ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఈ సమావేశాల్లో మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. అనంతరం అక్షర క్రమంలో మంత్రులు.. వంగలపూడి అనిత , అచ్చెన్నాయుడు, టీజీ భరత్ , కందుల దుర్గేష్, ఫరూక్, జనార్ధన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, నారాయణ, పార్థసారథి, రామానాయుడు, ఆనం రాంనారాయణరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, ఎస్, సవిత.. ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు.. ఆ తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు..
తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని.. 21 మందితో.. 21న..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు.. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరుగులేని విజయాన్ని అందుకున్న ఆయన.. ఈ రోజు, రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాలుకు హాజరయ్యారు.. ఆయనకు మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అయితే, అసెంబ్లీలో పవన్ కల్యాణ్ అడుగుపెట్టిన రోజుకు ఓ ప్రత్యేక ఉందనే చెప్పాలి.. ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది జనసేన పార్టీ.. పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు దక్కగా.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి రికార్డు సృష్టించారు జనసేనాని.. అంటే.. 21 సీట్లు తీసుకొని.. 21 ఎమ్మెల్యేలను గెలిపించుకుని.. ఆ 21 మంది ఎమ్మెల్యేలతో.. 21వ తేదీన అసెంబ్లీలో అడుగుపెట్టారు..
ఆనాడు శపథం.. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు..
రెండేళ్ల క్రితం శపథం చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నుంచి వెళ్లిపోయిన అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు.. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో రెండేళ్ల తర్వాత అదే సభలో అడుగుపెట్టారు.. ఈ సందర్భంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.. తనను అన్ని రకాలుగా అవమానించిన ఈ సభలో విపక్ష నేతగా ఈ కౌరవ సభలో ఉండలేను.. మళ్లీ గెలిచి గౌరవ సభలో అడుగుపెడతానంటూ 2021లో సభ నుంచి వెళ్లిపోయిన ఆయన.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. శాసనసభకు చేరుకున్నారు.. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు స్వాగతం పలికారు.. ఇక, తొలుత శాసన సభ మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు.. ఆ తర్వాత శాసన సభలో అడుగుపెట్టారు చంద్రబాబు. అయితే, 2021 నవంబర్ 19వ తేదీ తర్వాత చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇదే తొలిసారి.. ఇన్నేళ్లు తాను పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ.. ఇలాంటి సభలో నేనుండను.. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను.. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు.. మీ అందరికీ ఓ నమస్కారం.. అంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు చంద్రబాబు.. అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగినా.. ఆయన సమావేశాలకు వెళ్లింది లేదు.. కానీ, ప్రజాక్షేత్రంలో వైసీపీపై పోరాటం చేస్తూనే వచ్చారు.. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-బీజేపీతో కలిసి పోటీ అఖండ విజయాన్ని అందుకున్నారు.. అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌లోనూ కీలకంగా మారారు.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టిన చంద్రబాబు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.
ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ ప్రమాణం..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.. ఈ రోజు, రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా.. తొలి రోజు శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. ఆ తర్వాత వరుసగా మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, భరత్, దుర్గేష్, ఫరూఖ్, జనార్థన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, నారాయణ, పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఆనం రాంనారాయణరెడ్డి, రామ ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్ యాదవ్, సవిత.. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఇక, మంత్రుల ప్రమాణం తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు వైఎస్ జగన్.. మరోవైపు.. ఇంగ్లీష్ ఆల్బాబెట్‌ల ప్రకారం సభ్యులతో ప్రమాణం చేస్తున్నారు ప్రొటెంస్పీకర్ బుచ్చయ్య చౌదరి.. కాగా, అసెంబ్లీ ప్రారంభానికి ముందే.. తన చాంబర్‌కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. తాను ప్రమాణస్వీకారం చేసే సమయానికి సభలోకి వచ్చారు.. ఇక, ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తన చాంబర్‌కు తిరిగి వెళ్లిపోయారు.. అక్కడి నుంచి తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు వైఎస్ జగన్.
బీఆర్‌ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌లో సీనియర్ నేతగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్‌రెడ్డితో కాంగ్రెస్ లోకి చేరడంతో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. ఈ ఉదయం పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ వెళ్లారు. వీరిద్దరు పోచారంతో భేటీ అయ్యారు. అనంతరం పోచారం నివాసానికి కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఈ క్రమంలో తాజా రాజకీయాలపై చర్చ జరిగింది. అలాగే పోచారంను సీఎం రేవంత్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కండువా కప్పి పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పోచారం ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి.. సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. సహకరించాలని కోరామని తెలిపారు. పెద్దలుగా సహకరించాలని కోరామని తెలిపారు. దీంతో పోచారం స్పందించి హస్తం గూటికి చేరారు.
పోచారం మాకు అండగా నిలవడటానికి ముందుకు వచ్చారు..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌లో సీనియర్ నేతగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్‌రెడ్డితో కాంగ్రెస్ లోకి చేరడంతో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. ఈ ఉదయం పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడంతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో సంబరాలు నెలకొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం మా తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. పోచారం ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యిందన్నారు. సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. పెద్దలుగా సహకరించాలని కోరామని తెలిపారు. రైతు మేలు జరిగే నిర్ణయాలు.. ప్రోత్సహించడానికి మాతో చేరారు. సీనియర్ లతో సమానమైన గౌరవం ఇస్తామన్నారు. నిజామాబాద్ లో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు లు పూర్తి చేస్తామన్నారు. పోచారం మాకు అండగా నిలవడటానికి ముందుకు వచ్చారని తెలిపారు. ఇవాళ కేబినెట్ లో రైతు ఋణమాఫీ పై నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అని చెప్పే నిర్ణయాలు కేబినెట్ లో చర్చ చేస్తామన్నారు. సింగరేణి వేలం పై రేపు స్పందిస్తామన్నారు. ఇవాళ కేవలం రైతుల అంశంపై నే స్పందిస్తామని క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయం పండగ చేసే బాధ్యత మాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
నా రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైంది..
నా రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైందని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఏర్పడి పదేళ్లు పూర్తి అయ్యిందని తెలిపారు. రేవంత్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. రేవంత్ ని నేనే ఇంటికి ఆహ్వానించా అన్నారు. రైతు పక్షపాత నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. రైతుల కష్టాలు తీరాలని.. కాంగ్రెస్ లోకి వచ్చా అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల పాలన చూశామన్నారు. చిన్న వయసులోనే అన్ని సమస్యలు అవగాహన చేసుకుంటున్నారని తెలిపారు. రాజకీయంగా నేను ఏం ఆశించడం లేదన్నారు. రైతు బాగుండాలి అనేదే నాకు ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వానికి చేదోడు వాదోడు గా ఉంటా అని క్లారిటీ ఇచ్చారు. టీఆర్ ఎస్ కంటే ముందు నేను టీడీపీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైందన్నారు. ఒక్కొక్కరి అభిప్రాయం.. ఒక్కోలా ఉంటుందన్నారు.
అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్‌పై స్టే విధించిన కోర్టు..
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దిగువ కోర్టు నుంచి మంజూరైన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. కేసు విచారణ వరకు బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదల చేసిన ఉత్తర్వులను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి వంటి ప్రధాన పదవిని కలిగి ఉన్నారని.. ఇప్పుడు ఆయనను విడుదల చేస్తే..దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఈడీ తన SLP లో పేర్కొంది. కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు.. పిటిషన్‌పై ముందస్తు విచారణ అవసరం లేదని పేర్కొంది. కేసుపై విచారణ పూర్తయ్యే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాలను అమలు చేయబోమని హైకోర్టు తెలిపింది. ఈ కేసుపై విచారణ పూర్తయ్యే వరకు కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాలేరని స్పష్టంగా అర్థమవుతోంది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్‌ను కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు పేర్కొంది. కేజ్రివాల్ కు బెయిల్ మంజూరు కావడం ఈడీకీ ఏమాత్రం ఇష్టం లేదు. నిజానికి, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ లంచం డిమాండ్ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది.
టాటా ఎయిర్‌లైన్ కంపెనీకి మళ్లీ నోటీసు.. 15రోజుల్లో తప్పు సరిదిద్దుకోవాలని సూచన
టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల విమానంలోని ఆహార పదార్థాలలో బ్లేడ్ లాంటి వస్తువు కనిపించింది. దీంతో FSSAI ఎయిర్‌లైన్ కంపెనీకి దిద్దుబాటు నోటీసును జారీ చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తప్పును సరిదిద్దుకునేందుకు ఎయిర్‌లైన్ కంపెనీకి 15 రోజుల సమయం ఇచ్చింది. బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడికి అందించిన ఆహారంలో బ్లేడ్ లాంటి వస్తువు కనిపించింది. ఇంతకు ముందు కూడా విమానాల్లోని ప్రయాణికులు చాలాసార్లు ఆహారం నాణ్యత లేదని ఫిర్యాదు చేశారు. ఇటీవల ఈ సంఘటన జూన్ 9న జరిగిన ఆహార పదార్థాలలో బ్లేడ్ వంటిది కనుగొనబడింది. FSSAI TajSATS బెంగళూరులో తనిఖీ నిర్వహించింది. అక్కడి నుంచి విమానయాన సంస్థకు ఆహార పదార్థాలు సరఫరా చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం… ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఏదైనా నియమాన్ని పాటించడంలో విఫలమైతే, సహేతుకమైన వ్యవధిలో అవసరమైన చర్యలు తీసుకోవలసి వస్తే, అతనికి మెరుగుదల నోటీసును జారీ చేయవచ్చు. నోటీసును 15 రోజుల్లోగా పాటించాలని కంపెనీని కోరినట్లు ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియా, దాని క్యాటరింగ్ భాగస్వామి TajSATS టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్నాయి. సోమవారం జరిగిన ఘటనపై విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. దాని క్యాటరింగ్ భాగస్వామి తాజ్‌శాట్స్‌లో ఉపయోగించే కూరగాయల ప్రాసెసింగ్ మెషీన్‌లో ఈ సంఘటన జరిగిందని పేర్కొంది. ఆటోమేటిక్ వెజిటబుల్ కట్టర్ బ్లేడ్ విడిపోయి కూరగాయల ముక్కలో ఇరుక్కుపోయిందని ఫుడ్ సేఫ్టీ అథారిటీ గుర్తించింది.
మొదలైన సేల్.. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్‌పై భారీ డిస్కౌంట్!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పో’ ఇటీవల కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 13 రిలీజ్ చేయగా.. జూన్ 20 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ ఫోన్ 8జీబీ+128జీబీ వేరయంట్ ధర రూ.32,999గా ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ 15 శాతం తగ్గింపు అందిస్తోంది. దాంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు రూ.27,999కి కొనుగోలు చేయొచ్చు. అంటే మీరు రూ.5000 ఆదా చేసుకోవచ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాదు ఈఎంఐ ఆఫర్ (నెలకు రూ.985) కూడా అందుబాటులో ఉంది. ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటుతో 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో ఇది వస్తోంది. డైమెనిసిటీ 7050 ప్రాసెసర్ ఉండగా.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనక వైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెకండరీ సెన్సర్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరాను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 67W సూపర్ వూక్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
అందుకే బబుల్ గమ్‌ను ఇంకాస్త గట్టిగా నమిలా: సూర్యకుమార్
టీ20ల్లో టాప్ ర్యాంకర్‌గా కొనసాగడానికి తనకు పూర్తి అర్హత ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి నిరూపించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య (53: 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఔటైనప్పుడు జట్టుపై ప్రతికూల ప్రభావం పడకుండా.. సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అయితే కీలక సమయంలో కోహ్లీ ఔట్ అయినపుడు సూరీడు తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ సమయంలో బబుల్ గమ్‌ను ఇంకాస్త గట్టిగా నమిలాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. మ్యాచ్ అనంతరం బబుల్ గమ్‌ను ఎందుకు గట్టిగా నమలాల్సి వచ్చిందో సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. ‘మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తా. అందుకు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తాను. ప్రత్యర్థి బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించే సమయం అత్యంత క్లిష్టమైంది. ఆ సమయంలో దూకుడుగా ఆడాలి. అలా ఆడటం నాకిష్టం. ఈ మ్యాచ్‌లో అదే చేశా. కీలక సమయంలో విరాట్ కోహ్లీ ఔట్ అవ్వడం బాధించింది. ఆ సమయంలో టెన్షన్‌కు గురికాకుండా ఉండేందుకు బబుల్ గమ్‌ను ఇంకాస్త గట్టిగా నమిలా. దాంతో మళ్లీ నా ఆటపై దృష్టిపెట్టా’ అని సూర్య చెప్పాడు.
వరుణ్ తేజ్ ‘మట్కా’ షూటింగ్ అప్డేట్ వైరల్..
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుణ్ తేజ్ గత ఏడాది గాంధీవధారి అర్జున్ సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అలాగే ఈ ఏడాది ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు.ఈ సినిమా కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.దీనితో వరుణ్ తేజ్ ప్రస్తుతం చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు.వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మట్కా”.. ఈసినిమా ను “పలాస 1978 ” మూవీ ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రజని తాళ్లూరి , తీగల కృపాకర రెడ్డి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ,నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే నవీన్ చంద్ర,అజయ్ ఘోష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో వరుణ్ తేజ నాలుగు విభిన్న పాత్రలలో నటిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా కోసం భారీ సెట్ వేశారు. ఈ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీలో నెగటివ్ రోల్ లో ఎన్టీఆర్..?
మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాను దర్శకుడు కొరటాల ఎంతో భారీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కథ పెద్దది కావడంతో దర్శకుడు కొరటాల ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది,బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లో ప్రారంభం అవుతుందని మేకర్స్ ఇటీవల అప్డేట్ ఇచ్చారు.ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీ గా వున్నారు.ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే వెంటనే ప్రశాంత్ నీల్ మూవీ మొదలు పెట్టనున్నారు.ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో 31 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు “డ్రాగన్ ” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.డ్రాగన్ అంటే యూరోపియన్ సంస్కృతిలో చెడుకి గుర్తు.అలాగే డ్రాగన్ అంటే అలజడికి సింబాలిక్.. నిప్పును పీల్చే గుణం కూడా ఉంటుంది.దీనితో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.అయితే ఎన్టీఆర్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ నెగటివ్ రోల్ లో చూపించనున్నట్లు సమాచారం.దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.