Site icon NTV Telugu

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్రంలో వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లకు ఇప్పటి వరకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు వారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం.. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పర్యవేక్షణకు ప్రోత్సాహకంగా రూ.750 చెల్లించేందుకు సిద్ధమైంది.. అంటే.. గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5 వేలకు అదనంగా ఈ రూ.750ను చెల్లించనుంది వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం.. ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో వాలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నారు.. అందుకే వారికి ఈ ప్రోత్సాహ­కాన్ని అందజేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. ప్రతి నెలా రూ.750 మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా వేరేగా వాలంటీర్లకు అందించనున్నారు.. ఈ నెలలో సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో వాలంటీర్లను మరింత భాగస్వాములను చేయడం కోసం ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు.. అయితే, ఇప్పటి వరకు రూ.5 వేలు గౌరవ వేతనం పొందుతున్నారు వాలంటీర్లు.. వారికి అదనంగా రూ. రూ.750 ప్రోత్సాహకాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు.. కానీ, ఎప్పటి నుంచో వర్తింపజేస్తారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, వైఎస్ జగన్ సర్కార్ వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురైనా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తోన్న విషయం విదితమే.

ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన.. సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
నేను రాజశేఖర్ రెడ్డి అభిమానిని.. రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలను అభిమానించే వ్యక్తిని.. నా రాజకీయ ప్రయాణం షర్మిలతోనే అని స్పష్టం చేశారు ఆర్కే.. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే నేను ఉంటా.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ పార్టీని బలోపేతం చేయడానికి నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను అన్నారు. నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను.. మంత్రి పదవి ఇవ్వలేదని రాజీనామా చేయాలనుకుంటే రెండేళ్ల క్రితం రాజీనామా చేసేవాడ్ని కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 175 సీట్లు గెలుస్తానంటున్న ముఖ్యమంత్రి నియోజకవర్గాల్లో చేస్తున్న అభివృద్ధి ఏంటో చెప్పాలి..? అని నిలదీశారు. కుప్పం, పులివెందుల నియోజకవర్గాలను టార్గెట్‌ పెట్టుకున్న ప్రభుత్వం మిగతా నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. 1200 కోట్లు మంగళగిరి అభివృద్ధికి కేటాయిస్తానన్న ముఖ్యమంత్రి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు ఆర్కే.. మంగళగిరి అభివృద్ధిలో ప్రభుత్వ సహకారం లేదు.. ఎన్నిసార్లు సీఎంవో చుట్టూ తిరిగిన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంవోలో అధికారులు, ఎమ్మెల్యేలను పురుగులు చూసినట్టు చూస్తున్నారు.. అలాంటి పార్టీలో నేను ఎందుకు ఉండాలన్న ఆలోచనతోనే రాజీనామా చేశాను అన్నారు. ఎమ్మెల్యే పదవికే కాదు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను… నాకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. నా రాజీనామా ఆమోదిస్తారా లేదా అన్నది స్పీకర్ విచక్షణ అధికారం. నేను మాత్రం నైతికత పాటిస్తూ ఎమ్మెల్యేగా ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇకపై పాల్గొనబోనని స్పష్టం చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.

పవన్‌ కల్యాణ్‌ పిలిస్తే వెళ్లా.. ఇక్కడ టీడీపీ-జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదు
జగ్గంపేట రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌ అవుతున్నాయి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పుడు జనసేన పార్టీకి టచ్‌లోకి వెళ్లారు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఆయన రహస్యంగా సమావేశం అయినట్టు వార్తలు వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్‌ కష్టమని పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం ఉందట.. దీంతో.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. కానీ, జ్యోతుల నెహ్రూ నుంచి వ్యతిరేకత రావడంతో.. టీడీపీ అధిష్టానం జ్యోతుల చంటిబాబు చేరికను హోల్డ్‌లో పెట్టింది.. దీంతో.. జనసేన పార్టీ టచ్‌లోకి వెళ్లారు జగ్గంపేట ఎమ్మెల్యే.. పవన్‌ కల్యాణ్‌తో సమావేశంపై అనుచరులతో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పిలిచారు.. అందుకే వెళ్లి కలిసినట్టు చెప్పుకొచ్చారు.. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి పవన్‌ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఇక, జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేసే పరిస్థితి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సర్వేల ద్వారా సీటు ఇవ్వడానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేసింది ఏమీ లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అంతా ప్రభుత్వ పరంగా చేసినవేనన్న ఆయన.. జనవరి 1వ తేదీన అనుచరులతో సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు సీటు ఇస్తున్న వారు పనికి వచ్చే వారేనా? అంటూ వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీచేయనున్నాయి.. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి.. అయితే, సీట్లు సర్దుబాటు జరగాల్సి ఉంది.. ఇలాంటి సమయంలో జ్యోతుల చంటిబాబు.. జగ్గంపేటలో టీడీపీ-జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించడం చర్చగా మారింది.

అందుకే వైసీపీ నుంచి జనసేనలో చేరా..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అయితే, వైసీపీ నుంచి వంశీ కృష్ణపై విమర్శలు పెరిగాయి.. దీంతో.. వాటికి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రత్యక్ష రాజకీయాల్లో వుండడం కోసమే నేను వైసీపీ నుంచి జనసేనలో చేరాను అన్నారు. తాను రాజకీయాల కోసం 60 ఎకరాలు భూమి, 10 సైట్ లు అమ్ముకున్నాను.. వైసీపీలో బీసీలకు న్యాయం జరిగితే నేను ఎందుకు పార్టీ మారతాను అని ప్రశ్నించారు. గుడివాడ అమర్నాథ్ జాక్‌పాట్‌ కొట్టి మంత్రి అయ్యాడు అని ఎద్దేవా చేశారు.. తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. నా రాజకీయ భవిష్యత్తు నాశనం కావడానికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కారణం అన్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. వచ్చే ఎన్నికల్లో ఎంవీవీని ఓడించడమే నా లక్ష్యం అన్నారు. సంక్రాంతి పండుగ తరువాత నా సత్తా చూపిస్తాను అంటూ సవాల్ చేశారు. రాష్ట్రంలో నాకు చాలా మంది ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో సంబంధాలు వున్నాయి.. వైసీపీ పార్టీ నుండి చాలా మందిని తీసుకుపోతాను అని ప్రకటించారు. టీడీపీలో ఉన్నప్పుడు విడదల రజనీ.. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు మనుషులను పెట్టి కొట్టించేద్దాం అనుకున్నాను.. అటువంటి ఆమెకు మంత్రి పదవి ఇచ్చారని ఫైర్‌ అయ్యారు.. జగన్ సలహాదారులుగా పెట్టుకున్న వాళ్లే పార్టీని ముంచేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్‌ చెప్తే ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడానికి సిద్దం.. ప్రస్తుతం రాజీనామా చెయ్యొద్దని అధినేత చెప్పారని వెల్లడించారు ఎమ్మెల్సీ వంశీ కృష్ణ.

ప్రధాని మోడీకి పవన్‌ కల్యాణ్‌ లేఖ..
ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడ్డారని ప్రధానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.. పేదలందరికీ భూమి పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని.. ఈ స్కీం కింద భారీ ఎత్తున.. రూ. 35,141 కోట్ల మేర దోపిడీ జరిగిందన్నారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పేరుతో జరిగిన దోపిడీపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలి. ఈ స్కీం కేంద్ర ప్రభుత్వ పథకాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలన్నారు. భూ సేకరణ పేరుతో భారీ దందాకు.. భారీ దోపిడీకి వైసీపీ నేతలు తెర లేపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించాలని లేఖలో కోరారు. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ.91,503 కోట్లుగా చెబుతోంది.. ఈ అంశంలో అనేక సందేహాలున్నాయని లేఖలో పేర్కొన్నారు పవన్‌.. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా, ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసిందన్న ఆయన.. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లే అవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు. ఈ మొత్తం పథకంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసిందన్నారు.. పీఎంఏవై, జేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.

ఆర్టీసి సిబ్బందిపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదు
ఆర్టీసి సిబ్బంది, ఆర్టీసి బస్సులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని రవాణా, బీసీ సంక్షేమం శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఆర్టీసీ కొత్త 80 బస్సులను జెండా ఊపి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్నందున మహిళ ప్రయాణికుల రద్దీ పెరిగిందన్నారు. బస్సులపై ఓవర్ లోడ్ అవుతున్న విషయం మా దృష్టికి వచ్చిందన్నారు. వాటిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామన్నారు. పురుష ప్రయాణికుల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లుకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. సంక్రాంతి బస్సుల చార్జీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలు ఉచిత ప్రయాణం కల్పించారన్నారు. ఉచిత టికెట్ మీద ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారన్నారు. 1050 కొత్త బస్సులు 400 కోట్లతో కొనుగోలు చేస్తున్నామన్నారు. ఖాకీ బట్టలతో ఉన్న ఆర్టీసి సిబ్బంది సంస్థను కాపాడుకుంటున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసి బలోపేతానికి కృషి చేస్తామన్నారు. సీసీఎస్ బకాయిలు దశల వారీగా విడుదల చేస్తామని తెలిపారు.

అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో గోల్డ్ ATM.. ఎన్ని గ్రాములు కొనచ్చంటే?
ఒకప్పుడు ఆర్థిక లావాదేవీల కోసం ప్రజలు బ్యాంకులకు వెళ్లేవారు. డబ్బు, బంగారం దాచుకునేందుకు బ్యాంకులను ఆశ్రయించారు. ఖాతాదారులు తమ నగదును విత్‌డ్రా చేసుకోవడానికి లేదా నిల్వ చేసుకోవడానికి బ్యాంకులకు పరుగులు తీయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ATMలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, కొన్ని సేవలు మినహా, అవసరమైన అన్ని లావాదేవీలు ATMల ద్వారా పూర్తవుతాయి. అయితే ఇప్పుడు ఏటీఎంల ద్వారా డబ్బునే కాదు బంగారం కూడా తీసుకోవచ్చు. కానీ అన్ని ఏటీఎంలలో ఇది సాధ్యం కాదు. గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన గోల్డ్ ఏటీఎంల నుంచి మాత్రమే బంగారు నాణేలను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని ఓ మెట్రో స్టేషన్‌లో ఈ బంగారు ఏటీఎంను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా మారుతున్నందున అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని అమీర్ పేట మెట్రో స్టేషన్ లో గోల్డ్ ఏటీఎం ప్రారంభమైంది. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ ఆవరణలో గోల్డ్‌ సిక్కా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో గోల్డ్‌ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు.

అయోధ్యలో మోడీ గ్రాండ్ రోడ్ షో, రైల్వే స్టేషన్ ప్రారంభం.. ఎనిమిది రైళ్లకు ప్రధాని పచ్చ జెండా
ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా ఇక్కడ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపించి జై శ్రీరామ్ నినాదాలతో స్వాగతం పలికారు. ఇక్కడ పునఃఅభివృద్ధి చెందిన రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. ఇప్పుడు కొత్త విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దీంతో పాటు అయోధ్య సహా యూపీకి రూ.15 వేల కోట్ల బహుమతిని ప్రధాని మోడీ ఇవ్వనున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందించారు. ప్రధాని మోడీ అయోధ్యలో గంటపాటు రోడ్ షో నిర్వహించారు. ఇందులో రోడ్డుకు ఇరువైపులా జనం గుమిగూడారు. ప్రజలు కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రధానిపై పూలవర్షం కూడా కురిపించారు. రోడ్ షోలో పెద్ద ఎత్తున జనం కనిపించారు. వారు ప్రధానికి చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. పునరాభివృద్ధి చెందిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రెండు కొత్త అమృత్ భారత్, ఆరు కొత్త వందే భారత్ రైళ్లను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఇది కాకుండా, అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని మోడీ దేశానికి అంకితం చేశారు. ఈ సమయంలో ఆయన వెంట రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు. రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేసే ముందు, వాటిలో కూర్చున్న పిల్లలతో కూడా ప్రధాని మాట్లాడారు. అదే సమయంలో, ప్రధాని మోడీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని సుందరంగా అలంకరించారు. అన్ని చోట్లా ప్రధాని మోడీ బొమ్మలను కూడా ఉంచారు. ప్రధాని మోడీ అయోధ్య పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రతా ఏర్పాట్లను కూడా పెంచారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్, హైవే, రైల్వే లైన్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దీంతో పాటు నాలుగు ప్రధాన రహదారులను కూడా ప్రారంభించనున్నారు.

భారత్‌లో పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం.. రంగంలోకి దిగిన ప్రభుత్వం
దేశంలో అధిక ఆహార ద్రవ్యోల్బణంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ఆరు నెలల ఆర్థిక సమీక్షలో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోందని, అయితే భారత్‌తో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, దక్షిణాఫ్రికా, జపాన్ వంటి దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ అంచనా వేసిన 6.5 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ.. 100 బిలియన్ డాలర్ల విలువైన సామ్రాజ్యాధిపతి
ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మైయర్స్ ప్రస్తుతం ఈ పేరును ప్రతి ఒక్కరు గుర్తుంచుకుని తీరాలి. ఈ ఫ్రెంచ్ మహిళ చరిత్ర పుటల్లో తన పేరును నమోదు చేసుకుంది. మైయర్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా అవతరించింది. ఆమె సంపద 100 బిలియన్ డాలర్లను దాటింది. ప్రపంచంలోనే ఇంత డబ్బు సంపాదించిన తొలి మహిళగా కూడా ఆమె నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ మహిళ కూడా 100 బిలియన్ డాలర్ల సంపదను సృష్టించలేకపోయింది. భారతదేశంలో ఏ ధనవంతుడు ఆమె కంటే ముందు లేరు. ఆమె ప్రపంచంలోనే అతిపెద్ద సౌందర్య సాధనాల కంపెనీ లోరియల్ వారసురాలు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆమె 12వ స్థానంలో నిలిచింది. మైయర్స్ L’Oréal వ్యవస్థాపకుడు యూజీన్ షుల్లెర్ మనవరాలు. మైయర్స్ ఆమె కుటుంబం L’Oréalలో 34 శాతం వాటాను కలిగి ఉన్నారు.

‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఈ తాతదే.. రెమ్యునరేషన్ ఎంతిచ్చారో తెలుసా?
మహేష్ బాబు గుంటూరు కారం నుంచి వస్తున్న అప్‌డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మూవీపై మరింత హైప్ పెంచుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిన కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో వీపరితమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఫుల్ మాస్ సాంగ్‌గా వస్తోన్న పాటకు కోసం మహేష్ ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తు్న్నారు. ఈ ప్రోమోలో మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లో మోత మోగించడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు ఈ సాంగ్‌పై భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఈ పాటకు ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడానికి కారణం కుర్చీ తాతనే. కుర్చీ తాత సరదాకి ‘కుర్చీ మడతపెట్టి’ అనే డైలాగ్ చెప్పి సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అయ్యాడు. ఇక ఈ డైలాగ్‌ను హుకప్ లైన్ గా తీసుకుని రామజోగయ్య శాస్త్రి గుంటూరు కారంలో ఏకంగా పాటనే రాసేశాడు. అయితే త‌న డైలాగ్‌ను గుంటూరు కారం సాంగ్‌లో పెట్ట‌డంపై తాజాగా కుర్చీ తాత స్పందించాడు. గుంటూరు కారంలో నా డైలాగ్‌తో రాసిన పాట‌ను మహేశ్‌బాబు పాడి డ్యాన్స్ చేయ‌డం చాలా సంతోషంగా ఉందని, అంత గొప్ప నటుడు తన డైలాగ్‌కు పాట రూపంలో డాన్స్ చేయడం ఆనందంగా ఉందన్నారు. జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ అవుతుంది. ఇంకా సినిమా విడుద‌ల‌కు రెండు వారాల టైం మాత్రమే ఉంది. ఒకవేళ అవకాశం ఇస్తే మహేష్ బాబుతో కలిసి ఆ పాటకు డాన్స్ చేస్తా అని తన కోరికను బయటపెట్టాడు. మరి ఈ కుర్చీ తాత కోరికను మహేష్ తీరుస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే తన డైలాగ్‌ను పాటగా తీసుకున్నందుకు ఈ కుర్చీ తాతకు రెమ్యునరేషన్ కూడా అందినట్టు సమాచారం. ఈ పాటని కంపోజ్ చేసిన తమన్ దాదాపు రూ.5 వేల వరకు కుర్చీ తాతకు రెమ్యునరేషన్ ఇచ్చాడని స్వయంగా ఈ తాతే ఇంటర్వ్యూలో చెప్పాడు.

బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి.. ఫుల్ ఖుష్‌లో ఫ్యాన్స్
నేచులర్ బ్యూటీ సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ని పలకరించి రెండేళ్లు అవుతోంది. చివరగా నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాలో కనిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌తో సాయి పల్లవి నెక్ట్స్ సినిమాలపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఏ జోరులో సినిమాలు చేస్తుందో.. నెక్ట్స్ ఎలాంటి స్క్రిప్ట్‌తో వస్తుందా? అని ఫ్యాన్స్ అంతా ఆసక్తి కనబరిచారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసింది. లవ్‌స్టోరీ తర్వాత ఏ తెలుగు ప్రాజెక్ట్ ఒకే చేయలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా డిసప్పాయింటింగ్‌లో ఉన్న టైంలో ఎట్టకేలకు సాయిపల్లవి తెలుగు సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్యతో హీరో వస్తున్న ‘తండేల్‌’‌లో సాయి పల్లవిని హీరోయిన్‌గా ఖరారు చేస్తూ ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అయితే ఆమె సెట్లో ఎప్పుడు అడుగుతుంది, షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా? ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో వారిని ఫుల్ ఖుష్ చేసే అప్‌డేట్ వచ్చింది. తాజాగా సాయి పల్లవి తండేల్ సెట్లో అడుగుపెట్టిందట. షూటింగ్ అనంతరం సంధ్యా సమయంలో బీచ్ వ్యూ‌ను ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక లోని గోకర్ణ ప్రాంతంలో నిర్వహించింది మూవీ టీం.

Exit mobile version