NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు..! ఎంపీ జీవీఎల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి టీడీపీ-జనసే-బీజేపీ కలసి పనిచేసే దశగా చర్చలు సాగుతున్నాయి.. ఇప్పటికే జనసేన-బీజేపీ పొత్తులో ఉండగా.. మరోవైపు.. టీడీపీ-జనసేన మధ్య కూడా పొత్తు చిగురించింది.. ఇక, మూడు ఒకేతాటిపైకి రావడమే మిగిలిఉంది.. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా చర్చలు జరిపివచ్చారు. ఇక, పొత్తులపై చర్చలు జరుగుతున్నట్టు ఓ దశలో అమిత్‌షా కూడా ప్రకటించారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ జట్టు కట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.. పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి పొత్తుపై పార్టీ అధిష్టానం నిర్ణయమే మా నిర్ణయం అని స్పష్టం చేశారు. ఇక, విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నది బీజేపీ అధిష్టానమే నిర్ణయిస్తుందని తెలిపారు జీవీఎల్‌.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘాంగా సేవలు అందించిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారత రత్న రావడం చాలా గొప్ప విషయం అన్నారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వ్యక్తికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. కానీ, బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీలా వ్యత్యాసం లేదు.. దేశానికి వ్యక్తులు అందించిన సేవలతోనే సంబంధం అని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పీవీ నరసింహరావు జయంతి రోజు సెలవుగా ప్రకటించాలి, మెమోరియల్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్‌ చేశారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయబడింది.. అని చాలా సార్లు చెప్పాను అని గుర్తుచేశారు.. మరోవైపు.. తమ ఉనికి కాపాడుకోవడం కోసం వైఎస్‌ షర్మిల వంటివాళ్లు టీవీల్లో కనిపించడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.

విచారణకు రావడం లేదు.. స్పీకర్‌కు రెబల్‌ ఎమ్మెల్యేల లేఖ
రెబల్‌ ఎమ్మెల్యే విచారణపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది.. ఈ రోజు విచారణకు రావడం లేదని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్ఆర్సీపీ) రెబల్‌ ఎమ్మెల్యేలు.. తమకు మరో రెండు వారాల సమయం ఇవ్వాలని స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు.. మరోవైపు టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేల హాజరుపై కూడా ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా రాజ్యసభ ఎన్నికల వేళ రెబల్‌ ఎమ్మెల్యేల ఎపిసోడ్‌ ఉత్కంఠ కలిగిస్తోంది. రెబల్‌ ఎమ్మెల్యేలపై వేటు..! అనర్హత పిటిషన్లకు రాజ్యసభ ఎన్నికలకు ముడిపడిఉండడంతో.. అంతా ఏమవుతుందా? అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అసలు స్పీకర్‌ రెబల్‌ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోన్న నేపథ్యంలో.. ఈ రోజు మూడోసారి విచారణకు పిలిచారు స్పీకర్‌ తమ్మినేని.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేలు ఉదయం పూట విచారణకు హాజరుకావాలని.. టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం విచారణకు రావాలని సూచించారు. కానీ, ఈ రోజు విచారణకు హాజరుకావాల్సి ఉన్న వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీనిదేవి.. తాము వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు హాజరుకావడంలేదని.. తాము విచారణకు హాజరుకావాలంటే మరో రెండు వారాల గడువు ఇవ్వాలని కోరుతూ స్పీకర్‌కు లేఖలు రాసినట్టుగా తెలుస్తోంది. అయితే, నలుగురు టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు ఈ రోజు స్పీకర్‌ విచారణకు హాజరవుతారా? లేదా వారు కూడా డుమ్మకొడతారా? అనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే మూడు సార్లు విచారణకు పిలిచిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. మరోసారి అవకాశం ఇస్తారా? లేదా రెబల్‌ ఎమ్మెల్యేలపై చర్యలకు దిగనున్నారు..? ఎలాంటి చర్యలు ఉంటాయి? అనేది ఆసక్తికరంగా మారిపోయింది.

ఏపీ అభివృద్ధిలో సింహ భాగం బీజేపీదే.. ఈసారి ఎంపీల సంఖ్య 350 దాటుతుంది..!
ఏపీ అభివృద్ధిలో సింహ భాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాపోరు రాష్ట్ర స్ధాయి సమావేశం నిర్వహించారు.. ఈ సందర్బంగా పారిశామికవేత్త ఏలూరి రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని వైసీపీ నేత కేతా అమర్నాథ్‌ రెడ్డితో పాటు పలువరు తిరుపతి, ఒంగోలు, గిద్దలూరుకు చెందిన వివిధ పార్టీల నేతలో బీజేపీలో చేరారు.. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్‌ సభ్యుల సంఖ్య 350 దాటుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, దొంగ ఓట్లపై సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ (సీఈసీ)కి ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారు.. తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు గుర్తించి కంప్లైంట్ చేశామని తెలిపారు పురంధేశ్వరి.. ఐపీఎస్ ల మీద కూడా దొంగ ఓట్ల అంశంలో చర్యలు తీసుకుంటున్నారు.. అభ్యర్ధిని మార్చడంతో పాటు, ఓటర్లను లోపాయకారిగా నియోజకవర్గం మారుస్తున్నారని ఆరోపించారు. మంత్రి విడుదల రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు మారగానే ఆమె అనుయాయిల ఓట్లు లోపాయకారిగా మారుతున్నాయి అని విమర్శించారు. మరోవైపు.. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం బీజేపీ చేసిందే అన్నారు.. పార్లమెంటు అభ్యర్ధుల సంఖ్య ఈ సారి 350 దాటుతుందన్న ఆమె.. పార్టీలతో పొత్తుపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అసలు కనిపించడం లేదన్నారు. రాష్ట్ర పథకాలు అన్నీ కేంద్ర పథకాలు అని మేం చెప్పినా.. మాకు సహకారం ఇవాళ్టి వరకూ లేదన్నారు. ఈ నెల 29 వరకు ప్రజాపోరు కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి పెంపు
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి ఇప్పటి వరకు 44 ఏళ్లుగా ఉండగా.. ఇప్పుడు 44 ఏళ్ల నుండి 46 ఏళ్లకు పెంచింది రేవంత్‌రెడ్డి సర్కార్.. రెండేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది. వివిధ నియామక పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఇది గుడ్‌న్యూస్‌గా చెప్పుకోవాలి.. అయితే, గత ప్రభుత్వం గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెంచింది.. అందే 10 సంవత్సరాలు పెంచింది.. ఇక, ఈ ప్రభుత్వం రెండు ఏళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. నిర్దేశించిన గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. నిరుద్యోగ యువత నుండి అనేక ప్రాతినిధ్యాలు స్వీకరించబడ్డాయి.. మరిన్ని ఎనేబుల్ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని సడలించడం గురించి ఆలోచిస్తోందని పేర్కొంది ప్రభుత్వం.. నిరుద్యోగ యువత.. యూనిఫాం సేవలు కాకుండా ఇతర పోస్టులకు ఈ వయోపరిమితి వర్తింపజేయనున్నారు.. ప్రభుత్వం అన్ని విషయాలన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత.. రెండేళ్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. గరిష్ట వయో పరిమితి 44 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల వరకు యూనిఫాం సేవలకు కాకుండా.. మిగతా పోస్టులకు రెండు సంవత్సరాల కాలం ఈ వర్తింపు ఉంటుందని పేర్కొంది. ఈ నియమం ఏ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం వర్తించదు.. పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలు మొదలైన యూనిఫాం సేవలకు వర్దించదు..

ఎమ్మార్వో రమణయ్య హత్య ఘటన.. రెవెన్యూ ఉద్యోగుల పెన్‌డౌన్..
విశాఖ రూరల్ ఎమ్మార్వో రమణయ్య హత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకం రేపుతోంది.. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.. ఎమ్మార్వో రమణయ్య హత్యకు దారితీసిన కారణాలను వెలుగులేకి తీసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. అయితే, రమణయ్య హత్య ఘటన రెవెన్యూ అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది.. దీంతో పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చారు రెవెన్యూ ఉద్యోగులు.. ఇవాళ్టి నుంచి రెవెన్యూ ఉద్యోగులు పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఎమ్మార్వో హత్య జరిగి 10 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది రెవెన్యూ అసోసియేషన్.. రమణయ్య హత్యపై రెవెన్యూ అసోసియేషన్ సమావేశంలో చర్చించిన ఉద్యోగులు.. ప్రభుత్వం స్పందించే వరకు సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించింది. అందులో భాగంగా ఇవాళ్టి నుండి పెన్ డౌన్ చేసేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.. ఏమర్జెన్సీ కేసులు, పాత కేసులు తప్ప కొత్త వాటిని ప్రారంభించకూడదని ఉద్యోగులు నిర్ణయించారు. ఎమ్మార్వో కుటుంబ సభ్యులకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. రమణయ్య పిల్లలకు చదువు, రమణయ్య భార్యకు గ్రూప్ 2 ఉద్యోగం కల్పించాలని పేర్కొంది. ఇక, రమణయ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తోంది రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్‌.

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.. హరీష్ సాల్వే కొన్ని ఇబ్బందుల వల్ల ఈరోజు కోర్టుకు రాలేక పోయారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఈ కేసును మూడు వారాలు వాయిదా వేయాలని కోరారు.. అయితే, వీలయినంత త్వరగా డేట్ ఇవ్వండని కోరారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తరపు న్యాయవాది రంజిత్ కుమార్.. ఇక, ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. దాంతో ఈ కేసును రెండు వారాలు కేసును వాయిదా వేసింది.. ఫిబ్రవరి 26వ తేదీన కేసు విచారణ ఉంటుందని తెలిపింది ధర్మాసనం.. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ నెల 26వ తేదీన కేసు విచారణ చేపట్టనుంది.. కాగా, ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసిన విషయం విదితమే.

ఏపీకి 512.. టీఎస్‌ కి 299 టీఎంసీ ఎలా ఒప్పుకున్నారు? ఇది అన్యాయం కాదా?
ఏపీకి 512.. టీఎస్‌ కి 299 టీఎంసీకి ఎలా ఒప్పుకున్నారు? ఇది తెలంగాణకు అన్యాయం కాదా? అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్లు తెలంగాణకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు ఆంధ్ర 512 టీఎంసీ లు తీసుకుని వెళ్లేందుకు బీఆర్ఎస్ అంగీకారం చెప్పిందని.. ఇది తెలంగాణ కి అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏపీ వచ్చి తెలంగాణాకి 50:50 కావాలి అంటున్నారని తెలిపారు. దీనిపై సభలో కృష్ణ నది మీద పవర్ పాయింట్ పై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రజెంటేషన్ చేశారు. గూగుల్ మ్యాప్ ద్వారా ప్రసెంటేషన్ ఇస్తున్నామని తెలిపారు. KRMB నీ రెండు రాష్ట్రాల నీటి వాటా తేల్చేందుకు ఏర్పాటు చేశారు. నీటి పంపకాల విషయంలో గత ప్రభుత్వం ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదని అన్నారు. ఎన్నికలకు ఒక్క రోజు ముందు నాగార్జున సాగర్ ను ఏపి పోలీసులు ఆక్రమించారన్నారు. KRMB కి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు అప్పగించేది లేదని చెప్పింది. తెలంగాణ ప్రజలను కొన్ని అపోహలకు గురిచేస్తున్నారని, దాని మీద వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. భారత దేశంలో గంగా గోదావరి తర్వాత కృష్ణానది పెద్దదని తెలిపారు. మహారాష్ట్ర మహాబలేశ్వర్ లో ప్రారంభమై బంగాళాఖాతంలో కలుస్తుందన్నారు.

తెలంగాణలో సిగరెట్లు, పొగాకు యాడ్స్‌ నిషేధం..!
నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో హుక్కా సెంటర్లను నిషేధిస్తూ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు మంత్రి శ్రీధర్ బాబు సభకు ధన్యవాదాలు తెలిపారు. హుక్కా సెంటర్లను నిషేధించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. యువత ధూమపానానికి అలవాటు పడే అవకాశం ఉందన్నారు. పొగ కంటే హుక్కా హానికరం అని అంటారు. అంతకుముందు మృతి చెందిన సభ్యులకు శాసనసభలో సంతాపం తెలిపారు. ఫిబ్రవరి 4న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హుక్కా నిషేధంపై నిర్ణయం తీసుకున్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. సిగరెట్ కంటే హుక్కా 1000 రెట్లు హానికరం.. ఒక్కసారి హుక్కా అలవాటు చేసుకుంటే.. యువత అడిక్ట్ అవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర యువత, ప్రజల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. హుక్కా, హుక్కా సెంటర్లపై శాశ్వత నిషేధం విధిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు.

భారతీయ విలువలపై ఆధారపడిన విద్యావ్యవస్థ మనకు అవసరం..
భారతీయ విలువలపై ఆధారపడిన విద్యావ్యవస్థ ప్రస్తుతం మనకు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్యసమాజ్‌ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా.. గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఆయన స్వస్థలమైన టంకారాలో నిర్వహించిన వేడుకను ఉద్దేశించి ఆదివారం నాడు ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతీయ విలువల బోధనకు కేంద్రంగా ఆర్యసమాజ్‌ పాఠశాలలు నిలుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. బానిసత్వం, మూఢనమ్మకాలతో దేశం కునారిల్లుతున్న కాలంలో జన్మించిన దయానంద సరస్వతి.. వాటి వల్ల శాస్త్రీయ ఆలోచనలు ఎలా బలహీనపడుతున్నాయో తెలియజెప్పి చైతన్యం కలిగించారని ఆయన గుర్తు చేశారు. వేదాలకు తార్కిక వివరణలు ఇచ్చి, వాటి గొప్పతనాన్ని ఆయన తెలియజేశారన్నారు. భారతీయ తత్వమంటే ఏమిటో బ్రిటిష్‌ పాలకులకు చాటి చెప్పారని ప్రధాని తెలిపారు. ఎంతో మందిని ఆర్య సమాజం ప్రభావితం చేసిందని ఆయన తెలిపారు. దయానంద సరస్వతి జన్మించిన రాష్ట్రంలో తాను పుట్టడం, ఆయన కర్మభూమిగా భావించే హరియాణా గురించి బాగా తెలుసుకోవడం వల్ల తన జీవితంపై ఆయన ప్రభావమెంతో ఉందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.

బీహార్ లో బలపరీక్షకు ముందు ఇద్దరు ఎమ్మెల్యేలు మిస్సింగ్.. టెన్షన్ లో నితీశ్
బీహార్‌లో నీతీశ్‌ కుమార్ ప్రభుత్వం ఇవాళ బలపరీక్ష ఎదుర్కోనుంది. బీజేపీ మద్దతుతో సునాయాసంగానే దీనిని గట్టెక్కే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే, ప్రధాన విపక్షమైన ఆర్జేడీ తన బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. దీంతో అసెంబ్లీలో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రసంగం కొనసాగుతోంది. అనంతరం స్పీకర్‌(ఆర్జేడీ) అవధ్‌ బిహారీ చౌధరీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. బీజేపీ-జేడీయూ నేతలు ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత బలపరీక్ష జరగనుంది. అయితే, ఈ క్రమంలో బీజేపీ- జేడీయూ శిబిరం నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, వారిలో ఏడుగురు బలపరీక్షకు ముందే శిబిరానికి తిరిగి వచ్చేశారు. మరొకరి జాడ ఇప్పటి వరకు తెలియల్సి ఉంది. మరో పక్క ఆర్జేడీ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పట్నాలోని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ ఇంటి దగ్గర నుంచి అసెంబ్లీకి తీసుకొచ్చింది. కాగా ఇద్దరు జేడీయూ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజీవ్, బీమా భారతి ఇంకా బీహార్ అసెంబ్లీకి చేరుకోలేదు.. దీంతో సీఎం నితీశ్ కుమార్ టెన్షన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే, ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ కూడా ఫ్లోర్ టెస్ట్‌లో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చారు.

పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్‌.. తోసుకుంటూ వెళ్లిన రాపిడో డ్రైవర్!
దేశంలోని ప్రధాన నగరాల్లో ‘రాపిడో’కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ విద్యార్థుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు రాపిడో సేవలను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ ఉన్నా సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చడం, ఆటో ఛార్జీల కన్నా తక్కువ ధర కావడంతో అందరూ రాపిడోను బుక్ చేసుకుంటున్నారు. తమ కస్టమర్ల సేఫ్టీ ప్రయాణం కోసం రాపిడో డ్రైవర్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. అయితే తాజాగా ఓ ర్యాపిడో డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. పెట్రోల్ అయిపోయినా కస్టమర్‌ బైక్ దిగకపోవడంతో అలానే తోసుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే చోటుచేసుకుంది. తాజాగా హైదరాబాద్​లో ఓ వ్యక్తి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. ర్యాపిడో బుక్ చేసుకున్న కస్టమర్‌ను అతడి గమ్యస్థానంలో దింపాల్సి ఉండగా.. మార్గమధ్యలో సడెన్‌గా స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ర్యాపిడో డ్రైవర్.. కస్టమర్‌ను దగ్గరలో ఉన్న పెట్రోల్ ​బంక్ వరకూ నడుచుకుంటూ రావాలని కోరాడు. అందుకు సదరు కస్టమర్ ససేమిరా అనడంతో.. ర్యాపిడో డ్రైవర్ షాక్ అయ్యాడు. ఇక చేసేదేం లేక స్కూటీపై అతన్ని కూర్చోబెట్టుకుని​ పెట్రోల్ ​బంక్ వరకూ తీసుకెళ్లాడు.

వెంకీ మామ బాటలో మెగాస్టార్?
ప్రస్తుతం ఓటిటి హవా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎక్కడా లేని కంటెంట్ ఓటిటిలో కనిపిస్తోంది. సినిమాలకు మించిన బడ్జెట్‌తో పోటీ పడి మరీ వెబ్ సిరీస్‌లు చేస్తున్నాయి ప్రముఖ ఓటిటి సంస్థలు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ సంస్థలు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్‌లు చేస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు ఓటిటి ఎంట్రీ ఇచ్చేశారు. రానా నాయుడు వెబ్ సిరీస్‌తో వెంటకేష్, రానా డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా.. నాగ చైతన్య ధూత సిరీస్‌తో అదరగొట్టాడు. దీంతో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటిటి ఎంట్రీ కోసం చూస్తున్నారని చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్టతో ‘విశ్వంభర’ అనే భారీ సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత చిరు ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ లూప్ లైన్ లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో చిరు ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చిరు ఒక వెబ్ సీరీస్ చేయబోతున్నాడు అనే వార్త వినిపిస్తోంది. చిరు ఒక సీరీస్ కోసం సైన్ కూడా చేసాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. రూమర్స్ వినిపిస్తున్నాయి ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే చిరు ఏ ఓటీటీకి సైన్ చేసాడు, దర్శకుడు ఎవరు? ఎలాంటి కథతో చేయబోతున్నాడు? కనీసం డిస్కషన్స్ అయినా చేసారా? ఇలా ఏ ప్రశ్నకి సమాధానం లేదు. పైగా సోలో హీరోగా 2023లోనే సాలిడ్ హిట్ కొట్టిన చిరు… ఇప్పట్లో థియేటర్స్ ని వదిలి ఓటీటీ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే అవకాశమే లేదు. ఇప్పటికైతే ఇది జరగదు, సో చిరుని చూడాలి అంటే థియేటర్స్ కి వెళ్లాల్సిందే.

సీరియస్ ఆపరేషన్‌ను కామెడీ చేసిన ఏజెంట్ ‘చారి 111’…
చారి… బ్రహ్మచారి… రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెంట్. సైలెంట్‌గా హ్యాండిల్ చేయాల్సిన కేసును వయలెంట్‌గా హ్యాండిల్ చేయడం అతని నైజం. అతడిని ‘ఏజెంట్ 111’ అని పిలుస్తారు. ‘బాండ్… జేమ్స్ బాండ్’ టైపులో తనను తాను ‘చారి… బ్రహ్మచారి’ అని పరిచయం చేసుకోవడం చారికి అలవాటు. ఒక సీరియస్ ఆపరేషన్‌ను కామెడీగా మార్చేస్తాడు అతడు. ఆ తర్వాత ఏమైందనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. సుమంత్ హీరోగా ‘మళ్ళీ మొదలైంది’ వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు.  మురళీ శర్మ ప్రధాన పాత్రధారి. మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. ఎటువంటి కెమికల్, బయలాజికల్ వెపన్స్ తయారు చేయకూడదని 1992లో ఇండియా పాకిస్తాన్ జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాయని మురళీ శర్మ చెప్పే మాటలతో ‘చారి 111’ ట్రైలర్ ప్రారంభమైంది. రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి ఆయన హెడ్. ఆయన ఏజెన్సీలోనే చారి పని చేసేది. చారి అసిస్టెంట్ పాత్రలో తాగుబోతు రమేష్ కనిపించారు. మూడు రోజుల్లో ఏడు బ్లాస్టులు చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తారు. వాళ్లను రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఎలా అడ్డుకుంది? చారి ఏం చేశాడు? మ్యాడ్ సైకో సైంటిస్ట్ ఏం చేశాడు? ఈ జన్మలో నువ్వు ఏజెంట్ కాలేవని చారిని మురళీ శర్మ ఎందుకు తిట్టారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

అవార్డులు పంచుకోవడం కాదు… సినిమా చేసేయండి
హీరో నాని చాలా కూల్ గా సింపుల్ గా పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫైర్ మోడ్ లో బీస్ట్ లా ఉంటాడు. ఇలాంటి రెండు వేరు వేరు ధృవాల్లాంటి నాని-సందీప్ రెడ్డి వంగ కలిస్తే ఆ కాంబినేషన్ ఫైర్ అండ్ వాటర్ లా ఉంటుంది. ఈ మాటని నిజం చేస్తూ నాని-సందీప్ రెడ్డి వంగ కలిసి ఇటీవలే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సందీప్ రెడ్డి వంగ… అనిమల్ లాంటి ఇంటెన్స్ సినిమా ఇస్తే సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తా అంటూ నాని ఇటీవలే చెప్పుకొచ్చాడు. నానిలోని యాక్టర్ అంటే సందీప్ కి చాలా ఇష్టం కూడా. సో ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. నానిలోని వైల్డ్ యాక్టర్ ని సందీప్ రెడ్డి వంగ బయటకి తీసుకోని వస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సినిమా కన్నా ముందే ఈ ఇద్దరు మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఒకే వేదికపైన బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు అందుకున్నారు. బిహైండ్ వుడ్స్ బెస్ట్ యాక్టర్ అవార్డుని నాని గెలుచుకున్నాడు. ఈ అవార్డుని సందీప్ నానికి అందించాడు. బెస్ట్ డైరెక్టర్ అవార్డుని సందీప్ రెడ్డి వంగ గెలుచుకోగా… ఈ అవార్డుని నాని సందీప్ కి అందించాడు. ప్రస్తుతం నాని-సందీప్ కలిసున్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవార్డులు కాదు సినిమా చేయండి అంటూ నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నాడు. మరి ఒక సాలిడ్ సినిమాతో నాని-సందీప్ రెడ్డి వంగ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తారేమో చూడాలి.

ప్రభాస్ కోసం స్పెషల్‌గా ‘సీత’…
ప్రభాస్‌తో నటించే ఛాన్స్ అంటే ఎవ్వరు వదులుకుంటారు? అందులోను మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్‌కు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోదు. అందుకే… ప్రభాస్ కోసం స్పెషల్‌గా కనిపించేందుకు రెడీ అవుతోందట అమ్మడు. అసలు ఇందులో నిజమెంతో తెలియదు గానీ… ప్రభాస్ సినిమాలో సీత అనే న్యూస్ వైరల్‌గా మారింది. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తుండగా… దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే… విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని లాంటి హీరోలు కూడా కల్కిలో క్యామియో రోల్స్ చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఇక ఇప్పుడు ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా స్పెషల్ క్యామియో చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ‘కల్కి’లో ఫిమేల్ క్యామియో కోసం మృణాల్‌ని అప్రోచ్ అవ్వగా.. అందుకు ఓకే చెప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘సీతారమం’ సినిమాని వైజయంతి మూవీస్ వారే నిర్మించారు పైగా ప్రభాస్‌తో ఛాన్స్ అనేసరికి మృణాల్ ‘కల్కి’లో స్పెషల్ క్యామియోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం కానీ ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే… సినిమా రిలీజ్ డేట్ మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా… కల్కి క్యామియో రోల్స్ మాత్రం సినిమా పై రోజు రోజుకి అంచనాలను పెంచేస్తోంది.