Site icon NTV Telugu

Tomato Price: రోజురోజుకు దిగజారుతున్న టమాటా ధర.. కిలో రూ.4 మాత్రమే!

Tomato Price

Tomato Price

Tomato Price Today in Pattikonda Market: గత జూన్, జులై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు ఈ 20 రోజుల్లో నేలకు దిగొచ్చాయి.

జులై చివరి వరకు రూ. 200 పలికిన కిలో టమోటా ధర.. ఇప్పుడు రూ. 4కు దిగజారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ. 4 పలుకుతోంది. 50 కేజీల జత బాక్సులు రూ.200 పలుకుతుండడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రైతన్నలకు కేజీకి రూ.4 కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. పలు ప్రాంతాల నుంచి టన్నుల కొద్దీ పంట వస్తుండటం, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో.. టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఓ నెల క్రితం మార్కెట్‌కు టమాటాలు తీసుకొచ్చి జేబు నిండా డబ్బులు తీసుకెళ్లిన రైతు.. ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read: Moon Mission: చంద్రుడిపైకి మరో దేశం.. మట్టి నుంచి ఆక్సిజన్ సేకరించే ప్లాన్..

పెరిగిన టమాటా ధరలు జూన్, జూలై నెలలో రైతులకు కాసుల వర్షం కురిపించాయి. ఊహకందని ధరలతో కొందరు రైతులను టమాటా కోటీశ్వరులను చేసింది. ఇదే విషయాన్ని రైతులు స్వయంగా చెప్పారు. టమోటాకు ఇంత ధర ఎప్పుడూ లేదని, చాలా డబ్బు సంపాదించామని తెలిపారు. అయితే ఇప్పుడు అదే టమోటా రైతుకు కంటతడి పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పంటకు పెట్టుబడి, ఎరువులు, కూలీల ఖర్చులు కూడా పూడే పరిస్థితి లేదని కంటతడి పెట్టుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తీరా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురుస్తూ నష్టాలను కలిగిస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. నష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version