Today Business Headlines 15-04-23:
రైల్వే @ 170 ఏళ్లు
ప్రపంచంలోనే ప్రత్యేక ఘనత వహించిన ఇండియన్ రైల్వేస్.. రేపటితో 170 ఏళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో మొట్టమొదటి ప్యాసింజర్ ట్రైన్ 1853వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన ప్రారంభమైంది. బోరి బందర్ నుంచి థానే వరకు 34 కిలోమీటర్ల దూరం పరుగులు తీసింది. దీంతో.. అప్పటినుంచి ఏప్రిల్ 16వ తేదీన ‘ఇండియన్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ డే’ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రయాణికుల సేవలో 170 ఏళ్లు అనే పేరుతో దేశంలోని పలు ప్రాంతాల్లో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు.
‘బీమా’లకు ధీమా
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మూడు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు వేల కోట్ల రూపాయల మూలధనం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాల్లో ఉండటంలో ఆదుకునేందుకు సాయం చేయనున్నారని చెప్పారు. ఈ మూడు సంస్థలకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయల మూలధనం అందించిన సంగతి తెలిసిందే.
సిడ్బి కొత్త పథకం
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సిడ్బి.. ప్రయోగాత్మకంగా ఒక పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు.. మిషన్ 50కె-ఈవీ4ఎకో. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనేందుకు మరింత ఈజీగా లోన్లు ఇవ్వటం కోసం దీనికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా టూ.. త్రీ.. ఫోర్ వీలర్స్ కొనుగోలుకు డైరెక్ట్‌గా మరియు ఇన్‌డైరెక్ట్‌గా రుణ సదుపాయం కల్పిస్తారు. ప్రత్యక్ష పద్ధతిలో ఎంఎస్ఎంఈలకు, పరోక్ష పద్ధతిలో ఎన్‌బీఎఫ్‌లకు లోన్లు ఇస్తుంది. చిన్న.. పెద్ద.. తేడా లేకుండా అన్ని సంస్థలనూ పరిగణనలోకి తీసుకుంటామని సిడ్బి తెలిపింది.
కరెన్సీ వల్ల లాసే
కరెన్సీ నోట్లను ముద్రించటం ఏమాత్రం లాభదాయకం కాదని ‘డి లా ర్యూ’ తెలిపింది. ‘డి లా ర్యూ’ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ నోట్ ప్రింటర్. ఈ సంస్థ లేటెస్ట్‌గా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు పంపిన నివేదికలో.. బ్యాంక్ నోట్లకు గిరాకీ 20 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్లు తెలిపింది. ఏకంగా 210 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కంపెనీ.. బ్యాంక్ నోట్లను ముద్రించటంతోపాటు 130 దేశాలకు ‘రా మెటీరియల్’ కూడా సప్లై చేస్తుండటం విశేషం. ఈ దేశాల జాబితాలో బ్రిటన్, థాయ్‌ల్యాండ్, ఖతార్ వంటివి ఉన్నాయి.
‘ఫస్ట్ క్రై’ షేర్ సేల్
పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఫస్ట్ క్రై సంస్థలో వాటా విక్రయం కోసం చర్చలు కొనసాగుతున్నాయి. సాఫ్ట్ బ్యాంక్ ఆర్థిక మద్దతు కలిగిన ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూని 3 బిలియన్ డాలర్లుగా లెక్కించారు. దాదాపు 100 మిలియన్ డాలర్ల విలువైన సెకండరీ షేర్లను విక్రయించటం ద్వారా నిధుల సమీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు ప్రముఖ ఆంగ్ల మీడియా పేర్కొంది. ఫస్ట్ క్రై సంస్థలో అతిపెద్ద వాటాదారైన సాఫ్ట్ బ్యాంక్ తన 29 శాతం హోల్డింగ్స్‌లో కొంత భాగాన్ని అమ్ముకోనున్నట్లు సమాచారం అందుతోంది.
పెరిగిన ‘ఫారెక్స్’
ఈ నెల 7వ తేదీన ముగిసిన వారంలో ఇండియా విదేశీ మారక నిల్వలు 9 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. సుమారు 51 వేల 600 కోట్లు పెరిగి 48 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. ఈ విషయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బంగారం నిల్వలు ఒకటీ పాయింట్ నాలుగు తొమ్మిది ఆరు బిలియన్ డాలర్లు పెరిగాయి. తద్వారా 46 పాయింట్ ఆరు తొమ్మిది ఆరు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వద్ద దేశీయ నిల్వలు 13 మిలియన్ డాలర్లు పెరిగి 5 పాయింట్ ఒకటీ ఏడు ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.