నెల్లూరులో ఆసక్తికర పరిణామం.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల భేటీ..
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే పొత్తులు, ఎత్తులపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి.. అయితే, ఈ రోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి.. కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి.. మహీధర్ రెడ్డిలతో సమావేశం అయ్యారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. రాష్ట్రంలో, జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నెల్లూరులోని పది స్థానాలనూ గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మాధురిగానే.. పది అసెంబ్లీ.. రెండు లోక్ సభ స్థానాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు కలిసికట్టుగా పనిచేస్తాం అన్నారు. నేతల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉన్నాయి.. కానీ, అందరూ కూర్చుని మాట్లాడుకుని ఒక తాటిపై ఉంటాం.. వచ్చే వంద రోజుల్లో మరింత చురుగ్గా వ్యవహరిస్తాం.. వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తామన్నారు మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. అయితే, నెల్లూరు జిల్లా రాజీకాయాల్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేల భేటీ ఆసక్తికరంగా మారింది.. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిలతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విడివిడిగా సమావేశం అయ్యారు. అనిల్ కుమార్ తో పాటు మరో రెండు నియోజకవర్గాల్లో నేతల మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.. ఇక, నెల్లూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ముగ్గురిని మార్చాలని అధిష్టానానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు.. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో అనిల్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీలో ఎన్నికలపైనే మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది.. మరోవైపు, మూడు రోజుల్లో ఎన్నికల్లో టికెట్ల పై ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చర్చించనున్నారు.
వైసీపీకి మరో షాక్.. టీడీపీలో చేరనున్న జగ్గంపేట ఎమ్మెల్యే..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పు వ్యవహారం రచ్చగా మారుతోంది.. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావని తెలిసిన నేతలు.. పక్క చూపులు చూస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లే.. సీటుపై ఓ మాట తీసుకుని.. సమయం చూసి జంప్ అవుతున్నారు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. ఇప్పటికే టీడీపీ పెద్దలతో చర్చలు పూర్తి అయినట్టు ప్రచారం సాగుతోంది.. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుపున జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు చంటిబాబు.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గా చంటిబాబును నియమించారు.. ఇక, జ్యోతుల నెహ్రూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి రావడంతో.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు చంటిబాబు.. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి జగ్గంపేట స్థానంలో పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎవరి సీటు గ్యారంటీ లేదు అనే చర్చ సాగుతోంది.. అంతేకాదు.. జగ్గంపేట వైసీపీ టికెట్ జ్యోతుల చంటిబాబుకు ఇచ్చే పరిస్థితి లేదని క్లారిటీ కూడా వచ్చిందంట.. దీంతో.. మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారట.. అయితే, జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు సమీప బంధువులు.. ఎమ్మెల్యేగా ఉంటే తానుండాలి, లేదంటే తన కుటుంబానికి చెందిన వారు ఉండాలి.. కానీ, బయటి వారికి ఎలా మద్దతిస్తామని అనుచరులతో చంటిబాబు వ్యాఖ్యానించినట్టు ప్రచారం సాగుతోంది.. జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వలేమని టీడీపీ తేల్చిచెప్పినప్పటికీ.. ప్రత్యామ్నాయంగా వేరే చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంటిబాబు కోరుతున్నారట.. ఉన్న అవకాశాలను బట్టి పరిశీలిస్తామని టీడీపీ అధిష్టానం చెప్పినట్టు తెలుస్తోంది.. దీంతో.. వచ్చే ఏడాది.. అంటే జనవరి 5 లేదా 6 తేదీల్లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పసుపు పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ఆయన అనుచరులు.
వైసీపీతో బీజేపీ పొత్తు..! క్లారిటీ ఇచ్చిన జాతీయ కార్యదర్శి సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు, లోక్‌సభ ఎన్నికలకు సమయం పడుతోన్న సమయంలో.. పొత్తులపై కీలకంగా చర్చలు సాగుతున్నాయి.. ఇప్పటికే.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించగా.. ఇండియా కూటమిగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలో కూడా మరోవైపు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. అయితే, కేంద్రానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తూ వస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? అనే చర్చ కూడా సాగుతోంది.. అయితే, దీనిపై క్లారిటీ ఇస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అవినీతిలో కురుకుపోయిన పార్టీ వైసీపీ… అవినీతి పార్టీలతో బీజేపీ ఎలాంటి పొత్తు పెట్టుకోదు అని స్పష్టం చేశారు.. అయినా.. పొత్తుల అంశం కేంద్రం పార్టీ నాయకత్వం చూసుకుంటుందన్నారు సత్యకుమార్. ఇక, ప్రజలను హింసిస్తున్న సీఎం జగన్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ సెటైర్లు వేశారు సత్యకుమార్.. ఏపీలో సంక్షేమం పేరుతో గాలి మాటలతో పరిపాలన జరుగుతుంది.. గుంతల రోడ్లపై మట్టి పోసిన పాపాన పోలేదు.. తప్పుడు పనులకు మాత్రం ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతుంటే.. మంత్రులు ట్వీట్ లకే పరిమితం అయ్యారు.. చెల్లికి పెళ్ళి.. మళ్ళీ మళ్ళీ అన్నట్లు.. చెప్పిందే చెప్పడం. చేసిందే చేస్తున్నారని దుయ్యబట్టారు. క్రీడా స్థలాలు, స్టేడియాలు అభివృద్ధి చేయకుండా.. ఆడుదాం ఆంధ్రా అని మోసం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బయటకు వస్తే.. ప్రజలు మీతో ఫుట్ బాల్ ఆడుకోడానికి రెడీగా ఉన్నారన్న ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలతో ఫుట్ బాల్, ఉద్యోగులతో కబడ్డీ, యువతతో క్రికెట్ ఆడుతుందన్నారు. ఓట్ల విషయంలో జగన్ ప్రభుత్వ మోచేతి నీళ్లుతాగే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు. మరోవైపు.. కేంద్రం సహకరించకపోతే.. ఏపీ సంకనాకి పోతుంది అంటూ హాట్ కామెంట్లు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్.
హరిరామ జోగయ్య పేరుతో ఫేక్ లెటర్ హల్‌చల్.. అసలు లేఖ ఇదే
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.. అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఆయన పేరుతో ఓ లేఖ హల్ చల్ చేస్తోంది.. దాని ప్రకారం.. పవన్ నిర్ణయాన్ని జోగయ్య తప్పుబట్టారు.. అంతేకాదు.. ప్యాకేజీ ఆరోపణలు నిజమే అనిపిస్తుందంటూ.. ఆ లేఖలో రాసుకొచ్చారు.. నిజం నిద్రలేచే సరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది అన్నట్టుగా.. ఆ ప్రకటన నేను చేయలేదు.. అది ఫేక్ అంటూ తాజాగా మరో లేఖను విడుదల చేయాల్సి వచ్చింది. మాజీమంత్రి హరిరామ జోగ్యయ్య పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ లెటర్ హల్ చల్ చేస్తోంది. కాపు సామాజికవర్గానికి పవన్ కల్యాణ్ ఏదో చేస్తాడని ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చాం.. కానీ, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రతిపక్షాలు చేస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమనిపిస్తున్నాయి అంటూ ఆలేఖ సారాంశంగా ఉంది.. అయితే, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లేఖ తన నుంచి వచ్చింది కాదని మాజీ మంత్రి హరిరామ జోగయ్య స్పష్టం చేస్తూ మరో లేఖ విడుదల చేశారు. టీడీపీ-జనసేన మైత్రిని దెబ్బతీసే విధంగా వైసీపీ సానుభూతి పరులు ‘కాపు సామాజిక వర్గానికి ఒకవిన్నపం’ అంటూ నా పేరుతో ఫేక్ లెటర్ విడదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జోగయ్య.. దీన్ని జనసైనికులు గమనించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ముఖ్యమైన గమనిక అంటూ లేఖ విడుదల చేశారు.. చీప్ ట్రిక్స్ కి పాల్పడుతూ వైసీపీ వారి ట్రాప్ లో పడకుండా తప్పుడు వార్తలను నమ్మకుండా పవన్ కళ్యాణ్ సియం పీఠం అధిష్టించేవరకు అంతా ఆయన వెంట ఉండాలని లేఖలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు.
రోడ్డు ప్రమాద ఘటనలపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియా చెల్లించాలని..!
నల్గొండ జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాల ఘటనలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కేసీఆర్ కోరారు. అలానే మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. నల్లొండ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. పెద్దవూర మండలం నిమ్మానాయక్ తండాకు చెందిన రమావత్ కేశవులు (28) ఆదివారం రాత్రి బైక్‌పై మిర్యాలగూడ నుంచి వస్తూ సైదులు (55) అనే వ్యక్తిని ఢీ కొట్టాడు. వేంపాడు సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న కేశవులు కుటుంబ సభ్యులు ఏడుగురు సోమవారం తెల్లవారుజామున టాటా ఏస్ వాహనంలో ఘటనాస్థలికి బయల్దేరారు. టాటా ఏస్ వాహనాన్ని ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గన్యా (40), నాగరాజు (28), పాండ్య (40), బుజ్జి (38) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ముగ్గురిలో ఒకరు చనిపోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కోట్లాది ఇళ్లు నిర్మించారు.. కుగ్రామాలకు రోడ్లు వేసిన ఘనత వాజ్‌పేయిది: కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాజ్‌పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నివాళులర్పించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అటల్ బిహారి వాజపేయి విశిష్ట సేవలు దేశానికి అందించారన్నారు. కోట్లాది ఇల్లు నిర్మించారని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కుగ్రామలకు రోడ్లు వేసిన ఘనత ఆయనదని ప్రశంసించారు.
న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందే.. సన్ బర్న్‌కు అనుమతులు ఇవ్వలేదు!
న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్పష్టం చేశారు. సన్ బర్న్ పార్టీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఇప్పటివరకు సన్ బర్న్ ఈవెంట్ కోసం ఎలాంటి దరఖాస్తులు తమకు అందలేదని తెలిపారు. ఆదివారం సెక్రటేరియట్‌లో జరిగిన మీటింగ్‌లో సన్ బర్న్ లాంటి ఈవెంట్స్‌పై చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నగర పోలీసులను ఆదేశించారు. దాంతో సిటీలో ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్‌పై పోలీసులు ఫోకస్ చేశారు. గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ఏరియాల్లో గతంలో సన్ బర్న్ ఈవెంట్స్ జరిగాయి. ఈ ఈవెంట్స్‌లో డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్‌పై పోలీసులు ఫోకస్ చేశారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ… ‘ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు సన్ బర్న్ ఈవెంట్స్‌కి ఆన్‌లైన్‌లో టికెట్స్ ఉన్నాయని తెలిసింది. సన్ బర్న్ పార్టీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. సన్ బర్న్ ఈవెంట్ కోసం ఎలాంటి దరఖాస్తు రాలేదు. అనుమతి తీసుకోకుండా ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటాం. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించాం. న్యూ ఇయర్ ఈవెంట్స్ కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందే’ అని స్పష్టం చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. అడవిలోకి తీసుకెళ్లి యువతిపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 11వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినితో ముగ్గురు యువకులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్రెండ్షిప్ చేసి ఆమెను కిడ్నాప్ చేశారు. నిందితులు విద్యార్థినిని అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఇద్దరు నిందితులు ఆమెను మహారాష్ట్రకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై 3 రోజుల పాటు అత్యాచారం చేశారు. మహారాష్ట్ర నుంచి బస్సులో విద్యార్థినిని ఇంటికి పంపించారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని కుటుంబసభ్యులకు తెలియజేసింది. వాస్తవానికి 16 ఏళ్ల విద్యార్థి గత మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. పోలీసులు అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం బాలిక ఇంటికి చేరుకోగా ఘటన వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్‌కు గురైన విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. ముగ్గురు అబ్బాయిలు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. దీంతో కుటుంబసభ్యులు తమ కుమార్తెతో కలిసి ముండి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులపై ఎక్కడ ఫిర్యాదు చేశారు.
పాకిస్తాన్‌లో మరొక టెర్రరిస్ట్ ఖతం.. ఈ సారి మాత్రం చంపే స్టైల్ మారింది..
పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు బయలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. టెర్రరిస్టులకు స్వర్గధామంగా ఉన్న పాక్‌లో జిహాదీలు భయపడి చస్తున్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చి చంపేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి, అత్యంత సమీపం నుంచి చంపిపారిపోవడం అక్కడ నిత్యకృత్యంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ జీహాదీ గురవును గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. లష్కరేతోయిబా ఉగ్ర సంస్థకు చెందిన అబ్దుల్లా షాహీన్ అనే ఉగ్రవాదిని కసూర్‌లో వాహనంతో ఢీకొట్టించి చంపారు. అయితే ఈసారి మాత్రం గుర్తు తెలియని వ్యక్తుల హత్యా విధానం మారింది. గతంలో కాకుండా, వాహనంతో ఢీకొట్టి చంపారు. ఇదిలా ఉంటే యథావిధిగా నిందితులు ఎవరో అక్కడి అధికారులకు అంతుబట్టడం లేదు. ఇది కేవలం ప్రమాదామా..? ఉద్దేశపూర్వక చర్చనా..? అని విచారిస్తున్నారు. అబ్దుల్లా షాహీన్ భారత్‌కి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్నాడు. పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు 15 మందికి పైగా కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఇది ఎవరి చర్య అనేది అంతుబట్టడం లేదు. అయితే కొంతమంది ప్రకారం.. ఇది పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పనే అని చెబుతుంటే.. మరికొందరు ఈ హత్యల్లో భారత్ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు.
ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహమ్‌లో “నో క్రిస్‌మస్”.. కారణం ఏంటంటే..?
ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. కానీ ఏసు క్రీస్తు పుట్టిన బెత్లెహమ్‌లో మాత్రం ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. సాధారణంగా ప్రతీ ఏడాది క్రిస్మస్ పండగ రోజు బెత్లెహమ్ క్రీస్తు ఆరాధకులతో ఎంతో రద్దీగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం అక్కడి నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. హోటళ్లు, రెస్టారెంట్లు వ్యాపారం అంతా నిలిచింది. ఏసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహమ్‌లో క్రిస్మస్ వేడుకలను ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావితం చేసింది. ఇజ్రాయిల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో ఉన్న ఈ పట్టణం నిర్జనంగా మారిపోయింది. ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేంకి దక్షిణంగా ఉన్న బెత్లెహమ్‌లోనే క్రీస్తు పుట్టినట్లు అంతా భావిస్తారు. అయితే అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి కారణంగా, ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం నెలకొంది. దీంతో గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్‌లోని హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పోరు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది అక్కడి క్రిస్మస్ వేడుకలు జరగడం లేదు. ప్రజలు ఎవరూ రావడం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. తమ జీవితంలో ఇప్పటి వరకు ఇంత చెత్త క్రిస్మస్ పండగను ఎప్పుడూ చూడలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
క్రిస్మస్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. మహేష్ కూల్ లుక్ అదిరిందిగా..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కుతుండటంతో సినిమా పై భారీ హైప్ ఏర్పడింది.వీరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలే రాగా తాజాగా గుంటూరు కారం మూవీ మూడో సినిమాగా తెరకెక్కింది. వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కుతుంది అని తెలియగానే ఏ వివరాలు తెలియకపోయినా.. మూవీపై అంచనాలు పెంచేసుకున్నారు అభిమానులు. అప్పటినుంచి వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విడుదలయిన ప్రతీ పోస్టర్లో మహేష్ ను మాస్ లుక్ లో చూపించాడు త్రివిక్రమ్. కానీ మొదటిసారి క్రిస్మస్ స్పెషల్ పోస్టర్లో మాస్ కాకుండా క్లాస్ మహేశ్ బాబును చూపించాడు.‘గుంటూరు కారం’ అనే టైటిల్లోనే చాలా మాస్ ఉంది. దానికి తగినట్టుగా.. ఈ సినిమాలో నుండి మహేష్ ఫస్ట్ లుక్ ను రెడ్ షర్ట్, బీడీతో రిలీజ్ చేశాడు. ‘ఒక్కడు’ తర్వాత మహేశ్ బాబు సిగరెట్, బీడీ తాగుతూ ఎప్పుడూ కనిపించలేదని ఫ్యాన్స్ గుర్తుచేసుకున్నారు. కేవలం ఆ పోస్టర్లోనే కాదు.. అప్పటినుండి విడుదలవుతున్న ప్రతీ పోస్టర్లో కూడా మహేష్ బీడీతోనే కనిపించాడు. కానీ క్రిస్మస్ పోస్టర్లో మహేశ్ చేతిలో బీడీ లేదు. బ్లాక్ షర్ట్లో క్లాస్ లుక్ తో,సింపుల్ స్మైల్ తో చాలా కూల్ గా కనిపించాడు. మహేష్ లేడీ ఫ్యాన్స్ అయితే ఈ పోస్టర్ ని చూసి ‘ఓ మై బేబీ’ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే ఇప్పటికే ‘గుంటూరు కారం’ సినిమా నుండి రెండు పాటలు విడుదలయ్యాయి. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి మొదటి ‘దమ్ మసాలా’ పాట విడుదలయ్యింది. మహేశ్ మాస్ కటౌట్ కీ సరిపోయేలా ఉన్న ఈ పాట వెంటనే మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఇంప్రెస్ చేసేసింది. ఆ తర్వాత ఒక క్యూట్ పాటను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇది మూవీలో హీరోయిన్గా నటిస్తున్న శ్రీలీల.. మహేశ్ కోసం పాడే పాట. ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాటకు ముందుగా ఆడియన్స్ నుండి అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. కానీ మెల్లగా ఇది మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. దీంతో ‘ఓ మై బేబీ’ పాటకు యూట్యూబ్లో మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చేస్తున్నాయి.గుంటూరు కారం మూవీ 2024 జనవరి 12న విడుదల కానుందని తాజాగా రిలీజ్ చేసిన క్రిస్మస్ స్పెషల్ పోస్టర్ తో మరోసారి క్లారిటీ మేకర్స్ ఇచ్చారు.
