NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

నాకు టికెట్‌ వస్తుందో రాదో..! ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ అధిష్టానం చేపట్టిన సీట్ల మార్పులు – చేర్పులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నాకు టిక్కెట్ వస్తోందో? రాదో? తెలియదు అన్నారు. అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన వారి గెలుపు కోసం పనిచేస్తాను అని ప్రకటించారు. ఇక, అధిష్టానం నుంచి నాకు ఎలాంటి పిలుపు అందలేదన్న ఆయన.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురబ (కురుమ) సామాజిక వర్గం బలంగా ఉందని గుర్తుచేశారు. నేను ముఖ్యమంత్ర వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (జగనన్న) సైనుకుడి.. ఆయన మాటే శిరోధార్యం అని స్పష్టం చేశారు ఎంపీ గోరంట్ల మాధవ్‌.. పనితీరు, సర్వేలు, కుల, మతాల ప్రాతిపదికన అభ్యర్థి ఎంపిక జరుగుతోందన్నారు. అయితే, తనను జగన్‌ అన్న ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్తానని తెలిపారు. అన్ని కులాలకు, మతాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉండాలనేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్ర వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమని వెల్లడించారు హిందూపురం లోక్‌సభ సభ్యులు గోరంట్ల మాధవ్‌.

వైసీపీ టార్గెట్‌ అదే.. అందుకే ఈ మార్పులు..!
వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి.. విశాఖ చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇక, ఎయిర్‌పోర్ట్‌ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. మేం 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాం.. దానిలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని తెలిపారు.. అయితే, వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలన్నారు. ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం.. కానీ, ఆయన పార్టీని వీడారు.. అయితే, పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా మాకు ఏమీ ఇబ్బంది లేదు.. ప్రజల ఆశీస్సులతో వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో షర్మిల చేరికపై ఏకాభిప్రాయం..!
ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి పుంజుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది పార్టీ అధిష్టానం.. రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి.. పార్టీ పునర్‌నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే.. ఈ సమావేశంలో రాహుల్‌ గాంధీ పాల్గొని.. నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ ఆహ్వానితులు పళ్లం రాజు.. సమావేశంలో జరిగిన అంశాలను ఎన్టీవీతో పంచుకున్నారు. ఇక, వైఎస్‌ షర్మిల.. కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని.. ఆమెకే పార్టీ పగ్గాలు ఇస్తారనే చర్చ సాగుతోన్న నేపథ్యంలో.. పళ్లం రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ షర్మిల చేరికకి సంబంధించి ఏఐసీసీ పెద్దలు మా అభిప్రాయం అడిగారని తెలిపారు.. అయితే, షర్మిల పార్టీలో చేరితే కాంగ్రెస్ కి ఉపయోగం ఉంటుందని అందరం ఏకాభిప్రాయం చెప్పామని వెల్లడించారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీలో ఆమె స్థానంపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు పళ్లంరాజు.. మరోవైపు.. రాష్ట్రంలో లైక్ మైండెడ్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటుందన్నారు. రాష్ట్రానికి సమయం కేటాయిస్తానని రాహుల్ గాంధీ చెప్పారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలతో పోటీపడి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచే విధంగా పనిచేయాలని రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించారని చెప్పుకొచ్చారు. ఇక, పాత నేతలు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులపై విచారణ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టింది.. ఆ కేసులను సుమోటో తీసుకుని విచారణ జరిపింది హైకోర్టు.. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ నిర్ణీత సమయంలోగా పూర్తి అయ్యేలా ఆదేశాలు ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా అభిప్రాయ పడింది హైకోర్టు.. లిఖిత పూర్వక వాదనలు తీసుకోవటం ద్వారా వాదనలు వీలైనంత త్వరగా ముగించవచ్చని పేర్కొంది.. కేసుల విచారణ పరిశీలనకు ప్రత్యేక కోర్టు అధికారిని ఏర్పాటు చేస్తామని పేర్కొంది హైకోర్టు.. కేసులు విచారణకు వేగవంతంగా లిస్ట్ అవటం కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, రిజిస్ట్రీలకు డైరెక్షన్ ఇస్తామని తెలిపింది హైకోర్టు. ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో 78 కేసులు పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టుకు తెలిపారు ఏజీ శ్రీరామ్.. కొన్ని కేసులు ట్రయిల్ దశలో ఉండగా, మరికొన్ని కేసులపై స్టే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏజీ.. మరికొందరిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (NBW) జారీ అయ్యాయని హైకోర్టుకు తెలిపారు.. సమన్లు తొలుత ఇవ్వాలని స్పందన లేకపోతే.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఇస్తామని పేర్కొంది హైకోర్టు.. మరోవైపు ప్రజాప్రతినిధులపై కేసుల వ్యవహారంలో పూర్తిస్థాయి మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

వచ్చే ఎన్నికల్లో నేను పెనుకొండ నుంచి పోటీ.. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే నినాదం..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్నికి కట్టుబడి ఉంటాం అని స్పష్టం చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్‌.. పెనుకొండ బాధ్యతలు తీసుకోవాలని అధిష్టానం నాకు సూచించిందన్న ఆమె.. వచ్చే ఎన్నికల్లో తాను పెనుకొండ నుంచి పోటీచేయనున్నట్టు ప్రకటించారు.. కళ్యాణదుర్గంలో బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బరిలో ఉండబోతున్నారని తెలిపారు. అయితే, అభ్యర్థి ఎవరు అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాను పెనుకొండ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో నేను పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నా.. అధిష్టానం నుంచి నాకు ఆ దిశగా ఆదేశాలు వచ్చాయన్నారు ఉషశ్రీ చరణ్‌.. సీఎం జగన్ ఆదేశించారు.. ఆయన నిర్ణయం స్వాగతిస్తున్నా.. ఆదేశాలు పాటిస్తాను.. నేను పెనుకొండ వెళ్తున్నాను అన్నారు. ఇన్ని రోజులు కళ్యాణదుర్గం ప్రజలు ఎంతో ఆదరించారు.. వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను.. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను అన్నారు. సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగానే మార్పు ఉంటుందన్నారు. మేం ఎక్కడికి వెళ్లినా.. ఒక్కటే నినాదం.. అది జగన్ నినాదం.. ప్రజలు ఎక్కడైనా సరే జగన్ ని, ఫ్యాన్ గుర్తునే చూస్తున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా.. సీఎం వైఎస్‌ జగన్‌ను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని తెలిపారు మంత్రి ఉషశ్రీ చరణ్‌.

ఆసక్తిగా మైలవరం రాజకీయం.. మరోసారి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎంవో ఫోన్
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మార్పులు చేర్పుల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా సాగుతోంది.. ఈ వ్యవహారం అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, నేతలు, మంత్రులు.. ఇలా అందరిలోనూ టెన్షన్‌ పెడుతోంది.. అయితే, ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎంవో నుంచి మరోసారి ఫోన్‌ వచ్చిందట.. గతంలో పలుమార్లు ఆయనకు సీఎంవో నుంచి ఫోన్‌ వచ్చినా.. ఆయన స్పందించలేదనే ప్రచారం సాగాంది.. అందేకాదు.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోను అంటూ వైసీపీ అధిష్టానికి ఆయన క్లారిటీగా చెప్పారనే చర్చ కూడా సాగింది.. అయితే, మరోసారి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు సీఎంవో నుంచి కాల్‌ వచ్చిందట.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ సమావేశం కాబోతున్నారట.. ఇప్పటికే తాను పోటీ చేయను అంటూ అధిష్టానం పెద్దలకు వసంత చెప్పినట్టు సమాచారం అందుతుండగా.. ఇప్పటికే పలుమార్లు వసంతను సీఎంవోకి రావాలని పిలిచినా వెళ్లని ఆయన.. ఈ రోజు వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.. ఈ వ్యవహారం మైలవరం రాజకీయాన్ని హీటెక్కిస్తోంది.. అయితే, సీఎంవో నుంచి కాల్‌ వచ్చిందంటే చాలు.. సీటు మార్పు ఖాయం అని.. లేదా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు అనేది వైసీపీ శ్రేణులను టెన్షన్‌ పెడుతోంది.

ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన ఆటోడ్రైవర్లు.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడాన్ని ఆటో డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మహాలక్ష్మి పథకం వల్ల తమ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందిపై ఆటో డ్రైవర్లు శత్రువులుగా చూస్తే వారిపై దాడి చేస్తున్నారు. అయితే కొత్తగూడెంలో బస్సు డ్రైవర్పై ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలంలో మహిళా కండక్టర్ను ప్రయాణికులు దూషించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై TSRTC ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్లైన సిబ్బందిని దూషించడం, దాడులు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ ఏమాత్రం సహించదని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే కొందరు అధికారులు స్థానిక పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. డ్రైవర్లపై, కండెక్టర్లపై దాడి చేస్తే ఏ మాత్రం సహించేది లేదని అన్నారు. ఇప్పటికైనా ఆటో డ్రైవర్లు సహనం పాటించాలని కోరారు. మాటి మాటికి ఇదే రిపీట్ అయితే.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బీఆర్ఎస్ అనుబంధ సంఘానికి బిగ్ షాక్ ఇచ్చిన సింగరేణి
హోరాహోరీగా సాగుతున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సత్తా చాటింది. మొత్తం 1436 ఓట్ల తేడాతో గుర్తింపు సంఘంగా ఎన్నికయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికలు బిగ్ షాక్ ఇచ్చింది. ముందుగా పోటి చేయబోమని ప్రకటించిన టిబీజీకేఎస్.. చివరి నిమిషంలో మళ్లీ పోటికి సై అనడంతో టిబీజీకేఎస్ గెలుపుతధ్యమని భావించారు. కానీ కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంకు ఈ ఎన్నికల్లో దారుణ ఓటమిపాలయ్యారు. మొత్తం 11 ఏరియాల్లో కనీసం పోటి సైతం ఇవ్వలేకపోయారు. గత రెండు దఫాల్లో గుర్తింపు సంఘంగా నిలిచిన బీఆర్ ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ పోటీకి దూరమైంది. గనులు, శాఖల్లో మొదటి నుంచి బరిలో ఉండి పట్టు సాధిస్తామని చెబుతూనే ప్రచారాన్ని కొనసాగించిన నేతలు ఎన్నికల రోజు మాత్రం కనిపించలేదు. ఈ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి ఐఎన్‌టీయూసీని గెలిపించకూడదనే ఉద్దేశంతో ఏఐటీయూసీ కార్మిక సంఘానికి అంతర్గతంగా మద్దతు పలికినట్లు సమాచారం.

రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల శకటాలకు దక్కని అవకాశం
వచ్చే ఏడాది జనవరి 26న ఢిల్లీ డ్యూటీ పాత్‌లో రిపబ్లిక్ డే వేడుకలకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ కోసం భద్రతా సిబ్బంది రిహార్సల్ ఈరోజు నుంచి ప్రారంభించారు. జనవరి 26న భద్రతా సిబ్బంది పూర్తి సన్నద్ధతతో, ఉత్సాహంతో తమ శౌర్యాన్ని ప్రదర్శించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన విద్య, ఆరోగ్య నమూనాకు సంబంధించిన శకటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రిపబ్లిక్ డే రోజున జరిగిన వేడుకల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన శకటాలకు అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలపై కేంద్రంలోని మోడీ సర్కార్ దురుద్దేశంతో పని చేస్తోందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యం, విద్యారంగంలో చేసిన పనులు నచ్చకపోవడం వల్లే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన శకటాలకు అవకాశం ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో చండీగఢ్ నుంచి ఏ శకటం రావడం లేదు.. ఇప్పుడు అధికారులు 2025 కవాతు కోసం సన్నాహాలు స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం 20 రాష్ట్రాలకు చెందిన శకటాలు మాత్రమే పరేడ్ లో పాల్గొంటాయి. కానీ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలకు ఇదో బలమైన ఉదాహరణ అని అన్నారు.

భారత జట్టు నిజంగా అతన్ని మిస్సవుతోంది.. అద్భుతాలు చేసేవాడు!
సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాపై దక్షిణాఫ్రికా పైచేయి సాధిస్తోంది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో​ 245 పరుగులకే ఆలౌట్ చేసిన ప్రొటీస్.. రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ కోల్పోయి 256 రన్స్ చేసింది. ఓపెనర్‌ డీన్ ఎల్గర్ (140 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ బెడింగ్‌హామ్ (56) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్‌ కృష్ణ ఒక్క వికెట్‌ పడగొట్టినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక శార్ధూల్‌ ఠాకూర్‌ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని మిస్ అయిందని, అతడు ఉంటే అద్భుతాలు చేసేవాడు అని అభిప్రాయపడ్డాడు. క్రిక్‌బజ్‌తో దినేష్‌ కార్తీక్‌ మాట్లాడుతూ… ‘మహమ్మద్ షమీ బౌలర్‌గా, పేస్ నాయకుడిగా ఎదిగాడు. అతను జస్ప్రీత్ బుమ్రాకు సరైన జోడి. ఈ పిచ్‌లో సీమ్‌తో అద్భుతాలు చేసేవాడు. షమీ ఖచ్చితంగా కొన్ని వికెట్లు పడగొట్టేవాడు. షమీని భారత జట్టు మిస్‌ అవుతోంది. అందులో ఎటువంటి సందేహం​ లేదు’ అని అన్నాడు. చీలమండ గాయం కారణంగా షమీ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

ఈ సినిమా కథ ఒరిజినల్… ఫ్యామిలీని కలిసి నాని అండ్ టీమ్…
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. అనిమల్ సినిమా ముందు హాయ్ నాన్న కనపడేమో అనుకున్న ప్రతి ఒక్కరికీ షాక్ ఇస్తూ సినిమా చాలా బాగా ఆడుతుంది. ఇప్పటికి సిటీలోని కొన్ని మేజర్ సెంటర్స్ లో హాయ్ నాన్న సినిమా మంచి బుకింగ్స్ నే రాబడుతుంది. నాని మార్క్ యాక్టింగ్, మృణాల్ పెర్ఫార్మెన్స్, బేబీ కియారా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ హాయ్ నాన్న సినిమాని బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా మార్చేశాయి. ఒక మంచి లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఒరిజినల్ స్టోరీ అనే విషయం చాలా మందికి తెలియదు. హాయ్ నాన్న సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాలో విహాన్ సీఎఫ్ ఇండియా అనే అకౌంట్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. “ఈ సినిమాలో మా జీవితాన్ని మళ్లీ చూపించింది. ఇందులో పాప ఉన్నట్లే మా లైఫ్ లో బాబు ఉన్నాడు, విహాన్. మా బాబుకి కూడా సిస్టిక్ ఫైబ్రోసిస్ అన్నారు… సినిమాలో ప్రతి సీన్ మాకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. మా లైఫ్ నే స్క్రీన్ పైన చూస్తున్నట్లు అనిపించింది” అంటూ విహాన్ కృష్ణ అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. ఈ పోస్ట్ చూసిన డైరెక్టర్ శౌర్యవ్… “ఏం మాట్లాడాలో తెలియట్లేదు అండి, త్వరలో టీమ్ అంతా వచ్చి మిమ్మల్ని కలుస్తాం” అంటూ రిప్లై ఇచ్చారు.

అసలు ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు మావా… మీ దెబ్బకి సోషల్ మీడియా షేక్ అవుతోంది
సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈరోజు కలెక్షన్స్ రిపోర్ట్ బయటకి వచ్చే వరకూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. దేవర టీజర్ బయటకి రాబోతుంది అనే న్యూస్ వినిపిస్తుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. దేవర ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ అవుతోంది కాబట్టి ఘట్టమనేని అభిమానులు కూడా సోషల్ మీడియాని కబ్జా చేసి రచ్చ చేస్తున్నారు. వచ్చే నెల రోజుల పాటు సోషల్ మీడియా అంతా ఘట్టమనేని అభిమానుల హంగామాతో నిండిపోతుంది. ఇలా ప్రతి హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది, తమ హీరో సినిమా అప్డేట్ బయటకి వస్తేనే, వస్తుందనే న్యూస్ వస్తేనే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కారణం లేకున్నా పవన్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘దే కాల్ హిమ్ OG’ ట్యాగ్ ని టాప్ ట్రెండ్ చేస్తున్నారు. సలార్ సినిమాలో సూపర్బ్ రోల్ ప్లే చేసిన శ్రీయా రెడ్డి OG మీ ఊహకందకుండా ఉంటుంది అనే మాట చెప్పిన దగ్గర నుంచి… సలార్ సినిమాకే ఇలా ఉంటే మా OG వస్తే గ్రౌండ్ లెవల్లో సెలబ్రేషన్స్ ఏ రేంజులో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. కారణం లేకున్నా పవన్ కళ్యాణ్ పేరుని, OG ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్… ఇక సినిమా రిలీజ్ సమయానికి వస్తే ఆన్ లైన్ ఆన్ లైన్ అనే తేడా లేకుండా రిలీజ్ సెలబ్రేషన్స్ కి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.