హైదరాబాదీలకు మెట్రో ఉగాది కానుక.. నేటి నుంచి మూడు కొత్త ఆఫర్లు..
ఉగాది సందర్భగా హైదరాబాదీలకు శుభవార్త చెప్పింది హైదరాబాద్ మెట్రో రైలు.. ఈ రోజు నుంచి మూడు ప్రత్యేక ఆఫర్లు మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఉగాది సందర్భంగా నేటి నుంచి ఆ మూడు ఆఫర్లు మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ప్రకటించారు.. మెట్రో ప్రయాణికుల కోసం తీసుకొచ్చిన.. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు నేటి నుంచి 6 నెలల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.. ఇక, కొత్త మూడు ఆఫర్లపై హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు కోసం ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ సరికొత్తగా కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాంను పరిచయం చేస్తుందని పేర్కొన్నారు.. ఇవి మెట్రోలో ప్రయాణించే వారికి ఎంతో వెసులుబాటు కల్పిస్తాయని.. ఎక్కువగా మెట్రో సేవలు వినియోగించుకుంటే ఎక్కువ రివార్డులు పొందవచ్చు అని వెల్లడించారు.. మరోవైపు.. కొత్తగా ప్రారంభించిన కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాం ద్వారా మెట్రో ప్రయాణికులు ఎంతో లబ్ధి పొందుతారని చెప్పుకొచ్చారు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి.. ప్రయాణికుల నుంచి వస్తుందన్న స్పందన, అభ్యర్థనలతో ఈ ఉగాది రోజున మేం ఈ ఆఫర్‌లను తిరిగి పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాం. మేం సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ మరియు మెట్రో స్టూడెంట్ పాస్‌లను మళ్లీ ప్రారంభించినందున, ఏప్రిల్ 9, 2024 నుంచి అంటే ఇవాళ్టి నుంచి 6 నెలల వరకు ఈ ఆఫర్‌లను పొందవచ్చు.. మీరు మాతో ప్రయాణిస్తున్నప్పుడు అసాధారణమైన పొదుపులు మరియు సౌకర్యాన్ని పొందుతారు అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. పెట్టుబడులు ఆగవు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడులు ఆగవు అని స్పష్టం చేశారు బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో కేంద్ర సంక్షేమ పథకాలు అమలు దాదాపు జరగలేదన్నారు. అమరావతి ఐదు సంవత్సరాలలో రాజధాని కాలేదు.. కానీ, రాబోయే ఐదేళ్లలో అమరావతి రాజధాని అవుతుంది.. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడులు ఆగవు అని పేర్కొన్న ఆయన.. పోలవరం ప్రాజెక్ట్ పునాదులలో లోపాలు జరిగాయి.. పోలవరం డిజైన్ మార్పులు చేశారని వెల్లడించారు. ఇక, అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్ధుల విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు సిద్ధార్థ నాథ్ సింగ్. ఉగాది భారతదేశానికి, తెలుగువారికి చాలా ముఖ్యమైన రోజుగా పేర్కొన్న ఆయన.. ఉగాది పండుగ ఏపీలో జరుపుకోవడం అద్భుతంగా ఉందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న చోట సంక్షేమం అమలు చేయడం సాధ్యపడింది.. కానీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం కేంద్ర సంక్షేమ పథకాలు అమలు దాదాపు జరగలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపుకోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్.
ముస్లిం భక్తులతో కిటకిటలాడిన వెంకన్న ఆలయం..
కడప జిల్లాలో ముస్లిం భక్తులతో వెంకన్న ఆలయం కిటకిటలాడుతోంది.. దీంతో.. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం.. అయితే, ఉగాది రోజున శ్రీనివాసునికి పూజలు, అభిషేకాలు నిర్వహించి బత్యం చెల్లించడం ముస్లింలకు ఆనవాయితీగా వస్తోంది.. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. సబ్ కా మాలిక్ ఏక్ హై అని చాటుతున్నారు ముస్లిం మహిళలు.. ఈ రోజు పెద్ద ఎత్తున శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అభిషేకాలు చేసి బత్యం చెల్లించి.. తమ మొక్కులు సమర్పించుకున్నారు.. మత సామరస్యానికి ఉదాహరణగా, శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి దేవి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ముస్లిం పురుషులు, బురఖా ధరించిన మహిళలు, వారి పిల్లలు పెద్ద సంఖ్యలో హిందూ భక్తులతో పాటు క్యూ లైన్లలో నిలబడి, ప్రసిద్ధ మరియు చారిత్రక ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ప్రార్థనలు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా దేవుని కడపలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ వాతావరణం కనిపించింది.. ఆలయం వెలుపల క్యూలలో వేచి ఉన్న ముస్లింలు.. పూలు, బెల్లం, చెరకు ముక్కలు, చింతపండు, వేప పండ్లు, కొబ్బరికాయలను అధిష్టాన దేవతలకు సమర్పించి, హారతి మరియు తీర్ధం కోసం తమ వంతు కోసం ఓపికగా నిరీక్షించారు. అయితే, కడప మరియు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ఇతర ప్రాంతాలలో ఉగాది రోజున వెంకటేశ్వర స్వామి ఆలయాలను సందర్శించడం సంప్రదాయంగా ఉంది, ఎందుకంటే చాలా మంది ముస్లింలు వేంకటేశ్వరుని భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం అని నమ్ముతారు. యాదృచ్ఛికంగా, దేవుని కడపను వేంకటేశ్వరుని నివాసమైన తిరుమలకు ప్రవేశ ద్వారంగా భావిస్తారు. అర్చకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం భక్తులకు హారతి, తీర్ధం సమర్పించి ఆశీర్వదించారు. కడపలో కొన్ని శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. “బాలాజీ మా కమ్యూనిటీకి చెందిన బీబీ నాంచారమ్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మా అల్లుడు. తెలుగు సంవత్సరాది సందర్భంగా కృతజ్ఞతలు తెలిపేందుకు ముస్లింలు దేవుని కడపకు వస్తారని చెబుతున్నారు..
టీడీపీకి మరో షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
ఎన్నికల తరుణంలో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా.. అన్ని పార్టీలకు చెందిన నేతలు.. తమ పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీ గూటికి చేరుతున్నారు.. ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి.. టీడీపీకి రాజీనామా చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని వెల్లడించిన ఆయన.. ప్రజలకు సేవ చేసే పార్టీలా టీడీపీ పనిచేయడం లేదన్నారు. డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకోవడం దారుణం అన్నారు. పార్టీ అభివృద్ధికి పని చేసిన వారికి టీడీపీలో గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని సంప్రదించకుండా టికెట్లు కేటాయించడం దుర్మార్గం అన్నారు. తమ బాధలు.. జరుగుతోన్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ సైతం దొరకని పరిస్థితి టీడీపీలో ఉందన్నారు. ఇక, రేపు వినుకొండలో జరిగే మేమంతా సిద్ధం సభలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి.
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను జైలు అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 23 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడీషియల్ కస్టడీ 14 రోజులు పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమి లేవని కవిత తరపు న్యాయవాది రానా పేర్కొన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని, కవిత ప్రభావితం చేసే వ్యక్తి అని మొదటి నుంచి కానీ అలాంటిది ఏమి లేదన్నారు రానా. కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరగా.. కవిత కోర్టులో నేరుగా మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారు న్యాయమూర్తి కావేరి బవేజా. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని కవిత తరపు న్యాయవాది తెలిపారు. అప్లికేషన్ వేసుకోవాలని జడ్జి కావేరి బవేజా సూచించారు. కవితను కోర్టులో భర్త, మామ కలిసేందుకి కవిత న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు. కోర్టులో కవితను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
లిక్కర్ కేసులో బాధితురాలిని.. తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ
తనకు లిక్కర్ కేసులో ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నాలుగు పేజీలతో మీడియాకు లేఖ విడుదల చేశారు ఎమ్మెల్సీ కవిత. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదని.. లిక్కర్ కేసులో తాను బాధితురాలినని లేఖలో తెలిపారు. రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటు తేలడం లేదన్నారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ రెండున్నర ఏళ్లుగా జరిగిందని.. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆమె లేఖలో స్పష్టం చేశారు. తన మొబైల్ నెంబర్‌ను టీవీ ఛానళ్లలో ప్రసారం చేసి ప్రైవసీని దెబ్బతీశారన్నారు. నాలుగు పర్యాయాలు విచారణకు హాజరయ్యానని.. బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించానన్నారు. దర్యాప్తు సంస్థకు తన మొబైల్ ఫోన్లు అన్నీ అందజేశానని.. కానీ వాటిని ధ్వంసం చేసినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కవిత లేఖలో రాశారు. గత రెండున్నరేళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారని.. భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని.. చాలామందిని అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. వాంగ్మూలాలు తరచూ మార్చుతూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకుని కేసును నడిపిస్తున్నారన్నారు. సాక్షులను బెదిరిస్తున్నట్టు తనపై ఆరోపణలు చేస్తున్న ఈడీ, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా తనను ఇప్పుడు అరెస్టు చేశారన్నారు.
ప్రజాప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు రానివ్వం..
ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం ఆర్ఆర్ఆర్‌లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్‌లోని వారి నివాసంలో కలిశారు. పీర్లాపల్లి, ఇటిక్యాల, లింగారెడ్డి పల్లి, ఆలీరాజ్ పేట్, నర్సన్నపేట, చేబర్తి, పాతూరు, మక్తా మాసాన్ పల్లి, సామలపల్లి, నెంటూర్, బంగ్లవెంకటాపూర్, బెగంపేట్, ఎల్కంటి గ్రామాలకు చెందిన రైతులకు ఇటీవల ఆర్ఆర్ఆర్ నిర్మాణ భూసేకరణకు నోటీసులు వచ్చాయని, అయితే తాము ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూనిర్వాసితులం అయ్యామని మళ్లీ తమకు మిగిలిన కొద్దిపాటి భూములు ఆర్ఆర్ఆర్‌లో పోతే తాము జీవనాధారం కోల్పోతామని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మా పరిస్థితిని మానవతా ధృక్పథంతో పరిశీలించి ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చేందుకు చొరవ చూపాలని వారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి విన్నవించారు. రైతులతో సుధీర్ఘంగా మాట్లాడిన మంత్రి వారి సాధకబాధకాలను తెలుసుకొని.. తాను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు రైతులు ఆందోళన చెందవద్దని రైతులకు ధైర్యం చెప్పారు. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించిన ప్రాజెక్టు వల్ల ప్రజాధనం వృథా అవడమే కాకుండా రైతులు నిర్వాసితులుగా, బాధితులుగా మారారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాల వలన రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. గత ప్రభుత్వంలా ఒంటెద్దు పోకడలు పోకుండా.. ప్రజాస్వామ్యయుతంగా రైతుల సమస్యలను తీర్చుతూనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.
కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బీరేందర్ సింగ్
సార్వత్రిక ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీకి షాకిచ్చారు. కమలం పార్టీకి గుడ్‌బై చెప్పి హస్తం గూటికి చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో బీరేందర్ సింగ్‌కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఆయన భార్య ప్రేమ్‌లత కూడా కాంగ్రెస్‌లో చేరారు. నెలరోజుల క్రితమే బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్ లోక్‌సభకు రాజీనామా చేసి.. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానాలో బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించిన బీరేందర్ సింగ్ భార్య ప్రేమ్‌లత సైతం బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు బీరేందర్ సింగ్ సోమవారం ప్రకటించారు. తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపినట్లు తెలిపారు. 2014-2019 వరకూ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న తన భార్య ప్రేమ్ లత సైతం పార్టీని వీడారని చెప్పారు. గతంలో నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌తో సంబంధాలు సాగించిన బీరేందర్ సింగ్ పదేళ్ల క్రితం బీజేపీలో చేరారు.
అమేథీ టికెట్ ఆయనకు ఇవ్వొద్దు.. కాంగ్రెస్‌కు ప్రశాంత్ భూషణ హెచ్చరిక
అమేథీ లోక్‌సభ టికెట్‌పై కాంగ్రెస్‌లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు ఈ టికెట్‌పై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకులేదు. దీంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోనియా అల్లుడు, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రాబర్ట్ వాద్రా కూడా గత వారం ఒక ప్రకటన చేశారు. అమేథీ నుంచే పోటీ చేయనున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. కాంగ్రెస్‌ను తీవ్రంగా హెచ్చరించారు. అమేథీ టికెట్ రాబర్ట్ వాద్రాకు ఇవ్వొద్దని ప్రశాంత్ భూషణ్ వార్నింగ్ ఇచ్చారు. రాబర్ట్ వాద్రాకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే అది ఆత్మహత్యా సదృశ్యమని ప్రశాంత్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోటలాంటివి. అలాంటిది గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి సోనియా గట్టెక్కారు కానీ.. అమేథీలో మాత్రం రాహుల్‌గాంధీ ఓడిపోయారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో 55 వేల ఓట్లతో రాహుల్ ఓడిపోయారు. కేరళలోని వాయనాడ్ నుంచి మాత్రం రాహుల్ గట్టెక్కారు. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వయనాడ్ నుంచే రాహుల్ పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి దూరం జరిగినట్టేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ వాయనాడ్ పోలింగ్ ముగిశాక.. అమేథీపై రాహుల్ నిర్ణయం తీసుకుంటారని మరో వాదన వినిపిస్తోంది.
ఉగాది వేళ షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
ఉగాది పండుగ రోజు కూడా బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి.. ఈరోజు బంగారం పెరగ్గా , వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఇవాళ మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. తులం బంగారం పై 100 కు పైగా పెరిగింది.. అలాగే కిలో వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,730 ఉంది.. వెండి ధరలు కిలో రూ.88,000 ఉంది.. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,730 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.71,730 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,760.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..65,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,870 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,750, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.71,730 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 88,000, ముంబైలో 84,500, ఢిల్లీలో 84,500, బెంగుళూరు లో 83,000,అదే విధంగా హైదరాబాద్ లో 88,000 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
చిన్నోడితో కలిసి పెద్దోడి బిజినెస్.. ‘ఏఎంబీ విక్టరీగా’ థియేటర్!
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న ‘సుదర్శన్’ థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద హీరో సినిమా రిలీజ్ ఉందంటే.. అక్కడ పండుగ వాతావరణం ఉంటుంది. భారీ కటౌట్లు, వందల కొద్ది ఫెక్సీలు, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి, ఆయన ఫ్యాన్స్‌కి సుదర్శన్ థియేటర్ చాలా సెంటిమెంట్. తన సినిమా మొదటి షోను ఫ్యాన్స్‌తో కలిసి మహేష్ బాబు సుదర్శన్‌లోనే చూస్తారు. ఇటీవల వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాకు సెలబ్రేషన్స్‌ను ఫ్యాన్స్ వీరలెవల్లో చేశారు. ఈ సెలబ్రేషన్స్ రానున్న రోజుల్లో మరింత ఎక్కువ కానున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. 2010లో అనివార్య కారణాల వల్ల సుదర్శన్ 70MM మూతపడింది. ఇప్పుడు దానిని మహేశ్ బాబు రీఓపెన్ చేస్తున్నారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ పేరుతో 7 స్క్రీన్స్ ఉండేలా సూపర్ స్టార్ భారీ మల్టీఫ్లెక్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బిల్డింగ్ వర్క్ పూర్తయింది. అయితే ఈ థియేటర్ బిజినెస్‌లోకి తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా వచ్చారట. దాంతో సుదర్శన్ థియేటర్‌కు ‘ఏఎంబీ విక్టరీగా’ పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ వార్త తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘చిన్నోడితో కలిసి పెద్దోడి బిజినెస్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
చిరంజీవి వర్సెస్ రవితేజ.. గెలుపు ఎవరిదో!
2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో జరిగింది. చిరు, బాలయ్యలు సినీ అభిమానులకు కావల్సినంత ఎంటర్టైన్ ఇచ్చారు. వీర సింహారెడ్డిగా బాలయ్య, వాల్తేరు వీరయ్యగా చిరు రచ్చ చేశారు. ఈ రెండు సినిమాలు కూడా బక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేశాయి. అయితే వచ్చేసారి మాత్రం చిచిరంజీవి వర్సెస్ రవితేజగా మారిపోయింది. వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి నటించిన చిరు, రవితేజ.. బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. కానీ ఈసారి మాత్రం ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత.. చిరు చేస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉంది. అయితే మాస్ మహారాజా రవితేజ.. మెగాస్టార్‌తో బాక్సాఫీస్ ఫైట్‌కు సై అంటున్నాడు. ఉగాది సందర్భంగా (ఏప్రిల్ 9) రవితేజ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. సమాజవరగమన సినిమాకు రచయితగా పని చేసిన భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా నేడు ప్రకటించారు. ‘వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపొండ్రి’ అంటూ అనౌన్స్ చేశారు. దీంతో ప్రస్తుతానికి 2025 సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ రవితేజగా మారిపోయింది.