గన్నవరంలో వైసీపీకి బిగ్ షాక్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి.. మరోసారి గన్నవరం రాజకీయాలు తెరపైకి వచ్చాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలేలా పరిస్థితి కనిపిస్తోంది.. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గన్నవరం నుంచి బరిలోకి దిగి.. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి అయిన వల్లభనేని వంశీ చేతిలో ఓటమిపాలైన యార్లగడ్డ వెంకట్రావు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. వల్లభనేని వంశీ.. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత.. వైసీపీలో వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డగా మారిపోయింది పరిస్థితి.. ఈ రెండు గ్రూపుల మధ్య ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉంది.. వైసీపీ అధిష్టానానికి కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. పార్టీ పెద్దలు సముదాయించినా.. ఇది కొలిక్కిరాకుండా పోయింది.. చివరకు వైసీపీకి గుడ్‌బై చెప్పేసి.. టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు యార్లగడ్డ.. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారట.. ఈ నెల 19వ తేదీన లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణ జిల్లాకి చేరుకోనుండగా.. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు యార్లగడ్డ సన్నాహాలు చేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నమాట.. ప్రస్తుతం మాత్రం గన్నవరంలో వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. గన్నవరంలో కార్యకర్తలతో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు.. రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు.. కార్యకర్తల సమావేశం తర్వాత కీలక నిర్ణయం యార్లగడ్డ తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు.. అది రాకపోతే టీడీపీలోకి యార్లగడ్డ వెళ్తారని క్యాడర్ చెబుతున్నమాట..
లక్షిత ఘటనపై ఎమ్మెల్యే నల్లపరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. తల్లిదండ్రులపై అనుమానం..!
తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షిత మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది.. తిరుమల – అలిపిరి కాలి నడక దారిలో చిన్నారి లక్షిత మొదట తప్పిపోయింది.. ఆ తర్వాత ఆ చిన్నారిపై ఎలుగుబంటి దాటిచేసి చంపిఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అయినా.. చివరకు నిన్న రాత్రి తప్పిపోయిన లక్షిత ఉదయం నడకదారిలోని నరసింహస్వామి ఆలయం వద్ద శవమై తేలింది.. చిన్నారి మెడపై దాడి చేసి ముఖ భాగాన్ని పూర్తిగా తినేసి ఉండడంతో.. చిన్నారి లక్షిత మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీకి తరలించారు.. చివరకు చిరుత దాడిలోనే చిన్నారి మృతిచెందినట్టు తేల్చారు.. అయితే, ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తిరుమల ఘాట్ రోడ్‌లో మృతి చెందిన లక్షిత ఘటనపై స్పందించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. లక్షిత మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయన్నారు.. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్, ఈవోతో ఫోన్‌లో మాట్లాడాను.. వారు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకునే విషయాన్ని కూడా ఆలోచిస్తామని తెలిపారన్న ఆయన.. అయితే, ఈ ఘటనలో లక్షిత తల్లిదండ్రులపై నాకు అనుమానం ఉందన్నారు. వారిని కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కాగా, అలిపిరి నడకమార్గంలో నిన్న రాత్రి బాలిక తప్పిపోయ్యినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక పేరెంట్స్.. అయితే, ఆ ఫిర్యాదు అందుకున్న పోలీసులకు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. కానీ, బాలిక ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇవాళ ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.. చిరుత దాడిలో బాలిక మృతిచెందినట్టు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు.
ఇది కదా పేదల ప్రభుత్వం.. కనీసం ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా..?
పేదల ప్రభుత్వం అంటే మాదే.. కానీ, కనీసం మీరు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశామని చెప్పగలరా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించి తనకి అభిమానం ఉన్నట్లు, సాగునీటి ప్రాజెక్టులను నేటి ప్రభుత్వం విధ్వంసం చెసినట్లుమాటాడారని మండిపడ్డారు. చంద్రబాబు అవగాహనతో మాట్లాడితే బాగుండేదని హితవుపలికారు. తోటపల్లి, వంశదార, ఆప్ షోర్ ప్రారంభించింది వైఎస్ రాజశేఖ రెడ్డి అని గుర్తుచేశారు. కనీసం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి చేసిన బాబు.. ప్రాజెక్టులపై ప్రశ్నించడం ఏంటి..? అని నిలదీశారు. 1996లో సీఎం అయి 14 ఏండ్లు ముఖ్యమంత్రి అయిన మీరు ఏం చేశారు అంటూ చంద్రబాబును ప్రశ్నించారు మంత్రి ధర్మాన.. కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పగలరా..? అని నిలదీశారు.. వంశధార ప్రాజెక్టుపై ఏనాడైనా పట్టించుకున్నారా..? మా ప్రభుత్వం నాలుగేళ్లు అయ్యింది.. అందులో రెండేళ్లు కరోనా మహమ్మారే.. అయినా 97 శాతం పనులు అయ్యాయని వెల్లడించారు. వంశధార ప్రాజెక్టుపై ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్ సమావేశం అయ్యారు.. రెండు వేల కోట్ల నిధులు ఖర్చు చేసిన ప్రాజెక్టు ఉపయోగంలోకి తీసుకువస్తున్నాం అన్నారు. ట్రిబ్యునల్ వేయించావా? సమస్య పరిష్కారానికి ఒడిశా సీఎంతో మాట్లాడారా? అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు 14 ఏళ్లలో శాశ్వత పరిష్కారం సూచించలేదని దుయ్యబట్టారు.. అయితే, రక్షిత తాగునీరు అందించేందుకు 700 కోట్లు కేటాయించి, ఒక్క టెర్మలోనే సర్పేస్ వాటర్ అందిస్తున్నాం.. కిడ్నీ రోగులకు, హాస్పిటల్ రీసెర్చ్ ఇన్టిట్యూషన్ , త్రాగునీరు , డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది కదా పేదల ప్రభుత్వం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
పార్లమెంట్‌లో బీజేపీ డాన్‌లాగా ప్రవర్తిస్తోంది..
పార్లమెంట్‌లో బీజేపీ డాన్‌లాగా ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం.. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో విశాఖ నుండి తిరుపతి వరకు సీపీఐ చేపట్టనున్న బస్సు యాత్ర పోస్టర్ రిలీజ్ చేశారు.. సీపీఐ నేతలు ఆగష్టు 17 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు.. అయితే, పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని కార్మికులకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత.. ఉద్యోగులు, కార్మికులు మరణించినప్పుడు చిన్నపాటి సహాయం చేయడం కాదు.. ప్రభుత్వాలు మరణించిన ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక, బీజేపీ ప్రభుత్వం వల్ల పార్లమెంట్ సెషన్స్ పూర్తిగా విలువ లేకుండా పోయాయని మండిపడ్డారు బినోయ్ విశ్వం… పార్లమెంట్ లో బీజేపీ డాన్ లాగా ప్రవర్తిస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీ పార్లమెంట్ ను ఒక నాన్సెన్స్ గా మార్చేసిందని దుయ్యబట్టారు. మణిపూర్ అంశంపై చర్చించాలని పట్టుబట్టాం.. కానీ, బీజేపీ ప్రభుత్వం చర్చకు తేలేదు.. బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందరితో కలిసి పెట్టాం.. అవిశ్వాస తీర్మానం కారణంగా మోడీ పార్లమెంట్‌కు వచ్చారని తెలిపారు. మణిపూర్ అంశంలో కేంద్రం.. రేపిస్టుల తరఫున నిలబడుతోందని ఆరోపించారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం మార్చాల్సిందే అని పిలుపునిచ్చారు. మరోవైపు, కేరళ మినహా మిగతా రాష్ట్రాలలో లెఫ్ట్ పార్టీలు బలహీనంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, పార్లమెంట్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పీచ్ హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.. రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు.. అది ఒక ఫ్లైయింగ్ కిస్ మాత్రమే.. కానీ, దానిని రాద్ధాంతం చేయడం ఏంటి? అంటూ ఎద్దేవా చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం.
12గంటల ఆపరేషన్.. ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి
కరీంనగర్ లో ఎలుగుబండి హల్ చల్ చేసింది. రాత్రి ఎలుగుబండి రోడ్డుమీదకు పరుగులు పెట్టింది. దీంతో నగర ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. ఎలుగు బండి మెరాయిస్తూ రోడ్లపై, జనావాసంలో పరుగులు పెడుతుండటంతో స్థానికులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలుగు బండి ఏం చేస్తుందో అన్నట్లు బిత్తరపోయి చూస్తు ఉండిపోయారు. కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రాత్రి నుంచి ఎలుగు బంటిని పట్టుకునేందుకు నానా తంటాలు పెట్టారు. ఉరుకులు పరుగులు పెడుతున్న ఎలుగుబండిని పట్టుకునేందుకు దారుల్లో పరుగులు పెట్టారు. రాత్రి కావడంతో అధికారులకు కాస్త జాప్యం ఏర్పడింది. అర్థరాత్రి ఎలుగుబంటిని పట్టుకునేందు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇళ్ల తలుపులు వేసుకుని ఉండాలని, ఎవరూ బయటకు రాకూడదని సూచించారు. దీంతో ప్రజలు బిక్కు బిక్కు మంటూ రాత్రంగా గడిపారు. ఇక మళ్లీ తెల్లవారు జామునుంచి ఎలుగు బంటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధికారులు. ఎలుగు బంటికి పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన ఫలితం కనిపించకపోవడంతో చివరకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు సుమారు 12 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్‌లో అధికారులు ఎలుగు బంటిని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఎవరికి ఎటువంటి హాని జరగక పోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం, ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్..!
బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి ఓ యువతి అద్దంకి పీఎస్‌కు వచ్చారు.. గతంలో అద్దంకి ఎస్‌ఐగా విధులు నిర్వహించిన సమందర్ వలీ అనే వ్యక్తి తనకు అన్యాయం చేశారంటూ ఫిర్యాదు చేశారు.. ఒక రోజు బర్త్‌డే అంటూ నన్ను తన ఇంటికి పిలిపించి, మత్తుమందు ఇచ్చి తనపై ఎస్‌ఐ అత్యాచారం చేసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్‌బెయిల్‌చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.. శారీరకంగా నన్ను వాడుకున్న ఎస్సైని వివాహం చేసుకోమని అడిగితే.. చంపుతానని బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. ఇక, యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్థానిక పోలీసులు చెబుతున్నారు. కాగా, అద్దంకి ఎస్సైగా పనిచేసిన సమయంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు సమందర్ వలీ, అద్దంకిలో ఎస్సైగా పనిచేస్తున్న సమయంలోనే తిమ్మన పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య, కుమార్తె మృతిచెందడంతో.. ఆయన పట్ల ఉదాసీనంగా వ్యవహరించారట ఉన్నతాధికారులు.. ఇక, సమందర్ వలి అవినీతి, మహిళల పట్ల ఆయన ప్రవర్తన మారకపోవడంతో విధుల నుంచి సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.. తాజాగా సమీనా అనే యువతి ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్టు సీఐ రమేష్ వెల్లడించారు.
కొడుకు, కోడలి మధ్య విభేదాలు.. మనవడిని మర్డర్ చేసిన తాత.. అసలు కథ వేరే ఉంది..!
కొడుకు లేదా కూతురు పిల్లలు అంటే తాతకు ఎంతో మమకారం ఉంటుంది.. తల్లిదండ్రులు వారిపై కోపంతో అరచినా.. వారిని వెసుకోసుకురావడంలో.. అల్లారిముద్దుగా చూసుకోవడంలో ముందువరసలో ఉంటారు.. తాత, మనవళ్ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది.. కానీ, ఓ తాత.. తమన మనవడిపట్ల దారుణంగా వ్యవహరించాడు.. ఏకంగా తన వెంట తీసుకెళ్లి.. హత్య చేసి.. మళ్లీ వచ్చి తనకు ఏమీ తెలియనట్టు ఉండిపోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మీనవల్లురులో జరిగిన దారుణానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొడుకు, కోడలు మధ్య విబేధాలు కారణంగా విడాకులు తీసుకుంటే ఆస్తి మనవడికి వెళ్తుందని భావించిన తాతయ్య.. సొంత మనవడిని దారుణంగా హత్య చేశాడు. ఈ నెల 9వ తేదీన ఉదయం బాలుడిని వెంటబెట్టుకుని వెళ్లి హత్య చేసి యణమధుర్రు కాలువలో పడేశాడు. ఏమి తెలియనట్టు ఇంటికి వచ్చిన నిందితుడు పోకల నాగేశ్వరరావు.. మళ్లీ బాబు కనిపించట్లేదంటే అందరితో కలిసి వెతికాడు.. అయితే0, నిన్న బాలుడి మృతదేహం కాలువలో లభ్యం కాగా పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడిని 9వ తేదీ ఉదయం తాత నాగేశ్వర రావు తీసుకు వెళ్లడాన్ని చూసిన స్థానికులు.. అతనిపై అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.
మణిపూర్ సమస్య పరిష్కారానికి సర్జికల్ స్ట్రైక్ లాంటి చర్య జరగాలి..
మణిపూర్‌లో అక్రమ వలసదారులు, మిలిటెంట్ల సమస్యను ఒక్కసారిగా పరిష్కరించడానికి సర్జికల్ స్ట్రైక్ వంటి ప్రభావవంతమైన చర్య జరగాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) నాయకుడు ఎం.రామేశ్వర్ సింగ్ అన్నారు. మణిపూర్‌లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఎన్‌పీపీ ఈ విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మణిపూర్ రాష్ట్రం గత మూడు నెలలుగా 150 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న జాతి హింసను చూస్తోన్న సంగతి తెలిసిందే. “సరిహద్దు దాటి కొందరు అక్రమ కుకీ ఉగ్రవాదులు, వలసదారులు వస్తున్నారని హోం మంత్రి చేసిన ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఇందులో బాహ్య దురాక్రమణ ప్రమేయం ఉందని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. మనం మణిపూర్‌ను మాత్రమే కాకుండా మొత్తం దేశాన్ని కూడా రక్షించడం చాలా ముఖ్యం. సమస్యను ఒక్కసారిగా పరిష్కరించడానికి సర్జికల్ స్ట్రైక్ వంటి కొన్ని సమర్థవంతమైన చర్యలు చేయాలి.” అని ఎన్‌పీపీ నాయకుడు ఎం.రామేశ్వర్ సింగ్ అన్నారు.
రాష్ట్రపతి ఆమోదం.. చట్టంగా మారిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆమోదించిన నాలుగు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆమోదం తెలిపారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు ఇప్పుడు చట్టంగా సంతకం చేయబడ్డాయి. ఇప్పుడు సంతకం చేసిన ఈ బిల్లుల్లో కనీసం రెండు బిల్లులకు ప్రతిపక్ష పార్టీల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం నుండి ఢిల్లీ బ్యూరోక్రసీపై నియంత్రణను చేజిక్కించుకున్న ఆర్డినెన్స్ స్థానంలో దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన చట్టం, ఇండియా కూటమి నుంచి తీవ్ర వ్యతిరేకతను చూసింది. ఓటింగ్‌కు రాగానే ప్రతిపక్ష కూటమి ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. దేశ రాజధానిలో బ్యూరోక్రాట్‌లను ఎవరు నియంత్రిస్తారనే దానిపై సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమిస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టాన్ని హోంమంత్రి అమిత్ షా సమర్థించారు. బిల్లు ఆమోదానికి ముందు, ‘ఢిల్లీ ప్రజలను బానిసలుగా చేయడమే ఈ బిల్లు లక్ష్యం’ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 131 మంది ఎంపీలు చట్టానికి అనుకూలంగా, 102 మంది వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాత ఈ బిల్లు ఆమోదం పొందింది. కేంద్రం, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మధ్య ఎనిమిదేళ్ల వాగ్వివాదం తరువాత, ఎన్నికైన ప్రభుత్వమే ఢిల్లీకి బాస్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ప్రపంచాన్ని చుట్టుముడుతున్న ‘డిసీజ్ X’.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
ప్రస్తుతం సోషల్ మీడియాలో డిసీజ్ ఎక్స్ అనే వ్యాధి చాలా ట్రెండ్ అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) X వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా ప్రకటించింది. ఈ వ్యాధి ఇంకా తెరపైకి రాలేదు. జంతువులలో ఉన్న అనేక వైరస్ జాతులను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇవి మానవులను చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది వినాశకరమైన ఫలితాలకు దారి తీస్తుంది. మానవులకు ముప్పు కలిగించే ఈ ప్రాణాంతక వైరస్‌లలో ఏవియన్ ఫ్లూ ఒకటి. మానవాళికి హాని కలిగించే ఈ ప్రమాదాలను పర్యవేక్షించడానికి, పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. 2018 సంవత్సరపు నివేదికలో X వ్యాధి ప్రపంచానికి అతిపెద్ద అంటు ముప్పుగా మారుతుందని పేర్కొంది. కోతులు, కుక్కలు మొదలైన ఏ జంతువు నుండి అయినా X వ్యాధి సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. డిసీజ్ ఎక్స్ ప్రమాదకరమైన వ్యాధి కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ఎబోలా హెచ్‌ఐవి ఎయిడ్స్, కోవిడ్ వంటి వ్యాధులు వ్యాపించడం ద్వారా మానవులకు సోకుతుంది.
ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు… క్లారిటీ ఇచ్చిన కోహ్లీ!
దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రపంచంలో ఉన్న క్రికెటర్లు అందరి కంటే కోహ్లీ ఎక్కువ సంపాదిస్తున్నాడనే టాక్ ఉంది. దానికి తగ్గట్టుగానే ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు ఈ రన్నింగ్ మిషన్. బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్స్ లో కనిపిస్తూ ఒక్కో యాడ్ కు భారీగానే వసూలు చేస్తున్నాడు. యాడ్స్ ద్వారానే సంవత్సరానికి వందల కోట్లు సంపాదిస్తున్నాడు కోహ్లీ. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా విరాట్ కు కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. అయన తన పోస్ట్ ల ద్వారా కూడా భారీ ఆదాయాన్ని ఆర్జీస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు ఏకంగా రూ.11.45 కోట్లు వసూలు చేస్తున్నాడంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తపై స్వయంగా కోహ్లీనే స్పందించాడు. ట్విటర్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. జీవితంలో తనకు లభించిన ప్రతిదానికి రుణపడి ఉన్నానని కోహ్లీ చెప్పాడు. సోషల్ మీడియాలో తన సంపాదన గురించి వస్తున్న వార్తలు నిజం కాదని కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు.
మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే…
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘భోళా శంకర్’. ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో నెగటివ్ రిపోర్ట్స్ సొంతం చేసుకుంది. వీక్ మేకింగ్ భోళా శంకర్ సినిమాపై విమర్శలు వచ్చేలా చేసాయి. వేదాళం సినిమా తమిళనాడులో సూపర్ హిట్ అయ్యింది అంటే కథలో కచ్చితంగా విషయం ఉంటుంది. ఇక్కడ ఫ్లాప్ అయ్యింది అంటే తెలుగు ఆడియన్స్ కి తగ్గట్లు మార్పులు చేయకపోవడం, మెహర్ ఓల్డ్ స్కూల్ మేకింగ్ లో ఉండిపోవడమే కారణం అయ్యి ఉంటుంది. చిరు వరకూ భోళా శంకర్ గా ఎప్పటిలాగే తన మార్క్ మాస్ ఎలిమెంట్స్ అండ్ కామెడీ టైమింగ్ తో ఇంప్రెస్ చేసాడు. ఈ ఒక్క కారణమే మెగా ఫ్యాన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. మొదటి రోజు మార్నింగ్ షోకె నెగటివ్ టాక్ వచ్చింది కాబట్టి భోళా శంకర్ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందా అంటే కష్టమనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరు నుంచి ఇంకో సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అవుతాయో అని అందరు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిదేమి భోళా శంకర్ విషయంలో జరగలేదు. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా భోళా శంకర్ సినిమా 30 కోట్లని కూడా రాబట్టలేకపోయింది. నైజాంలో అయితే భోళా శంకర్ సినిమా నాలుగున్నర కోటి మాత్రమే రాబట్టింది. ఇది చిరంజీవి సినిమాల్లోనే అతి తక్కువ కలెక్షన్స్ లో ఒకటి అనే చెప్పాలి. ఒక యావరేజ్ టాక్ వచ్చే సినిమాని ఇచ్చినా చిరు తన మేనియాతో దాన్ని బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుస్తాడు. ఆయన చరిష్మా యావరేజ్ సినిమాని కూడా కాపాడగలదు. మెగా ఫ్యాన్స్ కూడా మంచి ఎలిమెంట్స్ ఉంటే కాస్త అటు ఇటు ఉన్న సినిమాని కూడా సూపర్ హిట్ గా చేస్తారు. మెహర్ రమేష్ కనీసం ఆ అవకాశం కూడా అభిమానులకి ఇవ్వలేదు. ఇక ఇప్పుడు వీకెండ్ కి కలెక్షన్స్ పుంజుకోని ఆడియన్స్ థియేటర్స్ కి వస్తే భోళా శంకర్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది లేదంటే బయ్యర్స్ కి భారీ నష్టాలు తప్పేలా లేవు.