Today Stock Market Roundup 06-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం ఓ మోస్తరు లాభాలతో ముగిసింది. ఎర్లీ ట్రేడింగులో ఊగిసలాట ధోరణిలో జరిగిన ట్రేడింగ్ కారణంగా వచ్చిన నష్టాలను ఇంట్రాడేలో పూడ్చుకోగలిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచకపోవటం కలిసొచ్చింది. జీడీపీ గ్రోత్ మరియు ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలు ఈక్విటీ మార్కెట్ పెట్టుబడిదారుల సెంటిమెంటును బలపరిచాయి.
దీంతో రెండు కీలక సూచీలు కనీసం స్వల్ప లాభాలతోనైనా సరిపెట్టుకోగలిగాయి. సెన్సెక్స్ 143 పాయింట్లు పెరిగి 59 వేల 832 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ.. 42 పాయింట్లు పెరిగి 17 వేల 599 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ లోని మొత్తం 30 కంపెనీల్లో 17 కంపెనీలు లాభాల బాటలో నడవగా 13 కంపెనీలు నష్టాల బాట పట్టాయి.
read more: IMF bailout for Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కనున్న ద్వీపదేశం
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ రాణించాయి. ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, ఎన్టీపీసీ వెనకబడ్డాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ మంచి పనితీరు కనబరిచాయి. హెచ్ సీఎల్ టెక్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ ఒక శాతానికి పైగా పడిపోయాయి.
సెక్టార్ల వారీగా చూసుకుంటే.. నిఫ్టీ బ్యాంక్, రియాల్టీ, PSU, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్ సెక్టార్లు ఒక శాతం వరకు పెరిగాయి. వ్యక్తిగత స్టాక్స్ పరిశీలిస్తే.. అనుపమ్ రసాయన్ సంస్థ షేర్ల విలువ రెండు నెలల్లో రికార్డు స్థాయిలో 58 శాతం వృద్ధి చెందింది. వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు సాధించటం ప్లస్ పాయింట్ అయింది. 10 గ్రాముల బంగారం రేటు 68 రూపాయలు తగ్గింది.
గరిష్టంగా 60 వేల 788 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 175 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 74 వేల 730 రూపాయలు పలికింది. క్రూడాయిల్ రేటు నామమాత్రంగా పాతిక రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 580 రూపాయలుగా నమోదైంది. రూపాయి విలువ 8 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 81 రూపాయల 95 పైసల వద్ద స్థిరపడింది.