రంగంలోకి టీడీపీ అధిష్టానం.. అసంతృప్త నేతలకు బుజ్జగింపులు..!
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఓవైపు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెడుతూనే.. మరోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడిపోయింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం.. కర్నూలు జిల్లాలో సీటు దక్కని అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో టీడీపీ హైకమాండ్ పడిపోయింది.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రెబెల్స్ గా పోటీకి సిద్ధమవుతోన్న పలువురు నేతలను సంప్రదింపులు జరుపుతున్నారు.. ముఖ్యంగా కోడుమూరు, ఆదోని, మంత్రాలయం టీడీపీలో తీవ్రమైన సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తోంది అధిష్టానం.. కోడుమూరులో ఆకెపోగు ప్రభాకర్, ఆదోనికి చెందిన మీనాక్షి నాయుడు, మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన తిక్కారెడ్డితో చర్చలు జరుపతున్నారు పార్టీ జోనల్ ఇంఛార్జ్ బీద రవిచంద్ర నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం. ఇప్పటికే కోడుమూరులో ప్రభాకర్, మంత్రాలయంలో తిక్కారెడ్డితో చర్చలు జరిపారు టీడీపీ నేతలు.. అయితే, తనకు అన్యాయం జరిగిందంటూ తిక్కారెడ్డి, ప్రభాకర్ మండిపడినట్టుగా తెలుస్తోంది.. మళ్లీ ఇవాళ కూడా కోడుమూరు టీడీపీ నేత ప్రభాకర్ ను బుజ్జగించేందుకు బీద రవిచంద్ర యాదవ్ టీమ్ వెళ్లగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరాగాల్సి వచ్చింది.. అయితే, కోడుమూరు టికెట్‌ను అమ్ముకున్నారని బీదరవిచంద్రపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారట.. మరోవైపు.. ఆలూరు టికెట్ తనకివ్వలేదని, తనను కలసే ప్రయత్నం చేయొద్దన్ని బీద రవిచంద్ర యాదవ్‌కు కోట్ల సుజాతమ్మ స్పష్టం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. మరి, ఎన్నికల నాటికి అన్నీ సర్దుకుంటాయా? నేతలు రెబల్స్‌గానే బరిలోకి దిగుతారా? అనేది ఉత్కంఠగా మారిపోయింది.
పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన చంద్రబాబును ప్రజలు సస్పెండ్ చేయాలి..
అవ్వ, తాతలకు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన చంద్రబాబు నాయుడును ప్రజలు సస్పెండ్ చేయాలంటూ పిలుపునిచ్చారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. మరోసారి కడప నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగన వైఎస్ అవినాష్‌రెడ్డి.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి పేరుతో మందిని కూడగట్టుకుని తప్పుడు ఆరోపణలతో వస్తున్నాడు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీ-జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? అని నిలదీశారు. రంగురంగుల మ్యానిఫెస్టోతో ఎన్నికలకు వస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ, ప్రతి ఇంటికి ఉద్యోగం అన్న చంద్రబాబు హామీలు అమల్లో విఫలం అయ్యాయని విమర్శించారు అవినాష్ రెడ్డి.. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో అనేకమంది మృత్యువాత పడ్డారు.. అవ్వ తాతలకు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన చంద్రబాబు నాయుడును ప్రజలు సస్పెండ్ చేయాలి.. ప్రజలను ఇబ్బంది పెట్టేవారు మనకు అవసరమా? అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి. కాగా, వరుసగా రెండో రోజు ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది.. ఉదయం నుంచి సచివాలయాల దగ్గర వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్ల కోసం బారులు తీరారు.. అయితే, పెన్షన్ల పంపిణీ తొలి రోజు ఎండ దెబ్బతో రాష్ట్రంలో నలుగురు వృద్ధుల ప్రాణాలు పోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు
శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు అంటూ ఫైర్ అయ్యారు బెజవాడ ఎంపీ, వైసీపీ అభ్యర్థి కేశినేని నాని.. విజయవాడలో క్రిస్తురాజపురం, పెద్ద బావి సెంటర్ లో తూర్పు నియోజకవర్గ జోనల్ ఎన్నికల కార్యాలయాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్ లు మరియు వైసీపీ శ్రేణులతో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన నాయకుడు దేవినేని అవినాష్ అని ప్రశంసలు కురిపించారు. లక్షమందికి రక్షణగా రక్షణ గోడ కట్టించిన గొప్పతనం అవినాష్ దే అన్నారు. సీఎం వైఎస్ జగన్ ని ఒప్పించి వేగవంతంగా రిటైనిoగ్ వాల్ పూర్తి చేశాడు.. నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన ఘనత కూడా ఆయన సొంతం అన్నారు. ఇక, ఫించన్ దారులను ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేశినేని నాని.. పేదలకు, సామాన్యులకు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తుంటే.. చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారన్న ఆయన.. 2024 ఎన్నికలు అయిపోతే సొంత రాష్ట్రం తెలంగాణకి చంద్రబాబు పారిపోతాడు అంటూ సెటైర్లు వేశారు. శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు.. కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.. పెన్షన్ల పంపిణీ నిలిపివేసింది చంద్రబాబేనంటూ ఆరోపణలు చేశారు కేశినేని నాని.
పెన్షన్ల పంపిణీపై నీచరాజకీయాలు.. జోగి రమేష్ రాజకీయ సమాధికి పెనమలూరే వేదిక..!
కృష్ణాజిల్లాలో పెన్షన్ల పంపిణీపై వివాదం కొనసాగుతూనే ఉంది.. పెన్షన్ తీసుకోవడానికి వెళ్లి వడదెబ్బతో మృతిచెందారంటూ.. వారి కుటుంబ సభ్యులు చెబుతుండగా.. వాటిపై కూడా రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు.. ఈ వ్యవహారంలో మంత్రి జోగి రమేష్ తీరును తప్పుబట్టారు పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్.. పెన్షన్ పంపిణీపై వైసీపీ నీచరాజకీయాలు చేస్తోందని మండిపడ్డా యాన.. జోగి రమేష్ రాజకీయ సమాధికి పెనమలూరు వేదిక కాబోతోందని జోస్యం చెప్పారు. జోగి రమేష్ అధికార దాహం అనే మానసిక రోగం ఉంది.. వైసీపీ అధిష్టానం జోగి రమేష్ ను మూడు నియోజకవర్గాలు మార్చేసరికి అతని మానసిక పరిస్థితి దెబ్బతిందన్నారు. ఎక్కడ ఎప్పుడు శవం దొరుకుతుందా? రాజకీయం చేద్దామనే ఆలోచనతో జోగి రమేష్ ఉన్నాడు అంటూ ఫైర్ అయ్యారు. అసలు వజ్రమ్మ మృతికి కారణం ఎవరో వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారన్న ఆయన.. పెన్షన్ పంపిణీ చేయాల్సిన అధికారులు మూడుసార్లు సచివాలయానికి ఇంటికి వజ్రమ్మను తిప్పటంతో ఆమె చనిపోయిందన్నారు. అనోరోగ్యంతో ఉన్న వారికి ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలనే నిబంధనలను అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు. వజ్రమ్మ చనిపోయిన విషయం తెలుసుకుని వేరే సచివాలయం నుంచి తీసుకొచ్చిన డబ్బులు పంపిణీ చేశారని మండిపడ్డారు బోడె ప్రసాద్.
అవనిగడ్డ అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఆయనకే అవకాశం..
అవనిగడ్డ అభ్యర్థి ఎవరు? తాజాగా పార్టీలోకి వచ్చిన నేతకే టికెట్ వరిస్తుందా? జనసేన పార్టీకి చెందిన సీనియర్లకు అవకాశం దక్కుతుందా? తమకే సీటు కేటాయించాలంటూ స్థానికల నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో.. అసలు టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ సాగుతోన్న తరుణంలో.. ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది జనసేన పార్టీ.. అవనిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఖరారు చేసింది జనసేన అధిష్టానం.. మరోవైపు.. రైల్వేకోడూరు అభ్యర్థిపై జనసేన పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. ఇక, పాలకొండ అసెంబ్లీ అభ్యర్థిపై కసరత్తు కొనసాగుతోందని జనసేన నేతలు చెబుతున్నారు.. రైల్వే కోడూరు అభ్యర్థి యనమల భాస్కరరావు పేరుపై సర్వేల్లో వ్యతిరేకత రావడంతో.. అభ్యర్థి విషయంలో జనసేన పునరాలోచనలో పడినట్టుగా ప్రచారం సాగుతోంది.. కాగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు టీడీపీ నుంచి అవనిగడ్డ సీటు దక్కకపోవడంతో.. జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే.. అప్పటి నుంచి టికెట్ ఆశించిన విక్కుర్తి శ్రీనివాస్, బండ్రేడ్డి రామకృష్ణ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.. గతంలో జనసేనపై తీవ్ర విమర్శలు చేసిన బుద్ధప్రసాద్‌కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.. కానీ, కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరునే అధిష్టానం ఖరారు చేసింది.. 1999, 2004, 2014లో అవనిగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించారు బుద్ధ ప్రసాద్.. గతంలో కాంగ్రెస్, టీడీపీలో పనిచేసిన బుద్ధ ప్రసాద్.. ఇటీవల జనసేన పార్టీలో చేరారు.. కొద్ది రోజుల వ్యవధిలోనే అవనిగడ్డ టికెట్ దక్కించుకున్నారు మండలి బుద్ధప్రసాద్.
సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తెలిపిన వివరాలు.. గతంలో మాదిరే నేతన్నలకు అర్డర్లు వేంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అలాగే, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్ వల్ల నిలిపి వేసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి అని కోరారు. చేనేత మిత్రా లాంటి పథకాలను పక్కన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రస్తుతం అందుతున్న అన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలి అన్నారు.. అవసరం అయితే మరింత సాయం చేయాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. కేవలం గత ప్రభుత్వంపై విద్వేశంతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదు అని కేటీఆర్ వెల్లడించారు. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పారు. ఈ పదేళ్లలో మా ప్రభుత్వం నేతన్నలకు చేతి నిండా పని కల్పిస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్య రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం స్టార్ట్ అయిందని ఆయన విమర్శలు గుప్పించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరం అయ్యారు.. అలాగే, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యారు అని కేటీఆర్ అన్నారు.
రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ప్రమాణం..!
రాజ్యసభ సభ్యురాలుగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ప్రమాణస్వీకారం చేశారు. సోనియా గాంధీ చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా సోనియాగాంధీతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. వీరిని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఇక తెలంగాణ నుండి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వద్దిరాజు రవిచంద్ర తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి అందరిని ఆశర్యపరిచారు.
ఏడాది క్రితం రూ.17వేల కోట్లు.. ఇప్పుడు జీరో.. బైజూస్ రవీంద్రన్..!
రెండేళ్ల కిందటివరకు కూడా ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్., ఇప్పుడు మాత్రం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. కంపెనీ ప్రస్తుతం తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. బైజూస్ సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉందంటే నమ్మండి. ఇదివరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న తన ఇంటిని కూడా తాకట్టు పెట్టేందుకు బైజూస్ అధినేత రవీంద్రన్ సిద్ధపడ్డాడు. వాటితోపాటు అనేక విలువైన ఆస్తులను కూడా అమ్ముకున్నట్లు సమాచారం. ఇకపోతే గత సంవత్సరం ఇదే సమయానికి ఆయనకు వేల కోట్లు ఉన్నాయి. అది కూడా 17 వేల కోట్లు విలువచేసే ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రపంచ కుబేరుల జాబితా ఫోర్బ్స్ లో కూడా ఆయనకు స్థానం దక్కింది. అయితే రోజులన్నీ మనవి కాదు అన్నట్లుగా.. ఒక్క సంవత్సరంలోనే ఆయన పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోట్ల అధిపతి నుండి ఒక్క రూపాయి కూడా చేతిలో లేని పరిస్థితికి ఆయన చేరడం నిజంగా బాధపడాల్సిన విషయం. తాజాగా విడుదలైన ఫోర్బ్స్ జాబితాలో రవీంద్రనాథ్ నికర విలువ ఏకంగా ‘0’ కి పడిపోయినట్లు తెలిపింది.
బాగా ఆడావ్.. పంత్‌ను మెచ్చుకున్న షారుక్ ఖాన్! వీడియో వైరల్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సహయజమాని షారుక్ ఖాన్ ఫిదా అయ్యారు. బుధవారం విశాఖలో పంత్ నో-లుక్ షాట్ ఆడినప్పుడు స్టాండ్స్‌లో లేచినిలబడిన చప్పట్లు కొట్టిన షారుక్.. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి ఆప్యాయంగా కౌగిలుంచుకున్నారు. బాగా ఆడావ్ అని ప్రశంసలు కురిపించారు. అలానే ఢిల్లీ కెప్టెన్ ఆరోగ్య పరిస్థితి గురించి షారుక్ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలో రింకూ సింగ్‌తో రిషబ్ పంత్ కూర్చొని మాట్లాడాడు. ఆ సమయంలో షారుక్ ఖాన్ మైదానంలోకి వచ్చారు. షారుక్‌ను చూసిన పంత్ లేచే ప్రయత్నం చేయగా.. ఫర్వాలేదు కూర్చొమని బాలీవుడ్ బాద్‌షా సైగలు చేశారు. అయినా పంత్ లేచి షారుక్ దగ్గరకు వచ్చాడు. ఇద్దరు ఆప్యాయంగా కౌగిలుంచుకున్నారు. పంత్‌తో కాసేపు ముచ్చటించిన షారుక్.. ఢిల్లీ, కోల్‌కతా ఆటగాళ్ల అందరితో కాసేపు మాట్లాడారు. ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, గౌతమ్ గంబీర్‌లను బాద్‌షా కౌగిలుంచుకున్నారు. ఎలాంటి అహం లేకుండా షారుక్ హుందాగా ప్రవర్తించడంపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.
అదరగొడుతున్న టిల్లు గాడు.. 6 రోజులకు ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ను ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసిన సినిమా డిజే టిల్లు.. ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఆ సినిమా పాటలు ఇంకా వినిపిస్తున్నాయి..ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకేక్కిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇక సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం మాత్రమే కాదు భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకుంటుంది.. ఆరు రోజులకు సినిమా ఎంత వసూల్ చేసిందో ఒకసారి చూద్దాం.. ఈ సినిమాలో యంగ్ హీరో జొన్నలగడ్డ సిద్దు, అనుపమ పరమేశ్వరన్ హీరో,హీరోయిన్గా నటించారు.. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ సంగీతాన్ని అందించారు.. సినిమా కథ, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో రోజు రోజుకు కలెక్షన్స్ భారీగా పెరుగుతున్నాయి.. ఇక ఆరు రోజుల్లో టిల్లు స్క్వేర్ మూవీ 91 కోట్లకు పైగా వసూల్ చేసింది .. ఆరోవ రోజు ఏకంగా 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.91 కోట్లు గ్రాస్ వచ్చింది.. ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ మూవీ యూఎస్, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 25 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది.. త్వరలోనే 100 కోట్ల మైలురాయిని అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు..
ఈ వారం థియేటర్లలో సందడి చెయ్యబోతున్న సినిమాలు ఇవే..
టాలీవుడ్ లో ప్రతివారం సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అవ్వగా, కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. ఇక ఈ వారం కూడా ఎక్కువగానే సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ హీరో సినిమాలు విడుదల కాబోతున్నాయో ఓ లుక్ వేద్దాం పదండీ..
ఫ్యామిలీ స్టార్..
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. డైరెక్టర్ పరుశురాం ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు.. ఈ సినిమా ఏప్రిల్ 5 అంటే రేపే థియేటర్లలో విడుదల కాబోతుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్, పోస్టర్స్ సినిమా పై భారీ అంచనాలను నెలకొల్పాయి.. మరి రేపు ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..
భరతనాట్యం..
దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ‘భరతనాట్యం’ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. సూర్యతేజ ఏలే ఈ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.. ఈ సినిమాలో మీనాక్షి గోస్వామి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో హర్షవర్ధన్, వైవా హర్ష కీలక పాత్రలలో కనిపించనున్నారు. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ ఈ చిత్రాన్ని నిర్మించారు..
బహుముఖం..
హర్షివ్ కార్తీక్ హీరోగా నటిస్తూ, దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘బహుముఖం’. ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ కాబోతుంది.. సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి..
మంజుమ్మల్ బాయ్స్..
మలయాళ సూపర్ హిట్ సినిమా ఇది.. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొడువల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్ ప్రధాన పాత్రలో నటించారు.. నిజమైన స్నేహం ఇలా ఉంటుంది అని చక్కగా సినిమాలో చూపించారు.. ఏప్రిల్ 6న విడుదల కాబోతుంది.. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
ప్రాజెక్ట్ Z..
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ప్రాజెక్ట్ z.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, ఇది ఇప్పటి నుండి పదేళ్ల తర్వాత భవిష్యత్తును అన్వేషిస్తుంది. ప్రముఖ తమిళ దర్శకుడు నలన్ కుమారసామి ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందించారు. ప్రముఖ తమిళ నిర్మాత సీవీ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు.. ఈ సినిమా ఏడేళ్ల నుంచి వాయిదా పడుతూనే వస్తుంది.. తాజాగా విడుదల తేదీని అనౌన్స్ చేశారు మేకర్స్.. ఏప్రిల్ 6 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
