Today Business Headlines 23-03-23:
అల్లు అర్జున్ బ్రాండ్ వ్యాల్యూ
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ వ్యాల్యూ 260 కోట్ల రూపాయలని ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ క్రోల్ పేర్కొంది. ఇండియాలో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన పాతిక మందిలో పుష్పరాజ్‌కి కూడా చోటు లభించింది. ఈ లిస్టులో అల్లు వారి వారసుడికి స్థానం దక్కటం ఇదే మొదటిసారి. 2022వ సంవత్సరానికి సంబంధించిన సెలెబ్రిటీ బ్రాండ్ వ్యాల్యుయేషన్ స్టడీ రిపోర్టును ఈ కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ 20వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలోని మొత్తం 25 మంది ప్రముఖుల బ్రాండ్ విలువ కలిపి 160 కోట్ల డాలర్లుగా నమోదైంది. 2021వ సంవత్సరంతో పోల్చితే ఇది 29 పాయింట్ 1 శాతం పెరిగింది.
యూఎస్‌లో పెరిగిన వడ్డీ రేట్లు
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్.. వడ్డీ రేటును.. పాయింట్ రెండూ ఐదు శాతం పెంచింది. దీంతో మొత్తం రుణ రేటు 5 శాతానికి చేరింది. అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావటం మరియు రెండు శాతం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ దివాలా తీయటంతోపాటు యూరప్‌లోని క్రెడిట్ సూయిజ్ సంక్షోభంలో చిక్కుకోవటంతో వడ్డీ రేటు పెంచాలా వద్దా అనే అంశంపై ఫెడరల్ రిజర్వ్ తీవ్రంగా మథనపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేట్ల పెంపును టెంపరరీగా ఆపేస్తున్నట్లు సూచాయగా చెప్పింది.
ముఖేష్ అంబానీకి 9వ స్థానం
భారతదేశంతోపాటు ఆసియా ఖండంలో కూడా అత్యంత సంపన్నుడిగా ఉన్న ముఖేష్ అంబానీ.. ఇప్పుడు గ్లోబల్ లెవల్‌లోనూ మెరిశారు. ప్రపంచ ధనికుల జాబితాలో 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాదికి సంబంధించిన అంతర్జాతీయ కుబేరుల లిస్టును ఎం3ఎం హురున్ అనే సంస్థ విడుదల చేసింది. ఇందులో అంబానీ నికర సంపదను 82 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. ఇది ఏడాది కిందటితో పోల్చితే 20 శాతం తగ్గింది. అయినప్పటికీ.. గౌతమ్ అదానీ సంపద ఇంతకంటే ఎక్కువగా క్షీణించటం అంబానీకి కలిసొచ్చింది. మళ్లీ వరల్డ్-10 రిచ్ పీపుల్ లిస్టులోకి వచ్చేశారు.
భారీగా స్థిరాస్తుల స్వాధీనం
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే నిఘా సంస్థలు గడచిన ఆరు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నాయి. 200లకు పైగా కేసుల్లో వీటిని అటాచ్ చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 వేల 683 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశాయి. కాకపోతే.. వీటిని విక్రయించేందుకు న్యాయస్థానాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే.. ఇవి ప్రభుత్వ సొంతం కావాలంటే లేటవుతోంది. ఈ విషయాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభకు వెల్లడించారు. ఈడీ, డీఆర్‌ఐ, సీబీడీటీ, సీబీఐసీ వంటి సంస్థలు ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు.
ఇతర రాష్ట్రాలకు కూడా కిమ్స్
తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారులేని కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. కిమ్స్.. ఇకపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ మేరకు క్లస్టర్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ స్ట్రాటజీని ఫాలో కావాలని యోచిస్తోంది. నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే ఆస్పత్రిలో కిమ్స్‌కి 51 శాతం షేరుంది. హాస్పిటల్‌లో మొత్తమ్మీద 334 పడకలను ఏర్పాటుచేసే వీలుండగా ప్రస్తుతం 250 బెడ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగతా పడకలు కూడా అందుబాటులోకి వస్తాయని ఆశిస్తోంది. అంతేకాకుండా.. మొత్తం బెడ్‌ల సంఖ్యను 510కి పెంచాలని కూడా భావిస్తోంది.
2 దశాబ్దాల గరిష్టానికి గిరాకీ
మన దేశానికి ఫిబ్రవరి నెలలో క్రూడాయిల్ దిగుమతులు ఏడాది కిందటితో పోల్చితే దాదాపు 8 శాతం పెరిగాయి. డిమాండ్ 24 ఏళ్ల గరిష్టానికి చేరటంతో ఈ రేంజ్‌లో ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇండియన్ ఎకానమీ తిరిగి పుంజుకోవటం, టెంపరేచర్లు పెరగటం, ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుండటం, రష్యాలో కాస్త చౌకగానే చమురు లభిస్తుండటం కూడా దీనికి దారితీశాయి. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం నిన్న బుధవారం వెల్లడించింది. ఇదిలాఉండగా.. భారతదేశంలో.. రానున్న రోజుల్లో క్రూడాయిల్ డిమాండ్ మరింత పెరగనుందని, ఇంపోర్ట్‌లు సైతం వృద్ధి చెందుతాయని అనలిస్టులు అంటున్నారు.