NTV Telugu Site icon

Tomato Price: ఎమ్మిగనూరులో కిలో టమోటా రూపాయే… రైతుల నిరసన

Tomato

Tomato

ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే వాటికి గిట్టుబాటు ధర గగనం అయిపోతోంది. అన్నదాతకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి అన్న చందంగా మారింది టమోటా రైతుల పరిస్థితి. కర్నూలు జిల్లాలో టమాటా ధరలు పతనం అయిపోయాయి. ఎంతగా అంటే టమోటా అమ్మేందుకు కూడా రైతులు ఇష్టపడడం లేదు. బహిరంగ మార్కెట్లో కిలో 15, 20 రూపాయలు పలుకుతుంటే.. రైతులకు మాత్రం ఒక్కరూపాయి కూడా దొరకడం కష్టంగా మారింది. టమోటా లేకుండా వంట గదిలో రోజు గడవదు. ఏ కూర చేయాలన్నా టమోటా కావాల్సిందే. అదే టమోటా ఒకప్పుడు తలెత్తుకు నిలబడింది. కానీ ఇప్పుడు టమోటా బిక్కచూపులు చూస్తోంది.

Read Also: Tiger Fear in Araku : అరకులో పులి సంచారం.. భయాందోళనలో జనం

ఎమ్మిగనూరు మార్కెట్లో కిలో టమాట రూపాయికి దిగజారింది. దీంతో రవాణా ఖర్చులు కూడా రావని మార్కెట్లోనే పారబోశారు రైతులు. టమోటాలు కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా అందించాలని, తమకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిన్నా మొన్నటి వరకూ కిలో రూ. 30 నుంచి రూ. 40ల వరకూ పలికిన టమాటా ధర అమాంతంగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో టమాటా పంట దిగుబడి అధికంగా ఉంది. వర్షాలు బాగా కురవడంతో రైతులు టమోటా పంట వైపు ఫోకస్ పెట్టారు. దీంతో పంట బాగా పండింది. మరోవైపు ఎగుమతులు సరిగ్గా లేకపోవడంతో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 10 రోజులుగా ఎమ్మిగనూరు మార్కెట్ లో టమోటాకు ధర లేక రైతులు ఆవేదనా వ్యక్తం చేస్తున్నా నేతలు పట్టించుకోవడం లేదు.

Read Also: Khammam student: అమెరికాలో కన్నకొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీరు.. స్పందించిన కేటీఆర్‌