NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

పెన్షన్లపై పెద్ద కుట్ర.. మా అభ్యంతరం లేదు.. ఈసీ ఆదేశించలేదు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు పెన్షన్ల పంపిణీ వ్యవహారం కాకరేపుతోంది.. పెన్షన్ల విషయంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. సోషల్‌ మీడియా వేదికగానూ వీడియోలు షేర్‌ చేస్తూ.. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలు, సపోర్టర్లు.. ఇక, ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వైసీపీపై విరుచుకుపడ్డారు.. తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందే నీచమైన తీరు జగన్‌ది అని మండిపడ్డారు.. వైసీపీ నేతలు, జగన్ రెడ్డి బతుకే ఒక ఫేక్ బతుకు అని విమర్శించారు. అసలు పెన్షన్లు పంచవద్దని టీడీపీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు చంద్రబాబు.. అంతేకాదు.. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఆదేశించ లేదని గుర్తుచేశారు.. పెన్షన్ల విషయంలో నేడు జరుగుతుంది అంతా పెద్ద రాజకీయ కుట్రగా అభివర్ణించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదన్నారు. ప్రజలారా కుట్రలను చేధించండి.. దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టండి అని పిలుపునిచ్చారు. అంతేకాదు.. తాము అధికారంలోకి రాగానే పెన్షన్ రూ.4000కు పెంచుతాం. ఇంటి వద్ద పెన్షన్ ఇస్తాం అని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

ఎమ్మెల్సీ అనంతబాబును అడ్డుకున్న దళితులు.. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం..
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం విదితమే.. అయితే, ఈ రోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఎమ్మెల్సీ అనంతబాబును అడ్డుకున్నారు స్థానికులు, దళితులు.. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మవరంలోని బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు అనంతబాబు.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి పూనుకున్నారు.. కానీ, ఒక దళితుడిని చంపి ఎస్సీ కాలనీకి వచ్చి ఓట్లు అడగడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు స్థానికులు.. అనంతబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. అనంతబాబు పూలమాల వేయడంతో బీఆర్ అంబేద్కర్ విగ్రహం అపవిత్రమైంది అంటూ.. ఆ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు దళితులు.. కాగా, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సుబ్బారావు కి మద్దతుగా ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు అనంతబాబు.. ఓ దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తక్షణమే అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.. ఇక, ధర్మవరంలో నిరసన వ్యక్తం కావడంతో.. అక్కడి నుంచి బైక్ పై వెనక్కి తిరిగి వెళ్లిపోయారు ఎమ్మెల్సీ అనంతబాబు.

వైసీపీ గుర్తు చాలా మందికి తెలియదు..! మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.. ఓ వైపు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు.. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.. ఇంకో వైపు.. టికెట్లపై క్లారిటీ కోసం ఇండియా కూటమి అభ్యర్థులు వేచిచూస్తున్నారు. అయితే, ఎన్నికల తరుణంలో పార్టీ సింబల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే కే ఓటు వేస్తామంటున్నారు.. కానీ, వైసీపీ గుర్తు ఏంటో ఇప్పటికీ చాలామందికి తెలియటంలేదన్నారు.. వైసీపీ గుర్తు ఏంటి? అని అడిగితే.. కొందరు హస్తం గుర్తు అంటున్నారు.. మరికొందరు సైకిల్ గుర్తు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్‌ గుర్తును మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తాం అన్నారు. మరోవైపు.. గెలవక ముందే పిటిషన్లు పెట్టి వాలంటీర్ వ్యవస్థను తీయించారు. రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు అన్నీ తీసేస్తారు అని హెచ్చరించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

బాప్టిస్ట్ చర్చిలో పవన్‌ ప్రత్యేక ప్రార్థనలు.. అన్ని మతాలను గౌరవిస్తాను
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పిఠాపురం పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సమావేశాలు, బహిరంగ సభలు, సమీక్షలు, ప్రార్థనలు ఇలా సాగుతోంది ఆయన పర్యటన.. ఎన్నికల ప్రచారానికి తాను బరిలోకి దిగుతోన్న పిఠాపురం నుంచే శ్రీకారం చుట్టిన ఆయన.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడుతోన్న విషయం విదితమే కాగా.. నాల్గో రోజు పిఠాపురం పర్యటనలో భాగంగా నేడు స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా భార్య క్రిస్టియన్ అని గుర్తుచేశారు.. అయితే, నేను ఎన్నికల కోసం చర్చికి రాలేదని స్పష్టం చేశారు. తనను తాను తగ్గించుకునువాడు హెచ్చించును అన్నారు. ఇక, మా కుటుంబంలో సర్వ మతాలను గౌరవించేవారు.. అన్ని మతాలను నేను గౌరవిస్తాను అన్నారు. అంతేకాదు.. జీసస్ నడిచిన బెత్లెహేముకి కూడా నేను వెళ్లానని తెలిపారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌.

ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. ఉత్తర్వులు జారీ.. ఎప్పటి నుంచంటే..?
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఇప్పటికే స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా.. ఇప్పుడు విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ నెల నుంచే వేసవి సెలవులు ప్రకటించింది.. వేసవి సెలవులపై అధికారిక ప్రకటన విడుదల చేశారు.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులుగా పేర్కొన్న విద్యాశాఖ.. వచ్చే అకడమిక్‌ ఇయర్‌.. విద్యాసంవత్సరం 2024-25 కోసం జూన్ 12వ తేదీ నుంచి తిరిగి స్కూళ్లు ప్రారంభం అవుతాయని పేర్కొంది. ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో.. ఈ నెల 23వ తేదీన స్కూళ్లకు చివరి పనిదినంగా ఉండనుంది.

కేకే కడిగిన ముత్యం.. రామ్మోహన్‌ ఆనిముత్యం..
కేకే కడిగిన ముత్యం అయ్యారని, రామ్మోహన్ అనిముత్యం అయ్యారని బీజేపీ శాసన సభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ధరణి కుంభకోణం.. 2 లక్షల కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు. హరీష్ రావు, కేటీఆర్ లు ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఉపేక్షిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 115 రోజులు అయింది ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి జరిగింది అని ఆరోపించిన రేవంత్ రెడ్డీ ఎందుకు ఆ కుంభకోణాన్ని వెలికితీయడం లేదన్నారు. 24 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములు ఉంటే ఈ రోజు మిగిలింది 6 లక్షల ఎకరాలు మాత్రమే…ఆ భూములు ఎక్కడికి పోయాయి… ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. 60 వేల ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని అన్నారు. ప్రోహిబిటెడ్ లిస్ట్ లో 14 లక్షల ఎకరాలు పెట్టారు… ఈ భూ యజమానులు ను భయపెట్టి తక్కువ ధరకు కొన్నారని తెలిపారు. కేకే కడిగిన ముత్యం అయ్యారు… రామ్మోహన్ అనిముత్యం అయ్యారని అన్నారు. రంజిత్ రెడ్డి దేవాదాయ భూములు కబ్జా చేశారని అన్నారు… ఈ రోజు అనిమిత్యామై మీ అభ్యర్థి అయ్యారని తెలిపారు. కేంద్ర దర్యాప్తుకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. అవకతవకలు ఎందుకు పబ్లిక్ లో పెట్టడం లేదన్నారు. ఆర్ టాక్స్ తో పాటు కొత్తగా బీ టాక్స్ తెరపైకి వచ్చిందని అన్నారు.

ఖమ్మం టికెట్‌ ఇవ్వండి.. భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తా..!
ఖమ్మం టికెట్ తనకిస్తే మెజారిటీతో గెలుస్తానని మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల కలిశానని.. ఖమ్మం లోక్ సభ సీటు ఇవ్వాలని కోరానని అన్నారు.పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. రాజీవ్ గాంధీతో అక్కడే తిరిగానని అన్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు ఉన్నారో తెలియాలన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రికార్డ్ చేశారని తెలిపారు. ఇందులో ఇంకా చాలా అంశాలు బయటకు రావాలని అన్నారు. రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో అసలు సూత్రధారులు ఎవరు? ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారని అన్నారు. నయీం అనే గ్యాంగ్ స్టార్ట్ గతంలో కోట్ల రూపాయలు, భూములు కజేశాడన్నారు. నయీం మరణం తర్వాత అక్కడ దొరికిన డబ్బులు ఏమయ్యాయి ? అని ప్రశ్నించారు. సీట్ అధికారిగా నాగిరెడ్డి ఉన్నారని తెలిపారు. పేదల భూములు నయీం లాక్కున్నారు ఏమయ్యాయి అవి అని ప్రశ్నించారు. శివనంద రెడ్డి ఎస్పీ నీ పట్టుకోవడానికి వెళ్తే అప్పుడు ఆయన తప్పించుకొని పారిపోయారన్నారు. 2500 కోట్ల ఆస్తులు, భూములు ఆక్రమించారన్నారు. శివనంద రెడ్డి వెనుక నయీం ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వీటి పై విచారణ జరిపితే ఆ భూములను పేద ప్రజలకు ఇవ్వొచ్చన్నారు. నయీం డబ్బులు,సొమ్ము ఏమయ్యాయి ఎవరు చెప్పలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ ను ప్రభుత్వం ఎలా సీరియస్ గా తీసుకుందో ,నయీం డబ్బులు,అస్తులు ఏమయాయ్యో విచారణ జరపాలన్నారు.

అప్పుడే చెప్పా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని.. కానీ మా మీదే కేసు పెట్టారు
దుబ్బాక ఎన్నికలప్పుడు చెప్పా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కానీ.. మా మీదే కేసు పెట్టారని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ లో పూజారి హత్య జరిగినప్పుడు హిందువునని గుర్తుకు రాలేదా? ఆ కుటుంబాన్ని పరామార్శించినవా? అంటూ ప్రశ్నించారు. భైంసా లో సంక్రాంతికి హిందువుల పై దాడులు జరిగితే మీ మామ ఎందుకు పోలేదు? అని మండిపడ్డారు. హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అనప్పుడు ఏమైంది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల్లో ఎంట్రీ టైమ్ లో ఆడపిల్లల మెడమీద తాళి బొట్టు తీసేసినప్పుడు మీలో హిందువు ఏమైండు? అని ప్రశ్నించారు. చెంగిచర్ల లో జరిగిన ఘటనలో బాధితుల దగ్గరకు వెళ్ళినవా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరి గుట్ట ఆలయం నిర్మాణం దాతల పోన్ లు కూడా టాప్ చేసి .. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు గుంజి ఉంటారు… దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదన్నారు. హిందుత్వకు వ్యతిరేకంగా పనిచేసి… ఇప్పుడు హనుమాన్ చాలీసా వచ్చు … అని నాలుగు తప్పులు చదివి కొత్త నాటకానికి తెర లేపకన్నారు. మీరు మోకాళ్ళ మీద యాదగిరి గుట్ట ఎక్కిన మిమ్మల్ని ప్రజలు నమ్మరన్నారు.

తప్పుడు ఆరోపణలు చేస్తే లీగల్‌ నోటీసు పంపుతా.. కాంగ్రెస్‌ నేతలకు కేటీఆర్‌ వార్నింగ్‌
తప్పుడు ఆరోపణలు చేస్తే లీగల్‌ నోటీసు పంపుతా.. కాంగ్రెస్‌ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరికి లీగల్ నోటీసు పంపిస్తా అని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై సిగ్గు లేకుండా , తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలపై తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా కాకుంటే.. చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాలని హెచ్చరించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే.. వారు ఎవరైనా సరే వారిపై లీగల్ నోటీసులు పంపిస్తానని తెలిపారు. తాజాగా.. కుట్రపూరితంగా అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు పెడతామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలసిందే. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయనీ మండిపడ్డారు. ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లపైన కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం దావాలతో పాటు.. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందుకు క్రిమినల్ కేసులను కూడా నమోదు అయ్యేలా చూస్తామని హెచ్చరించారు.

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెలంగాణ మాజీ గవర్నర్..
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందర రాజన్ తిరిగి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో జాయిన్ అయ్యారు. దీంతో ఆమెకు దక్షిణ చెన్నై నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కింది. అయితే, తమిళనాడులో మొదటి విడతలో ఎన్నికలు జరగనుండగా.. తమిళిసై తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని ఎక్కటుతంగల్ నుంచి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజలు నాకు ఓటేస్తారని భరోసా ఇస్తున్నారు తెలిపింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్ట లేదు అని చెప్పుకొచ్చింది. కేవలం మాటల పైనే దృష్టి సారించారు అని విమర్శలు గుప్పించింది. వర్షాలు కురిస్తే నగరానికి వరదలు వచ్చాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి నిర్మాణాలు చేస్తాం.. చెన్నైని నీటి ఎద్దడి, వరదలు లేకుండా చేయడమే మా మొదటి లక్ష్యం అని ఆమె తెలిపింది. కాగా గతంలో డాక్టర్ అయిన తమిళిసై.. తెలంగాణ గవర్నర్ గా కీలక పదవిలో కొనసాగారు. ఇక, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా ఎండలో తిరగడం చేత ఆమె ప్రస్తుతం నల్లగా మారిపోయింది.

వరుణ్‌ గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి..!
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. 10 రోజుల ఎ‍న్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గంలో పర్యటించారు. బీజేపీ ఫిలీభీత్‌ టికెట్ ను వరణ్‌గాంధీకి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించిన తర్వాత తొలిసారి మేనకా గాంధీ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం, వరణ్‌గాంధీ చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ‘వరుణ్‌ గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి అని మేనకగాంధీ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దాని గురించి ఆలోచిస్తామన్నారు. నేను బీజేపీలో ఉన్నందుకు సంతోషపడుతున్నాను.. ప్రధాని మోడీ, అమిత్‌ షా, జేపీ నడ్డా నాకు పోటీ చేసే అవకాశం కల్పించారు.. అయితే టికెట్ కేటాయించటంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం అని తెలిపారు. ఈసారి ఫిలీభీత్‌? లేదా సుల్తాన్‌పూర్‌? అనే అనుమానం ఉండేది.. కాన, బీజేపీ అధిష్టానం సుల్తాన్‌పూర్‌లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. ఎందుకంటే ఈ సెగ్మెంట్‌లో ఒకసారి గెలిచిన ఎంపీ మళ్లీ గెలవడని చర్రిత ఉంది అని మేనకా గాంధీ పేర్కొన్నారు.

ఎన్నికల తర్వాత భారత్‌-పాక్‌ సంబంధాలు మెరుగుపడతాయి..
భారతదేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాత సంబంధాలు మెరుగుపడతాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, సోమవారం నాడు ఇస్లామాబాద్‌లోని పార్లమెంట్ హౌస్ వెలుపల విలేకరులతో మాట్లాడిన ఆసిఫ్.. భారతదేశంలో ఎన్నికల తర్వాత మా సంబంధాలు మెరుగుపడతాయని అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయని అన్నారు. భారతదేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 4 మధ్య ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు ఇస్లామాబాద్- న్యూ ఢిల్లీ మధ్య సుదీర్ఘమైన చర్చలు కొనసాగుతున్నాయని పాక్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ చెప్పారు. ఇక, 2019లో భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసింది. దీంతో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత పాకిస్తాన్- భారత్ మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి. ఇక, నాలుగేళ్ల తర్వాత మళ్లీ పొరుగు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని పాకిస్తాన్ వెల్లడించింది. అయితే, పాకిస్తాన్ దాదాపు పరిశ్రమ స్థాయిలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని.. ఉగ్రవాదులను ఉపేక్షించే ధోరణిలో భారత్ లేదని.. ఇకపై దీనిని విస్మరించబోమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సింగపూర్‌లో ప్రకటన చేసిన కొద్ది రోజుల తర్వాత ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓటీటీలోకి వచ్చేసిన ‘లంబసింగి’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ దివి జంటగా నటించిన సినిమా ‘లంబసింగి’. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టి.ఆనంద్‌ నిర్మించారు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద కొంతమేరకు మెప్పించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. లంబసింగి సినిమా మంగళవారం (ఏప్రిల్‌ 2) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఈమేరకు హాట్‌స్టార్‌ అధికారికంగా ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. లంబసింగి విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి రావడంతో ఫ్యాన్స్‌ ఖుషి అవుతున్నారు. థియేటర్లో చూడని వారు ఎంచక్కా.. లంబసింగిని ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని లంబసింగి ఏజెన్సీ ప్రాంతంలో 50 రోజుల్లో ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. సినిమాలో ప్రతి పాత్ర వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. పోలీసు, నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే లంబసింగి సినిమా. హరిత అనే పాత్రలో దివి ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తెరపై కొత్త దివిని చూస్తారు. మరోవైపు ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయం అయిన భరత్‌ రాజ్‌ కూడా మెప్పించాడు.

మాస్ జాతర మొదలైంది.. ‘పుష్ప’ దిగుతున్నాడు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప-2’. 2021లో రిలీజ్ అయిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-ది రూల్’ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్ప 2 నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అందరిలో భారీ అంచనాలు పెంచేశాయి. పుష్ప 2 గురించి ఈరోజు బిగ్ అప్డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. ‘పుష్ప మాస్ జాతర ఈరోజు ప్రారంభమవుతుంది. అందరూ ఎదురుచూస్తున్న ఓ అప్డేట్ ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న పుష్ప 2 గ్రాండ్ రిలీజ్ అవుతుంది’ అని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ప్రస్తుతం పుష్ప మాస్ జాతర, పుష్ప-ది రూల్, పుష్ప 2 టీజర్ ట్రెండ్ అవుతున్నాయి.