*బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల..
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ప్రధాని మోడీ రిలీజ్ చేశారు. మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా సంకల్ప్ పత్రను రూపొందించినట్లు బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది. దీని కోసం 15 లక్షల సలహాలు, సూచనలను ఈ కమిటీ పరిశీలించింది. అయితే, ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి రోజు సంకల్ప్ పత్ర విడుదల సంతోషదాయకం అన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు. అంబేడ్కర్ సూచించిన మార్గంలో తాము కూడా నడుస్తున్నామన్నారు. అంబేడ్కర్ ఆకాంక్షలను అమలు చేస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. 2014లో మోడీ ప్రధాని కాగానే పేదల కోసమే బీజేపీ సర్కార్ అని చెప్పారని నడ్డా గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో తమ మేనిఫెస్టో చెబుతుంది.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తేనే దేశ ప్రగతి సాధ్యం.. మోడీ నేతృత్వంలో పదేళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని జేపీ నడ్డా వెల్లడించారు. ఇక, గ్రామాలకూ ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించామన్న జేపీ నడ్డా.. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని తెలిపారు. పేదలకు బియ్యం, గోధుమలు, పప్పులు అందిస్తున్నామన్నారు. ‘పేదల జీవితాల్లో మార్పు రావాలనేదే మా లక్ష్యం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేదే మా నినాదం అని ఆయన చెప్పుకొచ్చారు. సామాజిక సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేశాం, అలాగే, అయోధ్యలో రామ మందిర్ నిర్మాణాన్ని పూర్తి చేశాం.. ట్రిపుల్ తలాక్‌ను తొలగించి ముస్లిం మహిళలకు మంచి చేశాం.. మహిళల రిజర్వేషన్ చట్టాన్ని తెచ్చాం.. కరోనాను ధైర్యంగా ఎదుర్కొని.. 9 నెలల్లోనే వ్యాక్సిన్ తయారు చేశాం.. కరోనా వ్యాక్సిన్‌ను వంద దేశాలకు ఎగుమతి చేశామన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మందికి మేలు చేకూర్చామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.
*దేశ ప్రజలకు మోడీ గుడ్ న్యూస్..
ఇవాళ ఎంతో మంచి రోజు.. ఉత్తమ మేనిఫెస్టోను తయారు చేసిన రాజ్‌నాథ్ సింగ్‌ను అభినందిస్తున్నాను.. అలాగే, మేనిఫెస్టో కమిటీకి అభినందనలు తెలిజేస్తున్నాను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గత పదేళ్లలో దేశాభివృద్ధికి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం.. ఈ పదేళ్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన చేపట్టాం.. బీజేపీ సంకల్ప పత్రం యువత ఆకాంక్షలను ప్రతిబింభిస్తోంది.. యువత, మహిళలు, పేద వర్గాలపై ఫోకస్ చేశాం అన్నారు. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ అందిస్తాం.. పేదల జీవితాలు మార్చడమే మోడీ ఇస్తున్న గ్యారెంటీ నరేంద్ర మోడీ అన్నారు. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ రోజు కొత్త సంవత్సరం మొదలవుతుంది అని ప్రధాని మోడీ తెలిపారు. కాత్యాయని మాత తన రెండు భుజాలపైన కమలం పువ్వులు ఉంటాయి.. ఇవాళ అంబేద్కర్ జయంతి కూడా.. అన్ని కలిసి వచ్చిన పవిత్రమైన ఈ రోజునే బీజేపీ సంకల్ప పత్రను విడుదల చేసింది అని చెప్పుకొచ్చారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ బీజేపీ సంకల్ప పత్రం కోసం ఎంతో ఆసక్తి ఉంటుంది.. మా మేనిఫెస్టోలో నాలుగు అంశాల పైన ప్రధానంగా ఫోకస్ ఉంటుంది అని ఆయన చెప్పారు. యువశక్తి, నారిశక్తి, గరీబ్ యోజన, కిసాన్ యోజనపై యువ భారత్ కి, యువ ఆకాంక్షలకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రతిబింబంగా నిలుస్తుంది అని మోడీ పేర్కొన్నారు.
*సీఎం జగన్‌పై దాడి ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరం
సీఎం జగన్‌పై దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్కూల్ బిల్డింగ్ పైనుంచే జగన్‌పై దాడి జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఘటనాప్రాంతం సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్కూల్ భవనంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉండగా.. స్కూల్ బిల్డింగ్‌ను సీపీ కాంతి రాణా పరిశీలించారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో సీసీఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్యలోని చెట్ల దగ్గర నుంచి దాడి జరిపినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సీఎం జగన్‌పై పక్కా స్కెచ్ వేసుకుని దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్య ఉన్న చెట్లు దగ్గర నుంచి దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ పూర్తిగా చీకటిగా ఉండడం.. చెట్లు ఉండడంతో నిందితుడు కనిపించలేదు. దాడికి పాల్పడి.. అక్కడి నుంచి ఈజీగా ఎస్కేప్ కావచ్చని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. 30 అడుగుల దూరం నుంచి బలంగా రాయిని విసిరినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు ఇందుకు తగ్గట్టే ముందస్తు కుట్ర, ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశించింది. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపేస్తుండటాన్ని ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు. జగన్‌పై దాడి ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. సీఎం జగన్, వేలంపల్లి ఇద్దరికీ తగిలిన రాయి ఒకటేనా లేక వేర్వేరా అనే విషయంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జగన్‌పై దాడి కేసును డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నిరంతరం పరివేక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఈసీకి సీపీ కాంతి రాణా నేడు నివేదిక ఇవ్వనున్నారు. ఏ సమయంలో, ఎక్కడ ఎలా జగన్ పై దాడి జరిగిందని సవివరంగా నివేదిక ఇవ్వనున్నారు. దాడికి పాల్పడిన వారి ఆచూకీ ఇప్పటి వరకు గుర్తించలేదని సమాచారం. సీఎం జగన్‌పై దాడి చేసిన ప్రాంతంలో పోలీసులు డ్రోన్ విజువల్స్ తీయిస్తున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా దాడి ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు పోలీసుల విజువల్ అనాలసిస్ మీద ఫోకస్ పెట్టారు. ఈ విచారణలో పోలీసులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. బస్సు యాత్ర రూట్‌లో సీసీటీవి ఫుటేజ్ సేకరణ సవాలుగా మారినట్టు పోలీసులు చెబుతున్నారు. జగన్ బస్సు యాత్ర నేపథ్యంలో ఆ రూట్‌లో రోడ్డుకు ఇరు వైపులా కలిపే వైర్లను ముందే అధికారులు కట్ చేశారు. సీసీటీవీ వైర్లు, కేబుల్ వైర్లు, విద్యుత్ వైర్లు కట్ చేయటంతో సీసీటీవీ ఫుటేజ్ ఇబ్బందిగా మారింది. నెట్, విద్యుత్ సరఫరా ఉంటేనే డీవీఆర్ ఆన్‌లో ఉండి సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరా లేకపోవటం, వైర్లు కట్ అవటంతో సీసీటీవీ ఫుటేజ్ కష్టంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్న వీడియోల ద్వారా ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. విద్యుత్, నెట్, సీసీటీవీ కెమెరాల వైర్‌లను ఉదయం నుంచి ఆయా విభాగాల సిబ్బంది పునరుద్ధరణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం జగన్‌పై దాడిని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. విజయవాడ సీపీ కాంతి రాణాను సీఈఓ ఎంకే మీనా నివేదిక కోరారు. సీపీ కాంతి రాణా నుంచి ప్రాథమిక సమాచారాన్ని సీఈవో తీసుకున్నారు. . ఏపీలో జీరో వయలెన్స్ ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకున్న ఈసీ.. ఏకంగా సీఎంపైనే దాడి జరగడంతో ఈసీ సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఈ క్రమంలోనే నేడు సీపీ కాంతి రాణా ఎన్నికల సంఘానికి నివేదికను సమర్పించనున్నారు.
*తెలంగాణలో ఏ పార్టీలతోనూ ఎలాంటి పొత్తు లేదు.. తేల్చేసిన ఒవైసీ
తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు లేదని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఒవైసీ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో దేశానికి ఒడిగేది ఏమీలేదన్నారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రాజ్యాంగ విరుద్ధమని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం సమానత్వ హక్కుకు విరుద్ధమని, ఈ చట్టాన్ని తాను ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పీడీఎం కూటమి ఏర్పడిందని, తమ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఉన్నాయని బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆరోపణలపై ప్రశ్నించగా… ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేశారని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా నియోజకవర్గం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ హషమాబాద్, అల్ జుబైల్ కాలనీతోపాటు పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో సమావేశమయ్యారు. ఎంఐఎం పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అసదుద్దీన్ ఒవైసీ ప్రజలను కోరారు. కాగా, హైదరాబాద్ పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి హైదరాబాద్ ఎంపీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాగా, తమిళనాడులో పళనిస్వామి నేతృత్వంలోని ఏఐడీఎంకేకు తాము మద్దతిస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
*అల్లాహ్ అక్బర్ అని కేటీఆర్ అనగలడా.. అనే దమ్ముందా.?
అల్లాహ్ అక్బర్ అని కేటీఆర్ అనగలడా.. అనే దమ్ముందా.? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సిటీ పార్టీ ఆఫీస్ లో అఖిల భారతీయ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎలక్షన్ రోజు వరకు క్యాంపెయిన్ నిర్వహించాలి.. నాకోసం కాదు ఓటింగ్ పెంచేలా.. అన్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్ వేసేలాగా ఒక మూవ్మెంట్ తీసుకువద్దామన్నారు. చదువుకున్న వారే ఓటింగ్ కు ముందుకు రావడం లేదన్నారు. మనమంతా ఐక్యమత్యంగా ఉండాలి.. హైదరాబాద్ ను కాపాడుకోవాలన్నారు. మూడు సార్లు వరుసగా గెలిచి.. నాలుగో సారి వెయ్యి ఓట్లతో ఓడిపోయానన్నారు. ఓటింగ్ కు రాకపోవడం వల్లే ఓడాను.. అవతలి వ్యక్తికి నలభై వేల ఎంఐఎం ఓట్లు పడ్డాయన్నారు. ఎంఐఎం ఇద్దరితోను ఉంటుంది.. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లతో కలుస్తుందన్నారు. శక్తికి వ్యతిరేకంగా పోరాడాలి అని రాహుల్ గాంధీ అంటారన్నారు. సనాతన ధర్మం లేకపోతే దేశం మరో పాకిస్తాన్ అవుతుందన్నారు. సనాతన ధర్మం లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదన్నారు. అల్లాహ్ అక్బర్ అని కేటీఆర్ అనగలడా.. అనే దమ్ముందా.? అని ప్రశ్నించారు. అల్లాహ్ అక్బర్ ను విమర్శిస్తే కేటీఆర్ హైదరాబాద్ లో ఉంటాడా.? అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడికి జై అంటే రాముడు అన్నం పెడుతాడా.? జీతాలు ఇస్తాడా.? అని కేటీఆర్ అన్నాడని, మీ అయ్యా కూడా హోమాలు యాగాలు చేస్తాడు కదా.! ఎందుకో అడుగు కేటీఆర్.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సనాతన ధర్మం.. హిందూయిజం ఉన్నన్ని రోజులే దేశం సెక్యులర్ గా ఉంటుందన్నారు. జూన్ రెండో వారంలో మోడీ హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. 2047 వరకు అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉంచాలనేదే మోడీ లక్ష్యమన్నారు. భారత్ వందేళ్ళు పూర్తి చేసుకునే నాటికి వికసిత్ భారత్ గా చేయాలనేదే మా లక్ష్యం అన్నారు. పీవీని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే.. మేము భారతరత్నతో గౌరవించామన్నారు. అవార్డు ప్రధాన కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఆహ్వానం ఇస్తే రాలేదన్నారు. ఖర్గే ఒక్కడే వచ్చాడు.. మేము చప్పట్లు కొడితే ఆయన ముడుచుకుని కూర్చున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు.
*పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి..
రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు అంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్పూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏళ్లపాటు తెలంగాణ పోరాటాన్ని కెసిఆర్ గారి నాయకత్వంలో కొనసాగించామన్నారు. ప్రజా పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో, అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు పది సంవత్సరాలు మా ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే ప్రగతి వస్తుంది, ప్రగతి తోనే సమానత్వం వస్తుంది అన్న ఆయన ఆలోచనతో 1022 గురుకులాలు పెట్టుకున్నామన్నారు. వీటినుంచి బయటకు వచ్చిన లక్షల పదిమంది భవిష్యత్తు తెలంగాణ పౌరులు ఈరోజు అనేక ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారని తెలిపారు. 125 సీట్ల ప్రపంచంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. మేము ఏర్పాటు చేసింది విగ్రహం కాదు విప్లవం అనే మాటను కేసీఆర్ చెప్పారన్నారు. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం అది కేసిఆర్ కే సాధ్యమైందన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం దళిత గిరిజన వర్గాల కోసం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా… అవన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవే అని క్లారిటీ ఇచ్చారు. కొలంబియా యూనివర్సిటీలో ఆయనకు ఇచ్చిన ఘనమైన నివాళి మనమందరం గుర్తు తెచ్చుకోవాలన్నారు. సమాజంలో సమానత్వం రావాలి అంటే రాజ్యాంగ స్ఫూర్త కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు అంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.
*రామ్‌లల్లా వెండి నాణెం విడుదల.. ధర ఎంతో తెలుసా..?
అయోధ్యలో కొత్త రామాలయం ప్రారంభమైన తర్వాత రామ్‌లల్లాను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇక, ఇక్కడి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అయోధ్యకు వచ్చి రామ్‌లల్లా దర్శనం చేసుకోలేని వారు ఆన్‌లైన్‌లో ప్రసాదాన్ని ఆర్డర్ చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 50 గ్రాముల అయోధ్య రామాలయ వెండి నాణేలను ప్రజలకు విక్రయించేందుకు రిలీజ్ చేశారు. కాగా, 50 గ్రాముల బరువున్న ఈ నాణెం ధర 5,860 రూపాయలు మాత్రమే.. ఇది 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ నాణెంలో ఒక వైపు రామ్ లల్లా విగ్రహం, మరొక వైపు రామాలయ ఫోటో కనిపిస్తుంది. ఆలయంలోని రామ్‌లల్లా విగ్రహాన్ని శిల్పి అరుణ్ యోగి రాజ్ రూపొందించగా.. ఈ నాణెం కొనుగోలు చేసిన వారు.. ఇంటిలోని పూజా మందిరంలో ఉంచవచ్చు.. లేదా ఎవరికైనా గిప్ట్ గా ఇవ్వొచ్చని రామ మందిర ట్రస్ట్ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
*మణిపూర్ లో మరోసారి చెలరేగిన హింస.. కాల్పుల్లో ఇద్దరు మృతి..!
సార్వత్రిక ఎన్నికలకు ముందు మణిపూర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు ప్రారంభమయ్యాయి. కంగ్‌పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామంలో కుకీ, మోతీ సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. కము సైచాంగ్ గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో అదనపు బలగాలు మోహరించాయి. మరణించిన ఇద్దరు వ్యక్తులను కమ్మిన్‌లాల్ లుఫెంగ్ , కమ్లెంగ్‌సట్ లుంకిమ్ అని కాంగ్‌పోక్పిలోని కుకి-నివాస ఎల్ చాజాంగ్ గ్రామ చీఫ్ లెనిన్ హౌకిప్ పేర్కొన్నారు. నోంగ్‌డమ్ కుకీ, బొంగ్‌జాంగ్ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. వీరిద్దరూ గ్రామ రక్షణ వాలంటీర్లుగా పని చేస్తున్నారని తెలిపారు. అయితే, దీనిపై ఇప్పటి వరకు మణిపూర్ పోలీసులు అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. కాగా, ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, రాష్ట్రంలో గురువారం నుంచి మూడు వేర్వేరు హింసాత్మక ఘటనలు నమోదవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇక, శుక్రవారం నాడు తెంగ్నౌపాల్ దగ్గర ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, గతేడాది మే నెల నుంచి మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కుకీ, మోతీ తెగల మధ్య ఘర్షణలు జరగడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 221 మంది చనిపోగా.. 50 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
*బాలీవుడ్ నటుడు ఇంటి దగ్గర కాల్పుల కలకలం.. పోలీసులు అలర్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ముంబయిలో సల్మాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున 5 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. క్రైం బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, గత ఏడాది మార్చిలో సల్మాన్ ఖాన్ ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈ- మెయిల్స్ వచ్చాయి. దీనిపై విచారణ చేసిన ముంబయి పోలీసులు.. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా.. వీరు టార్గెట్ చేసిన లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ పేరున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. అయితే, కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న టైంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్ దెబ్బ తీశారంటూ 2018లో లారెన్స్ బిష్ణోయ్ కామెంట్స్ చేశారు. ఇదే విషయంపై ఆయనకు ఈ- మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే, 2023 ఏప్రిల్‌లోనూ ఇదే తరహా బెదిరింపుల రావటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘ఎక్స్’ గ్రేడ్ భద్రతను ‘Y+’గా అప్‌గ్రేడ్ చేయగా.. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్‌కు భద్రత ఇస్తున్నారు.