Tokyo Video: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!

  • టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం
  • ల్యాండింగ్ అవుతుండగా భారీ ఈదురుగాలులు
  • భారీ కుదుపులకు గురైన విమానం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Koreanflight

Koreanflight

టోక్యో విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. కొరియన్ ఎయిర్‌కు చెందిన విమానం జపాన్ రాజధాని టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు సిద్ధపడుతుండగా ఒక్కసారిగా భారీగా ఈదురుగాలులు వీచాయి. దీంతో విమానం ఒక్కసారిగా భారీగా కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ఉన్న వారంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇక పైలట్లు చాకచక్యంగా ల్యాండింగ్‌ను విరమించుకుని గగనతలంలోకి తీసుకెళ్లిపోయారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సురక్షితంగా విమానం ల్యాండింగ్ అవ్వడంతో అధికారులు, ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు తీసుకున్న వేగవంతమైన నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

దక్షిణ కొరియాకు చెందిన కొరియన్ ఎయిర్ ఎయిర్‌బస్ A321neo విమానం టోక్యోలోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో బలమైన క్రాస్‌విండ్స్‌, తీవ్ర గాలి అలజడి కారణంగా విమానం అదుపు తప్పినట్లు కనిపించింది. రన్‌వేపై దిగేందుకు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్న సమయంలో విమానం ఒక్కసారిగా ఎడమ, కుడి వైపులకు ఊగిపోవడం వీడియోల్లో కనిపించింది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని గుర్తించిన పైలట్లు వెంటనే “గో అరౌండ్” ప్రక్రియను అమలు చేశారు. అంటే ల్యాండింగ్‌ను మధ్యలోనే నిలిపివేసి విమానాన్ని మళ్లీ గాల్లోకి ఎగరేశారు. అనంతరం పరిస్థితులు అనుకూలించడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు లేదు. అలాగే విమానానికి నష్టం జరగలేదని సమాచారం.

టోక్యో పరిసరాల్లో బలమైన ఈదురుగాలులు వీచినట్లు సమాచారం. రన్‌వేకి అడ్డంగా వీచే గాలులను క్రాస్‌విండ్స్‌గా పిలుస్తారు. ఇవి విమానాల ల్యాండింగ్ సమయంలో పైలట్లకు పెద్ద సవాలుగా మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో విమానం సురక్షితంగా ల్యాండ్ కాకపోతే గో అరౌండ్ చేయడం సాధారణ భద్రతా చర్యగా విమానయాన నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు పైలట్ల చాకచక్యాన్ని ప్రశంసించారు.

“దైవం కాపాడింది.. పైలట్ అద్భుత నిర్ణయం తీసుకున్నాడు” అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరో వ్యక్తి “ఇలాంటి పరిస్థితుల్లో ల్యాండింగ్‌ను రద్దు చేయడం ఉత్తమ నిర్ణయం” అని పేర్కొన్నారు. మరొకరు “నరిటా విమానాశ్రయంలో గాలులు ఎంత ప్రమాదకరమో తెలిసిన విషయమే.. పైలట్ చాలా సమర్థంగా వ్యవహరించాడు” అని కామెంట్ చేశారు.