Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7న మిజోరంలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఇక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 7, 17 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో పోలింగ్ జరగనుంది. తెలంగాణలో నవంబర్ 30న, రాజస్థాన్‌లో నవంబర్ 23న, మిజోరంలో నవంబర్ 18న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) 88 సీట్లు గెలుచుకుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణంలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 3వ తేదీన తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.. నవంబర్‌ 10వ తేదీ వరకు బరిలో నిలవాలనుకున్న అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తారు. నవంబర్‌ 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నవంబర్ 15వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నవంబర్‌ 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి.

4 కొత్త రైల్వే సర్వీసులు.. జెండా ఊపి ప్రారంభించిన కిషన్ రెడ్డి..
దక్షిణ మధ్య రైల్వే నాలుగు రైల్వే సర్వీసులను పొడిగించింది.. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కాజీపేట్, రాయచూర్, కర్నూల్ సిటీ, బోధన్ స్టేషన్లకు రైల్వే సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. కొత్త రైళ్లకు బదులు ఉన్నవాటిని పొడిగించింది రైల్వేశాఖ.. ఇక, నాలుగు కొత్త సర్వీసులను ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. పూణె – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట్ వరకు.. నాందేడ్ – తాండూరు ఎక్స్‌ప్రెస్‌ను రాయచూర్ వరకు పొడిగించారు అధికారులు.. ఇక, జైపూర్ – కాచిగూడ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూల్ సిటీ వరకు పొడిగించారు. కరీంనగర్ – నిజామాబాద్ ప్యాసింజర్ రైలును బోధన్ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోగా.. నేడు జెండా ఊపి ప్రారంభించారు కిషన్‌రెడ్డి.. ఇక, ఈ రోజు నుంచి ప్రయాణికులకు ఈ కొత్త రైల్వే సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

ప్రతినిధుల సభలో పార్టీ ప్రోటోకాల్.. వీవీఐపీ గ్యాలరీల్లో మంత్రులు..
విజయవాడలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం ప్రారంభమైంది.. నాలుగున్నర ఏళ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు సిద్ధం అయ్యారు సీఎం వైఎస్‌ జగన్‌.. 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణు­లను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారు. అయితే, ప్రతినిధుల సభలో పార్టీ ప్రోటోకాల్ పాటిస్తున్నారు.. వేదిక పై పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులకు మాత్రమే చోటు కల్పించారు.. దీంతో.. వీవీఐపీ గ్యాలరీల్లో ప్రేక్షకుల్లా కూర్చిండిపోయారు మంత్రులు బూడి ముత్యాల నాయుడు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కార్మూరి నాగేశ్వరరావు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.

చంద్రబాబుకు హైకోర్టు షాక్‌.. ముందస్తు బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదా? అన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేసింది హైకోర్టు.. అంగళ్లు కేసుతో పాటు ఇన్నర్‌ రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్‌ కేసుల్లోనూ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు.. అయితే, చంద్రబాబుకు షాక్‌ ఇస్తూ.. మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేసింది హైకోర్టు.. దీంతో.. అంగళ్ల అల్లర్ల, ఫైబర్‌ గ్రిడ్‌, ఐఆర్‌ఆర్‌ కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ ను నిరాకరించింది ఏపీ హైకోర్టు. మరోవైపు.. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది.. విజయవాడ ఏసీబీ కోర్టు కూడా బెయిల్‌ పిటిషన్ పై తీర్పు వెలువరించనుంది.. అలాగే సీఐడీ కస్టడీ పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఉత్కంఠ వీడినా.. సుప్రీంకోర్టు, ఏసీబీ కోర్టుల తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారంది.

4 కీలక కార్యక్రమాలు ప్రకటించిన వైసీపీ
విజయవాడ వేదికగా జరుగుతోన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల సభలో నాలుగు కీలక కార్యక్రమాలను ప్రకటించింది ఆ పార్టీ.. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా పేరుతో నాలుగు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.. ప్రతి సచివాలయ పరిధిలోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల దగ్గరకు వెళ్లేవిధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది వైసీపీ.. మొదటి దశలో సచివాలయ పరిధిలోని లబ్దిదారుల జాబితా ప్రదర్శించనున్నారు.. రెండో దశలో పార్టీ జెండాల ఆవిష్కరణ.. మూడో దశలో ఇంటింటి సందర్శన.. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పని తీరును పోలిస్తూ వివరించడం చేయనున్నారు.. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. ఇక, బస్సు యాత్ర కూడా చేపట్టబోతున్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చేసిన అభివృద్ధి పనులను వెల్లడించడానికి బస్సు యాత్రను ఉపయోగించుకోనున్నారు.. మూడు నెలల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగించనున్నారు. మరోవైపు.. ఆడుదాం ఆంధ్రా పేరుతో.. సచివాలయ, మండల, జిల్లా స్థాయిల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తారు.. జనవరి 17వ తేదీ వరకు ఆడుదాం ఆంధ్రా కింద క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఇక, నాలుగున్నర ఏళ్లుగా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం ఉండనుంది. సీఎం జగన్ స్వయంగా సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.. 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణు­లను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా పార్టీ ప్రతినిధుల సభలో దిశా నిర్దేశం చేస్తున్నారు..

వైసీపీ వరుస కార్యక్రమాలు.. సీఎం జగన్‌ దిశా నిర్దేశం
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో విజయం లక్ష్యంగా ముందుకు సాగుతోంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, విజయవాడలో జరిగిన వైసీపీ ప్రతినిధుల సభలో పార్టీ శ్రేణులకు చేతినిండా పని కల్పించారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌.. వరుస కార్యక్రమాలు ప్రకటించిన ఆయన.. అన్నింటిలోనూ భాగస్వామ్యం కావాలని సూచించారు. పార్టీ శ్రేణులకు వరుసగా కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించారు సీఎం జగన్‌.. జనవరి 1 నుంచి మరో మూడు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్న ఆయన.. జనవరి 1 నుంచి వృధ్ధాప్య పెన్షన్ పెంపు ఉంటుంది.. మూడు వేల రూపాయలకు పెన్షన్‌ పెరుగుతుంది.. ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్‌ పెంచుతున్నాం అన్నారు.. ఇక, పది రోజుల పాటు పెన్షన్ పెంపు సంబరాలు ఉంటాయన్న ఆయన.. గ్రామ స్థాయిలో జరిగే సంబరాల్లో మీరు అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. రెండో కార్యక్రమం వైఎస్సార్ చేయూత.. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు జరుగుతుంది.. ఐదు వేల కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లో వేస్తాం.. ఈ ఒక్క పథకం ద్వారా ఇప్పటి వరకు మహిళలకు 19 వేల కోట్లు ఇచ్చినట్లు అవుతుందన్నారు.. పది రోజుల పాటు సంబరాలు జరగాలన్నారు. మూడవ కార్యక్రమం వైఎస్సార్ ఆసరా.. జనవరి 20 నుంచి 30 వరకు వైఎస్సార్ ఆసరా అందిస్తాం.. ఇక, ఫిబ్రవరిలో మ్యానిఫెస్టోను ప్రజలకు తీసుకుని వెళ్లే కార్యక్రం ఉంటుందన్నారు.. మార్చి నెలలో ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు.

గుడ్ న్యూస్.. త్వరలో మన దేశంలోనే బంగారం గని ప్రారంభం
భారతదేశంలో బంగారం వినియోగానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం సామాన్యులు వేల టన్నుల బంగారాన్ని కొంటారు. ఈ భారీ డిమాండ్‌ను తీర్చడానికి భారత్ బయటి నుండి బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి. ఇప్పుడు త్వరలో ఈ పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించవచ్చు. దేశంలోనే బంగారం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. దేశంలోనే తొలి ప్రైవేట్‌ గోల్డ్‌ మైన్‌ త్వరలో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. భారతదేశంలోని మొట్టమొదటి పెద్ద బంగారు గనిలో ఉత్పత్తి వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ 2024 నాటికి జోనగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌లో పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించవచ్చని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఆపరేషన్‌ కొనసాగుతోంది. జోనగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే.. ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారం అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు రూ.200 కోట్ల మేర ఈ గనిలో పెట్టుబడులు పెట్టగా ప్రస్తుతం అక్కడ నెలకు సుమారు కిలో బంగారం ఉత్పత్తి అవుతోంది. గనిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ ఆకాంక్షించారు.

ఓయో నుంచి టాటా వరకు ఐపీవోకు 28 కంపెనీలు.. రూ. 38000 కోట్లు సమీకరించే ప్లాన్
ఈ ఏడాది ఐపీవోల జోరు నడుస్తోంది. ఈ కారణంగా భారత స్టాక్ మార్కెట్ హాట్ హాట్ గా ఉంది. చిన్న నుంచి పెద్ద కంపెనీలు తమ ఐపీఓలను ప్రారంభించాయి. ఇప్పటివరకు 2024 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రికార్డు స్థాయిలో 31 ఐపీవోలు అమ్మకానికి వచ్చాయి. ఇది కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో 28 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. 28 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.38 వేల కోట్లు సమీకరించనున్నాయని అంచనా. ఇది కాకుండా 41 కంపెనీలు రూ. 44 వేల కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌ను ప్రారంభించేందుకు సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రానున్న IPOలలో Oyo, Tata Technologies, JNK ఇండియా, డోమ్ ఇండస్ట్రీస్, APJ సురేంద్ర పార్క్ హోటల్స్, Epack Durables, BLS e-Services, India Shelter Finance Corporation, Cello World, RK స్వామి, ఫ్లెయిర్ రైటింగ్ ఉన్నాయి. పరిశ్రమలు.. గో డిజిట్ ఇన్సూరెన్స్ వంటి ప్రముఖ కంపెనీలు స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాయి. ప్రైమ్ డేటాబేస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ హల్దియా మాట్లాడుతూ.. భారతీయ స్టాక్ మార్కెట్‌లలోకి ప్రవేశించాలని యోచిస్తున్న మొత్తం కంపెనీలలో మూడు కొత్త-యుగం టెక్నాలజీ కంపెనీలు సమిష్టిగా 12 వేల కోట్ల రూపాయలను సమీకరించాలని యోచిస్తున్నాయని చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతుండగా.. రానున్న అంతరాయానికి ముందే అనేక IPOలు ప్రారంభించబడే అవకాశం ఉంది.

‘యాత్ర 2’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర 2’. ఈ సినిమాకు మహీవీ రాఘవ్ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్‌. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. వైఎస్సార్ పాత్రలో మలయాళ ‘సూపర్ స్టార్’ మమ్ముట్టి జీవించారు. ఇక యాత్ర 2లో కోలీవుడ్ స్టార్ జీవా.. వైఎస్ జగన్ పాత్రలో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా యాత్ర 2 నుంచి మేకర్స్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేశారు. యాత్ర 2 ఫ‌స్ట్ లుక్‌ను ఈరోజు ఉద‌యం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌లో ఒక‌వైపు జీవా ఉండ‌గా.. మ‌రోవైపు మమ్ముట్టి ఉన్నాడు. మ‌మ్ముట్టి, జీవా ఇన్‌టెన్స్ లుక్స్‌తో క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్‌లో ‘నేనెవ‌రో ఈ ప్ర‌పంచానికి ఇంకా తెలియ‌కపోవ‌చ్చు కానీ ఒక్క‌టి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్.రాజశేఖర్‌ రెడ్డి కొడుకుని’ అంటూ పోస్ట‌ర్‌లో రాసుకోచ్చారు. ఫ‌స్ట్ లుక్‌తో పాటు మేక‌ర్స్ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు. యాత్ర 2 సినిమా 2024 ఫిబ్రవరి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఓటీటీ లోకి రాబోతున్న మార్క్ ఆంటోనీ.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే…?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ మూవీ..సెప్టెంబర్ 15 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజైన ఈ మూవీ కోలీవుడ్‌ లో పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది. వంద కోట్ల వసూళ్లను రాబట్టి విశాల్ కెరీర్‌ లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. తెలుగు లో మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో మార్క్‌, ఆంటోనీ గా రెండు పాత్రల్లో విశాల్ కనిపించి మెప్పించాడు.. అతడి నటన తో పాటు లుక్స్ విషయంలో విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.టైమ్ ట్రావెల్ కాన్సెస్ట్‌ తో రూపొందిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్‌తో పాటు ఎస్‌జే సూర్య, సునీల్‌, రీతూ వర్మ మరియు అభినయ ముఖ్య పాత్రలు పోషించారు.అయితే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడన్నది క్లారిటీ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అక్టోబర్ 13 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే..మార్క్ (విశాల్‌) తండ్రి ఆంటోనీ ఓ గ్యాంగ్‌స్టర్‌. ఓ గొడవల్లో అతను చనిపోతాడు. తండ్రి కారణంగా మార్క్ ఎన్నో ఇబ్బందులు పడుతోంటాడు. తండ్రిపై ద్వేషంతో రగిలిపోయే అతడికి ఓ టైమ్ ట్రావెల్‌ ఫోన్ ద్వారా గతంలోకి వెళ్లి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వస్తుంది.. అయితే ఆ తర్వాత ఏమైంది.. తన తండ్రిని మార్క్ కలుసుకున్నాడా..తండ్రి విషయంలో తాను చేసిన తప్పును మార్క్ ఎలా సరిదిద్దుకున్నాడన్నదే ఈ సినిమా కథ. 1975 మరియు 1995 బ్యాక్‌డ్రాప్‌లలో ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్‌. తెలుగు మరియు తమిళంలో రిలీజైన ఈ మూవీ హిందీలో మాత్రం సెన్సార్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొనింది.. మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ సెన్సార్ కోసం ఆరున్నర లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఇటీవల విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

దసరా దావత్ షురూ.. ఓరుగల్లు గడ్డపై బాలయ్యబాబుకు తలకాయ కూర!
నందమూరి బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌ జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్‌ కేసరి’. బాలీవుడ్ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో యువ హీరోయిన్ శ్రీలీల ముఖ్యభూమిక పోషించారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా భగవంత్‌ కేసరి ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి హనుమకొండలో జరిగింది. ఈ కార్యక్రమంలో కమెడియన్, ఓరుగల్లు బిడ్డ ‘రచ్చ రవి’ రచ్చ రచ్చ చేశాడు. భగవంత్‌ కేసరి ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో రచ్చ రవి మాట్లాడుతూ… ‘భగవంత్‌ కేసరి సినిమాలో అవకాశం ఇచ్చిన అన్నయ్య అనిల్‌ రావిపూడి గారికి ధన్యవాదాలు. బాలయ్యబాబు గారితో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓరుగల్లు గడ్డపై అందరిని ఇలా చూసినందుకు ఆనందంగా ఉంది’ అని చెప్పాడు. అప్పటివరకు రచ్చ రవి చాలా నెమ్మదిగా మాట్లాడగా.. యాంకర్ రవి ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. బాలయ్యబాబు ఉన్నందుకు బయపడి మాట్లాడుతున్నావ్ రచ్చ అని రవి అనగా.. మా డైరెక్టర్ ఓవర్ చేయకుండా, కంటెంట్ మాత్రమే మాట్లాడాలని చెప్పాడని ఆయన బదులిచ్చాడు. ఆపై రచ్చ రవి ‘రచ్చ’ మొదలైంది. ‘నా ఓరుగల్లు ముద్దుబిడ్డలారా.. ఈ గడ్డ మీదనే పుట్టినా. నేను ఎందరో రాజుల గురించి విన్నా కానీ కళ్లారా చూడలే. సినిమా అనే నా ప్రపంచంలో ఓ రాజును చూసిన. రాజంటే రాజ్యమున్నోడు కాదు, బలగామున్నోడు కాదు.. రాజంటే ఓ దైర్యం ఇచ్చేటోడు. సినిమా పరిశ్రమలో నిర్మాతలకు ధైర్యాన్ని ఇస్తాడు. పాలనా రోజు ఈ సినిమా రిలీజ్ పక్కా అనే నమ్మకం ఇస్తడు. బాలయ్యబాబు సినిమా చేసినం.. పైసలు బీరువాట్లో ఉన్నట్లే. బాలయ్యబాబు గారు.. మీరు చిన్ని కృషుని లెక్కనే’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Exit mobile version