NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరికి ఏ శాఖ అంటే..
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణా రావు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. ఇక, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు? అనే చర్చ అప్పటి నుంచి సాగుతూనే ఉందే.. ఇదిగో మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవేనంటూ సోషల్‌ మీడియాలో కొన్ని లిస్ట్‌లు హల్‌చల్‌ చేశాయి.. ఫైనల్‌గా కేబినెట్‌ మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం రేవంత్‌రెడ్డి.. నిన్న ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సమావేశమైన రేవంత్‌రెడ్డి.. ఎవరికి ? ఏ శాఖ కేటాయించాలి అనే దానిపై చర్చించి వచ్చారు.. అయితే, మంత్రులకు శాఖలు ఈ శాఖలు కేటాయించారు.
మంత్రులు-శాఖల కేటాయింపు ఇలా ఉంది:
* రేవంత్‌రెడ్డి-ముఖ్యమంత్రి
* భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖ
* ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటిపారుదల, పౌరసరఫరాలు
* దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ
* కోమటిరెడ్డి వెంకటరెడ్డి – రోడ్లు భవనాల శాఖ
* పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం
* పొన్నం ప్రభాకర్ – రవాణా, బీసీ సంక్షేమం
* కొండా సురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
* సీతక్క – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమం
* తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్
* శ్రీధర్ బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు
* జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్ పర్యాటకశాఖ

గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్వహణ సక్రమంగా లేదు.. ఎమ్మెల్యే ఫైర్‌
గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్వహణ తీరు సక్రమంగా లేదని మండిపడ్డారు అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల భద్రతపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్న ఆయన.. ప్రాజెక్టుల భద్రత ఆందోళన కలిగిస్తుందన్నారు. గత ఏడాదిలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేటు, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకోపోయినా వాటిని ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం శోచనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది నాణ్యత లేని మధ్యం అమ్మడం, ఇసుక అక్రమ రవాణా ద్వారా దోచుకోవడం.. ఇసుక అక్రమ రవాణా ద్వారా వైసీపీ నేతలు వెయ్యి కోట్లు దోచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. బాపట్ల జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు సంభవించగా రైతులకు తీవ్ర నష్టం జరిగినా ఆడుకోవటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.

కంటకాపల్లి రైల్వే ప్రమాదం.. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు
విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన రైల్వే ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్‌.. మానవ తప్పిదం వల్లే కంటకాపల్లిలో ఘోర రైలు ప్రమాదం జరిగిందన్నారు.. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. ఇక, త్వరలో మరికొన్ని వందే భారత్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయని తెలిపారు. వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోంది.. రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడవొద్దుని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో రైల్వేల అభివృద్ధి కోసం 8 వేల 406 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.. తూర్పు కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు భూమి కేటాయింపే ప్రధాన సమస్యగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని భూమిని అప్పగిస్తే ఇవాళ్టి నుంచే పనులు ప్రారంభిస్తాం అని వెల్లడించారు. 52ఎకరాల భూమి అవసరం అవుతుందని గుర్తించాం.. డిజైన్లు, 106 కోట్ల రూపాయల నిధులు సిద్ధంగా ఉన్నాయి.. భూమి కేటాయింపు విషయంలో జాప్యం జరుగుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.

ఆడండి పాడండి ఎంజాయ్ చేయండి.. జగన్‌ మళ్లీ సీఎం కావాలి..
ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాక్షించారు మంత్రి ఆర్కే రోజా.. కాకినాడ జిల్లా సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు.. ఇక, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆడండి, పాడండి, ఎంజాయ్ చేయండి అని సూచించారు మంత్రి ఆర్కే రోజా. మరోవైపు, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ్య యూవర్శిటీలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ ప్రోగ్రాంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి పాల్గొన్నారు మంత్రి ఆర్కే రోజా.. నన్నయ్య వర్శిటీలో వివిధ ప్రాంతలా ఛాంపియన్ షిప్ విద్యార్థులకు గౌరవ వందనం చేశారు.. నన్నయ్య వాణితో మంత్రిని అలరించారు యూనివర్సిటీ సిబ్బంది. ఇక, ఈ రోజు పాలకొల్లులోనూ మంత్రి రోజా పర్యటించనున్నారు. పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న లక్ష దీపోత్సవంలో పాల్గొననున్నారు మంత్రి ఆర్కే రోజా.

సోనియా గాంధీ పుట్టిన రోజు తెలంగాణ ప్రజలకు ఒక పండుగ
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సోనియా గాంధీ బర్త్ డే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ అని అన్నారు. డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారు.. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదు.. కానీ, తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతో ఉంటారని మొన్నటి ఎన్నికల తీర్పుతో నిరూపించారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు నాకు ఈ బాధ్యత ఇచ్చారు.. సేవకుడిగా ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నాది.. కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం.. ఈ ప్రభుత్వం ప్రజలది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ శాసన సభ సంప్రదాయాన్ని కాల రాసింది.. కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ శాసన సభ సంప్రదాయంను కాల రాసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత అలవాటు ను కొనసాగించిందన్నారు. మజ్లిస్ పార్టీతో చేసుకున్న ఒప్పందం మేరకు ఆ పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ను ప్రోటెన్ స్పీకర్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా దగ్గిన కూలిపోయే ప్రమాదం ఉంది… అందుకే ఎంఐఎంను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. సీనియర్ లను పక్కన పెట్టీ ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ నీ ప్రోటెన్ స్పీకర్ చేయడాన్ని మేము ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ కు ఎంఐఎంకి లోపాయకార ఒప్పందం బయట పడిందని ఆరోపించారు. ఎంఐఎం, బీజేపీ ఒకటి అని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ లని కాదని దొడ్డిదారిన అక్బరుద్దీన్ ను ప్రోటెన్ స్పీకర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయాన్ని మేము బహిష్కరిస్తున్నమని తెలిపారు. ప్రొటెన్ స్పీకర్ ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక జరుగొద్దని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక అయిన తర్వాత మా ఎమ్మేల్యేలు ప్రమాణం చేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరిగింది. ఈ మేరకు అక్బరుద్దీన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు చేరుకున్నారు. అక్బరుద్దీన్‌ ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్‌, సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇవాళ సాయంత్రం నోటిఫికేషన్ వెలువడనుంది. రేపు (ఆదివారం) స్పీకర్ ఎన్నిక జరగనుంది. వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ స్పీకర్‌గా రేవంత్‌రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది.

మణిపూర్ ప్రభుత్వానికి మానవ హక్కుల సంఘం నోటీసులు.. కారణం ఇదే?
తెంగ్నౌపాల్ జిల్లాలోని లీతావో గ్రామంలో జరిగిన కాల్పుల్లో కనీసం 13 మంది మరణించారని వచ్చిన నివేదికలపై ఎన్‌హెచ్‌ఆర్‌సి మణిపూర్ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసు చీఫ్‌కు నోటీసు జారీ చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సంఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు మోహరించిన చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బలగాల “లోపాన్ని” సూచిస్తుందని హక్కుల ప్యానెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది మేలో మణిపూర్ రాష్ట్రంలో ఉద్రిక్తతలు చెలరేగినప్పటి నుంచి ఈ ప్రాంతంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారనే నివేదికలు “కలవరపెడుతున్నాయని” జాతీయ మానవ హక్కుల కమిషన్ భావించింది. మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలోని సైబోల్ సమీపంలోని లిథావో గ్రామంలో జరిగిన కాల్పుల్లో కనీసం 13 మంది మరణించారని మీడియా కథనాన్ని హక్కుల ప్యానెల్ స్వయంచాలకంగా స్వీకరించింది. ఈ సంఘటన డిసెంబర్ 4 న జరిగింది. మీడియా నివేదికలోని అంశాలు నిజమైతే తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు ఉన్నాయని కమిషన్ గుర్తించింది. దీని ప్రకారం రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ స్థితిగతులను, రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను పొందుపరచాలని హక్కుల సంఘం పేర్కొంది.

చెన్నైలో భారీ అగ్నిప్రమాదం.. రూ.100 కోట్ల ఆస్తి నష్టం
తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర చెన్నైలోని మనాలి సమీపంలోని వైకాడు ప్రాంతంలోని సబ్బు పొడి గోదాములో ఇవాళ ఉదయం భారీ ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన వస్తువులు నష్టపోయాయి. వెంటనే ఆరు అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. గత ఐదు గంటలుగా మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన గ్యాస్ సిలిండర్ ఫ్యాక్టరీ కూడా మంటలు చెలరేగిన ప్రైవేట్ గోదాం సమీపంలో ఉంది. దీని కారణంగా మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో మనాలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తమిళనాడు అగ్నిమాపక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రియా రవిచంద్రన్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని వారు వెల్లడించారు.

రాజస్థాన్ సీఎం రేసు నుంచి బాల్కనాథ్ ఔట్? ముఖ్యమంత్రి ఎవరంటే ?
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) విజయం సాధించినప్పటి నుండి బాబా బాలక్‌నాథ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. పార్ల‌మెంట్ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయనను రాజస్థాన్ ముఖ్యమంత్రిని చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ కూడా ఉంది. ఇన్ని చర్చల మధ్య బాబా బాల్కనాథ్ ప్రకటన వెలుగులోకి వచ్చింది. మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలను పట్టించుకోకుండా ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ఆయన ప్రకటన తర్వాత బాబా బాల్కనాథ్ సీఎం రేసులో లేరని స్పష్టమైంది. వేచిచూడాలని హైకమాండ్ సూచించినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు మంత్రిగా మంచి పని చేసి అనుభవం సంపాదించుకుంటానన్నారు. రాజస్థాన్ రాజకీయాలపై రాజకీయ నిపుణుడు బాల్కనాథ్ చేసిన ట్వీట్లు అనేక అర్థాలకు దారి తీస్తున్నాయి. యోగి సీఎం రేసులో లేరని కొందరు అంటున్నారు. అందుకే ఇలా ట్వీట్ చేశారు. కాగా శాసనసభా పక్ష సమావేశం తర్వాతే సీఎం ఎవరన్నది తేలనుందని కొందరు అంటున్నారు. ప్రస్తుతం బాలక్‌నాథ్‌ ట్వీట్‌తో రాజస్థాన్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. లోక్‌సభ ఎన్నికల ప్రకారమే బీజీపీ కొత్త సీఎం అవుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహంత్ బాలక్‌నాథ్‌ ను సీఎంగా ఎంపిక చేసేందుకు బీజేపీ వెనుకాడుతోంది. అందుకే బాలక్‌నాథ్‌ ప్రస్తుతానికి పోటీకి దూరంగా ఉంచాలని భావిస్తున్నారు. శుక్రవారం బాల్కనాథ్ ఢిల్లీలో సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. బహుశా ఆయన సీఎం కాలేరనే సంకేతాలు అందాయి. అందుకే ఇలాంటి ట్వీట్‌ చేశాడు.

వామ్మో బీసీసీఐకి ఇంత ఆదాయం వస్తుందా.. మరి ఆస్ట్రేలియా..?
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచింది. ప్రపంచ క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని భారత క్రికెట్‌ బోర్డు ఇప్పటికి కొనసాగిస్తోంది. ప్రతీ సంవత్సరం తమ నికర అదాయాన్ని బీసీసీఐ పెంచుకుంటూ వెళ్తుంది. క్రిక్‌బజ్‌ నివేదిక ప్రకారం.. అయితే, ప్రస్తుతం బీసీసీఐ క్రికెట్ బోర్డు నెట్‌ వర్త్‌ 2.25 బిలియన్‌ డాలర్లు ( సుమారు రూ.18760 కోట్లు). కాగా, మరే ఇతర ఏ క్రికెట్‌ బోర్డు కూడా బీసీసీఐ దారిదాపుల్లో కనిపించడం లేదు.. అయితే, బీసీసీఐ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఉంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్షిక ఆదాయం 79 మిలియన్‌ డాలర్లు( సుమారు రూ. 660 కోట్లు). అంటే ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు కంటే బీసీసీఐ ఆదాయం దాదాపు 28 రేట్లు అధికంగా ఉంది. ఇక ఈ జాబితాలో మూడో స్ధానంలో ఇంగ్లండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డు ఉండగా.. ఈసీబీ నెట్‌వర్త్‌ 59 మిలియన్‌ డాలర్లు(రూ.490 కోట్లు)గా ఉంది. అయితే, బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్‌ బోర్డులు ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను, టోర్నమెంట్‌ నిర్వహణ, క్రికెట్‌ ఆసోషియేషన్‌లకు నిధుల విడుదల చేయడం లాంటివి చూసుకుంటాయి. బోర్డులకు మీడియా రైట్స్‌, స్పాన్సర్‌ షిప్‌ల రూపంలో తమ ఆదాయాన్ని ఆర్జిస్థాయి. కాగా ఐపీఎల్‌ ద్వారా భారత క్రికెట్ బోర్డు ఆర్థిక వృద్ధి బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ ఐపీఎల్‌ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐ భారీగా డబ్బును సంపాదిస్తుంది. 2023-27 ​కాలానికి గాను ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ కోసం మూడు వేర్వేరు సంస్థలు కలిపి బీసీసీఐకి 48,390.32 కోట్ల రూపాయలు చెల్లించాయి. ఇక, వన్డే ప్రపంచకప్-2023కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఈ వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి.. భారత అర్ధిక వ్యవస్ధపై మాత్రం కాసుల వర్షం కురిసింది. ఎకమోనిక్ టైమ్స్ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. రూ. 22 వేల కోట్లు భారత అర్ధిక వ్యవస్ధలోకి వచ్చినట్లు తెలుస్తుంది.

రెండేళ్ల తర్వాత కనిపించినా లేడీ పవర్ స్టార్ క్రేజ్ తగ్గలేదు…
సాయి పల్లవి… ఫిదా సినిమాతో తెలుగు తెరపై మెరసి ఫస్ట్ సినిమాతో సూపర్బ్ ఫేమ్ సంపాదించుకుంది. అందం, యాక్టింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ గా ఉండే సాయి పల్లవి తను చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. లవ్ స్టొరీ, శ్యాం సింగ రాయ్, విరాట పర్వం లాంటి సినిమాల పేర్లు చూస్తే ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ ఇంత పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ పడలేదనే చెప్పాలి. చీర కట్టులో కూడా మోస్ట్ గ్లామరస్ గా కనిపించగల సాయి పల్లవికి తెలుగు రాష్ట్రాల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెని చూడడానికే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు అంటే సాయి పల్లవి క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. లేడీ పవర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగా ఉంది. సాయి పల్లవి చివరగా నటించిన విరాటపర్వం సినిమా 2022 జూన్ లో రిలీజ్ అయ్యింది అంటే గత రెండేళ్లుగా సాయి పల్లవి నుంచి సినిమా లేదు, ఆమె బయట కూడా కనిపించింది చాలా తక్కువ. ఎవరైనా హీరోయిన్ రెండేళ్లు కనపడకపోతే ఆమె మర్చిపోతారు ఆడియన్స్. కొత్త హీరోయిన్ ని క్రష్ లిస్టులో యాడ్ చేసుకోని, ఆమె ఫోటోస్ ని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. సాయి పల్లవి విషయంలో మాత్రం అలా జరగట్లేదు, రెండేళ్లైనా ఆమె క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమా చేయడానికి రెడీ అయ్యింది సాయి పల్లవి. ఈ పాన్ ఇండియా మూవీ ఓపెనింగ్ సెరిమోనీకి వచ్చిన సాయి పల్లవి ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చాలా సింపుల్ గా ఎప్పటిలాగే క్యూట్ లుక్స్ తో కనిపించిన సాయి పల్లవి ఫోటోలని ట్రెండ్ చేస్తూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కి ఇలాంటి క్రేజ్ దక్కలేదు. మరి తండేల్ నుంచైనా సాయి పల్లవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తుందేమో చూడాలి.

శారీలో కొంటె చూపులతో కవ్విస్తున్న శ్రీయా శరన్..
తెలుగు సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికి సరసన జత కట్టింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా అదిరిపోయే శారీలో హాట్ అందాలను చూపిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా అమ్మడు మరోసారి తన తన అందాల ఘాటు చూపించింది.ఈ ఏజ్ లో కూడా కుర్ర భామలు తనకి పోటి రారని చెబుతోంది. చూపులతోనే కవ్వించే అందమైన హీరోయిన్లలో శ్రీయ ముందు వరుసలో ఉంటుంది. యువత మైండ్ బ్లాక్ అయ్యే విధంగా గ్లామర్ విధ్వంసం సృష్టించింది. తాజాగా శారీలో బ్లాస్టింగ్ ఫోజులిచ్చింది శ్రియా. కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్ళకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. శ్రీయ చిరునవ్వులతో వాలు చూపులు చూస్తే ఎవరైనా ఫిదా కావలసిందే. ఆ తరహాలోనే శ్రీయ లేటెస్ట్ ఫోజులు ఉన్నాయ్. శ్రీయ ప్రస్తుతం కొన్ని క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది.

రాజమౌళి, మహేష్ బాబులకి సినిమా నచ్చలేదా?
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీని మైంటైన్ చేస్తూ సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది అనిమల్ మూవీ. రణబీర్ కపూర్ చేసిన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని కొట్టాడు. ఒక కథని చెప్పడంలో సందీప్ రెడ్డి కన్విక్షన్ లో హ్యూజ్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. కామన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీస్ కూడా అనిమల్ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా అనిమల్ సినిమాని చూసి చిత్ర యూనిట్ మొత్తాన్ని పేరు పేరున అభినందిస్తూ ట్వీట్ చేసాడు. అయితే అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చిన రాజమౌళి, మహేష్ బాబుల నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. సందీప్ రెడ్డి వంగని రామ్ గోపాల్ వర్మతో పోలుస్తూ ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్పీచ్ ఇచ్చిన జక్కన, అనిమల్ సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. చిన్న సినిమాల గురించి కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేసే మహేష్ బాబు కూడా అనిమల్ సినిమా విషయంలో సైలెంట్ గా ఉన్నాడు. ఈ ఇద్దరు అనిమల్ సినిమాని చూడలేదా? లేక చూసినా నచ్చలేదా అనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం రాజమౌళి, మహేష్ బాబులకు అనిమల్ సినిమా నచ్చలేదేమో అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అనిమల్ సినిమాని ఈ వీకెండ్ చూసి రాజమౌళి, మహేష్ లు ట్వీట్ చేస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే అనిమల్ సినిమాని పొగిడే వాళ్లు ఎంతమంది ఉన్నారో విమర్శించే వాళ్లు కూడా అంతే మంది ఉన్నారు. ముఖ్యంగా నార్త్ లో అనిమల్ సినిమాపై నెగటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. టాక్సిక్ మూవీ అంటూ అనిమాల్ పై విమర్శలు చేస్తున్నారు. ఇవే కామెంట్స్ సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాకి కూడా వినిపించాయి. మరి ఈసారి సందీప్ నెగటివ్ కామెంట్స్ పై ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది చూడాలి.

Show comments