తిరుపతి నేతలతో అర్థరాత్రి వరకు జనసేనాని చర్చలు.. ఒక్కతాటిపైకి వచ్చేశారు..
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వం చిచ్చు పెట్టింది.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆరణి.. జనసేన పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు.. అయితే, స్థానికంగా ఉన్న జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్, జనసేన నేతలు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నేతలకు ఈ వ్యవహారం మింగుడుపడలేదు.. అభ్యర్థిని మార్చాలంటూ ఆందోళనకు దిగారు.. బహిరంగంగా పార్టీపై సంచనల వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ, జనసేన అధిష్టానం నుంచి వారిని సముదాయించే ప్రయత్నాలు జరిగాయి.. దీంతో, కొంత సైలెంట్ అయినా.. వారిలో అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది.. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనతో అంతా ఒక్కతాటిపైకి వచ్చేశారు. శుక్రవారం రోజు తిరుపతి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అర్ధరాత్రి వరుకు తిరుపతిలో కూటమీ పార్టీల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు.. తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీని పంపించేయాలని పిలుపునిచ్చిన ఆయన.. జనసేన, టీడీపీ సమన్వయంతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని సూచించారు. ఏ ఒక్క నాయకుడు.. కార్యకర్త త్యాగాన్నీ, కష్టాన్నీ మరచిపోం.. వచ్చేది కూటమి ప్రభుత్వమే.. నాయకులు, కార్యకర్తల బాధ్యతను సమష్టిగా తీసుకుంటాం అనే పార్టీ నేతలకు భరోసా కల్పించారు పవన్ కల్యాణ్.
అక్కాచెల్లెళ్లు నోరు మూసుకోండి.. వైఎస్ ఫ్యామిలీ పరువు తీస్తున్నారు..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో వైఎస్ ఫ్యామిలీలోనే కొందరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు.. ముఖ్యంగా ఎంపీ అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత.. అయితే, వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మేనత విమలమ్మ.. అక్కాచెల్లెళ్లు నోరు మూసుకోండి.. వైఎస్ ఫ్యామిలీ పరువును బజారుకు ఈడుస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైఎస్ కుటుంబంలోని ఆడపడుచులు అన్యాయంగా మాట్లాడుతారా? వైఎస్ కుటుంబ పరువును రోడ్డు మీదకు తీసుకువస్తున్నారు అంటూ విరుచుకుపడ్డ ఆమె.. నేను కూడా ఆ ఇంటి ఆడపడుచుగా ఇప్పుడు మాట్లాడుతున్నాను.. వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేస్తుంటే ఈ ఇద్దరు ఆడపిల్లలు చూసారా ? అని నిలదీశారు. వైఎస్ వివేకాను చంపినవాళ్లు బయట తిరుగుతున్నాకరంర విమలమ్మ.. మా ఇంట్లో పాపలు ఇలా తయారు అయ్యారని బాధగా ఉందన్నారు. చివరకు వైఎస్ జగన్ ను కూడా దీంట్లోకి తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. షర్మిల, సునీత వ్యక్తిగతంగా కక్ష్య పెట్టుకున్నారు.. ఇప్పటికీ అయినా ఇద్దరు అక్కాచెల్లెళ్లు నోరు ముసుకోండి అని సూచించారు. మీకు కరుణ , జాలి లేదా? అని మండిపడ్డారు. వైఎస్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ మీకు మద్దతు ఇవ్వరు గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు. జగన్ శత్రువులు అంతా షర్మిల చుట్టూ చేరారని దుయ్యబట్టారు. ఇక, ఎంపీ అవినాష్ రెడ్డి కడపను అభివృద్ధి చేశారు.. అవినాష్ రెడ్డి ఒక్క మాట ఇప్పటి వరకు ఆ ఇద్దరినీ అనలేదన్నారు. వాళ్ల కోసం ప్రార్థన చేస్తున్నా.. ఇద్దరు నాశనం అవుతారు.. మీకు దైవ భయం పోయిందన్నారు. ఇక, ఆస్తులు ఈడీ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇస్తానని షర్మిలకు వైఎస్ జగన్ చెప్పారని తెలిపారు వైఎస్ జగన్ మేనత విమలమ్మ.
సెల్పీ దిగేందుకు యత్నం.. అభిమానిపై మరోసారి చేయి చేసుకున్న బాలయ్య
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హీట్ పెంచుతుంది.. ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో తమ మార్క్ రాజకీయాలు చేస్తున్నారు నేతలు.. అయితే, ఈ రోజు నుంచి నటసింహ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారానికి సిద్ధం అయ్యారు.. కదిరిలో ప్రచారాన్ని ప్రారంభించి… ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు రోజుల పాటు ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారు.. అయితే, ఎన్నికల ప్రచారానికంటే ముందే తన శైలిలో దబ్బిడి దిబ్బిడి షురూ చేసేశారు బాలయ్య.. శ్రీ సత్యసాయి జిల్లాలో అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ.. చేయి కూడా చేసుకున్నారు. బాలకృష్ణతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు ఓ అభిమాని.. బాలకృష్ణ వచ్చిన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే.. హెలీప్యాడ్ దగ్గరకు ఒక్కసారిగా దూసుకొచ్చారు అభిమానులు.. గుమ్మిగూడి జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు.. ఈ సమయంలో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ చేయి చేసుకున్నారు.. అయితే, నేటి నుంచి రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలకృష్ణ ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు.. దీని కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు.. కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న బాలయ్య.. ఆ తర్వాత తన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టన్నారు. కాగా, ఇప్పటికే బాలయ్య పలు సందర్భాల్లో తన ఫ్యాన్స్‌పై చేసుకున్నారు.. సింపుల్ వచ్చి.. రిక్వెస్ట్‌గా సెల్ఫీ, ఫొటోలు అడిగితే కూల్‌గానే స్పందించే బాలయ్య.. ఎవరైనా తన దగ్గరకు వచ్చి అతిచేస్తే మాత్రం.. వెంటనే సీరియస్‌గా స్పందించే విషయం విదితమే..
అన్నీ సర్దుకున్నాయి.. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం..
అన్నీ సర్దుకున్నాయి.. తిరుపతిలో భారీ మెజారిటీతో జనసేన పార్టీ అభ్యర్థి గెలవగెలవబోతుందన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి తిరుపతి వచ్చిన ఆయన.. అసంతృప్త నేతలతో జరిపిన చర్చల్లో పాల్గొన్నారు.. శుక్రవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి.. అంతా కలిసి కట్టుగా పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఈ రోజు నాగబాబు మాట్లాడుతూ.. కూటమి నేతలు అందరూ ఏకతాటిపైకి వచ్చారు.. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి.. అందుకే పవన్ కల్యాణ్ తిరుపతి వచ్చారని తెలిపారు.. కూటమి నేతలతో మాట్లాడాం. అన్నీ సర్థుకున్నాయి.. తిరుపతి లో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలవబోతున్నారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు
వైసీపీలోకి టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్
ఓవైపు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తూనే.. మరోవైపు.. ఇతర పార్టీల నేతలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పనిలో పడిపోయారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ప్రతీ రోజూ ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయజనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కొందరు నేతలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నైట్ స్టే పాయింట్ వద్ద గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు, మంగళిగిరి నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. గుంటూరు పశ్చిమ నియోజవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జనసేన రాష్ట్ర కన్వీనర్ వీరశెట్టి సుబ్బారావు.. ఇక, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు, బీజేపీ స్టేట్ కో కన్వీనర్ డాక్టర్ టీవీ రావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు టీడీపీ జిల్లా కన్వీనర్ బైరా అజయ్‌బాబు, గుంటూరు జిల్లా టీడీపీ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగగౌడ్, మైనార్టీ నేత షేక్ షాజిత్ కూడా వైసీపీ గూటికి చేరినవారిలో ఉన్నారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ నుంచి గుంటూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు..
కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. వాట్సప్ చాట్‌పై ప్రశ్నించే ఛాన్స్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఆమెను విచారించనున్నారు. ఇప్పటికే తీహార్ జైల్లో పలు ప్రశ్నలు సంధించారు. అయినా కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా ప్రశ్నించాలన్న నేపథ్యంలో తమ కస్టడీకి ఇవ్వాలని శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ కోరగా.. మూడు రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ సీబీఐ కస్టడీలో కవితను అధికారులు విచారిస్తున్నారు. కవితను సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు ముడుపులు ముట్టజెప్పినట్లు సీబీఐ వెల్లడించింది. సౌత్ గ్రూప్ నుంచి ఆమె డబ్బు సమకూర్చినట్లుగా తెలిపింది. నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సఫ్ చాట్స్‌పై ప్రధానంగా కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవి పర్యవేక్షణలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదిలా ఉంటే కవితను సోదరుడు కేటీఆర్ కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీబీఐ కస్టడీలో కవితను కలిసి పరామర్శించనున్నారు. కేటీఆర్‌తో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా కలిసే అవకాశం ఉంది.
బీజేపీ ఆదేశాల మేరకే తీహార్ జైలు పరిపాలన.. ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం మరోసారి పెద్ద ఆరోపణ చేశారు. తీహార్ జైలు పరిపాలన బీజేపీ ఆదేశాల మేరకు నడుస్తోందన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌కు మాత్రమే అనుమతి ఉంది. సంజయ్ సింగ్ మాట్లాడుతూ, “అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తనను కలవడానికి అప్లై చేసినప్పుడు, మీరు తనను ముఖాముఖి కాకుండా కిటికీ ద్వారా కలవవచ్చని ఆమెకు చెప్పారు. ఒక రాష్ట్రానికి సీఎం భార్య పట్ల ఇంత అమానుషంగా ఎందుకు వ్యవహరించారు? ఇది అమానుష చర్యగా ఆయన అభివర్ణించారు. భయంకరమైన నేరస్థులను కూడా బ్యారక్‌లో కలవడానికి అనుమతిస్తారు. అయితే ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన భార్యను కిటికీలోంచి కలుసుకోవడానికి అనుమతించబడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుమారు ఆరు నెలల పాటు జైలులో ఉన్న సంజయ్ సింగ్ 2024 ఏప్రిల్ 3న బెయిల్‌పై విడుదలయ్యాడు. అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా, సత్యేంద్ర జైన్ భార్య పూనాజ్ జైన్‌లను ఆయన మొదట కలిశారు. తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన బీజేపీపై మరింత దూకుడుగా కనిపించడం మొదలుపెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ సభ ఎన్నికల కార్యక్రమాల్లో చురుగ్గా మారారు. ఏప్రిల్ 9న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను కూడా కలిశారు.
తేనె నమూనా పరీక్షలో విఫలమైన పతాంజలి.. రూ.లక్ష జరిమానా
ప్యాక్ చేసిన తేనె నమూనా పరీక్షలో విఫలమైన తర్వాత పతంజలి కంపెనీపై చర్య తీసుకోబడింది. నమూనా పరీక్షలో విఫలమవడంతో న్యాయనిర్ణేత అధికారి చర్య తీసుకున్నారు. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలోని దీదీహత్ నుండి తీసిన పతంజలి ప్యాక్డ్ తేనె నమూనాను పరీక్ష కోసం సేకరించారు. పరీక్షించిన తర్వాత, ప్యాక్ చేసిన తేనె నమూనా నాణ్యత లేనిదని తేలింది. నమూనాలో సుక్రోజ్ మొత్తం రెట్టింపు కంటే ఎక్కువ. ఈ కేసులో శుక్రవారం డీడీహాట్ విక్రయదారుడికి, రాంనగర్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ కంపెనీకి న్యాయనిర్ణేత అధికారి రూ.లక్ష జరిమానా విధించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్‌కె శర్మ మాట్లాడుతూ, 2020 జూలైలో డిపార్ట్‌మెంట్ దీదీహత్‌లోని గౌరవ్ ట్రేడింగ్ కంపెనీ నుండి ప్యాక్ చేసిన పతంజలి తేనె నమూనాను సేకరించి పరీక్ష కోసం రుద్రాపూర్‌లోని ల్యాబ్‌కు పంపింది. పరిశోధనలో తేనెలోని సుక్రోజ్ మొత్తం ప్రామాణిక ఐదు శాతానికి బదులుగా 11.1 శాతం (దాదాపు రెట్టింపు) ఉన్నట్లు కనుగొనబడింది. నవంబర్ 2021లో సంబంధిత విక్రేతపై డిపార్ట్‌మెంట్ దావా వేసింది. శుక్రవారం న్యాయనిర్ణేత అధికారి, ఏడీఎం డాక్టర్ ఎస్‌కే బరన్‌వాల్ తీర్పు వెలువరించారు. ప్రొడక్ట్ సెల్లర్ గౌరవ్ ట్రేడింగ్ కంపెనీకి రూ.40 వేలు, సూపర్ స్టాకిస్ట్ కన్హాజీ డిస్ట్రిబ్యూటర్ రాంనగర్‌కు రూ.60 వేలు జరిమానా విధించారు.
ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం.. యుద్ధ నౌకలు తరలింపు
24 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా.. తనమిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. ఇప్పటికే సహాయసహకారాలు అందిస్తున్న అమెరికా.. తాజాగా యుద్ధనౌకలను దింపింది. అమెరికా నుంచి అదనపు సైనిక దళాలను రంగంలోకి దించింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు బైడెన్ ఫోన్ చేసి అప్రమత్తం చేశారు. ఇజ్రాయెల్ కూడా అందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ ఇటీవల వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన సీనియర్ ఆఫీసర్‌తో పాటు పలువురు మృత్యువాత పడ్డారు. అప్పటినుంచి ఇరాన్ పగతో రగిలిపోతుంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడులకు తెగబడొచ్చని సమాచారం. ఆదివారం నాటికి ప్రతీకారం తీర్చుకోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడికి రెడీ అయింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
ఆ స్టేడియంపై రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అక్కడ మ్యాచ్ అంటే వణుకు..!
రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ గా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఎంతోమంది అభిమానుల ను మనసులను గెలిచాడు. ఇకపోతే ఆంతర్జాతీయ క్రికెటర్స్ వారి కెరియర్ లో భాగంగా విదేశాలకు వెళ్లి క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి. ఒక్కో దేశంలో కొరకమైన స్టేడియమ్స్ ఉంటాయి. దాంతో ఒక్కో దేశంలో ఒక్కో ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే టీమిండియా ఆటగాళ్లు వేరే దేశాలకు వెళ్లి క్రికెట్ ఆడాల్సిన సమయంలో అక్కడ ఉన్న క్రికెట్ అభిమానుల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. కాకపోతే., ఏ దేశంలో అయినా సరే వారి హోమ్ గ్రౌండ్స్ లో వారి దేశ ప్రజలు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. కొన్ని సమయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవని.. ఎలాంటి మంచి క్రికెటర్ అయినా సరే ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత, ట్రోల్ల్స్, విమర్శలు కూడా వస్తుంటాయని వాటిని ఎదుర్కోవడం కష్టమంటూ తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు కలిగిన రోహిత్ శర్మకు ఓ స్టేడియంలో మ్యాచ్ ఆడాలంటే మనకు పుడుతుందట. ఇంతకీ అది ఏ దేశంలో ఉంది..? ఏ స్టేడియం..? అసలు ఎందుకు భయం..? లాంటి విషయాలు ఒకసారి చూద్దాం. ఆస్ట్రేలియాలోని చారిత్రాత్మక గ్రౌండ్ మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్. అక్కడ మ్యాచ్ ఆడాలంటే రోహిత్ శర్మకు ఫీజులు అవుట్ అవుతాయని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ స్టేడియంలో అత్యంత భయానకరమైనదిగా ఎంసిజి గ్రౌండ్ ను చెప్పవచ్చు అంటూ రోహిత్ మాట్లాడుతూ.. అక్కడ తాము బాక్సింగ్ డే టెస్ట్ ఆడమని అయితే ఆ గ్రౌండ్ లో కుడివైపు ఉన్నారంటే చాలా అద్భుతమైన అనుభూతిని కలుగుతుందని., కాకపోతే.. అదే వేరే సైడ్ ఉంటే మాత్రం తమకి చుక్కలు చూపిస్తూ.. లైఫ్ ను నరకంగా మార్చేస్తానంటూ రోహిత్ వాపోయాడు.
పెంపుడు కుక్క కోసం హైకోర్టుకెళ్లిన బాలీవుడ్ భామ.. అసలేం జరిగిందంటే..!
తన పెంపుడు కుక్క మరణానికి కారణమైన నిందితుడిపై తర్వగా చర్యలు తీసుకునేలా విచారణ చేపట్టాలని బాలీవుడ్ నటి అయేషా జుల్కా బొంబే హైకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్ల క్రితం ఆమె పెంపుడు కుక్కను కేర్‌టేకర్ చంపేశాడు. అప్పటి నుంచి కేసు నత్తనడకన సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కుర్బాన్, జో జీతా వోహీ సికందర్ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటి అయేషా జుల్కా తన పెంపుడు కుక్క రాకీ అనుమానాస్పద మృతిలో మృతిచెందింది. ఆరేళ్ల కుక్క 2020 సెప్టెంబర్ 13న ఆయేషాకు చెందిన లోనావాలా బంగ్లాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కేర్‌టేకర్ రామ్ ఆండ్రేను అనుమానిస్తూ ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాదాపుగా నాలుగేళ్లు అవుతున్న కేసు మాత్రం ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
పండంటి బిడ్డకు తండ్రి అయిన మనోజ్..
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల మౌనిక తల్లి అయిన విషయాన్ని ప్రకటించారు.. అంతేకాదు సీమంతం వేడుకను ఘనంగా జరిపించారు. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.. తాజాగా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. మనోజ్ , మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. మా ఇంట్లో దేవత వచ్చింది. మనోజ్ , మౌనిక దంపతులు పాపకి జన్మనిచ్చారు. అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు. అప్పుడే తనకి నిక్ నేమ్ కూడా పెట్టారు.. శివయ్య ఆశీస్సులు మా కుటుంబం పై ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటున్నా అని మంచు లక్ష్మీ ట్వీట్ లో పేర్కొంది.. పోస్ట్ వైరల్ గా మారగా మనోజ్ – మౌనిక దంపతులకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. అంతేకాదు మంచు మనోజ్, మౌనికలు మొన్నీమధ్య కొత్త బిజినెస్ ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.. మనోజ్ కేరీర్ విషయానికొస్తే.. సినిమాను చేస్తున్నాడు.. అలాగే షోలు కూడా చేస్తున్నాడు..
అనుమానాస్పద స్థితిలో ప్రముఖ పాప్ సింగర్ హఠాన్మరణం..!
సంగీత ప్రపంచంలో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా దేశానికి చెందిన ప్రముఖ పాప్ సింగర్ ‘పార్క్ బో రామ్’ అనుమానాస్పద స్థితిలో గురువారం అర్ధరాత్రి మరణించింది. కేవలం 30 సంవత్సరాలు ఉన్న ఈ పాప్ సింగర్ దక్షిణ కొరియా పాప్ సింగర్ గా ప్రపంచంలో ఎంతో ఫేమస్. ఇకపోతే ఆమె మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. చనిపోయే సమయానికి కొన్ని గంటల ముందు తన స్నేహితులతో ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న ఈమె వారి స్నేహితులతో కలిసి మద్యం తాగింది. రాత్రి పది గంటల సమయంలో ఆవిడ రెస్ట్ రూమ్ కు వెళ్ళగా ఎంతసేపైనా రాకపోవడంతో ఆమె స్నేహితులు వెళ్లి చూశారు. అయితే అక్కడ అపస్మారక స్థితిలో కనపడటంతో విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే ప్రముఖ పాప సింగర్ ఇక లేరని వార్త తెలియడంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమెకి 17 ఏళ్ల వయసులోనే 2010 సంవత్సరంలో సూపర్ స్టార్ కే 2 పాటల పోటీలో పాల్గొని తన టాలెంట్ ను నిరూపించుకుంది. దాంతో వెనక్కి తిరిగి చూడకుండా 2014 తన ‘సింగిల్ బ్యూటిఫుల్’ ఆల్బమ్ రిలీజ్ కావడంతో ఆ ప్రపంచంలో అడుగు పెట్టింది. ఇక అదే సంవత్సరం ‘గావ్ చాట్’ అనే మ్యూజిక్ అవార్డ్స్ లో ‘ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్’ గా కూడా అవార్డు గెలుచుకుంది. ఈ సంఘటనతో అభిమానులు ఆమెకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు.