NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

పురంధేశ్వరి సహా ఢిల్లీకి ఏపీ బీజేపీ ముఖ్య నేతలు..!
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. ఏ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లినా.. పొత్తుల కోసమే అనే చర్చ సాగుతోంది.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వరుసగా హస్తిన పర్యటనకు వెళ్లారు.. చంద్రబాబు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వస్తే.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రధాని మోడీ, అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌ లాంటి వారిని కలిసి వచ్చారు.. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టలపై విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ రెండు పర్యటనల వెనుక.. రాజకీయాలు ఉన్నాయనే చర్చే సాగుతూ వచ్చింది.. మరోవైపు.. ఈ నెల 17వ తేదీన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సహా ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లన్నారు. ఢిల్లీలో ఎన్నికల సన్నద్ధతపై రెండు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ సదస్సులో పాల్గొననున్నారు పురంధేశ్వరి, బీజేపీ ముఖ్య నేతలు.. ఇక, బీజేపీ పెద్దలతో ప్రత్యేకంగా పురంధేశ్వరి సమావేశం కానున్నారు.. పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై హైకమాండ్‌తో ఏపీ బీజేపీ చీఫ్‌ చర్చిస్తారని తెలుస్తోంది.. పోటీకి అవకాశం ఉన్న నియోజకవర్గాల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందించనున్నారట చిన్నమ్మ.. ఆశావహుల జాబితాను ఢిల్లీ పెద్దల ముందు ఉంచి.. తమ ఓట్ షేర్‌తో పాటు.. పొత్తులతో కలిసివచ్చే అవకాశాలపై కూడా చర్చిస్తారనే ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉండగా.. ఆ తర్వాత టీడీపీ-జనసేన మధ్య స్నేహం చిగురించింది.. ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లే విషయాలపై చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీ అగ్రనాయత్వంతో చంద్రబాబు చర్చించి వచ్చారు. ఇక, త్వరలో పురంధేశ్వరి కూడా ఢిల్లీ వెళ్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఫేక్‌లే పార్టీ మారతారు.. నిజంగా జగన్‌ను అభిమానించేవారు కాదు..!
ఫేక్‌లే పార్టీ మారతారు.. నిజంగా వైఎస్‌ జగన్‌ను అభిమానించేవారు పార్టీ మారరు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్సీ అనిల్‌ కుమార్‌ యాదవ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా జగన్ కప్పాలని బహిరంగంగా చెప్పిన నేత పార్టీ మారారు.. అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుందన్నారు.. జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని దుయ్యబట్టారు.. నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ పోటీ చేస్తారని ప్రకటించారు. 2009 నుంచి మూడు సార్లు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశాను.. మొదటిసారి కొద్దిగా ఓడిపోయినా.. రెండుసార్లు విజయం సాధించాను.. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాను.. కష్టకాలంలో నా వెంట ఉన్న వారి రుణాన్ని తీర్చుకోలేను.. వైఎస్‌ జగన్ కోసం సైనికుడిలా పని చేస్తాను.. ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు. రేపు నరసరావుపేటకు వెళుతున్నా.. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ నాకు సన్నిహితులే.. అంతా కలిసికట్టుగా పని చేస్తాం అన్నారు అనిల్‌ కుమార్‌ యాదవ్.. ఈ ప్రాంతం (నెల్లూరు) నాకు అన్నీ ఇచ్చింది.. వీరి దీవెనల వల్లే నరసరావుపేటలో కూడా రాణిస్తా అన్నారు. నాకు ఎవరి మీదా కక్ష్య లేదన్న ఆయన.. నాకు ఎందరో సహకరించారు.. నెల్లూరు సిటీకి అభ్యర్థిగా మైనారిటీ కి వైఎస్‌ జగన్ అవకాశం కల్పించారు.. ఒకరిద్దరు నాయకులు వెళ్లినా ఇబ్బంది లేదన్నారు. పార్టీ ఏమీ బలహీన పడదు.. కొత్త వారిని తీసుకు వస్తాం.. నేత మారినప్పుడు కొందరు వెళ్లడం సహజమే అన్నారు. నెల్లూరు వదిలి వెళుతున్నందుకు బాధగా ఉన్నా.. జగనన్న నన్ను పోటీ చేయమని చెప్పారు.. ఎవరికీ దొరకని అవకాశం నాకు లభించిందని భావిస్తున్నాను అన్నారు. రేపు సాయంత్రం నరసరావుపేట లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాను అని వెల్లడించారు.

పవన్ కల్యాణ్‌ పర్యటనలకు ప్రత్యేక హెలికాప్టర్..?
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీల నేతలు విస్తృత పర్యటనలకు సిద్ధం అవుతున్నారు.. ఇక, ఈ సారి ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతోన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. తన పర్యటనల కోసం ప్రత్యేక హెలికాప్టర్‌ వాడనున్నారనే ప్రచారం సాగుతోంది.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృత పర్యటనలకు జనసేనాని ప్లాన్ చేస్తున్నారట.. ప్రతి జిల్లానూ కనీసం మూడు సార్లు టచ్ చేసేలా పవన్ కల్యాణ్‌ ప్రణాళికలు సిద్ధం చేశారని జనసేన పార్టీ శ్రేణులు చెబుతున్నమాట.. మొదటి దశ పర్యటనలో జిల్లా ముఖ్యనేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారట జనసేనాని.. పార్టీ పరిస్థితి, బలం, పోటీచేస్తే సాధించే ఓట్లు తదితర అంశాలపై దృష్టిసారిస్తారట.. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రచారంలో జిల్లాలను చుట్టేసే విధంగా ప్లాన్‌ రూపొందిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. ఇక, ఇప్పటికే అటు బీజేపీతోనూ.. ఇటు తెలుగుదేశం పార్టీతోనూ పొత్తు కలిగి ఉంది జనసేన పార్టీ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ముందుకు సాగేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.. అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ చర్చలు జరిపివచ్చారు. పొత్తులో భాగంగా వారి ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఏపీ బీజేపీ ముఖ్యనేతలో కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.. మరి మూడు పార్టీలు కలిసి నడిచే విషయంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచిచూడాలి. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే తమ లక్ష్యం అంటున్న పవన్‌ కల్యాణ్.. ఈ సారి ప్రచారంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెడతారని తెలుస్తోంది.

సంక్షేమ పథకాలు ముందుకు వెళ్లాలంటే మళ్లీ జగన్‌ సీఎంగా రావాలి..
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలను ముందుకు తీసుకు వెళ్లాలంటే మళ్లీ వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలన్నారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్మోహన్ రెడ్డి అప్పజెప్పిన బాధ్యత నిర్వహించడమే నా బాధ్యత అని స్పష్టం చేశారు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లు గెలుపు దిశగా మేం కృషి చేస్తాం అని వెల్లడించిన ఆయన.. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్‌ రావాల్సిందే అన్నారు.. ఇక, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం అన్నారు వైవీ.. అన్ని సీట్లు అనౌన్స్ చేసినప్పుడు చిన్న చిన్న మార్పులు ఉంటే చేయడం జరుగుతుందన్నారు.. ఇప్పుడు ఒకటి రెండు సీట్లు మినహా సీట్లు విషయంలో మార్పులు ఉండకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి.

నోరు ఉంది కదా అని మాట్లాడితే..! మంత్రి రోజా సీరియస్‌ వార్నింగ్‌
విపక్షాలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోయడం, విమర్శలు చేయడం తప్ప ఇంకేం చేస్తున్నాయి? అని ప్రశ్నించారు. కులం, మతం, ప్రాంతం అనే తేడా చూడకుండా అభివృద్ధి చేస్తున్నాం.. కానీ, చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిసియన్స్ వల్ల రాష్టం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాజకీయలద్ధి కోసం గతంలో కాంగ్రెస్ పార్టీతో, ఇప్పుడు బీజేపీ – జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నాడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. పవన్‌ కల్యాణ్ మాటలు విని విని బోర్ కొట్టడంతో.. ఇప్పుడు షర్మిలను రంగంలోకి దించారని ఆరోపించారు. ఇక, షర్మిల టైమ్ పాస్ రాజకీయలు చేస్తున్నారని ఎద్దేవా చేసిన ఆమె.. షర్మిల మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్ట్ అని విమర్శించారు.. మరోవైపు.. తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. ఇప్పుడు ఏపీలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చింది అని షర్మిలపై ఫైర్‌ అయ్యారు రోజా.. వైఎస్సార్ పంచెలు ఉడాదీసి కొడతా అన్నా పవన్ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి పెళ్లికి ఆహ్వానం ఇచ్చారు.. టీడీపీ కోవర్ట్ అన్నా రేవంత్ రెడ్డితో ఏ మొహం పెట్టుకొని పొత్తు పెట్టుకుంది..? అని ప్రశ్నించారు. వినే వాడు వెర్రి వాడు అయితే చెప్పే వాడు షర్మిల అన్నట్లుగా మారింది ఆమె పరిస్థితి అని సెటైర్లు వేశారు. షర్మిలకు అసలు ఏం గుర్తింపు ఉంది? ఒక్క రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనే గుర్తింపు తప్ప..? అని నిలదీశారు మంత్రి రోజా.

ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి వెళ్తే తెలంగాణ ఎడారిగా మారుతుంది..
బీఆర్ఎస్ పార్టీ నేతలంతా నల్గొండ సభకు వెళ్తున్నామని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కృష్ణ నది కింద ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించటం మంచిది కాదు అని చెప్పారు. ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి వెళ్తే తెలంగాణ ఎడారిగా మారుతుంది అని ఆయన పేర్కొన్నారు. కరెంట్ కు కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. వారం కిందనే మేము నల్గొండ సభ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.. ఇది చూసిన కాంగ్రెస్ భయపడి నిన్న సభలో తీర్మానం చేశారు.. మా సభ నుంచి దృష్టి మరల్చేందుకు ఇవాళ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీకి వెళ్తోంది అని కడియం శ్రీహరి ఆరోపించారు. కృష్ణ నదిపై ఉన్న హక్కులు కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉంది అని కడియం శ్రీహరి అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని నల్గొండ సభకు వెళ్తున్నాం.. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకులు, రైతులు వస్తున్నారు.. ఇవాళ్టి నుంచి జల యుద్ధం ప్రారంభమైంది అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ చేసిన అభివృద్ది రేవంత్ రెడ్డి సర్కార్ కు కనిపించడం లేదన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కడియం శ్రీహరి వెల్లడించారు.

మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు దూరంగా బీఆర్ఎస్- బీజేపీ
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ ప్రాజెక్ట్‌ సందర్శనకు మంత్రులతో పాటు ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యెలు వెళ్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి బస్సులో సీఎం బృందం బయల్దేరింది. ఇక, మధ్యాహ్నం 3 గంటల వరకు మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరకు ప్రజా ప్రతినిధుల బృందం చేరుకోనున్నారు. మేడిగడ్డ బ్రిడ్జ్, కుంగిన పిల్లర్లను ఈ బృందం పరిశీలించనుంది. సాయంత్రం 5 గంటలకు సీఈ సుధాకర్‌రెడ్డి, విజిలెన్స్‌ డీజీ రాజీవ్‌ రతన్‌ పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్.. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్‌, మంత్రుల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అయితే, మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు దూరంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అయితే, మేడిగడ్డ సందర్శనకు శాసనసభ్యులందరూ రావాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మేడిగడ్డలో ఏం జరిగిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. అన్ని పార్టీల సభ్యులు ప్రాజెక్టును చూపించాలని నిర్ణయించామని కాంగ్రెస్ సర్కార్ పేర్కొన్నారు. బ్యారేజ్ నిర్మాణం, లోపాలు, అనేక అంశాలపై పూర్తి అవగాహన వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రాజెక్టులకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. బీఆర్ఎస్- బీజేపీ ఒక్కటి కాబట్టి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు దూరంగా ఉన్నాయని విమర్శించారు.

ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళన.. టియర్ గ్యాస్ ఉపయోగించిన పోలీసులు
తమ డిమాండ్లు పరిష్కరించాలని దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన చేపట్టేందుకు రైతులు భారీగా బయల్దేరారు. అయితే, రైతుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల దగ్గర పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి.. అదనపు పోలీసు బలగాలను మొహరించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ సరిహద్దుల్లో 2 వేల మంది భద్రతా సిబ్బంది గస్తీ కాస్తున్నారు. పోలీసులతో పాటు సీఏపీఎఫ్, క్రైమ్ బ్రాంచ్, బెలాటియన్ సిబ్బంది భద్రతా చర్యల్లో పాల్గొన్నారు. అయితే, పంజాబ్, హర్యానా మధ్య గల శంబు దగ్గర నుంచి రైతులు ఢిల్లీకి బయల్దేరారు.. రైతులు ట్రాక్టర్లలో వస్తుండటంతో ట్రాక్టర్ ట్రాలీలను ఢిల్లీలోకి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో శంభు సరిహద్దులో రైతుల నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో రైతులు, సైనికులు ముఖాముఖి తలపడ్డారు. దీంతో పోలీసుల పైకి రైతులు రాళ్లు రువ్వాగా.. ఆ తర్వాత పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్ విడుదల చేశారు. టియర్ గ్యాస్ షెల్స్ కారణంగా రైతులు ఒక్కసారి వెనక్కి తగ్గారు.. అయితే పొగ తగ్గడంతో వేలాది మంది రైతులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు.. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

గుడ్ న్యూస్.. ఆ రంగం తర్వలో ఐదు కోట్ల ఉద్యోగాలు
హాస్పిటాలిటీ, టూరిజం రంగం రాబోవు 5 నుండి 7 సంవత్సరాలలో 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం మద్దతు ఇస్తే ఈ టార్గెట్ ను సులభంగా చేరుకోవచ్చని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఏఐ) సోమవారం తెలిపింది. ఇందుకోసం టూరిజం, హాస్పిటాలిటీ రంగానికి పరిశ్రమ, మౌలిక సదుపాయాల హోదా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ మద్దతు లభిస్తే ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది ఉద్యోగాలు సృష్టించవచ్చు. హెచ్ ఏఐ ప్రెసిడెంట్ పునీత్ ఛత్వాల్ ఆరో హెచ్ఏఐ హోటల్స్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ.. హాస్పిటాలిటీ రంగం పరిశ్రమ, మౌలిక సదుపాయాల హోదాను పొందడంతో పాటు జీవన ఏర్పాట్లు చేయడంతో పాటు ఆదాయం, ఉపాధి కూడా పెరుగుతుందని అన్నారు. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఛత్వాల్ మాట్లాడుతూ.. పర్యాటకం అభివృద్ధికి మూలస్తంభమని అన్నారు. ఇది దేశంలోని మొత్తం ఉపాధిలో 10 శాతం వాటాను అందిస్తోంది. అంతేకాకుండా జిడిపిలో 8 శాతం వాటా కూడా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ రంగానికి సరైన విధానాలు కావాలి.

ఆర్బీఐ ఒప్పుకుంటే పేటీఎంతో కలిసి పనిచేసేందుకు రెడీ అంటున్న యాక్సిస్ బ్యాంక్ సీఈవో
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపితే, ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ Paytmతో కలిసి పనిచేయాలనుకుంటోంది. యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అమితాబ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. యాక్సిస్ బ్యాంక్ ‘2023 బుర్గుండి ప్రైవేట్ హురున్ ఇండియా 500’ జాబితాను ప్రారంభించిన సందర్భంగా ఒక ప్రశ్నకు సమాధానంగా చౌదరి మాట్లాడుతూ, “ఇది రెగ్యులేటరీ అనుమతులపై ఆధారపడి ఉంటుంది. రెగ్యులేటర్ మమ్మల్ని Paytmతో పని చేయడానికి అనుమతిస్తే.. అప్పుడు ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం” అని చౌదరి చెప్పారు. సాధారణ వ్యాపారం కోసం Paytmతో బ్యాంక్ చర్చలు జరుపుతోంది. జనవరి 31, 2024 తర్వాత కొత్త అంశాలను చర్చిస్తున్నామని ప్రైవేట్ రంగ రుణదాతకు చెందిన మరో అధికారి తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ (సంపన్న బ్యాంకింగ్, ఎన్‌ఆర్‌ఐ, కార్డ్‌లు, చెల్లింపులు) అర్జున్ చౌదరి మాట్లాడుతూ, ‘మేము మా సాధారణ వ్యాపార సేవల కోసం Paytmతో చర్చలు జరుపుతున్నాము. జనవరి 31 నాటి సంఘటనల తరువాత మేము కొత్త విషయాలను చర్చిస్తున్నాము’. అన్నారు. జనవరి 31, 2024న, ‘నిరంతర సమ్మతి’, ‘మెటీరియల్ సూపర్‌వైజరీ ఆందోళనలు’ కారణంగా ఫిబ్రవరి 29, 2024 నుండి కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా, లావాదేవీలను నిర్వహించకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్‌ని RBI నిషేధించింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చెల్లింపుల హెడ్ పరాగ్ రావ్, పేటిఎమ్‌తో బ్యాంక్ చర్చలు జరుపుతోందని..ఈ అభివృద్ధిని అంచనా వేస్తోంది. పేమెంట్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ ఆర్డర్ తర్వాత, తదుపరి కస్టమర్ల విషయంలో పని చేయడం ప్రారంభిస్తుంది.

ఇషాన్‌ కిషన్‌పై బీసీసీఐ సీరియస్‌.. వేటు తప్పదా?
గతేడాది డిసెంబర్ నుంచి టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్‌ కిషన్‌ భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్‌.. సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు. అప్పటినుంచి బీసీసీఐ, భారత జట్టు మేనెజ్‌మెంట్‌తో టచ్‌లో లేడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇషాన్‌ అందుబాటులో ఉంటాడనుకున్నా.. అది జరగలేదు. చివరి మూడు టెస్టులకు ఇటీవల బీసీసీఐ సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించినా.. అతడిది చోటు దక్కలేదు. కేఎస్ భరత్, ధృవ్ జోరెల్‌లు కీపర్‌గా కొనసాగారు. రెండో టెస్టు అనంతరం భారత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కావాలంటే ఇషాన్‌ కిషన్‌ కచ్చితంగా రంజీ ట్రోఫీ 2024లో ఆడాల్సిందే అని స్పష్టం చేశాడు. అయితే కిషన్‌ మాత్రం రాహుల్‌ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా.. బరోడాలో ఐపీఎల్ 2024 కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ 2024లో బరిలో దిగే అవకాశం ఉన్నా.. కిషన్ ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ విషయంపై బీసీసీఐ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. ఇషాన్‌పై చర్యలకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది. 2024-25 ఏడాది గాను బీసీసీఐ ఆటగాళ్ల సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాను త్వరలో ప్రకటించనుంది. వచ్చే ఏడాదికి ఇషాన్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేడ్ సిలో ఉన్న అతడి కాంట్రాక్ట్‌ను పునరుద్దరించే ఆలోచనలో బీసీసీఐ లేదట. 2022-23లో తొలిసారి ఇషాన్ బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్నాడు. ఏడాదికి కోటి రూపాయలు వార్షిక వేతనాన్ని అతడు అందుకుంటున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున సత్తాచాటిన ఇషాన్.. జాతీయ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారత్ తరఫున ఇప్పటివరకు ఇషాన్ 2 టెస్టులు, 27 వన్డేలు, 32 టీ20లు ఆడాడు.

35 రోజుల్లో 65% పూర్తి…
డీజే టిల్లు సినిమాతో యూత్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమా ఒక డ్రగ్ లా ఆడియన్స్ ని ఎక్కేసింది. రాధిక అనే పేరుని అబ్బాయిలు తెగ వాడేశారు. డీజే టిల్లు సినిమా డైలాగులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఆ రేంజ్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. మార్చ్ 29న టిల్లు స్క్వేర్ ఆడియన్స్ ముందుకి రానుంది. నేహా స్థానంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సీక్వెల్ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. సిద్ధూ మాత్రం టిల్లు స్క్వేర్ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి మార్చ్ 29న టిల్లు స్క్వేర్ ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి. అయితే టిల్లు వచ్చిన వారం రోజులకి ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. ది ఫ్యామిలీ స్టార్ సినిమా కారణంగా టిల్లు స్క్వేర్ లాంగ్ రన్ కి సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సిద్ధూ జొన్నలగడ్డ మరో రెండు సినిమాలకి ప్యారలెల్ గా వర్కౌట్ చేస్తున్నాడు. ఇందులో తెలుసు కదా ఒకటైతే… మరొకటి జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో “జాక్… కొంచెం క్రాక్” సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే టైటిల్ అనౌన్స్మెంట్ జరుపుకోని రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ స్టార్ట్ అయ్యింది. ఈరోజు నుంచి హైదరాబాద్ లో జాక్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవనుంది. దాదాపు 35 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ తో జాక్ సినిమా 65% కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో టాకీతో పాటు యాక్షన్ పార్ట్ ని కూడా తెరకెక్కించనున్నారు.

SSMB 29 కాదు… ఇకపై SSRMB…
దర్శక ధీరుడు రాజమౌళి… ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలియజేసిన వాడు. రాజముద్ర పడితే చాలు వెయ్యి కోట్లు ఇవ్వడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు అంటే రాజమౌళి ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ టాప్ డైరెక్టర్స్ కూడా రాజమౌళి గురించి మాట్లాడుతున్నారు, ప్రెస్టీజియస్ ఆస్కార్ కూడా ఇండియాకి వచ్చింది అంటే అది కేవలం రాజమౌళి వలనే. ఇండియన్ సినిమా బిజినెస్ కూడా 500 కోట్లు లేని సమయంలో వేల కోట్ల ఖర్చుతో ధైర్యంగా సినిమాలు చేసేలా ఫిల్మ్ ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేశాడు రాజమౌళి. ఈరోజు తెలుగు సినిమా, తమిళ సినిమా, మలయాళ సినిమా, హిందీ సినిమా అనే బౌండరీలు లేకుండా ఇండియన్ సినిమా అనే మాట వినిపిస్తుంది అంటే అది రాజమౌళి చూపించిన మార్గమే. నెక్స్ట్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు ఈ దర్శక ధీరుడు. మహేష్ బాబుతో చాలా కాలంగా ఉన్న కమిట్మెంట్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి. ఇప్పటికే కథ కంప్లీట్ అయ్యిందని విజయేంద్ర ప్రసాద్ కూడా చెప్పేసాడు. అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటివరకు #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో సోషల్ మీడియాలో కనిపించింది. ఇకపై ఇది #SSMB29 కాకుండా #SSRMB అనే హాష్ ట్యాగ్ లో ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ముందున్న ట్యాగ్ లో రాజమౌళి పేరు లేదు… ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా అనే కలిసింది. ఇప్పటికైతే SSMB29 కాకుండా SSRMB అనేదే వర్కింగ్ టైటిల్ అవుతుంది… లేదా ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ సమయంలో రాజమౌళి… ఇంకేదైనా ట్యాగ్ ని అనౌన్స్ చేస్తాడేమో చూడాలి.