NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

వైసీపీ రెండో లిస్ట్‌ రెడీ..! సిట్టింగ్‌లలో టెన్షన్‌.. వారి మార్పు తప్పదా..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పాలిటిక్స్‌ హీట్‌ పెంచుతున్నాయి.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల్లోను టెన్షన్‌మొదలైంది.. దానికి ప్రధాన కారణం.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్థాలచలనం కలగడమే.. మరికొందరికి అయితే, సీటు కూడా కష్టమని అధిష్టానం నుంచి క్లారిటీగా సందేశాలు వెళ్లాయి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండో లిస్ట్‌ రెడీ అవుతుందట.. నేడో, రేపో ఆ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.. మొదటి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పులు చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అందులో ముగ్గురు మంత్రులకు కూడా స్థానచలనం తప్పలేడు.. ఇప్పుడు దాదాపుగా సెకెండ్ లిస్ట్ కొలిక్కి రావడంతో.. అందులో పేరు ఎవరిది ఉంటుంది.. అధిష్టానం నుంచి పిలుపు ఎవ్వరికి రానుందే అనేది ఉత్కంఠగా మారిపోయింది. ఇక, క్లారిటీ వచ్చిన నియోజకవర్గాలను ఎప్పటికప్పుడు ప్రకటించేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉందట.. పక్క పార్టీ వాళ్లతో టచ్ లోకి వెళ్తున్నారు టికెట్ రాదని నిర్ధారణ అయిన పలువురు ఆశావహులు.. ఈ సారి ఉభయగోదావరి జిల్లాల్లో పలు మార్పులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.. అనకాపల్లి జిల్లాలో మొత్తం ఏడు సెగ్మెంట్లలో మార్పులకు ఛాన్స్ ఉందట.. అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, యలమంచిలి, మాడుగుల, నర్సీపట్నం సెగ్మెంట్లలో మార్పులు ఉంటాయని సమాచారం.. మరోవైపు.. ఉభయగోదావరి జిల్లాల్లో అమలాపురం, రామచంద్రాపురం, నరసరావుపేట, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురంలో మార్పు తప్పదనే చర్చ సాగుతోంది..

మా వ్యూహం మాకుంది.. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుంచే చేస్తా..
వచ్చే ఎన్నికల్లో మా వ్యూహం మాకు ఉంటుంది.. కేంద్ర అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుండి పోటీ చేస్తానని ప్రకటించారు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాం అన్నారు.. రాజకీయ సమీకరణాలపై ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు అంటించుకుంటున్నారు.. నాడు చంద్రన్న, నేడు జగనన్న అంటూ స్టికర్ అంటించి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.. ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబంలో ఒక్కరికే వైద్యం అందిస్తున్నారు.. కానీ, ఆయుష్మాన్ భవ పథకం క్రింద ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు అందిస్తున్నామని వెల్లించారు.. ఇక, రాష్ట్రానికే కాకుండా జిల్లాల వారీగా కేంద్ర సహకారం అందిస్తున్నారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయన్న ఆమె.. చంద్రయాన్ తీసిన మొదటి ఫోటోలో రోడ్డు దుస్థితి కనపడిందన్నారు.. ఎన్నికలకు నాలుగోడల మధ్య నేతలతో చర్చించి సన్నద్ధమవుతున్నాం.. బీజేపీ సీట్ల కేటాయింపు కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్ర అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడినుండి పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు.. ఇతర పార్టీల్లోని అసంతృప్తివాదులు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి వస్తే ఆహ్వానిస్తాం అన్నారు. మా ఎన్నికల వ్యూహం మాకు ఉంటుంది.. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. తిరుపతిని వాటికన్‌సిటీ చేశారు..!
తిరుపతిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.. తిరుపతిని వాటికన్ సిటీనీ చేశారంటూ ‘ఆడుదాం ఆంధ్రా’లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి గురించి మాట్లాడిన నారాయణస్వామి.. అభియన్‌ రెడ్డికి సబ్జెక్ట్‌ను ఎలా నేర్చుకోవాలో తెలుసు.. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.. తిరుపతి రూపురేఖలను మార్చేశారు.. అలాగే తిరుపతిని వాటికన్ సిటీగా మార్చారంటూ వ్యాఖ్యానించారు.. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అయితే, తిరుపతి హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం.. అలాంటిది తిరుపతిని క్రైస్తవుల ప్రధాన పవిత్ర స్థలంతో.. ఎలా పోల్చుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ నేత భాను ప్రకాష్ రెడ్డి.. హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా మంత్రులు మాట్లాడుతూన్నారన్న ఆయన.. తిరుపతిని వాటికన్ సిటీతో పోల్చకండి.. లేదంటే తిరుపతి వదలి వాటికన్‌ సిటీకే వెళ్లండి అని సలహా ఇచ్చారు. అంతే కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మెప్పూకోసం అన్యమత ప్రచారం చేయకండి అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి హితవుపలికారు బీజేపీ నేత భాను ప్రకాష్‌రెడ్డి.

బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవానికి రెడీ..! 20నే ప్రారంభం..
విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం, ఆయన విగ్రహ ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది.. అయితే, జనవరి 20న భారీ అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవానికి సన్నహాలు చేస్తున్నారు.. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఈ రోజు సమావేశం అయ్యింది వైసీపీ ఎస్సీ సెల్.. జనవరి 20న అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేయాలని నిర్ణయించారు.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గ నేతలు హాజరు అయ్యే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు.. మరోవైపు.. జనవరి 20వ తేదీన సోషల్ జస్టిస్ డేగా ప్రకటించాలని ప్రతిపాదనలు పెట్టారు.. ఈ సన్నాహక సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున, తానేటి వనిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఇక, ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని ప్రశంసలు కురిపించారు.. 68 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నారని గుర్తుచేశారు.

వైసీపీకి మరోషాక్‌.. నేడు జనసేన గూటికి ఎమ్మెల్సీ వంశీ..!
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నాయి.. అయితే, ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులున్నాయి.. పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆశావహులు, వైసీపీ నేతలు ఇలా.. సీట్ల కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ఇక, విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీ పార్టీ మారుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.. దానికి మరింత బలాన్ని చేకూరుస్తూ.. ఈ రోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో సమావేశం కాబోతున్నారు ఎమ్మెల్సీ వంశీ.. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ జనసేనలో చేరబోతున్నారంటూ ఓ వైపు ప్రచారం సాగుతుండగా.. ఇదే సమయంలో ఆయన పవన్‌తో భేటీకానుండడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఇక, జనసేన పార్టీలో చేరేందుకు ఇప్పటికే తన వర్గం కార్పొరేటర్లతో వంశీ మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.. భీమిలి లేదా విశాఖ సౌత్ నుంచి పోటీ చేయాలనే ప్లాన్‌లో వంశీ ఉన్నాడని.. అది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చాక.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధం అయినట్టు ప్రచారం సాగుతోంది.. మరోవైపు, వంశీ కృష్ణపై సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతుండడంతో.. నిన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు.. వంశీని కలిసి చర్చలు జరిపాడు.. పార్టీ మారే ఆలోచన లేదని వంశీకృష్ణ తనకు చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు.. దీనిపై మాత్రం వంశీ కృష్ణ స్పందించలేదు.. కానీ, నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ వెళ్తారని.. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో సమావేశం అవుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక, ఈ రోజు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌.. జనసేన కండువా కప్పుకుంటారని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

తెలంగాణలో విస్తరిస్తున్న కోవిడ్… పొంతన లేని లెక్కలు ప్రకటిస్తున్న సర్కార్
తెలంగాణలో అన్నీ జిల్లాలకు కోవిడ్ విస్తరిస్తుంది. అత్యధికంగా హైదరాబాద్ లోనే కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 63 కేసులు కాగా.. కేవలం హైద్రాబాద్ లో 53 కొవిద్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే జిల్లాలలో కూడా వందల సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన కేసుల వివరాలు వైద్యశాఖ బులిటెన్ లో చూపించడం లేదు. వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా సర్కారు లెక్కలు ఉంటున్నాయని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. నిన్న కేవలం 8 కేసులు వచ్చినట్లు కరోనా బులిటెన్ విడుదల చేయడంతో పలు అనుమానం వ్యక్తమవుతున్నాయి. 1333 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే కేవలం 8 కేసులు అంటూ బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 59 ఆక్టివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. మిగితా వారు డిశ్చార్జ్ అవ్వగా.. నెగిటివ్ రిపోర్ట్ కూడా వచ్చినట్టు సమాచారం. దీంతో ప్రజలకు సర్కారు కరోనా లెక్కలను లైట్ తీసుకుంటున్నారు. మాస్క్ లు ఖచ్చితంగా వాడాలని వైద్యులు సూచిస్తున్న పట్టించుకోవడం లేదు. మరో నాలుగు రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతాయనే టెన్షన్ లో వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అందుకు అనగుణంగా ఆస్పత్రులను ఆరోగ్య శాఖ సన్నద్ధం చేస్తున్నారు.

చనిపోయిన తొమ్మిదిన్నరేళ్లకు UDID కార్డు.. షాక్‌లో కుటుంబ సభ్యులు
ఎక్కడైనా ప్రభుత్వ వ్యవస్థల పనితీరు కొన్నిసార్లు విమర్శలకు దారి తీస్తుంది. ముఖ్యంగా మనదేశంలో ఏదైనా సరే పని అంత త్వరగా ఏమీ చేయలేమనే విమర్శలు వస్తుంటాయి. పనులను మందకొడిగా జరుతాయని ఏ పని అయినా సులువుగా పరిస్కారం కాదని టాక్ ఉంది. అయితే తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మర్రి గంగరాజం(70) ఇంటికి పోస్టల్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక వికలాంగుల గుర్తింపు (యూడీఐడీ) కార్డు వచ్చింది. ఆ కార్డు చూసి గంగరాజం కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఇది ఎలా జరగిందని ప్రశ్నలు వేసుకుంటూ ఆశ్చర్యానికి లోలనయ్యారు. ఇది నిజంగానే గంగరాజం కార్డేనా అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే చివరకు గంగరాజం యూడీఐడీ కార్డు అని తేలడంతో షాక్ తిన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మర్రి గంగరాజం కుటుంబం నివాసం ఉంటున్నారు. గంగరాజం వికలాంగుడు. అయితే అతని ఇంటికి పోస్టల్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక యూడీఐడీ కార్డు వచ్చింది. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? అయితే గంగరాజం చనిపోయి దాదాపు తొమ్మిదిన్నరేళ్లు కావస్తోంది కాబట్టి.. ప్రతి రాష్ట్రం వికలాంగులకు సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఈ సర్టిఫికేట్‌ల ఆధారంగా, యూనివర్సల్ ఐడి, డిసేబిలిటీ సర్టిఫికేట్‌లను అందించడంలో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖ యుడిఐడి కార్డును జారీ చేస్తుంది. ఈ కార్డు ద్వారా వికలాంగుల పింఛను, ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. కానీ గంగరాజం చనిపోయి తొమ్మిదిన్నరేళ్లకే కార్డు ఇంటికి వచ్చింది.

24 గంటల్లో 529 కొత్త రోగులు.. 3 మరణాలు, 7 రాష్ట్రాల్లో JN.1 సబ్ వేరియంట్ వ్యాప్తి
భారత్‌లో మరోసారి కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. బుధవారం (డిసెంబర్ 27) భారతదేశంలో ఒకే రోజులో 529 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4093కి చేరుకుంది. మహమ్మారి సోకిన ముగ్గురు వ్యక్తులు కూడా మరణించారు. వారిలో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు. ఒకరు గుజరాత్‌కు చెందినవారు. మరోవైపు, కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొత్త సలహా జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పుడు సోకిన వ్యక్తులు ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండవలసి ఉంటుంది. అంతేకాకుండా అతనితో పరిచయం ఉన్న వ్యక్తులపై కూడా విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా కొత్త వేరియంట్ JN.1 కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు ఇది దేశంలోని 7 రాష్ట్రాల్లోని ప్రజలను ప్రభావితం చేసింది. కొత్త వేరియంట్‌తో సోకిన రోగుల సంఖ్య 83కి పెరిగింది. కరోనా కొత్త వేరియంట్ గరిష్ట ప్రభావం గుజరాత్‌లో కనిపిస్తుంది. గుజరాత్‌లో JN.1 వేరియంట్‌కు సంబంధించిన 34 కేసులు కనుగొనబడ్డాయి. ఇది కాకుండా, గోవా నుండి 18, కర్ణాటక నుండి 8, మహారాష్ట్ర నుండి 7, కేరళ, రాజస్థాన్ నుండి 5, తమిళనాడు నుండి 4, తెలంగాణ నుండి 2 పాజిటివ్ కేసులు కనుగొనబడ్డాయి.

పొగమంచులో కనిపించని రోడ్డు.. రెండు గంటల్లో 36 వాహనాలు ఢీ
రోడ్లపై పొగమంచు విధ్వంసం సృష్టించింది. లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, తాజ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై మూడు పెద్ద ప్రమాదాలు జరిగాయి. ఈ మూడు ఎక్స్‌ప్రెస్‌వేలపై రెండు డజన్లకు పైగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా 30 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 15 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం ఉదయం ఆరు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. ఉన్నావ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌వేపై ముందుకు వెళుతున్న కంటైనర్ అకస్మాత్తుగా బ్రేకులు వేసింది. అలాంటి పరిస్థితిలో వెనుక వస్తున్న బస్సు దానిని ఢీకొట్టింది. ఇంతలో మరో నాలుగు వాహనాలు కూడా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బంగార్మావు సీహెచ్‌సీలో చేర్పించారు.

మణిపూర్‌ నుంచి ముంబై వరకు రాహుల్‌ ‘భారత్‌ న్యాయ యాత్ర’!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేపట్టనున్నారు. ‘భారత్‌ న్యాయ యాత్ర’ పేరుతో రాహుల్‌ పాదయాత్ర చేయబోతున్నారని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14వ నుంచి మార్చి 20 వరకు 14 రాష్ట్రాల గుండా ఈ యాత్ర కొనసాగనుంది. మణిపూర్‌లో మొదలయ్యే భారత్‌ న్యాయ యాత్ర.. ముంబై వరకు 6,200 కిలోమీటర్ల మేర సాగనుంది. బస్సు, కాలి నడక ద్వారా రాహుల్‌ గాంధీ ‘భారత్‌ న్యాయ యాత్ర’ కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. భారత్‌ జోడో యాత్ర ఇచ్చిన గొప్ప అనుభవంతో.. రాహుల్‌ ఈ యాత్ర చేయబోతున్నారని చెప్పారు. ఈ యాత్రలో యువతను, మహిళలను, అణగారిన వర్గాలతో రాహుల్‌ ముఖాముఖి అవుతారని వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ యాత్ర రూట్ వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. మణిపుర్‌ నుంచి మొదలయ్యే భారత్‌ న్యాయ యాత్ర.. నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, గుజరాత్‌ మీదుగా చివరకు మహారాష్ట్రకు చేరుతుంది. మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్‌ గాంధీ యాత్ర చేస్తారు. గతంలో మాదిరిగా పూర్తిగా పాదయాత్ర కాకుండా.. ఈసారి బస్సు యాత్ర ఎక్కువగా ఉంటుందట. ప్రతి రాష్ట్రంలో నేతలు ఈ యాత్రలో పాల్గొంటారట.

వాట్సాప్ యూజర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో కొత్త ఫీచర్..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది.. ప్రస్తుతం పలువురు వాట్సాప్‌ స్టేటస్‌ని అప్‌డేట్‌ చేసుకోవడంలో కొంత ఇబ్బందులకు గురవుతున్న వారికి శుభవార్త చెప్పింది.. ఈ కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నది. వాట్సాప్‌ వెబ్‌ వర్షన్‌ నుంచి కూడా వాట్సాప్‌ స్టేటస్‌ ను అప్‌డేట్‌ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ప్రస్తుతం వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో ఫీచర్‌ను టెస్టింగ్‌ దశలో ఉన్నది. ప్రస్తుతం కేవలం మొబైల్‌లోనే స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం ఉంది.. త్వరలోనే కంప్యూటర్ లో అప్డేట్ చేసుకొనే అవకాశాన్ని అందిస్తుంది.. వాట్సాప్ యూజర్లు నాలుగు వేర్వేరు డివైజెస్‌లో ఒకే అకౌంట్‌ను లాగిన్‌ చేసుకునే వీలుంటుంది. స్టేటస్‌లో వాట్సాప్ వెబ్ నుంచి స్టేటస్‌లకు ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ ను షేర్‌ చేసే అవకాశం వాట్సాప్‌ కల్పిస్తోంది. ఫీచర్‌ సహాయంతో వెబ్ వెర్షన్‌ లేదంటే.. లింక్‌ చేయబడిన కంపానియన్‌ నుంచి స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ వాట్సాప్‌ బీటా వెర్షన్‌ను అందుబాటులో ఉందని తెలుస్తుంది..

‘సలార్’ ఫ్యాన్స్‌కు సలామ్ కొట్టాల్సిందే!
నిజమే… ఈ విషయంలో మాత్రం సలార్ ఫ్యాన్స్‌కు సలామ్ కొట్టాల్సిందే లేదంటే… ఇంత హైప్, ఈ రేంజ్ రచ్చ ఉండేది కాదు. మామూలుగా అయితే ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మూవీ మేకర్స్‌దే. అందుకోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయాలి. పాన్ ఇండియా సినిమాకైతే… దేశం మొత్తం చుట్టేయాలి. గతంలో బాహుబలి2, ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌ను గట్టిగా చేశాడు రాజమౌళి. తన హీరోలను వెంటబెట్టుకొని దేశమంతా తిరగాడు కానీ సలార్ వ్యవహారం మాత్రం రివర్స్‌లో ఉంది. ఈ సినిమాకు హోంబలే ఫిల్మ్స్ గానీ, ప్రశాంత్ నీల్ గానీ, ప్రభాస్ గానీ ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. ఏదో నామ మాత్రంగా ఒకటి రెండు ఇంటర్వ్యూలతో సరిపెట్టారు. కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఉంటుందని భావించారు. అది కూడా చేయలేదు… పట్టుమని సినిమా రిలీజ్‌కు మరో పది రోజులు ఉందనగా… జస్ట్ ట్రైలర్స్, రెండు సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేశారు కానీ అనౌన్స్మెంట్ నుంచే సలార్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. సినిమా ఎన్నిసార్లు వాయిదా పడ్డ కూడా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవలేదు. మేకర్స్ సలార్‌ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా సరే… ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తునే వచ్చారు. ఇక అఫీషియల్ అప్డేట్ బయటికొచ్చినప్పుడు… సలార్‌ను నేషనల్ వైడ్‌ ట్రెండ్ చేశారు. ప్రభాస్‌కు హిట్ పడాలని… మేకర్స్ కంటే ఎక్కువగా సలార్‌ను అభిమానులే ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఇక సినిమాకు హిట్ టాక్ రావడంతో ఒక్కసారిగా అంతా సోషల్ మీడియాపై పడిపోయారు. ఒంటిగంట షో నుంచే సలార్‌పై భారీ పాజిటివ్ హైప్ క్రియేట్ చేశారు. దీనికి తోడు మౌత్ టాక్ బాగుంది కాబట్టి… మూడు రోజుల్లో 400 కోట్లు, ఐదు రోజుల్లో 500 కోట్లు రాబట్టింది సలార్. ఫాన్స్ నుంచి ఈ రేంజ్ సపోర్ట్ ఉన్నా కూడా మేకర్స్ మాత్రం… ఇప్పటికీ కనీసం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం సలార్ సక్సెస్‌ను తమ సక్సెస్‌లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకేనేమో… సలార్ మేకర్స్ రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు. సలార్ క్రేజ్, ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి వాళ్లకు భారీ హైప్ ఇచ్చింది. ఏదేమైనా సరే… సలార్ ఫ్యాన్స్‌కు మాత్రం మేకర్స్ సలామ్ కొట్టాల్సిందే.

హనుమాన్ సినిమాలో మాస్ మహారాజ్ వినిపిస్తాడు…
ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. చిన్న సినిమాగా అనౌన్స్ అయిన ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా బజ్ జనరేట్ చేస్తోంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ… జనవరి 12న హనుమాన్ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ట్రైలర్ తో ఆడియన్స్ ని సాలిడ్ గా ఇంప్రెస్ చేసారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో హనుమాన్ విశేషాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న మేకర్స్ లేటెస్ట్ గా ఒక సూపర్ న్యూస్ ని బయటకి వదిలారు. హనుమాన్ సినిమాలో ‘కోటి’ పాత్రకు మాస్ మహారాజ రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఈ ఒక్క అనౌన్స్మెంట్ తో రవితేజ ఫ్యాన్స్ అంతా హనుమాన్ సినిమా కోసం థియేటర్స్ కి వెళ్లిపోవడం గ్యారెంటీ. రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మొదటిసారి రవితేజ జక్కన తెరకెక్కించిన మర్యాద రామయ్య సినిమాలో సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ తర్వాత నాని ప్రొడ్యూస్ చేసిన ‘ఆ!’ సినిమాలో బోన్సాయ్ మొక్కకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా శివ కార్తికేయన్ నటించిన డబ్బింగ్ సినిమా మహావీరుడు మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ మూడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు హనుమాన్ సినిమాకి రవితేజ లక్కీ చార్మ్ గా కలిసాడు కాబట్టి ఈ సినిమా కూడా పాన్ ఇండియా హిట్ అవుతుందో లేదో చూడాలి.