గడప గడపకు లక్ష్యం అదే..
గడప గడపకు కార్యక్రమం అంటే ప్రజల దగ్గరకు వెళ్లడమేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మూడేళ్లలో ఆయా కుటుంబాల్లో వచ్చిన మార్పులు వివరించడం కోసమే గడప గడపకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలది పెద్ద పాత్ర అంటూ తెలిపారు. ఇది కాలేజీ కాదు అందరూ నాయకులే.. సీఎం జగన్ ఎవరి మీదో సీరియస్ అయ్యారు అని నెగెటివ్‌గా చూడాల్సిన అవసరం లేదన్నారు. చేసే పని శ్రద్ధగా చెయ్యమని సీఎం జగన్ చెప్తారన్నారు.
బంగ్లా లక్ష్యం 513
ఛట్టోగ్రామ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు భారత్ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 60 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(110), టెస్ట్ స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పుజారా(102*) సెంచరీలు సాధించారు. శుభమన్ గిల్‌కు ఇది తొలి సెంచరీ కాగా.. పుజారా నాలుగేళ్ల అనంతరం శతకం బాదాడు. కేఎల్ రాహుల్ 23, విరాట్ కోహ్లీ 19* పరుగులు చేశారు. అంతకముందు టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ముష్పికర్ రహీమ్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీయగా.. సిరాజ్ 3, ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్‌లు చెరొక వికెట్ తీశారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. లక్ష్యం 500 పరుగులకు పైగా ఉండడంతో, బంగ్లాదేశ్ ఏదైనా అద్భుతం చేస్తే తప్ప ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఆటకు మరో రెండ్రోజుల సమయం ఉండడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు 200 ఓవర్లు ఆడేది అనుమానమే
వావ్.. 15 కొత్త అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు.. జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రతిభ
దేశంలోనే అతిచిన్న వయస్సున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ (PJTSAU) నాలుగు పంటలలో 15 కొత్త అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. వీటిలో వరి పంటలో 10 కొత్త విత్తన రకాలు, నువ్వులు, మేత బజ్రాలో రెండు, నల్లరేగడిలో ఒకటి ఉన్నాయి. ఈ కొత్త విత్తన రకాలను శుక్రవారం ఇక్కడ PJTSAU వైస్ ఛాన్సలర్, వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖ APC & సెక్రటరీ, M రఘునందన్ రావు విడుదల చేశారు. ఈ సంవత్సరం, విశ్వవిద్యాలయం మూడు పంటలలో అభివృద్ధి చేసిన ఎనిమిది విత్తన రకాలు (వరిలో ఐదు, మేత బజ్రాలో రెండు, నువ్వులలో ఒకటి) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సాగు చేయడానికి సెంట్రల్ వెరైటీ విడుదల కమిటీ ద్వారా ఆమోదించబడి విడుదల చేయబడింది. మరొకటి, మూడు పంటలలో ఏడు విత్తన రకాలు (వరిలో ఐదు, నల్ల శనగ, నువ్వులలో ఒక్కొక్కటి) రాష్ట్ర వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా విడుదల చేయడానికి అంగీకరించబడింది. అధిక హెడ్ రైస్ రికవరీ, విభిన్న బయోటిక్, లవణీయతకు నిరోధకత, మంచి వంట నాణ్యతతో కూడిన సూపర్ ఫైన్ ధాన్యం కొత్తగా విడుదల చేసిన ఈ వరి రకాల్లోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు. ఇంకా, వరిలో సుగంధ ధాన్యం, అధిక దిగుబడి, తక్కువ ఎత్తు కలిగిన రకం.. వరి-3 ప్రసిద్ధ స్థానిక రకం చిట్టిముత్యాలు వంటి లక్షణాలను కలిగి ఉంది. వివిధ పంటలపై విస్తృతంగా పరిశోధనలు చేపట్టిన వర్సిటీ గత ఏడేళ్లలో 15 రకాల పంటల్లో 61 విత్తన రకాలను అభివృద్ధి చేసి విడుదల చేసింది. ఈ విత్తన రకాల్లో 26 వరి పంటలో ఉన్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక అంశాలు వెలుగులోకి
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ లో స్కాం కుట్ర తదితర అంశాలను బయటపెట్టింది. సీబీఐ ఆరోపించిన అభియోగాలను కోర్టు ఆమోదించింది. ముడుపులు నగదు రూపంలో హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించింది. అభిషేక్ బోయిన్‌పల్లి 20 నుంచి 30 కోట్ల రూపాయల నగదును హవాలా మార్గంలో తరలించినట్లు ఛార్జిషీటులో వెల్లడించింది సీబీఐ. ఆ డబ్బంతా అడ్వాన్స్‌గా 2021 జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో ముట్టజెప్పినట్లుగా సీబీఐ పేర్కొంది. రూ.30 కోట్లను దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు అందజేసినట్లు తెలిపింది. దక్షిణాది ప్రాంతానికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి వ్యవహారం నడిపినట్లు తెలిపింది.
శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనువాసులు రెడ్డి సౌత్ గ్రూప్‌ను కంట్రోల్ చేశారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. సీఐబీ దాఖలు చేసిన తొలి ఛార్జిషీటును ఆమోదించి నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో కీలక అంశాలను ప్రస్తావించింది. మద్యం ఉత్పత్తిదారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఏ ఇద్దరి మధ్య ఎక్కడా గుత్తాధిపత్యం కానీ సమూహాలకు కానీ లబ్ధిచేకూర్చకూడదనే విధానాన్ని రూపకల్పన చేసినట్లుగా తెలిపింది. మద్యం పాలసీ రూపకూల్పన జరుగుతున్న సమయంలోనే నిందితులు కుట్రకు పాల్పడినట్లు తేటతెల్లచేసింది. 2021 జులై, సెప్టెంబర్ మధ్యలో రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్‌పల్లి.. దినేష్ అరోరాకు అందజేశారని తెలిపింది. మొత్తం నగదును విజయ్ నాయర్‌కు అందజేసినట్లుగా స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యులను ప్రభావితం చేసేందుకు హోల్‌సేల్ దారులకు 12 శాతం లాభాలు ఆర్జించేలా అందులో తిరిగి 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారని పేర్కొంది.
అవతార్ నచ్చలేదని చెప్తే ఊరుకోరు.. పవన్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఎట్టకేలకు అవతార్ 2 థియేటర్ లో సందడి చేసింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించాడు. అవతార్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా కూడా మొదటి నుంచి పాజిటివ్ టాక్ తోనే ముందుకు వెళ్తోంది. అభిమానులతో పాటు ప్రముఖులు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి అవతార్ విజువల్ వండర్ అని, సూపర్ అని, అద్భుతమని చెప్పుకొస్తున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ట్వీట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సూర్యదేవర నాగవంశీ.. టాలీవుడ్ కుర్ర నిర్మాత.. భీమ్లా నాయక్, డీజే టిల్లు లాంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న నాగ వంశీ ప్రస్తుతం మహేష్- త్రివిక్రమ్ కాంబో తెరకెక్కిస్తున్న చిత్రంని నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా ఈయన అవతార్ 2 రివ్యూ చెప్పుకొచ్చాడు. “జేమ్స్ కామెరూన్ లాంటి వాడు తీసాడు కనుక.. సినిమా ఎలా ఉన్నా ఒక మెరిన్ బయోలజీ డాక్యూమెంటరీ తీసినా అది ఒక అద్భుతమని, విజువల్ వండర్ అని పొగిడి తీరాలి.. ఇంకేమి చెప్పినా నావీ ఊరుకోదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అవతార్ 2 సినిమా తనకు నచ్చలేదని కొంచెం పోష్ గా చెప్పుకొచ్చాడు. ఇక దీంతో అవతార్ ఫ్యాన్స్ అసెంబెల్ అయ్యారు. మీరు తీసే చెత్త సినిమాల కంటే ఈ సినిమా బావుందని కొందరు.. హీరో హీరోయిన్ల ముద్దులు.. హీరో ఎలివేషన్స్ కాకుండా ఇలాంటి విజువల్స్ తో సినిమా తీసి అప్పుడు చెప్పండి అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
8 ఏళ్ళ తరువాత తండ్రి కాబోతున్న విజయ్ డైరెక్టర్..
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తమ ఇంట చిన్నారి రాబోతున్నట్లు తెలిపాడు. అట్లీ భార్య ప్రియ ప్రెగ్నెంట్ గా ఉంది. 2013 లో రాజారాణి సినిమాతో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఇక రాజారాణిలో సహాయ నటిగా నటించిన ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ జంట పెళ్ళైన ఎనిమిదేళ్ల తరువాత ఈ శుభవార్తను చెప్పుకొచ్చింది. బేబీ బంప్ తో ఉన్న భార్యతో అట్లీ నవ్వులు చిందిస్తూ ఉన్నఫోటోను షేర్ చేస్తూ తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో అట్లీ అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇకపోతే అట్లీ రాజారాణి తరువాత స్టార్ హీరో విజయ్ తో మూడు సినిమాలు తీసి మూడు హిట్లు అందుకున్నాడు. పోలీసోడు, బిగిల్, అదిరింది.. సినిమాలతో అట్లీ, విజయ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం అట్లీ.. జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. షారుఖ్ ఖాన్, నయన్ తార జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. మరి ఈ సినిమాతో అట్లీ బాలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్.. యుద్ధంపై సంభాషణ
భారత్, రష్యా మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరు నేతలు రెండు దేశాల దౌత్య సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంభాషించినట్లు పీఎంఓ తెలిపింది. ఉక్రెయిన్ తో యుద్ధంలో దౌత్యమే ఏకైక మార్గమని ప్రధాని మోదీ పుతిన్ కు పునరుద్ఘాటించారని వెల్లడించింది. పుతిన్, మోదీతో మాట్లాడినట్లు క్రెమ్లిన్ వర్గాలు కూడా ధృవీకరించాయి.
స్త్రీ-పురుషులు కలిసి కూర్చోవడం, ఫోటోగ్రఫీపై జామియా మసీద్ నిషేధం
ప్రసిద్ద శ్రీనగర్ జామియా మసీదు నిర్వాహకులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మసీదులో ఫోటోగ్రఫీతో పాటు స్త్రీ-పురుషులు కలిసి కూర్చోవడంపై నిషేధం విధించింది. దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది. అంజుమన్ ఆక్వాఫ్ సెంట్రల్ జామియా మీసీదు పేరుతో ఈ ఆదేశాలు జారీ చేసింది. స్త్రీ-పురుషులు మసీదు బయట లాన్ లో పచ్చిక బయళ్లలో కూర్చోవడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఫోటోగ్రాఫర్లు, కెమెరా పర్సన్లు మసీదు లోపల ఎలాంటి ఫోటోలు తీయకూడదని తెలిపింది. ఫోటోలు, వీడియో పరికరాలను మసీదులోకి అనుమతించమని.. గేట్ వద్దే ఆపేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పెరట్లో పాములు పెంచితే పొరుగువారినే కాదు.. వారిని కూడా కాటేస్తాయి : విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్
ప్రపంచం ముందు భారతదేశాన్ని దోషిగా నిలబెట్టాలని దాయాది దేశం పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ మాత్రం ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశాలకు హాజరైన జైశంకర్ ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. ఇటీవల పాకిస్తాన్ విదేశాంగ సహాయమంత్రి హీనారబ్బానీ ఖర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘ ఉగ్రవాదాన్ని భారత్ కన్నా మెరుగ్గా ఏ దేశం వాడుకోలేదు’’అంటూ పచ్చి ప్రేలాపనలు చేసింది హీనా రబ్బానీ.
ఈ వ్యాఖ్యలపై జర్నలిస్టులు ప్రశ్నించగా.. జైశంకర్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. ప్రపంచం ఏం పిచ్చిది కాదు.. ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రంగా ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ ఘాటుగా బదులిచ్చారు. గతంలో హిల్లరీ క్లింటన్ గతంలో పాకిస్తాన్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ‘‘ మన పెరట్లో పాములు పెంచి పక్కవారిని కాటేయాలంటే ఎలా..? అవి మనల్ని కూడా కాటేస్తాయి’’ అని పాకిస్తాన్ కు హితవు పలికారు. కానీ పాకిస్తాన్ కు మంచి సలహాలు తీసుకునే అలవాటు లేదని ఎద్దేవా చేశారు.
కూతురిపై కన్నతండ్రి అత్యాచారం.. గర్భం దాల్చడంతో దారుణం.. చివరికి
తండ్రి.. పుట్టిన ప్రతి బిడ్డకు మొదటి గురువు.. రోల్ మోడల్.. ఎన్ని కష్టాలు ఉన్నా ఆయన ఉన్నాడనే ధైర్యం. అతనే నమ్మకం.. కానీ, కొంతమంది తండ్రుల వలన నాన్న అనే పదానికి మచ్చ ఏర్పడుతోంది. ఒక ఆడపిల్ల తండ్రితో కలిసి ఒంటరిగా ఉండాలన్నా, హత్తుకోవలన్నా భయపడే దుస్థితికి తీసుకొచ్చారు. తండ్రి అనే బంధం మనసులో నుంచి తీసి తండ్రి కూడా ఒక మగాడే అని అమ్మాయిలు గుర్తించుకొనే స్థాయికి వచ్చారు. కామంతో కొట్టుకుంటూ కన్న కూతుర్లను కూడా వదలకుండా అత్యాచారం చేస్తున్న కీచకులను ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం. అలాంటి ఒక కీచకుడుకు కోర్టు సరైన శిక్ష విధించింది. ఆ కీచకుడు చచ్చేవరకు జైల్లోనే ఉంచాలని ఆదేశించింది. 2017 లో లాలాపేట పరిధిలోని నల్ల చెరువులో గర్భం దాల్చిన యువతి ఆత్మహత్య కేసులో తండ్రే హంతకుడని ఋజువు కావడంతో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా లాలాపేట పరిధిలో మహంకాళి నాగరాజు అనే వ్యక్తి కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. అతనికి ఒక కూతురు ఉంది. ఇక ఆమెపై కొన్ని నెలల క్రితం ఈ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కామంతో కళ్ళుమూసుకోపోయి కన్నా కూతురు అనే విచక్షణ లేకుండా ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారం జరిపాడు. దీంతో కూతురు గర్భం దాల్చింది. ఈ విషయం తెలియడంతో ఆమెకు అబార్షన్ చేయించాడు. ఇక తండ్రి అరాచకాలను తట్టుకోలేని యువతి ఎదురుతిరగడంతో ఆమెపై పలుమార్లు దాడి చేశాడు నాగరాజు. ఇక ఈ బాధలు భరించడం కంటే చావే నయం అనుకున్న యువతి ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. కూతురి మరణం కూడా ఈ కసాయివాడిని కరిగించలేకపోయింది. కూతురు ఆత్మహత్య కేసు కాకుండా ఆమెకు మతిస్థిమితం లేదని కోర్టును నమ్మించాడు. ఇక నాగరాజుపై అనుమానం వచ్చిన కోర్టు మృతురాలి గర్భంలో పిండానికి డీఎన్ఏ టెస్ట్ చేసి చూడగా అసలు గుట్టు బయటపడింది. ఇంత దారుణానికి పాల్పడిన నాగరాజు పై కోర్టు మండిపడింది. నిందితుడును చచ్చేవరకు జైల్లోనే ఉంచాలని న్యాయమూర్తి సీతా రామకృష్ణ రావు తీర్పు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన గుంటూరు లో సంచలనంగా మారింది.