Site icon NTV Telugu

Top Headlines@1PM: టాప్ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

*ఆర్టీసీ బస్సులు ఇప్పటి నుంచి ఆ స్టేజీల్లో ఆగవు..
మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. దీని వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని ఆర్టీసీ చెప్పింది. అందుకే తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. తమ సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ ఎంపీ వీసీ సజ్జనార్ కోరారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన బస్టాప్ లలో కాకుండా కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని ఆర్టీసీ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు.. దీంతో ప్రయాణ సమయం పెరిగిపోతుంది.. ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది అని సజ్జనార్ వెల్లడించారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.. కాగా, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సరైన సమయంలో బస్సులు రావడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ ఫిర్యాదుల మీద స్పందించిన టీఎస్‌ఆర్టీసీ.. అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ప్రకటన చేసింది. ఆసక్తి ఉన్న వాళ్లు బస్సులను అద్దెకు ఇవ్వొచ్చని చెప్పింది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్‌, సిటీ మఫిసిల్‌ బస్సులు కావాలని వెల్లడించారు.

 

*ఇవాళ సాయంత్రం ఆటో, ఊబర్ వాహానాల డ్రైవర్లతో సీఎం రేవంత్ భేటీ..?
ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. ఆటో, ఊబర్ వాహానాల డ్రైవర్లతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, ఊబర్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ఇక, ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రానున్న రెండు రోజుల్లో నిరసన కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంపై పునరాలోచించాలన్నారు. లేకుంటే ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయంగా ప్రతి నెల రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఈ పథకం ద్వారా తాము చాలా వరకు నష్టపోతున్నామని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. మహాలక్ష్మీ పథకం వల్లే చాలా వరకు ఆటోలను ఫైనాన్స్‌లో కొనుగోలు చేసిన మేము నెలవారీ.. పేమెంట్స్ కట్టేందుకు తీవ్రంగా కష్టపడుతున్నామని వారు పేర్కొంటున్నారు. తమ ఆటోలో ఎవరు ఎక్కకపోవడంతో ఆటో స్టాండ్స్‌ అన్నీ నిర్మానుషంగా మారాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించి ఆటో కార్మికులకు ఉపయోగపడేలా, వారి కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆటో, ఊబర్ డ్రైవర్లు కోరుతున్నారు. గతంలో 1000 నుంచి 1500 రూపాయల వరకు రోజువారి సంపాదన వచ్చేది.. కానీ, మహిళలకు ఫ్రీ బస్సు పథకం ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు కేవలం రూ.100 నుంచి 200 వరకు కూడా రావడం లేదని ఆటో కార్మికులు వాపోతున్నారు.

 

*ఏప్రిల్‌ నెలలోనే అసెంబ్లీ ఎన్నికలు!.. కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం భేటీ
ఏపీలో రెండో రోజు కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశమైంది. తొలి రోజున 18 జిల్లాల సమీక్ష జరగగా.. ఇవాళ 8 జిల్లాలపై సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నెలలోనే ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇవాళ నంద్యాల, కర్నూలు సత్యసాయి, అనంతపురం, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో చెక్ పోస్టులు, ఎన్నికల తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై సీఈసీ బృందం ఆరా తీస్తోంది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో భద్రతపై సమీక్ష నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈఓకు కేంద్ర బృందం సూచనలు చేయనుంది. ఓటర్ల జాబితాలో అవకతవకలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని తొలి రోజు సమావేశంలో సీఈసీ బృందం హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం నుంచి సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఈసీ బృందం భేటీ కానుంది.

 

*అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు.. నియోజకవర్గాల వారీగా పవన్ సమీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అభ్యర్థుల ఖరారును వేగవంతం చేశారు. తాజాగా అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 15-20 నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి అయినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాలపై పవన్ సమీక్షలు నిర్వహించారు. ఇవాళ మరికొన్ని నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పోటీ చేసేందుకు అవకాశం ఉన్న నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం.

 

*భారత్ లో 7 నెలల గరిష్టానికి కరోనా కేసులు..
భారత్ లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నెల రోజుల్లో 52 శాతం పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ చేసింది. భారత్ లోనూ కరోనా కేసుల పెరుగుదల కలవర పెడుతుంది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏడు నెలల గరిష్టానికి కోవిడ్ కొత్త కేసులు చేరాయి. మే 21 నుంచి అత్యధికంగా కోవిడ్ కేసులు 3,000 మార్కును దాటి 3,420 కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది. జెన్.1 సబ్-వేరియంట్ కేసుల పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇక, కరోనా వల్ల నలుగురు మరణించారు.. కేరళలో రెండు, రాజస్థాన్, కర్ణాటకలలో ఒక్కొ మరణం సంబవించింది. దీంతో మరణాల సంఖ్య 5, 33, 332 కు చేరుకుంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,07,964)గా ఉంది. అయితే, కేంద్ర వైద్యారోగ్యశాఖ డేటా ప్రకారం.. 17 రాష్ట్రాల్లో కోవిడ్ -19 కేసులలో పెరుగుదల కనిపిస్తుంది. వాటిలో కేరళ (266), కర్ణాటక (70), మహారాష్ట్ర (15), తమిళనాడు (13), గుజరాత్ (12) రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక, తెలంగాణలో కొత్తగా 8 కరోనా కేసులు, ఏపీలో 8 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే, గడిచిన 24 గంటల్లో 325 మంది కోవిడ్‌-19 నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4, 44, 71, 212కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. నిన్న (శుక్రవారం) భారతదేశంలో 640 కేసులు నమోదు కాగా, ఒక మరణం నమోదైంది. అలాగే, ఆసుపత్రులకు కోవిడ్ -19 ఆర్టీపీసీఆర్ పరీక్షను పెంచాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా ఫేస్ మాస్క్‌లు ధరించాలని కేంద్రం సూచించింది. ఇక, జెఎన్.1, ఓమిక్రాన్ కు సబ్ వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కొన్ని రోజుల నుంచి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. భారతదేశంలో జెఎన్.1 వేరియంట్ కారణంగా ఎలాంటి టుక్లస్టరింగ్ కేసులు నమోదు కాలేదని అధికారులు చెప్పారు.

 

*ఆదిత్య ఎల్1 ప్రయాణంలో మరో మైలురాయి.. వచ్చే నెల 6న గమ్యస్థానానికి చేరిక
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్‌పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 జనవరి 6న భూమికి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ (ఎల్1) గమ్యస్థానానికి చేరుకుంటుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. “జనవరి 6న ఆదిత్య-ఎల్1 ఎల్1 పాయింట్‌లోకి ప్రవేశిస్తుంది. అదే అంచనా వేయబడింది. సరైన సమయంలో ఖచ్చితమైన సమయం ప్రకటిస్తారు” అని సోమనాథ్ శుక్రవారం విజ్ఞాన భారతి నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం సందర్భంగా మీడియా ప్రతినిధులతో అన్నారు. సైన్స్‌ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఆ ఎన్‌జీవో కృషి చేస్తోంది. “అది L1 పాయింట్‌కి చేరుకున్నప్పుడు, అది మరింత ముందుకు వెళ్లకుండా ఇంజన్‌ను మరోసారి కాల్చాలి. అది అక్కడికి వెళ్లి, ఆ పాయింట్‌కి చేరుకున్న తర్వాత, అది దాని చుట్టూ తిరుగుతుంది. L1 వద్ద చిక్కుకుంటుంది. ” అని ఆయన చెప్పారు. ఆదిత్య-L1 దాని గమ్యాన్ని చేరుకున్న తర్వాత, రాబోయే ఐదు సంవత్సరాలలో సూర్యునిపై జరిగే వివిధ సంఘటనలను కొలవడానికి ఇది సహాయపడుతుంది.”ఇది విజయవంతంగా L1 పాయింట్‌లో ఉంచబడిన తర్వాత, ఇది వచ్చే ఐదేళ్ల పాటు అక్కడ ఉంటుంది, ఇది భారతదేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి చాలా ముఖ్యమైన డేటాను సేకరిస్తుంది. డేటా యొక్క డైనమిక్స్ అర్థం చేసుకోవడానికి డేటా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సూర్యుడు, అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది” అని ఇస్రో చీఫ్ చెప్పారు. భారతదేశం సాంకేతికంగా శక్తిమంతమైన దేశంగా ఎలా అవతరించబోతోంది అనేది చాలా ముఖ్యమని సభను ఉద్దేశించి ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు ‘అమృత్‌కాల్‌’ సందర్భంగా ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ పేరుతో భారత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ఇస్రో ప్రణాళిక రూపొందించిందని సోమనాథ్‌ తెలిపారు.

 

*జేడీయూ చీఫ్‌గా మళ్లీ నితీష్‌కుమార్‌!
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) చీఫ్‌గా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్‌ను తొలగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 29న ఢిల్లీలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జేడీయూ చీఫ్‌గా రాజీవ్ రంజ‌న్ సింగ్ అలియాస్ ల‌ల‌న్ సింగ్ ఉన్నారు. అయితే ఆయ‌న్ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు నితీష్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఊహాగానాల నేపథ్యంలో నితీష్‌ కుమార్‌ స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని నితీష్‌కు సన్నిహితులు సలహా ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ అంతర్గత విభేదాలకు బ్రేక్‌ ఇవ్వాలంటే పార్టీ నాయకత్వాన్ని స్వీకరించాల్సి ఉంటుందని పార్టీలోని సన్నిహితులతో నితీష్‌ స్వయంగా చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లలన్‌ సింగ్‌ పార్టీని నడుపుతున్న తీరు పట్ట నితీష్‌ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారు. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లతో పెరుగుతున్న సాన్నిహిత్యంపై నితీష్ అనుమానాలు వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ముంగేర్ నుంచి పోటీ చేసేందుకు లాలన్ సింగ్ ఆసక్తిగా ఉన్నారని, ఆయన ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్) టికెట్‌పై పోటీ చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. తన జాతీయ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఇండియా కూటమి భాగస్వాములతో బాగా సమన్వయం చేసుకోవడంలో లలన్ సింగ్ విఫలమైనందుకు నితీష్ కూడా కలత చెందినట్లు సమాచారం.

 

*’సలార్’ నాన్ RRR రికార్డ్… నైజాం కింగ్!
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే… బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇలా ఉంటుందని చూపిస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్… థియేటర్లో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాక్సాఫీస్ వసూళ్ల దగ్గర మోత మోగిస్తోంది. ఊహించినట్టుగానే సలార్ డే వన్ లెక్కలు రికార్డ్ రేంజ్‌లో ఉన్నాయి. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 180 కోట్ల వరకు రాబట్టింది. రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో సలార్ భారీ ఓపెనింగ్స్ అందుకుంది. నైజాంలో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ రీజన్‌లో అడ్వాన్స్ సేల్స్ గ్రాస్ విషయంలో ఆర్ఆర్ఆర్ లెక్షన్స్‌ని బ్రేక్ చేస్తూ.. 12 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది సలార్. ఇక మొత్తంగా నైజాం మార్కెట్‌లో దుమ్ముదులిపేసింది. నైజాం ఏరియాలో మొదటి రోజు 22.55 కోట్ల షేర్‌ని రాబట్టింది సలార్. గ్రాస్ పరంగా 32 కోట్లు కొల్లగొట్టినట్టుగా చెబుతున్నారు. దీంతో నైజాంలో సలార్ నాన్ RRR రికార్డుని సెట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నైజాంలో 23.35 కోట్ల షేర్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది ఆర్ఆర్ఆర్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ నెంబర్‌తో సలార్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఇమేజ్ అండ్ మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకోని చూస్తే ప్రభాస్ సోలోగానే వచ్చి అద్భుతం చేసి చూపించాడనే చెప్పాలి. సలార్‌ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. ఈ వీకెండ్ వరకు మరిన్ని రికార్డులు సెట్ చేయడం పక్కా. మొత్తంగా.. సలార్ సినిమా 2023 ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలబడం గ్యారెంటీ. మరి సలార్ ఫైనల్ ఫిగర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Exit mobile version