ఏం కష్టం వచ్చిందో..? నెల రోజుల క్రితం పెళ్లి.. సముద్రంలోకి వెళ్లిపోయిన యువజంట..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.. అయితే, కార్తికమాసం సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటామని ఇంటి దగ్గర చెప్పి బయటకు వచ్చారు ఆ నవ దంపతులు.. ఇద్దరు చేతులకు చున్నీ కట్టుకుని అంతర్వేది బీచ్ సమీపంలో 500 మీటర్ల దూరంలో అందరూ చూస్తుండగానే సముద్రంలోకి వెళ్లిపోయారు.. వారు సముద్రంలోనకి వెళ్తున్న దృశ్యాలను చూసిన బీచ్‌లో ఉన్నవారు.. వారిని వారించే ప్రయత్నం చేశారు.. వెనక్కి రావాలంటూ కేకలు వేశారు.. అయినా ఆ ఇద్దరు అలా సముద్రంలోకి వెళ్లి అదృశ్యమయ్యారు.. దీంతో, సమీపంలో ఉన్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. ఇప్పటి వరకు ఆ యువ జంట జాడ చిక్కలేదు.. సముద్రం ఒడ్డున వదిలిన ఫోన్ ఆధారంగా పేరెంట్స్ కు సమాచారం ఇచ్చిన సఖినేటిపల్లి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీఎం జగన్‌తో నాకు వ్యక్తిగత సంబంధాలు వేరు.. రాజకీయాలు వేరు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో ఎప్పటి నుంచో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం విదితమే.. గతంలో ఆయన ఆ పార్టీ నుంచి ఎంపీగా కూడా పనిచేశారు.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి.. అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే, నాకు.. సీఎం వైఎస్ జగన్ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు అని స్పష్టం చేశారు పొంగులేటి.. తెలంగాణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసార విజయవాడవెళ్లిన ఆయన.. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొక్కు చెల్లించుకోవడానికి కనకదుర్గమ్మ అమ్మవారికి ఆలయానికి వచ్చానని తెలిపారు. ఇక, 10 ఏళ్లలో అభివృద్ధి పేరుతో కేసీఆర్ అప్పులు చేశారని విమర్శించారు పొంగులేటి.. తెలంగాణ ప్రజలను ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ధనిక తెలంగాణను కేసీఆర్ పదేళ్ల పాలనలో 5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని ఫైర్ అయ్యారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. నాకు సీఎం జగన్ కు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని పేర్కొన్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో విభజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ప్రకటించారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తాం.. రెండు రాష్ట్రాల మధ్య ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తాం అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నా.. అన్నదమ్ముళ్ల మాదిరగా తెలుగు రాష్ట్రాల సమస్యను పరిష్కారం చేసుకుంటామని తెలిపారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. మరోవైపు.. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట.. ఇందకీలాద్రికి వచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి.
బ్రేకింగ్: వైసీపీకి గుడ్‌పై.. ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా చేశారు.. ఎమ్మెల్యే పదవితో పాటు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు.. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే.. ప్రత్యర్థులపై కేసులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. అయితే, పార్టీకి గత కొంత కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు.. ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ వస్తున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు.. ఇదే సమయంలో.. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై కూడా ఆర్కే ఆవేదనతో ఉన్నట్టుగా ప్రచారం జరగుతోంది.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. రాజీనామా చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.. మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ.. బీసీలకు కేటాయిస్తుందనే ప్రచారం ఉన్న నేపథ్యంలో.. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారని చెబుతున్నారు. అయితే, తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నా.. పార్టీ నేతలు ఎవరూ తనను సంప్రదించడంలేదనే ఆవేదన ఆయనలో ఉందంట.. ఇదే సమయంలో.. మంగళగిరి వైసీపీ ఇంచార్జ్‌గా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం నియమించడం.. నిన్న ప్రత్యేకంగా ఆయన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.. ఈ కార్యక్రమానికి ఆర్కేకు ఆహ్వానం లేనట్టుగా తెలుస్తోంది.. ఇక, పార్టీలో కొనసాగడం కష్టమే నిర్ణయానికి వచ్చిన ఆయన.. పార్టీతో పాటు.. ఇదే సమయంలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.. స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.
అందుకే ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా.. క్లారిటీ ఇచ్చిన ఆర్కే
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలినట్టు అయ్యింది.. పార్టీతో పాటు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వైసీపీ సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు.. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఆర్కే.. స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో.. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేసినట్టు తెలిపారు.. ముఖ్యంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ ఇంఛార్జ్‌గా గంజి చిరంజీవి బాధ్యతలు అప్పగించడమే ఈ రాజీనామాకు కారణంగా తెలుస్తుండగా.. తాను మాత్రం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు ఆర్కే ప్రకటించారు.. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను గెలిపించిన మంగళగిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్కే.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. స్పీకర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఓఎస్‌డీకి నా రాజీనామా లెటర్ అందించి రాజీనామా ఆమోదించేలా చూడాలని కోరడం జరిగిందంటూ తెలిపిన ఎమ్మెల్యే ఆర్కే.. నేను 1995 నుండి రాజకీయాల్లో ఉన్నాను.. 2004 లో సత్తెనపల్లి సీటు ఆశించా.. 2009లో పెదకూరపాడులో సీటు ఇచ్చి వెనక్కు తీసుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఇక, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ తోనే నేను ఉన్నానని తెలిపారు.. 2014, 2019లో ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ నాకు అవకాశం ఇచ్చారని తెలిపారు. అయితే, నా వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.
అడ్డగోలుగా అక్రమ మైనింగ్.. టన్నుకు రూ.30 ఇచ్చి రూ.1,485కి అమ్ముకుంటున్నారు..!
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ అడ్డగోలుగా సాగుతోంది.. పేదోళ్ల భూముల్లో టన్నుకు 30 రూపాయలు ఇచ్చి రూ. 1485 కి అమ్ముకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత అతిపెద్ద స్కామ్ లైన ఓబులాపురం ఐరన్ ఓర్.. మధుకోడా మైనింగ్ స్కామ్‌లు వెలుగులోకి వచ్చాయి.. ఇప్పుడు చాలా కాలం తర్వాత మూడు సిలికా.. నాలుగు క్వాడ్జ్ స్కామ్ లు ఏపీలో జరుగుతున్నాయని విమర్శించారు. పోరాటాలకు ప్రసిద్ధి చెందిన నెల్లూరు.. ఇప్పుడు భారీ స్కామ్ లకు పుట్టినిల్లుగా వైఎస్ జగన్ మార్చారని.. అక్రమ మైనింగ్‌పై పోరాటాలు చేశాం, డీజీపీకి ఫిర్యాదులు చేశాం.. అయినా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఒక్క టన్నుకి వంద రూపాయలుగా ఉన్న టాక్స్ ను.. వైసీపీ హయాంలో 381 రూపాయలకు పెంచేశారని విమర్శించారు సోమిరెడ్డి.. నెల్లూరులో విజయసాయి రెడ్ది ఆధ్వర్యంలో మైన్స్ కుంభకోణం జరుగుతోందన్న ఆయన.. ప్రతి నెలా ఒకటో తేదీ వైఎస్ జగన్ కు కమీషన్ చేరుస్తున్నారు.. 3 కోట్ల టన్నులు.. రూ.4,455 కోట్లు విలువ చేసే ఖనిజాన్ని అక్రమంగా తరలించారని ఆరోపించారు. రూ. 1,035 కోట్లను పన్ను రూపేణా ప్రభుత్వానికి చెల్లించాలి.. ఒక్క ఎకరాలో 25 వేల టన్నులు మైనింగ్ చేస్తున్నారన్న ఆయన.. అధికారులు కమీషన్లు తీసుకుంటున్నారు.. మూడేళ్లలో రూ. 371 కోట్లను మైన్స్ మీద పెనాల్టీ వేశారని దుయ్యబట్టారు. రూ. 371 కోట్లు ఎందుకు పెనాల్టీ వేశారు.? ఎంత వసూలు చేశారు. వివరాలు తెలపాలని డిమాండ్ చేశారు. దేశంలో నంబర్ వన్ క్వాలిటి కలిగిన ఖనిజాన్ని పరిశ్రమలకు తరలించేస్తున్నారు.. పేదోళ్ల భూముల్లో టన్నుకు 30 రూపాయలు ఇచ్చి రూ. 1485 కి అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో సెంట్రల్ విజిలెన్స్ కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నాం అన్నారు.
శబరిమలలో అపశృతి.. ప్రాణాలు కోల్పోయిన 11 ఏళ్ల బాలిక
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. దర్శనం కోసం క్యూలో వేచి ఉన్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల బాలిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చాలా సేపు క్యూలో వేచి ఉండటంతో కిందకు పడిన బాలికను గుర్తించిన ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. బాలిక గత మూడేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఇక మరోవైపు శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. దీంతో కొండంతా అయ్యప్ప భక్తులతో కిటకిటలాడింది. క్యూలో ఎక్కువసేపు వేచి ఉండలేక, చాలా మంది యాత్రికులు క్యూ వ్యవస్థను అధిగమించి బారికేడ్లను దూకేందుకు ప్రయత్నిస్తారు. దీంతో పవిత్ర మెట్ల దగ్గర రద్దీ పెరుగుతోంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులు సైతం భక్తులను ఆపలేకపోతున్నారు. ఈ పరిస్థితులు అక్కడ గందరగోళం సృష్టిస్తున్నాయి.
మెట్రో మాదిరి.. వాట్సప్‌లోనే బస్సు టికెట్ జారీ!
ప్రయాణీకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మరియు మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వాట్సప్ ద్వారా బస్సు టికెట్లు జారీ చేసే అంశాన్ని అధ్యయనం చేస్తోంది. దేశ రాజధానిలో ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) వాట్సప్ టికెట్ సేవలను అందిస్తోంది. దానినే బస్సు ప్రయాణికులకూ విస్తరించాలని ఢిల్లీ నగర రవాణా శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాట్సప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని 2023 మేలో కొన్ని మార్గాల్లో ప్రారంభించింది. వాట్సప్ టికెట్‌కు ప్రయాణికుల నుంచి ఆదరణ లభించటంతో.. మరిన్ని మార్గాలకూ డీఎంఆర్‌సీ విస్తరించింది. అయితే వాట్సప్ ద్వారా కొనుగోలు చేసే టికెట్ల సంఖ్యపై పరిమితి ఉంటుంది. త్వరలోనే వాట్సప్‌లో బస్సు టికెట్ జారీ చేస్తామని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీ మెట్రో టికెట్ కొనడానికి ప్రయాణికులు హాయ్ అని 91-9650855800కి వాట్సప్‌లో మెసేజ్ చేయాలి. లేదా మెట్రో స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయొచ్చు. అయితే వాట్సప్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్‌ను రద్దు చేసుకునే వెసులుబాటు లేదు. క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే.. మార్జినల్ కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తారు. యూపీఐ పేమెంట్స్‌కు మాత్రం అదనపు రుసుము ఉండదు.
ఆధార్ కు వేలి ముద్ర అవసరం లేదు.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
మన దేశంలో ఆధార్ అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు. అయితే ఆధార్ కార్డు తప్పనిసరి కాదని ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా దాని అవసరం ఏదో ఒక రూపంలో ఉంటుంది. అయితే కొందరి వేలిముద్రలు లేకపోవడంతో ఆధార్ కార్డు పొందడం కష్టంగా మారింది. వేలిముద్ర పడకపోవడంతో ఆధార్ కార్డుకు అర్హులు కాదంటూ వస్తున్నవార్తలకు కేంద్ర చెక్ పెట్టంది. వేలిముద్ర పడకపోయిన ఆధార్ కార్డు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డు పొందాలంటే వేలిముద్రలు తప్పనిసరి. అయితే వేళ్లు లేవని, వేలి ముద్రలు సరిగా పడటం లేదన్న పేరుతో ఆధార్‌ను తిరస్కరించలేరని స్పష్టం చేశారు. వారందరికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐరిస్ ద్వారా ఆధార్ పొందవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కేరళకు చెందిన జోసిమల్ పి.జోస్ అనే మహిళ తనకు వేళ్లు లేకపోవడంతో ఆధార్‌లో పేరు నమోదు చేసుకోలేకపోతున్నామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ కు విజ్ఙప్తి చేశాడు. దీంతో స్పందించిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ ఐరిస్ ద్వారా ఆధార్ పొందవచ్చని స్పష్టం చేశారు. దీంతో కొందరు వేలుముద్ర పడకపోవడంతో ఆధార్ లేనివారు ఇది శుభవార్త అనే చెప్పాలి. కేరళలోని కొట్టాయం జిల్లా కుమరకోమ్ పట్టణంలో వేళ్లు లేని జోసిమోల్ పి.జోస్ అనే మహిళ తన ఇంట్లో ఆధార్ నమోదు చేసుకున్న విషయాన్ని శనివారం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేసుకున్నారు. ఆమె విషయంలో మంత్రి జోక్యం చేసుకుని ఆధార్‌ను అందించారు. వేలిముద్రలు ఇవ్వలేని వారు వేలిముద్రల ద్వారా, ఐరిస్ సరిగా లేనివారు ఐరిస్ స్కాన్ ద్వారా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎవరికైనా వేలిముద్రలు, ఐరిస్ రెండూ లేకుంటే అవి లేకుండానే ఆధార్ కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. అటువంటి వ్యక్తులు బయోమెట్రిక్ మినహాయింపు నమోదు మార్గదర్శకాల క్రింద పేరు, లింగం, చిరునామా, పుట్టిన తేదీ వివరాలను సమర్పించాలన్నారు. ఆ వివరాలతో కూడిన బయోమెట్రిక్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. తమ వద్ద లేని వస్తువుల వివరాలను ఎన్‌రోల్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలన్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఫోటో తీయాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించిన తర్వాత ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సూపర్‌వైజర్ ధ్రువీకరిస్తే సరిపోతుందన్నారు.
బీసీసీఐ అంత కాకపోయినా.. కవర్స్ కొనేంత డబ్బు దక్షిణాఫ్రికా వద్ద లేదా?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. డర్బన్‌లో వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో టాస్ వేయడం కూడా సాధ్యం కాలేదు. ఒక్క బంతి కూడా పడకపోవడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. మైదానం మొత్తాన్ని కప్పి ఉంచే కవర్స్ కొనేంత డబ్బు కూడా దక్షిణాఫ్రికా వద్ద లేదా? అని విమర్శించారు. మైదానాన్ని కవర్స్‌తో కప్పి ఉంచలేనందుకే వన్డే ప్రపంచకప్ 2019లో ఎన్నో మ్యాచ్‌లు రద్దు అయ్యాయని గుర్తు చేశారు. స్టార్ స్పోర్ట్స్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘మైదానం మొత్తం కవర్స్ కప్పి ఉంచకపోతే.. వర్షం ఆగిన తర్వాత కూడా మ్యాచ్ ఆరంభానికి ఇంకో గంట ఎదురుచూడాల్సి ఉంటుంది. మరోసారి వర్షం కురిస్తే మ్యాచ్ కొనసాగదు. ఈ విషయం అందరికీ తెలుసు. అన్ని క్రికెట్ బోర్డులకు చాలా డబ్బు వస్తోంది. అన్ని క్రికెట్ బోర్డుల దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేవని చెబితే అబద్ధం చెబుతున్నట్లే. బీసీసీఐ దగ్గర ఉన్నంత డబ్బు దక్షిణాఫ్రికా బోర్డు వద్ద లేకపోవచ్చు. కానీ మైదానంను కప్పి ఉంచే కవర్స్‌ను కొనేంత డబ్బు ఉంటుంది’ అని అన్నారు.
ఆస్పత్రి నంచి కెప్టెన్ విజయ్‌కాంత్ డిశ్చార్జ్!
ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు, కెప్టెన్ విజయ్‌కాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. 71 ఏళ్ల విజయ్‌కాంత్ అనారోగ్య కారణాల వల్ల నవంబర్ 18న ఆసుపత్రిలో చేరారు. 23 రోజుల తర్వాత కోలుకున్న కెప్టెన్.. నేడు చెన్నైలోని తన నివాసానికి వెళ్లిపోయారు. విషయం తెలిసిన విజయ్‌కాంత్ ఫాన్స్, డీఎండీకే కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో విజయకాంత్‌ను ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. డయాబెటిస్ కారణంగా గతంలో కెప్టెన్ కుడికాలి మూడు వేళ్లని తొలగించారు. గతకొంతకాలంగా 71 ఏళ్ల విజయ్‌కాంత్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా అయాన పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో.. కెప్టెన్ భార్య ప్రేమలత ముందుండి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.
షారూక్ ఖాన్ ‘డంకీ’ సినిమా నుంచి ‘ఓ మాహీ’ సాంగ్ విడుదల..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వరుస హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల జవాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్నీ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం షారుఖ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ 21న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే డంకీ డ్రాప్ 1లో విడుదలైన వీడియో, డంకీ డ్రాప్ 2లో విడుదలైన ‘లుట్ పుట్ గయా..’ పాట, డంకీ డ్రాప్ 3లో విడుదలైన ‘నికలే ది కబీ హమ్ ఘర్ సే..’ పాట, డంకీ డ్రాప్ 4లో రిలీజైన ట్రైలర్‌తో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రోజు రోజుకీ ఈ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం మేకర్స్ డంకీ డ్రాప్ 5 అంటూ ‘ఓ మాహీ..’ అనే ప్రమోషనల్ వీడియో సాంగ్ విడుదల చేస్తున్నారు.. సాంగ్ పై ఆసక్తిని పెంచేలా గ్లింప్స్ వీడియోను తాజాగా విడుదల చేశారు..
