NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

దుర్గమ్మ సేవలో టీడీపీ అధినేత.. నా శేష జీవితం ప్రజలకే అంకితం..
నా శేష జీవితం ప్రజలకే అంకితం.. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడబోను అని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ రోజు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టాను అన్నారు.. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, అనంతరం దర్గాకు కూడా వెళ్తాను అన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని వెల్లడించారు చంద్రబాబు. రాష్ట్రంలో మరల పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వాలని కనకదుర్గమ్మను కోరుకున్నట్టు తెలిపారు చంద్రబాబు.. నా శేష జీవితం ఇక ప్రజలకు అంకితం.. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడబోను అన్నారు. ఈ కలియుగంలో త్వరగా ప్రతీదీ మర్చిపోతాం.. ఇబ్బంది పెడితే మర్చిపోం అన్నారు. గచ్చిబౌలీలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ వచ్చారు.. నా బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్ధించారు, కొంతమంది ప్రాణ త్యాగాలు చేసారు.. నిన్న కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామిని ధర్మాన్ని కాపాడటానికి దర్శనం చేసుకున్నా.. ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకుని దుష్టుల్ని శిక్షించమని కోరాను అన్నారు.

ఈసీ నిర్ణయంపై పయ్యావుల కీలక వ్యాఖ్యలు..
ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్… కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుందన్న ఆయన.. ఇక, బల్క్ ఫారమ్-7 డిలీషన్స్ చెల్లవు.. బల్క్ ఫారమ్- 7 అప్లికేషన్లు ఆన్ లైన్ లో తీసుకోవద్దని సీఈసీ ఆదేశించిందని తెలిపారు. దొంగ ఓట్లను తొలగించాలంటే ఫిజికల్ గానే ఫారమ్ 7 తప్పని సరి.. రాజకీయ నాయకులు వినతి పత్రాలు ఇస్తే ఓట్లను తొలగించడానికి లేదని స్పష్టం చేశారు. ఇక, పయ్యావుల కేశవ్ ఎవర్నీ బ్లాక్ మెయిల్ చేయడు.. ఏది చేసినా వైట్ పేపర్ తో మాట్లాడతానన్న ఆయన.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి బతుకు అంతా బ్లాక్ మెయిలే అని మండిపడ్డారు.. ఓటు హక్కు ఎక్కడ ఉండాలనేది ఓటరు ఇష్టం.. మధ్యలో మీది ఏంటి? అని నిలదీశారు. ఉరవకొండలో మేం చేసిన పోరాటం వల్ల ఎన్నికల సంఘం స్పందించిందన్నారు. కానీ, విశ్వేశ్వరరెడ్డి కలెక్టర్ ను, ఎమ్మార్వోలను కూడా పని చేసుకోనివ్వడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు జరిగితే.. చట్టాన్ని పరిరక్షించమని ఎన్నికల సంఘాన్ని ఎన్నిసార్లు అయినా అడుగుతాం అన్నారు. విశ్వేశ్వరరెడ్డి చేసిన తప్పులకు ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారని ధ్వజమెత్తారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.

హైదరాబాద్ ప్రజలు నా మాట విన్నారు..
హైదరాబాద్ ప్రజలు నా మాట విన్నారని, నూటికి 40 శాతం మాత్రమే ఓటేశారని.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. సీఈఓ వికాస్ రాజ్ ఒక పెద్ద డ్రామా నడుపుతున్నారని అన్నారు. అవినీతి చక్రవర్తిగా సీఈఓ మారుతున్నారని తెలిపారు. సీఈఓ వికాస్ రాజ్ పై చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశామన్నారు. 30వ తేదీ రాత్రి తుంగతుర్తిలో ఈవీయంలు కనబడటం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని 30 స్థానాల్లో ఈవీయంలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు 58 – 63 సీట్లు వస్తున్నాయని సర్వేలు చెపుతున్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారని, వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బుతో వికాస్ రాజ్ ను కొనేశారా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్వోలు అవినీతి చేస్తున్నారని మండిపడ్డారు. తను వికాస్ రాజ్ కు అనేక ఫిర్యాదులు చేసా.. ఒక్కటి కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ దగ్గర డబ్బులు ఎందుకు సీజ్ చేయలేదు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజలు నా మాట విన్నారని అన్నారు. నూటికి 40 శాతం మాత్రమే ఓటేశారని ఆనందం వ్యక్తం చేశారు.

ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎగ్జాట్ పోల్స్ వేరు..
ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎగ్జాట్ పోల్స్ వేరు.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కాబోతున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎగ్జాట్ పోల్స్ వేరు అన్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పార్టీలకు సంబంధాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఇస్తున్నారని తెలిపారు. పోలింగ్ పూర్తి కాకముందే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు. సైలెంట్ ఓటు కేసీఆర్ కు అనుకూలంగా ఉందన్నారు. బీఆర్ఎస్ 70 నుంచి 75 సీట్లు పక్క అని ధీమా వ్యక్తం చేశారు. మాస్ ఓటర్ వేరు.. క్లాస్ ఓటర్ వేరు అని అన్నారు. క్లాస్ ఓటర్ బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకీ వస్తే కేసీఆర్ పెద్ద పదవి ఇస్తా అన్నారని తెలిపారు. నా పక్కన ఉంటావు అన్నాడు కేసీఆర్ అని తెలిపారు. ఈ విషయం హరీష్ రావుకు కేటీఆర్ కు కూడా తెలియదన్నారు. మనసులో మాట కేసీఆర్ నాతో పంచుకున్నాడని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కు ఏర్పాట్లు.. సాయుధ బలగాలతో పహారా..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 40 సెంట్రల్ కంపెనీ దళాలు మూడు పొరల భద్రతతో స్ట్రాంగ్ రూమ్‌లను కాపాడుతున్నాయి. డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలోని 13 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్‌రూమ్‌ల లోపల, బయట కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు. స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేందుకు ఓకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతోపాటు స్ట్రాంగ్ రూంకు డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ టేబుల్స్ ఉన్నాయి. కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజిగిరి, పటాన్‌చెరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో 400లకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో 20+1 టేబుళ్లను ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, సేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఇక్కడ 28+1 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. విమానాల దారి మళ్లీంపు
దేశ రాజధాని న్యూఢిల్లీలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డంకిగా మారింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమానాలు ల్యాండ్‌ కావడం లేదు.. దీంతో పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే దారి మళ్లించిన విమానాల సమాచారాన్ని ఎయిర్ పోర్టు అధికారులు తెలియజేశారు. అయితే, ఢిల్లీలో వర్షం కారణంగా ఇవాళ ఉదయం 7: 30 నుంచి 10: 30 గంటల మధ్య వెళ్లాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. 18 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్‌సర్‌లకు పంపించారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా పిల్లలు దగ్గుకు గురౌవుతున్నారు. ఇక, ఢిల్లీలోని వివిధ నగరాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ విహార్ 388, అశోక్ విహార్ 386, లోధి రోడ్ 349తో పాటు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం 366 వద్ద రికార్డు స్థాయిలో కాలుష్యం నమోదు అయింది. అయితే, ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-3ని తొలగిస్తున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. గ్రాప్-1, గ్రాప్-2లను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

ట్విట్టర్ ట్రెండింగ్ లో భారత ప్రధాని మోడీ..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ- ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫోటో ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుంది. ఈ ఇరువురి మధ్య స్నేహాబంధంపై నెటిజన్స్ చర్చిస్తున్నారు. గత పర్యటనల్లోని వీరిద్దరి ఫోటోలను ‘Melodi’ హాష్ ట్యాగ్ తో ట్వీట్స్ చేయడంతో ట్రెండింగ్ లోకి వచ్చాయి. దుబాయ్ లో జరుగుతున్న కాప్ 28 శిఖరాగ్ర సదస్సులో మోడీతో తీసుకున్న సెల్ఫీని ‘Melodi’ ట్యాగ్ లైన్ తో ట్వీట్ చేశారు. దీంతో వీరి ఇరువురి ఫ్రెండ్షిప్ పై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. నరేంద్ర మోడీతో దిగిన సెల్ఫీని ఇటలీ ప్రధాని మెలోని ఎక్స్ లో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోకు 13.5M వీక్షణలు, 210K లైక్‌లు, 12K కామెంట్స్, 40 రీట్వీట్‌లు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు రూపొందించిన వైరల్ ట్రెండింగ్ ‘జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ని ఉపయోగించారు. మరి కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యొక్క ఇటాలియన్ సంబంధాన్ని తెలియజేస్తు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి జార్జియా మెలోనిని భారతదేశానికి ఆహ్వానించాలని మరి కొందరు నెటిజన్స్ హాస్యాస్పదమైన కామెంట్స్ చేశారు. అయితే, ఇంతకుముందు కాప్ 28 శిఖరాగ్ర సమావేశంలో ఈ ఇద్దరు నేతలు కలుసుకున్నారు. భారత్- ఇటలీ మధ్య సుస్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తు ఉంటుందని మెలోనీతో కలిసి ఉన్న ఫోటోను కూడా ప్రధాని మోడీ పోస్ట్ చేశారు.

ఇస్తాంబుల్ అనిమల్ vs ఢిల్లీ అనిమల్… సీక్వెల్ లో రణబీర్ vs రణబీర్
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చేసింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాలతో విడుదల అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అలాగే జరిగాయి.. జరుగుతున్నాయి. తెలుగులో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉంది. తెలుగులో గ్రాండ్‌గా నిర్వహించిన ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, మహేష్ బాబు ముఖ్య అథితిగా రావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే.. యానిమల్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. సందీప్ రెడ్డి మరో సాలిడ్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ డే 116 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది యానిమల్. ఇదిలా ఉంటే.. యానిమల్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని సినిమా ఎండ్ లో క్లియర్ గా చెప్పేసాడు సందీప్ రెడ్డి వంగ. “అనిమల్ పార్క్”గా ఈ సీక్వెల్ అనౌన్స్ అయిపొయింది. పోస్ట్ క్రెడిట్స్ లో వచ్చిన “అనిమల్ పార్క్” గ్లిమ్ప్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. ఈ గ్లిమ్ప్స్ లో రణబీర్ ని మరింత వైల్డ్ గా ప్రెజెంట్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సీక్వెల్ గురించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ, రివీల్ చేసిన పాయింట్స్ వరకూ చూస్తే… “ఇస్తాంబుల్ లో ఉండే అనిమల్ కి, ఢిల్లీ రన్ విజయ్ సింగ్ కి మధ్య వార్” ఉండేలా ఉంది. అంటే రణబీర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ… రణబీర్ vs రణబీర్ వార్ గా సీక్వెల్ రూపొందనుంది. ఇద్దరు వైల్డ్ అనిమల్స్ లాంటి మనుషులు కొట్టుకుంటే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం ఖాయం. కలెక్షన్స్ అనే కాదు అనిమల్ vs అనిమల్ లైన్ పై అనిమల్ పార్క్ సినిమాని డిజైన్ చేస్తే సందీప్ రెడ్డి వంగ వయొలెన్స్ అనే పదానికే కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.

ట్రెండింగ్ లో ఉగ్రమ్… కారణం ప్రభాస్-ప్రశాంత్ నీల్
సోషల్ మీడియాలో ఉగ్రమ్ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రశాంత్ నీల్ మొదటి సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీ మురళి హీరోగా నటించాడు. ఇద్దరు స్నేహితుల కథగా 2014లో రిలీజ్ అయిన ఉగ్రమ్ సినిమాలో కన్నడగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సెన్సేషన్ గా మారాడు. సలార్ సినిమాకి ఉగ్రమ్ సినిమాకి పోలికలు ఉంటాయనే కామెంట్స్ చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఇటీవలే రిలీజ్ అయిన సలార్ ట్రైలర్ బయటకి వచ్చిన తర్వాత ఆ డిస్కషన్ మరింత పెరిగింది. సలార్, ఉగ్రమ్ సినిమాకి రీమేక్ వర్షన్… స్కేల్ పెంచి అదే కథని పాన్ ఇండియా రేంజులో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్ అనే కామెంట్స్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో కూడా ఇది ఇద్దరు స్నేహితుల కథగా ప్రెజెంట్ చేయడంతో సలార్ రీమేక్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ కారణంగానే కన్నడ మూవీ లవర్స్, ఉగ్రమ్ మూవీ లవర్స్, శ్రీ మురళి ఫ్యాన్స్ ఉగ్రమ్ ట్యాగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ అంత బ్లైండ్ గా ఉగ్రమ్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ తో తెరకెక్కించకపోవచ్చు. ఉగ్రమ్ అనేది ప్రశాంత్ నీల్ మొదటి సినిమా కాబట్టి అతను ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఉగ్రమ్ లైన్స్ లో, ఆ ఛాయలు కనిపించడం సహజం. సందీప్ రెడ్డి వంగ ఎన్ని సినిమాలు చేసినా కూడా అర్జున్ రెడ్డి లైన్స్ ఛాయలు తప్పకుండా కనిపిస్తాయి. నీల్ విషయంలో కూడా అంతే… ఉగ్రమ్ ఛాయలు ఉంటూనే సలార్ కొత్త ప్రపంచంలో డిజైన్ చేసిన సినిమా అవుతుంది.