NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజు నుంచే..
తిరుమలలో నేటి నుంచి శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.. నేటి నుంచి నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్నారు.. దీంతో, ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు చేస్తున్నట్టు టీటీడీ పేర్కొంది.. అయితే, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొల‌గించి మ‌ర‌మ్మతుల‌ను పూర్తి చేయనున్నారు.. ఇక, మరమ్మతులు పూర్తి చేసి తర్వాత.. 10 రోజుల పాటు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా పరిశీలించి.. బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేయనుంది టీటీడీ.. కాగా, అధిక మాసం సందర్భంగా ఈ సారి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్న విషయం విదితమే. అధిక మాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్‌ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తామని వివరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 18న ధ్వజారోహణం ఉంటుంది. బ్రహ్మోత్సవాల వేళ వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయనున్నట్టు తెలిపారు. స్వయంగా వచ్చే ప్రముఖులకే బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి విషయం తెలిసిందే.

ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ.. పెరిగిన డే పాస్‌ ధరలు..
తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మరుసటి రోజే.. ప్రయాణికులకు షాకిచ్చింది ఆర్టీసీ.. సిటీలో డే పాస్ ధరలు పెంచేసింది.. ఇప్పటి వరకు డే పాస్‌ ధర రూ.100గా ఉండగా.. ఇవాళ్టి నుంచి డే పాస్‌ ధర రూ.120కు పెంచింది టీఎస్‌ఆర్టీసీ.. ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ప్రకటించిన మరుసటి రోజే డేపాస్‌ ధరలను పెంచేశారు.. ఇక, గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పడు 100 రూపాయలకు పెరిగింది.. అయితే, రూ.80 , రూ. 100గా ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు.. 120 రూపాయలు డే పాస్ సమయంలో రోజుకీ 25 వేలు మాత్రమే అమ్ముడు అవుతున్నాయని.. అదే 80 రూపాయల డే పాస్ సమయంలో రోజుకీ 40 వేల వరకు అమ్మకాలు జరిగాయని చెబుతున్నారు సంబంధిత అధికారులు.. మళ్లీ పెరిగిన టికెట్ ధరలతో బాదుడు మొదలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.

చంద్రబాబు చర్చకు రావాలి.. కుప్పంలో అయినా రెడీ..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు ఇప్పుడు రాయలసీమ గుర్తుకు వచ్చింది.. ఈ ప్రాంతంపై చంద్రబాబుకు మమకారం లేదని విమర్శించారు. సీమలో మూడు స్థానాలు మాత్రమే ఆయనకు దక్కింది. ఇందులో ఒకటి ఆయన (చంద్రబాబు)ది.. మరోటి ఆయన బామ్మర్ది (బాలకృష్ణ)ది అని.. ఇప్పుడు సీమకు అన్యాయం అంటున్నాడని మండిపడ్డారు. రాయలసీమలో పర్యటన కాకుండా చర్చ జరిపితే బాగుంటుంది.. చంద్రబాబు, వైఎస్సార్ హయాంలో సీమకు జరిగిన న్యాయంపై చర్చకు రావాలని చాలెంజ్‌ చేశారు. కనీసం కుప్పంకు కూడా నీళ్లు ఇవ్వని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి.. సొంత జిల్లా, సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు.. త్వరలో కుప్పంకు హంద్రీ – నీవా జలాలు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. సీమకు మేలు చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. దీనిని సీఎం వైఎస్‌ జగన్.. 80 వేల క్యూసెక్కుల పెంచనున్నారని వెల్లడించారు. సీమలో ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ చంద్రబాబుకు కనపడదు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన మనుషులతో కోర్టులో కేసులు వేసి కొన్ని ప్రాజెక్ట్ పనులు నిలిపే ఆలోచనలో ఉన్నాడని ఆరోపించారు. చంద్రబాబు ముందుగా చర్చకు రావాలి.. ఆ తర్వాత ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లాలని సూచించారు. కుప్పంలో సైతం ఆయనతో చర్చకు సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను అడ్డుకోబోమని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ఆగిన మూడు ప్రాజెక్టులపై సుప్రీం కోర్టుకు వెళ్లామని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

తెలంగాణ మంత్రికి హైకోర్టు షాక్‌.. మధ్యంతర పిటిషన్‌ కొట్టివేత
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్‌ ఇచ్చింది హైకోర్టు.. ఆయన దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేవారు మంత్రి కొప్పుల ఈశ్వర్.. అయితే, మూడేళ్ల పాటు విచారణ జరిగి.. అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక.. ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేసింది హైకోర్టు.. ఈ వ్యవహారంలో తుది వాదనలు వినాల్సి ఉందని పేర్కొంది.. దీంతో.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. కాగా, తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీచేసిన కొప్పుల ఈశ్వర్.. స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.. అయితే, కొప్పుల ఈశ్వర్ పై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ఎన్నికల ఫలితాలపై రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు. రీకౌంటింగ్ తర్వాత కొప్పుల గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, రీకౌంటింగ్ లో గందరగోళం జరిగిందని, కొప్పుల అక్రమ పద్ధతులతో గెలిచారని ఆరోపిస్తూ వచ్చిన లక్ష్మణ్‌.. దీనిపై న్యాయపోరాటానికి దిగారు.. కొప్పుల ఈశ్వర్‌ ఎన్నిక చెల్లదని, తననే ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఇక, ఈ పిటిషన్ ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది తెలంగాణ హైకోర్టు.

విశాఖలో దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌.. శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌కు భూమి పూజ చేశారు సీఎం జగన్‌.. కైలాసపురం వద్ద ఇనార్బిట్‌ మాల్‌కు శంకుస్థాపన చేశారు.. రూ. 600 కోట్లతో 17 ఎకరాల స్థలంలో ఇనార్బిట్‌ మాల్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది కె.రహేజా గ్రూపు.. మొత్తం 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఇనార్బిట్‌ మాల్‌ విస్తరణ చేయనున్నారు.. ఈ రోజు తొలి దశ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ నిర్వహించనున్నారు. రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం కానుంది. దీనికి అదనంగా పార్కింగ్‌ కోసం ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేసేలా ప్లాన్‌ సిద్ధం చేశారు. ఇక, 2026 నాటికి ఇనార్బిట్‌ మాల్‌ను అందుబాటులోకి తేవాలని టార్గెట్‌గా పెట్టుకుంది రహేజా గ్రూపు.. 250కిపైగా అంతర్జాతీయ బ్రాండ్లకు ఈ మాల్‌ వేదిక కానుండగా.. ఈ మాట్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.. కాగా, మాల్‌ నిర్మాణం కోసం పోర్టు అథారిటీకి చెందిన 17 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. రెండో దశలో ఐటీ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తారు. 3,000 మంది పనిచేసే విధంగా సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను 2027 నాటికి అందుబాటులోకి తెస్తారు. మూడో దశలో ఫోర్‌ స్టార్‌ లేదా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను 200 గదులు, బాంకెట్‌ హాళ్లతో నిర్మిస్తారు. పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని నిర్మిస్తామని రహేజా గ్రూపు చెబుతోంది.

108 ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతనాలు పెంచనున్న సర్కార్..
108 ఉద్యోగులకు శుభవార్త అందించిన సర్కార్. 108 ఉద్యోగుల వేతనాలను నాలుగు శ్లాబులుగా పెంచుతున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా కంటే పెద్ద రోగం వచ్చినా రాష్ట్రం మనుగడ సాగిస్తుందని అన్నారు. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో 466 అత్యవసర వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖలో 466 కొత్త వాహనాలను ప్రారంభించడం సంతోషకరమన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు లక్ష మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేదని, ఇప్పుడు 75 వేల మందికి ఒక 108 వాహనం మాత్రమే అందుబాటులో ఉందన్నారు. వాహనాలకు నిధులు అడిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మఒడిని విడుదల చేశారని వెల్లడించారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వైద్యారోగ్య శాఖలో ఐదంచెల వ్యవస్థను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. నీతి ఆయోగ్ కూడా తన మంత్రిత్వ శాఖను ప్రశంసించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. కుటుంబ పెద్దకు సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రం రాకముందు ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు ఆ విభాగం 70 శాతానికి పెరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లు మూతపడ్డాయి. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ప్రతిరోజు 4 వేల మంది గర్భిణులకు అమ్మఒడి వాహనాల ద్వారా సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఆశా వర్కర్ల సెల్‌ఫోన్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీశ్ తెలిపారు. వారికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అంబులెన్స్‌లను డైనమిక్‌గా ఉంచాలనుకుంటున్నామని వెల్లడించారు. 108 ఉద్యోగుల వేతనాలను నాలుగు శ్లాబులుగా పెంచుతామన్నారు.

ఉపాధి హామీ పథకంలో వారి భాగస్వామ్యాన్ని పెంచాలంటున్న ఆర్థికవేత్తలు
దేశంలో పేదల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకాల ద్వారా ప్రజలకు కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. MNREGA(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) ద్వారా ప్రభుత్వం ప్రజలకు చాలా ప్రయోజనాలను అందిస్తోంది. దీంతో పాటు ఈ పథకంలో మహిళల భాగస్వామ్యంపైనా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ పథకంలో మహిళల సంఖ్యను పెంచాలనే వాదన ఉంది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు SBI ఆర్థికవేత్తలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA)లో ఎక్కువ మంది మహిళలను చేర్చాలని సూచించారు. దీంతో అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి మహిళలను తీసుకువస్తామని చెప్పారు. MNREGA కింద దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ మంది మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తున్నాయని, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన లబ్ధిదారుల్లో కూడా మహిళల భాగస్వామ్యం మెరుగ్గా ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆర్థికవేత్తలు రూపొందించిన నివేదిక పేర్కొంది.

అంధవిశ్వాసంతో ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి.. జీవిత ఖైధు విధించిన కోర్టు
‘డూమ్స్‌డే’ అంధవిశ్వాసంతో తన ఇద్దరు పిల్లల్ని హతమార్చడంతో పాటు తన భర్త మొదటి భార్య హత్య కుట్ర పన్నిన ఒక అమెరికా మహిళకు జీవిత ఖైదు విధించబడింది. ఆ మహిళ పేరు లోరీ వాల్లో. ఈ ఏడాది మే నెలలో తన 16 ఏళ్ల కుమార్తె టైలీ ర్యాన్, దత్తత కుమారుడు జాషువాను హత్య చేసిన కేసులో ఆమె దోషిగా తేలింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇడహోలోని కోర్టు జడ్జి స్టీవెన్ తన తీర్పుని వెల్లడిస్తూ.. ‘‘ఎలాంటి పెరోల్‌కి అనుమతి లేకుండా నీకు జీవితఖైదు శిక్ష విధిస్తున్నాం’’ అని చెప్పారు. కాగా.. యేసుక్రీస్తు రెండో రాక కోసం మానవాళిని సిద్ధం చేయడానికి తాను మానవరూపంలో పుట్టిన దేవత అని లోరీ వాల్లో పేర్కొంది. తాను దేవదూతలతోనూ కమ్యూనికేట్ చేయగలదని కోర్టులో చెప్పింది. ఆమె వాదనలు విన్న తర్వాత.. తన హత్యలను సమర్థించుకోవడానికి ఆమె మత విశ్వాసాల్ని కారణంగా చూపుతోందని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆమె నేరాల వెనుక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అటు.. లోరీ ఐదో భర్త చాడ్ డేబెల్, తన మొదటి భార్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటుండగా, అతడ్ని నిర్దోషిగా తేల్చారు.

రెండోసారి రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ స్టార్‌.. ఈసారి మెసేజ్ డిలీటే!
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీ తన టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. యాషెస్‌ 2023లో భాగంగా లండన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన ఐదవ టెస్టు అనంతరం​ అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఓవల్ టెస్ట్ మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన అతడు ఐదవ టెస్ట్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతామని చెప్పాడు. అయితే అలీ టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం ఇది రెండోసారి. ఇదివరకు 2021 సెప్టెంబర్‌లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2021లో మొయిన్ అలీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ గాయం కారణంగా యాషెస్‌ 2023కి దూరమయ్యాడు. దాంతో ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు, టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ మాట్లాడిన అనంతరం మెయిన్‌ అలీ తన టెస్టు రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. యాషెస్‌ 2023తో ఇంగ్లాండ్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన అలీ.. అద్భుతంగా రాణించాడు. యాషెస్‌ 2023లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అలీ.. 180 పరుగులు, 9 వికెట్లు పడగొట్టాడు. యాషెస్‌ 2023 అనంతరం మళ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఐదవ టెస్ట్ మ్యాచ్‌ అనంతరం మొయిన్‌ అలీ మాట్లాడుతూ… రిటైర్మెంట్‌ గురించి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ నాకు మళ్లీ మెసేజ్ చేస్తే వెంటనే డిలీట్‌ చేస్తానని సరదాగా చెప్పాడు. ‘నేను వచ్చిన పని అయిపొయింది. యాషెస్‌ 2023ని బాగా ఎంజాయ్‌ చేశా. చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. బెన్ స్టోక్స్‌ రీ ఎంట్రీ ఇవ్వమని అడిగినప్పుడు నో చెప్పా. ఎందకంటే నేను ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై గొప్పగా ఆడలేదు. స్టోక్స్‌ అండగా నిలిచాడు. నువ్ అద్భుతంగా రాణించగలవని నమ్ముతున్నానని నాతొ అన్నాడు. అప్పుడు మళ్లీ ఆడేందుకు ఒప్పుకున్నా’ అని అలీ తెలిపాడు.

హెడ్‌క్వార్టర్స్‌పై ‘X’ లోగోని తొలగించిన ట్విటర్.. కారణం ఇదే!
తన ట్విటర్ హెడ్‌క్వార్టర్స్‌పై ఎలాన్ మస్క్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమర్చిన సరికొత్త ‘X’ లోగోను తాజాగా తొలగించారు. ఆ లోగోకి అమర్చిన రేడియెంట్ లైట్ల కారణంగా రాత్రి వేళల్లో తమ నిద్రకు భంగం కలుగుతోందని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో పాటు నిబంధనల్ని అతక్రమిస్తూ లోగోని మార్చడం వల్ల నోటీసులు అందడంతో.. ఆ సంస్థ లోగోని భవనంపై నుంచి తొలగించాల్సి వచ్చింది. ఈ కొత్త లోగోని శాన్‌ఫ్రాన్సిక్సోలోని ప్రధాన కార్యాలయంలో అమర్చిన తొలి వారాంతంలోనే.. ఆ లోగోకి సెట్ చేసిన రేడియెంట్ లైట్ల గురించి స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాని ప్రభావం తీవ్రంగా ఉందని, కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికితోడు.. ఓ నిబంధనని సైతం ట్విటర్ సంస్థ అతిక్రమించింది. ఒక సంస్థ తన లోగోని గానీ, గుర్తును గానీ మార్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు.. కచ్ఛితంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ఎలాన్ మస్క్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ట్విటర్ లోగోని మార్చడంతో పాటు హెడ్‌క్వార్టర్స్‌పై పిట్ట లోగోని తొలగించి, X లోగోని అమర్చారు. దీంతో.. శాన్‌ఫ్రాన్సిక్సో అధికారులు విచారణకు ఆదేశించారు. ఇలా ఒకవైపు స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో, లోగో మార్పుపై అధికారులు విచారణకు దిగడంతో.. ఎలాన్ మస్క్‌కి తప్పని పరిస్థితుల్లో వెనకడుగు వేయాల్సి వచ్చింది. లేనిపోని ఇబ్బందులు ఎందుకనుకొని.. లోగోని భవనంపై నుంచి తొలగించేశారు. అయితే.. ట్విటర్ సంస్థ వాదన మాత్రం మరోలా ఉంది. తాము స్వతహాగా ఈ లోగోని తొలగించామే తప్ప.. ఫిర్యాదులు అందడం వల్లనో, అధికారులు విచారిస్తున్నారో కాదని పేర్కొంది.

ఫోన్ పే గుడ్ న్యూస్.. రూ.49 ఇన్వెస్ట్ చేస్తే..రూ.లక్ష మీ సొంతం..
డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ ఫోన్ పే తమ యూజర్స్ కోసం మరో న్యూస్ ను చెప్పింది.. ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకొనే వారికి ఫోన్ పే తీపి కబురు చెప్పింది..ఫోన్‌పేలో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా మొత్తం నామినీకి చెందుతుంది. ఎలాంటి హెల్త్ చెకప్స్ అవసరం లేదు. పాలసీ తీసుకోవచ్చు. తక్కువ డాక్యుమెంట్లతోనే మీరు పాలసీ పొందొచ్చు. ఎప్పుడైనా ఈ పాలసీ కొనొచ్చు. 24 గంటలూ సేవలు అందుబాటులో ఉంటాయి. మరణించినా, కంటి చూపు కోల్పోయినా, శాశ్వత అంగ వైకల్యం వచ్చిన బీమా మొత్తం పూర్తిగా లభిస్తుంది. 18 నుంచి 65 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.. తక్కువ భీమాతోనే కవర్ చేసుకోవచ్చు.. న్యాచురల్ డెత్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది.. సూసైడ్ చేసుకొని మరణిస్తే వర్తించదు.. ఇక అలాగే యుద్ధం వంటి వాటిలో మరణించినా కూడా పాలసీ డబ్బులు రావు. డ్రగ్స్, లిక్కర్ తీసుకొని చనిపోయినా కూడా పాలసీ వర్తించదు. ఫోన్‌పే రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ఈ పాలసీని అందిస్తోంది. ప్రతి ఏటా మీరు ఈ పాలసీని రెన్యూవల్ చేసుకోవాల్సి టుంది. పాలసీ తీసుకున్న తర్వాత 15 రోజులు ప్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. వద్దనుకుంటే పాలసీని వెనక్కి ఇవ్వొచ్చు…

మృణాల్ మరోసారి సీతని గుర్తు చేసింది…
నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, శౌరవ్ డైరెక్షన్ లో అనౌన్స్ అయిన సినిమా ‘హాయ్ నాన్న’. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేసారు. డాటర్ సెంటిమెంట్, లవ్ స్టోరీ లాంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ లో మృణాల్-నానిల పెయిర్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ జంటగా కనిపిస్తున్నారు. ఈ గ్లిమ్ప్స్ లో మృణాల్ ఠాకూర్ చాలా అందంగా కనిపించి ఆకట్టుకుంది. సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్ రేంజ్ ఎక్కడికో వెళ్లింది. సీత పాత్రలో మృణాల్ చేసిన పెర్ఫార్మెన్స్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఒక యువరాణి ఎలా ఉండాలో అంతే హుందాగా, చీరకట్టులో చాలా అందంగా కనిపించి యూత్ ని మాయ చేసింది మృణాల్. ఈ దెబ్బకి కుర్రాళ్లంతా ‘సీతా సీతా’ అంటూ మృణాల్ జపం చేసారు. సీతారామాం సినిమా తర్వాత మృణాల్ గ్లామర్ రోల్స్ ఎక్కువగా ప్లే చేస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ స్టిల్స్ నే పోస్ట్ చేస్తూ వచ్చింది. దీంతో ఏమైంది సీతా ఇలాంటి ఫొటోస్ పెడుతున్నావ్ అంటూ నెగటివ్ కామెంట్స్ కూడా చేసారు. ఇవేమి పట్టించుకోకుండా తన క్యారెక్టర్ ఏం కోరుకుంటే అది మాత్రమే చేస్తూ వచ్చిన మృణాల్ ఠాకూర్, మరోసారి సీతారామం సినిమాలోని ‘సీత’ని గుర్తు చేసే అంత ట్రెడిషన్ అండ్ ట్రెండీగా కనిపించింది ‘హాయ్ నాన్న’ లేటెస్ట్ పోస్టర్ లో. ఈరోజు మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజు కావడంతో ‘హాయ్ నాన్న’ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. కలర్ ఫుల్ గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ని మృణాల్ బ్యూటిఫుల్ గా కనిపించింది. చిన్న నోస్ రింగ్, ఫ్లోరల్ డిజైన్ డ్రెస్ లో మృణాల్ మెస్మరైజ్ చేసేలా ఉంది. మరి డిసెంబర్ 21న రిలీజ్ కానున్న హాయ్ నాన్న మూవీ మృణాల్ ఠాకూర్ కి మరో సీతారామం రేంజ్ సినిమా అవుతుందేమో చూడాలి.

ఎరుపెక్కిన సంద్రం… తెప్పల్లో తెగిపడిన తలలు
ఓ వైపు భయంకరమైన మృగాలు.. మరో వైపు తుఫాన్‌లా ఎగిసిపడుతున్న అలలు.. ఈ రెండింటి మధ్యన రక్తం చిందిస్తున్న కత్తి… ఆ కత్తి చివరన భయానికే భయం పుట్టించేలా ఉన్నాడు దేవర. ఇప్పటి వరకు చరిత్రలో తీర ప్రాంతాల్లో ఎప్పుడు జరగనటువంటి యుధ్దం జరుగుతోంది. సముద్ర వీరుడికి, మృగాలకు జరిగిన భీకర పోరుకు సంద్రం ఎరుపెక్కింది. తెగిపడిన తలలతో తెప్పలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. అసలు ఇలాంటి యుధ్దం ఇప్పటి వరకు స్క్రీన్ పై చూసి ఉండరు అనేలా దేవర సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. బిగ్ ఎమోషన్, బిగ్ యాక్షన్‌తో బౌండరీస్ దాటేందుకు పెద్ద యుద్దమే చేస్తున్నారు ఎన్టీఆర్, కొరటాల శివ. జనతా గ్యారేజ్ తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు రెడీ అవుతోంది ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్. ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా టైం తీసుకున్న కొరటాల, షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్ అన్నట్టు పక్కా ప్లానింగ్‌తో దేవరను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇప్పటికే ఐదారు భారీ యాక్షన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న దేవర… ఇప్పుడు మరో భారీ షెడ్యూల్‌ స్టార్ట్ చేశారు. ఓ షార్ట్ బ్రేక్‌ తర్వాత.. కొన్ని రోజుల రిహార్సల్స్ తర్వాత… భారీ స్థాయిలో యాక్షన్‌ సీక్వెన్స్ తీసేందుకు సెట్స్ పైకి తిరగొచ్చాం అంటూ దేవర టీం ట్వీట్ చేసింది. తెప్పల్లో తలలు నరికేందుకు దేవర వస్తున్నట్టుగా ఓ పిక్‌ను షేర్ చేసుకున్నారు. ఈ షెడ్యూల్‌లో సముద్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నారు. దీంతో సినిమాలో ఇది మరో బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు జరిగిన అన్నీ షెడ్యూల్స్‌లోను యాక్షన్ సీక్వెన్స్‌లే షూట్ చేశారు. గ్రాఫిక్స్ వర్క్ కోసం ముందుగా యాక్షన్‌ సీన్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఆ తర్వాత టాకీ పార్ట్ షూట్‌ చేయనున్నారు. ఏప్రిల్ 5న దేవర రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.