Today Business Headlines 24-03-23:
నెలకోసారి.. నేను సైతం..
స్టార్‌బక్స్ సంస్థ CEOగా ఇటీవలే పగ్గాలు చేపట్టిన లక్ష్మణ్ నరసింహన్ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కంపెనీకి హెడ్ అయినప్పటికీ తాను కూడా స్టోర్లలో నెలకొకసారి హాఫ్‌డే షిఫ్ట్ పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. స్టార్‌బక్స్ వర్కింగ్ కల్చర్‌ని దగ్గరగా పరిశీలించేందుకు, కస్టమర్లతో కలిసిపోయేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు నిన్న గురువారం ఒక లేఖ రాశారు. కంపెనీలోని వివిధ స్థాయిల్లో పని చేస్తున్న లీడర్‌షిప్ టీమ్ కూడా తన మాదిరిగానే చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. దూర్‌దర్శ్ అనే సంస్థ CEO టోనీ జు మరియు అతని ఎగ్జిక్యూటివ్ టీమ్ సైతం నెలకోసారి ప్రొడక్టుల డెలివరీలు చేస్తుంటారు.
ఎల్‌ఐసీ చైర్మన్‌గా సిద్ధార్థ
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. LIC ఆఫ్ ఇండియా చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి ఎంపికయ్యారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో.. FSIB ఈ సెలక్షన్ నిర్వహించింది. FSIB సిఫారసుపై ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రివర్గ నియామకాల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎల్‌ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీ కాలం ఈ నెల 13న ముగియటంతో.. ఎండీగా ఉన్న మొహంతికి తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. నిన్న గురువారం భేటీ అయిన FSIB.. మొహంతితోపాటు మరో ముగ్గురు ఎండీలను చైర్మన్ పోస్టు కోసం ఇంటర్వ్యూ చేసింది. చివరికి.. మళ్లీ.. మొహంతీనే చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వానికి రికమండ్ చేసింది.
తెలంగాణకు పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ప్రవాహంలా వచ్చాయి. 2020-21తో పోల్చితే 2021-22లో ఏకంగా 150 శాతం ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగాయి. 2020-21లో కొత్త పెట్టుబడులు 31 వేల 274 కోట్ల రూపాయలు మాత్రమే రాగా 2021-22లో 76 వేల 568 కోట్ల రూపాయలు లభించాయి. వీటివల్ల కొత్తగా 60 వేల మందికి ఉద్యోగాలు దొరికాయి. ఐటీ ఉద్యోగుల సంఖ్య 3 పాయింట్ ఏడు ఒకటీ లక్షల నుంచి రెట్టింపైంది. తద్వారా 7 లక్షలకు చేరింది. ఈ విషయాలను MSME ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అనే సంస్థతో కలిసి స్టడీ చేసి, ఆ రిపోర్టును నిన్న గురువారం రిలీజ్ చేసింది.
బైక్ రేటు రూ.31.5 లక్షలు
లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMWకి అనుబంధంగా పనిచేసే మోటోరాడ్ కంపెనీ కొత్తగా ఓ బైక్‌ని రూపొందించింది. ఈ బైక్‌ని ఆర్18గా పేర్కొంటారు. ఇందులో ప్రస్తుతం 3 రకాలు అందుబాటులోకి వచ్చాయి. అవి.. ఆర్18, ఆర్18 క్లాసిక్, ఆర్18 ట్రాన్స్‌కాంటినెంటల్. ప్రయాణానికి సంబంధించి మాటల్లో చెప్పలేని మధురానుభూతిని పొందాలనుకునే ద్విచక్ర వాహన ప్రియులు ఈ మోడళ్లను బాగా ఇష్టపడతారని BMW గ్రూప్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా అన్నారు. ఈ బైక్.. 18 వందల 2 సీసీ ఇంజన్, 91 హెచ్‌పీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని ధర 31 లక్షల 50 వేల రూపాయలు.
బ్రిటన్‌లో పెరిగిన వడ్డీ రేట్లు
మొన్న అమెరికాలో వడ్డీ రేట్లు పావు శాతం పెరగ్గా నిన్న బ్రిటన్‌లో కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఫలితంగా అక్కడ కనీస వడ్డీ రేటు 4 పాయింట్ 5 శాతానికి చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్.. BOE పేర్కొంది. బ్యాంకింగ్ సంక్షోభం వెంటాడుతున్నప్పటికీ వడ్డీ రేట్లు పెంచాలని బ్రిటన్ కేంద్ర బ్యాంక్ నిర్ణయించటం గమనించాల్సిన అంశం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచటం ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై నిన్న గురువారం ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నిర్ణయం సైతం మన మార్కెట్‌పై ఇవాళ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఐటీ డిపార్ట్‌మెంట్ యాప్
ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించింది. ‘ఏఐఎస్ ఫర్ ట్యాక్స్‌పేయర్’గా పేర్కొనే ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఏఐఎస్ అంటే.. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ అని అర్థం. ఏఐఎస్ యాప్‌ను గుగుల్ ప్లే స్టోర్‌తోపాటు యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా వాడుకోవచ్చని తెలిపింది. శాలరీ రూపంలో వచ్చే ఆదాయం, డివిడెండ్లు, వడ్డీ, షేర్ల అమ్మకాల ద్వారా వచ్చే లాభాలు, పన్ను చెల్లింపులు, టీడీఎస్, పన్ను వసూళ్లు, ఐటీఆర్, జీఎస్‌టీ, ఫారన్ పేమెంట్స్ తదితర వివరాలన్నీ ఇందులో చూసుకోవచ్చు. ఏదైనా సమస్య తలెత్తితే ఫిర్యాదు కూడా చేయొచ్చు.