Tomato Price Touches All Time High in Madanapalle: గత కొన్ని రోజులుగా ‘టమాటా’ ధర పైపైకి దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా 2 నెలలుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. కొన్ని మార్కెట్‌లలో కిలో టమాటా రూ. 200 పైనే పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే జనాలు భయపడుతున్నారు. చాలామంది టమాటా బదులుగా చికెన్ కొనేసుకుంటున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా టమాటా ధర గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధర కొత్త రికార్డు సృష్టించింది.
మదనపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 1) నాణ్యమైన టమాటా రికార్డు స్థాయిలో కిలో రూ. 224 పలికింది. 2-3 రోజుల క్రితం కిలో టమాటా 200 ఉండగా.. ఇప్పుడు 224గా ఉంది. మంగళవారం దాదాపుగా పది వేల క్రేట్ల సరకు రాగా.. వేలంలో క్రేటు ధర రూ. 5600 పలికిందట. ఈ విషయాన్ని టీవీఎస్ మండీ యజమాని బాబు, మేనేజర్ షామీర్ మీడియాతో తెలిపారు. ఇక్కడికి వచ్చిన టమాటాను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారు తెలిపారు.
Also Read: ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌లో మార్పులు.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
మరోవైపు అనంతపురం జిల్లా కక్కలపల్లి టమాటా మార్కెట్‌లో 15 కిలోల బుట్ట రూ. 3,200కు అమ్ముడుపోయింది. కిలో టమాటా రూ. 215 పలికింది. మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర అని వ్యాపారులు అంటున్నారు. కనగానపల్లి మండలం పాతపాలెం గ్రామ రైతు బళ్లారి రాజు మంగళవారం మార్కెట్‌కు 90 బుట్టల టమాటాలు అమ్మకానికి తేగా.. నాణ్యత బాగుండటంతో 79 బుట్టలు రూ. 3200 చొప్పున అమ్ముడుపోయాయి. 2 ఎకరాల పొలంలో లక్ష పెట్టుబడితో టమాటా వేశానని, మంచి దిగుబడి వచ్చిందని యువ రైతు రాజు తెలిపారు.
Also Read: WI vs IND: 200 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన వెస్టిండీస్.. టీమిండియాదే వన్డే సిరీస్!