత్తని వైసీపీ, ఇప్పుడు నిద్రలేచిందని… హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో రెండేళ్లు కావాలంటూ మరో కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రోజున నాగార్జునసాగర్ డ్యాం పై హడావుడి సృష్టించి.. కేసీఆర్‌కు లబ్ధి చేకూర్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ఎన్నికల డ్రామాలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం..!
రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.. అయితే, ఏపీలోని రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.. మూడు సీట్లకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నుంచి ముగ్గురు నామినేషన్ల దాఖలు చేశారు.. రెండు సెట్ల నామినేషన్ల దాఖలు చేశారు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధ్ రెడ్డి, గొల్ల బాబూరావు.. అయితే, రాజ్యసభ రేసుకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేతలకు క్లారిటీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. దీంతో, వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.. ఏకగ్రీవం లాంఛనమే కాగా.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా బరిలోకి దిగి.. తమ అభ్యర్థిని గెలిపించుకుంది తెలుగుదేశం పార్టీ.. దీంతో, రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో టీడీపీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనే చర్చ జోరుగా సాగింది.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు.. సీట్లు దక్కని సిట్టింగులు, మరికొందరు ఎమ్మెల్యేలు వైసీపీపై అసంతృప్తితో ఉన్నారని.. ఇది క్యాష్ చేసుకోవడానికి టీడీపీ తన అభ్యర్థిని పోటీకి దింపుతుందనే ప్రచారం సాగింది. కానీ, బలం లేకపోవడంతో బరిలో దిగకూడదని నిర్ణయించుకుంది టీడీపీ.. పార్టీ సీనియర్ల సమావేశంలో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే ఈ విషయాన్ని ప్రకటించారు.. ఇక, రేసు నుంచి టీడీపీ తప్పుకోవడంతో మూడు సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైపోయింది.
తిరుపతి రాజధాని అవుతుంది.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి.. అయితే, తిరుపతి రాజధాని అవుతుంది, అవ్వాలని ప్రజలు కోరుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్.. సీమలో కరువు పోయి అభివృద్ధి జరగాలంటే తిరుపతి రాజధానిగా మారితేనే సాధ్యం అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన చింతామోహన్.. సీమకు నీళ్లు లేవు.. రాళ్లు మిగిలాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, బ్రహ్మంగారు కాల జ్ఞానంలో తిరుపతి రాజధాని అవుతుందని రాశారు.. అందుకోసం అందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. తిరుపతి అందరికీ ఆమోద యోగ్యమైన ప్రాంతం.. భూములు, వనరులు, ఆహ్లాదకర మైన వాతావరణం అన్నీ ఉన్నాయని వెల్లడించారు. మూడు రాజధానులు అని చెప్పిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనటం ఏంటి? అని నిలదీశారు చింతామోహన్.. స్వార్థ ఆర్ధిక ప్రయోజనాల కోసం హైదరాబాద్‌ను విడిచిన చంద్రబాబు.. తుళ్లూరు వచ్చారని విమర్శించిన ఆయన.. భూముల కోసం వైసీపీ.. విశాఖపట్నం వెళ్లిందని ఆరోపించారు. తిరుపతి రాజధాని చేయాలని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చెప్పినా.. సంజీవయ్య కర్నూలుకి పంపించారని.. ఆ తర్వాత రాజధాని హైదరాబాద్ వెళ్లిందన్నారు. తుళ్లూరు నుంచి విశాఖ వెళ్లిన రాజధాని.. ఇప్పుడు గాల్లో ఉంది అని ఎద్దేవా చేశారు. మరోవైపు.. రాష్ట్ర రాజకీయాలు భ్రష్ఠు పట్టాయి.. పాకిస్థాన్ కంటే ఘోరంగా ఏపీ పాలిటిక్స్ మారాయని ఫైర్ అయ్యారు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావాలని అన్నీ వర్గాలు కోరుతున్నాయన్నారు. ఇక, వైఎస్ జగన్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.. జగన్ కు ఈ ఎన్నికల్లో 10 సీట్లు లోపు వస్తాయని జోస్యం చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అర్థరాత్రి చంద్రబాబు కలవాల్సిన అగత్యం ఏంటి? అని నిలదీశారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభ ఘోషిస్తోందన్న ఆయన.. వైఎస్ షర్మిల రావటం వల్ల కాంగ్రెస్ కు లాభం చేకూరింది.. కాంగ్రెస్ మైలేజ్ ను షర్మిల పెంచింది.. షర్మిల ను సీఎంగా చూడాలని ప్రజల్లో ఉంది.. కాంగ్రెస్ 130 స్థానాల్లో గెలుస్తుంది. రెండో స్థానంలో చంద్రబాబు నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్.
సీఎం అవ్వడానికి చిరంజీవికి ఇదే చివరి అవకాశం.. ఆయన రాకపోతే..!
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలి.. తిరుపతి నుంచి పోటీ చేయాలి.. సీఎం కావాలి అనే కోరుకునే నేతల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతామోహన్ ఒకరు.. ఇప్పటికే పలు సందర్భాల్లో.. చిరంజీవి మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని.. తిరుపతి నుంచి పోటీ చేయాలని.. ఆయన నామినేషన్ వేసి వెళ్తే చాలు.. గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని గతంలో పలు మార్లు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చిరంజీవియే అని ప్రకటించారు కూడా.. మరోసారి చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చింతామోహన్.. ముఖ్యమంత్రి అవ్వడానికి చిరంజీవికి ఇదే చివరి అవకాశంగా పేర్కొన్న ఆయన.. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, చిరంజీవి ఇప్పుడు రాకపోతే పదేళ్ల పాటు కాపులు, బలిజలకు ఏ అవకాశం రాదు అని చెప్పుకొచ్చారు చింతామోహన్.
కిరణ్‌కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్ బలహీనం..!
2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు.. కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్.. మూడో జోనల్ రివ్యూ మీటింగ్ విశాఖలో జరిగింది.. ఏపీలో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతోందని కేంద్రానికి హైకోర్టు ద్వారా తెలిసినా చర్యలు లేవన్నారు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమ ఇసుక మైనింగ్ పై స్పందించేందుకు సిద్ధంగా లేదని అర్ధమవుతోందని విమర్శించిన ఆయన.. ఇక, చంద్రబాబు స్పెషల్ కేటగరీ స్టేటస్ గురించి అడగకుండా NDAలోకి వెళతారా? అని ప్రశ్నించారు. మరోవైపు, ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు ఆర్డర్ పూర్తిగా చదివిన తరువాత స్పందిస్తాం అన్నారు మాణిక్కం ఠాకూర్.. ఏపీలో నాలుగు ర్యాలీలు నిర్వహిస్తాం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మొదటి ర్యాలీలో పాల్గొంటారు.. కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా వచ్చి ర్యాలీల్లో పాల్గొంటారని తెలిపారు. 2014లో కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు కాంగ్రెస్ ను బలహీన పరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలా పనిచేస్తున్నాం అన్నారు. ఎమ్మెల్యే ఆర్కే ఏం చేస్తారనేది ఆయనే చెప్పాలన్నారు. ఇక, ఎలక్టోరల్ బాండ్లు అంశంపై కేంద్ర పార్టీతో మాట్లాడి స్పందిస్తాం అన్నారు. ప్రతిపక్షాలను పోటీకి రాకుండా చేయడానికి మోడీ ప్రభుత్వం తెచ్చినవి ఎలక్టోరల్ బాండ్లు అని దుయ్యబట్టారు. మాకు వెయ్యికి పైగా అప్లికేషన్లు వచ్చాయని ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు కాంగ్రెస్ ఎంపీ.. ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్.
అందుకే ప్రధాని మోడీని సీఎం జగన్.. హోంమంత్రి అమిత్‌షాను చంద్రబాబు కలిశారు..!
ఏపీలో ఎన్నికల పొత్తులపై వాడివేడీగా చర్చలు సాగుతోన్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సాగడం ఆసక్తికరంగా మారింది.. ఈ పర్యటనలో ఏం చర్చలు జరిగాయి అనేది పక్కన పెడ్డితే.. ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కలిశారని.. అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారని తెలిపారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. అయితే, ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ నెల 22న మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నెల్లూరుకు వస్తున్నారని తెలిపారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది.. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది.. ఇసుక దోపిడీ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది.. ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు.
ట్రాఫిక్ చలాన్ల రాయితీపై చెల్లింపు.. నేటితో ముగియనున్న గడువు
గత ఏడాది డిసెంబర్ 27న పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. చలాన్ల చెల్లింపునకు జనవరి 10 వరకు గడువు ఇవ్వగా.. ఆ తర్వాత గడువును జనవరి 31 వరకు పొడిగించింది. అనంతరం ముచ్చటగా మూడోసారి ఫిబ్రవరి 15వ తేదీవరకు పొడిగిస్తూ అధికారులు ప్రకటించారు. దీంతో సబ్సిడీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు ఇవాళ (గురువారం) అర్ధరాత్రితో ముగియనుంది. పెండింగ్‌లో ఉన్న వాహనాల చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి గడువు పొడిగించేది లేదని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న చలాన్‌ల చెల్లింపు గడువు నేటి అర్ధరాత్రి 11:59 గంటలతో ముగుస్తుంది. గత ఏడాది డిసెంబర్ 26 నుంచి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రభుత్వం రాయితీని కల్పించింది. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు గడువును పొడిగించింది. ఇకపై గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలతో పాటు త్రీ వీలర్లపై 80 శాతం తగ్గింపును ప్రకటించింది. కార్లతో పాటు ఇతర వాహనాలకు 60 శాతం తగ్గింపును ప్రకటించింది. ఆర్టీసీ బస్సులపై ప్రభుత్వం 90 శాతం రాయితీ కల్పించిన విషయం తెలిసిందే..
అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న సభ జరుగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించగా అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ… సభ నడుస్తుండగా మీడియా పాయింట్లో ఎవరూ మాట్లాడకూడదని స్పష్టం చేశారు. బ్రేక్ టైంలో మాత్రమే మీడియా పాయింట్‌లో సభ్యులు మాట్లాడాలని స్పీకర్ ఆదేశించారు. ఇవాళ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. దీనిపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. ఇక ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సర్కార్ సభలో పెట్టింది. ప్రాణహిత ప్రాజెక్టు లో ఎలాంటి పురోగతి లేదు దీనికోసం కేటాయించిన 878 కోట్లు నిష్ఫలంగా మారిపోయాయన్నారు. రీఇంజనీరింగ్ పేరుతో డబ్బులు వృధా చేశారన్నారు. ప్రాణహిత మీద..2022 మార్చి నాటికి..1727 కోట్లు కాగా.. కాళేశ్వరం పై 86, 788 కోట్లు ఖర్చు.. కాళేశ్వరం పై అంతరాష్ట్ర సమస్యలు.. నిల్వ సామర్థ్యం.. సౌకర్యం పై సరైన అధ్యయనం చేయలేదన్నారు. అస్తవ్యస్తంగా.. పనులు ప్రారంభించారని తెలిపారు. మహారాష్ట్ర లో ముంపు సమస్యను కాగ్ ఎత్తిచూపించింది. ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగింది కానీ.. ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వడ్డితో సహా 1,47,427 కోట్లకు పెరిగిందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ లేదన్నారు. ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరార్థకం అయ్యాయి.. ఫలితంగా 767 కోట్లు నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం డీపీఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నాయన్నారు. రి ఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారని తెలిపారు. 2018 లో కాళేశ్వరం dpr ని కేంద్ర జలసంగం ఆమోదించాక ముందే 17 పనులు.. 25049 కోట్లకు అప్పగించారన్నారు.
ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అవి రాజ్యాంగ విరుద్ధం..
ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పుకొచ్చింది. రాజకీయ పార్టీలకు విరాళాలివ్వడం క్విడ్ ప్రోకోకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పును ఇచ్చింది. బ్లాక్ మనీని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదన్నారు. విరాళాల దాతల పేర్లు గోప్యంగా ఉంచడం సరికాదని రాజ్యంగ ధర్మాసనం పేర్కొంది. అయితే, ఐదుగురు న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) ప్రకారం విరుద్ధమని చెప్పింది. ఎలక్టోరల్ బాండ్స్ ను రద్దు చేయాల్సిందేనని తెలిపింది. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు ఇతర మార్గాలున్నాయి.. నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరు అనే విషయాన్ని సుప్రీంకోర్టు కామెంట్స్ చేసింది. అయితే, రాజకీయ పార్టీలకు వచ్చిన ఫండ్ ఎవరిచ్చారో తెలియాలి అని సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం తెలిపింది. 2019 నుంచి జారీ చేసిన ఎలెక్టోరల్ బాండ్స్ వివరాలు బహిర్గతం చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెబ్ సైట్ లో పెట్టాలి అని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
యాంటీ వాలంటైన్ వీక్.. ఈ రోజుల ప్రత్యేకత ఏంటో తెలుసా ?
ఫిబ్రవరి రెండో వారంలో అంటే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎక్కడ చూసినా ప్రేమ సంబరాల్లో జనం మునిగి తేలుతుంటారు. ఈ వారం ప్రేమికులకు పరీక్ష అని అంటారు కానీ ఇది పూర్తిగా నిజం కాదు ఎందుకంటే వాస్తవానికి పరీక్ష ప్రారంభం వాలెంటైన్స్ డే రెండవ రోజు. ఫిబ్రవరి 15 నుండి యాంటీ-వాలెంటైన్ వీక్ జరుపుకుంటారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకున్నారు. అయితే మీరు నేటి నుండి యాంటీ వాలెంటైన్ వీక్‌ని కూడా జరుపుకుంటారు. ఈ వారంలో ఏయే రోజులు జరుపుకుంటారో తెలుసుకుందాం. ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమయ్యే యాంటీ-వాలెంటైన్ వీక్‌లో వచ్చే రోజులు చాలా సరదాగా ఉంటాయి. ఈ వారంలో మొదటి రోజు స్లాప్ డే. నిజానికి ఈ రోజును జోక్‌గా తీసుకుని ఫిబ్రవరి 15న చెంపదెబ్బ కొట్టే సంప్రదాయం ఉందని చెబుతారు. ఫిబ్రవరి 16 అంటే వాలెంటైన్ వ్యతిరేక వారం రెండవ రోజు వారి జీవితాల్లో చేదును కలిగించిన వ్యక్తుల కోసం. ఈ రోజును కిక్ డేగా జరుపుకుంటారు. అంటే మీకు ప్రతికూలంగా ఉన్న వారిని మీ జీవితం నుండి తొలగించండి.
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు.. అలర్టైన పోలీసులు
ఢిల్లీ హైకోర్టుకు బాంబుల బెదింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ- మెయిల్ ద్వారా పంపారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు న్యాయస్థానం దగ్గర కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. ఇక, ఢిల్లీ హైకోర్టులో భారీ బాంబు పేలుడు సంభవిస్తుందని బుధవారం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ మెయిల్ ఈ మెస్సేజ్ వచ్చింది. అయితే, ఇవాళ (‘ఫిబ్రవరి 15న) హైకోర్టులో బాంబు పేల్చుతానంటూ వచ్చిన ఈ- మొయిల్ పేలుడు ఢిల్లీలోనే అతిపెద్దది కానుంది అని అందులో పేర్కొన్నారు. అయితే, ఎంత మంది భద్రతా బలగాలైనా పెట్టుకోండి.. అందరినీ పేల్చివేస్తాం అంటూ గుర్తు తెలియని దుండగులు ఈ మెయిల్‌లో బెదిరింపులకు దిగారు. ఇక, ఇదే రోజు మరోవైపు బీహార్ డీజీపీకి సైతం వాట్సప్ లో ఆడియో క్లిప్ ద్వారా బాంబు బెదిరింపు పంపడం గమనార్హం. అయితే, ఈ ఘటనలో నిందితుడిని కర్ణాటకలో పటుకున్నామని పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి అతణ్ని ఎంక్వైరీ కోసం పట్నాకు తరలించారు. నిందితుడిని అన్ని కోణాల్లో లోతుగా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
అరుదైన రికార్డు నెలకొల్పిన సర్ఫరాజ్ ఖాన్.. సచిన్ టెండూల్కర్ తర్వాత..!
దేశవాళీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తుది జట్టులో సర్ఫరాజ్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదగా అతడు టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. దాంతో సర్ఫరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అరంగేట్రం చేసే సమయానికి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు ఉన్న ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు. భారత్ తరఫున అరంగేట్రం చేసే సమయానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వినోద్ కాంబ్లీ అత్యధిక బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. కాంబ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టే ముందు 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 88.37 సగటుతో పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 45 మ్యాచ్‌ల్లో 69.85 సగటుతో రన్స్ చేశాడు. ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్‌ను అధిగమించి.. సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 45 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 3,912 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 11 అర్ధ శతకాలు ఉన్నాయి.
ఓటీటీ లోకి రాబోతున్న ఎమోషనల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
మణికందన్, శ్రీ గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ట్రూ లవర్..ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు. తమిళంలో లవర్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీని తెలుగులో ట్రూ లవర్‌గా డైరెక్టర్ మారుతి మరియు బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కలిసి రిలీజ్ చేశారు.యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ మూవీని తెరకెక్కించాడు. కాలేజీ రోజుల నుంచి అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీగౌరిప్రియ) ప్రేమించుకుంటారు. ప్రతి విషయంలో దివ్యను అనుమానిస్తుంటాడు అరుణ్. ఆమె మరొకరితో క్లోజ్‌గా మాట్లాడినా అస్సలు సహించలేడు. అరుణ్ ప్రవర్తనకు విసిగిపోయిన దివ్య అతడికి బ్రేకప్ చెప్పాలని ఎన్నో సార్లు అనుకుంటుంది.దివ్య తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లిన ఓ టూర్‌కు ఆమె వెంట అరుణ్ కూడా వెళతాడు..అక్కడ ఏం జరిగింది..అరుణ్‌లో మార్పు వచ్చిందా..దివ్య ప్రేమను అర్థం చేసుకున్నాడా.. అన్నదే ఈ మూవీ కథ. అపనమ్మకం మరియు అభద్రతా భావంతో కూడిన ఏ ప్రేమ నిలబడదనే పాయింట్‌తో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ట్రైలర్ మరియు టీజర్స్‌తో ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించింది. కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. తమిళంలో మాత్రం డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.తమిళంలో లవర్ మూవీ రజనీకాంత్ లాల్ సలామ్ కలెక్షన్స్‌ను బీట్ చేసింది. ఆరు రోజుల్లో ఈ మూవీ పది కోట్ల వరకు గ్రాస్, నాలుగున్నర కోట్ల షేర్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.. ట్రూ లవర్‌లో నటించిన శ్రీ గౌరిప్రియ తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఈ భామ వైజయంతీ మూవీస్‌లో వచ్చిన ‘మెయిల్ ‘మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది . ఇటీవలే ఈ భామ మ్యాడ్ మూవీ తో తెలుగులో పెద్ద హిట్ అందుకున్నది. ఇదిలా ఉంటే ట్రూ లవర్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తమిళం మరియు తెలుగు స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం.ఎమోషనల్ లవ్ స్టోరీ గా రూపొందిన ట్రూ లవర్ మూవీ మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.. మార్చి ఫస్ట్ వీక్‌లో ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తుంది.
ఈసారి ‘రాజా సాబ్’ లేకుండానే లాగిస్తున్నారు…
సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న కల్కికి.. త్వరలోనే ప్యాకప్ చెప్పేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక సలార్ తర్వాత ఆరు నెలల గ్యాప్‌లో కల్కిగా వస్తున్న ప్రభాస్… మరో ఆరు నెలల గ్యాప్‌లో రాజా సాబ్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్టింగ్ నుంచి సైలెంట్‌గా షూటింగ్ జరుపుకున్న మారుతి సినిమాను పోయిన సంక్రాంతికి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. రాజా సాబ్ టైటిల్‌తో వింటేజ్ డార్లింగ్‌ను చూపించి కిక్ ఇచ్చాడు మారుతి. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజా సాబ్… త్వరలో మరో కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల మూడో వారం తరువాత ఓ షెడ్యూలు ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రభాస్ లేని సీన్లు షూట్ చేయనునట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కికి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. మరో వెర్షన్ ప్రకారం… యూరప్ ట్రిప్‌లో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల మాట. అందుకే… రాజా సాబ్ నెక్స్ట్ షెడ్యూల్‌లో ప్రభాస్ లేకుండానే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట మారుతి. వీలైనంత తర్వాత రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ ఏడాది చివర్లో లేదా… వచ్చే సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరి నిర్మిస్తున్న ఈ సినిమాలో… మాళవిక మోహన్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
OG విలన్ ని సెట్ చేసిన గూఢచారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్ మోస్ట్ అంటిసిపేటెడ్ మూవీ OG. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నాడు. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇటీవలే నెగటివ్ రోల్స్ ప్లే చేస్తున్న ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా విలన్ గా నటించడానికి రెడీ అయ్యాడు. అడివి శేష్ హీరోగా గూఢచారి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న భారీ బడ్జట్ సినిమా గూఢచారి 2. గతేడాది డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ సినిమాలో విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఇమ్రాన్ హష్మీ జాయిన్ అవ్వడంతో గూఢచారి 2 మార్కెట్ స్పాన్ మరింత పెరిగింది. విజయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బనిత సంధు హీరోయిన్ గా నటిస్తోంది. గూఢచారి సినిమా తెలుగులో స్పై సినిమాలకి మార్కెట్ క్రియేట్ చేసింది. తక్కువ బడ్జట్ లో థ్రిల్లింగ్ సినిమాని ఆడియన్స్ కి ఇచ్చి హిట్ కొట్టిన శేష్… ఇప్పుడు సాలిడ్ బడ్జట్ అండ్ స్టెల్లార్ స్టార్ కాస్ట్ తో ఎలాంటి సినిమా చేస్తాడు? ఏ రేంజ్ హిట్ కొడతాడు అనేది చూడాలి.
